కేసీఆర్ స్కాంలపై నోరు విప్పని రేవంత్ రెడ్డి
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం కుంభకోణాల గురించి నిత్యం ఘాటు విమర్శలు చేస్తూ వచ్చిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే ఆయన కుంభకోణాలలో కీలక కాంట్రాక్టర్లతో లాలూచీపడి వారి ప్రయోజనాలు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. లక్ష కోట్ల రూపాయల కుంభకోణం జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టులో ఆ మొత్తాన్ని కక్కించి, పేదలకు పంచుతానని చెప్పిన ఆయన ఇప్పుడు జరుపుతున్న న్యాయవిచారణ సైతం దెబ్బతిన్న బ్యారేజీలకే పరిమితం చేసి కీలకమైన కాంట్రాక్టర్ ను కాపాడుతున్నారు. ఇక హైదరాబాద్‌లో కోకాపేట భూముల అమ్మకం, ఓఆర్ఆర్ లీజులలో భారీ కుంభకోణాలు జరిగాయని విమర్శలు గుప్పించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు వాటి గురించి మాట్లాడటమే లేదు. దేశంలో తనకు తప్ప ఎవరికీ విధానాలు లేవు.. పాలించటం చేతకాదని గట్టిగా నమ్మిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధికారంలో ఉండగా దళిత బంధు అమలు కోసం వేల కోట్ల రూపాయల విలువ చేసే కోకాపేట భూములు అమ్మారు. కోకాపేట భూముల అమ్మకం ద్వారా వచ్చిన రూ.2,000 కోట్లను దళిత బందుకు ఉపయోగించామని అప్పటిలో బీఆర్ఎస్ కీలక నేతలే బహిరంగంగా చెప్పారు. అక్కడితో ఆగలేదు. 2023 ఎన్నికల ముందు కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఓఆర్ఆర్ ప్రాజెక్టును కూడా ప్రైవేట్ పరం చేశారు. ఈ నిధులను కూడా ఎన్నికల ముందు నాలుగేళ్ళ పాటు పెండింగ్ పెట్టిన రైతు రుణమాఫీ అమలుకు వాడినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కేసీఆర్ సర్కారు కోకాపేట భూముల విక్రయంతో పాటు ఓఆర్ఆర్ ను దీర్ఘకాలిక లీజు ప్రాతిపదికన ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టడాన్ని టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. కోకాపేటలో ఉన్న అత్యంత ఖరీదైన భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం అస్మదీయ కంపెనీలకు కట్టబెట్టిందని ఆరోపించారు. ఈ వ్యవహారంలో రూ.1,000 కోట్ల స్కాం జరిగిందని ఆరోపిస్తూ ఇదే విషయంపై దిల్లీలో సీబీఐకి కూడా ఫిర్యాదు చేశారు.
కోకాపేట భూముల తరహాలోనే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం తెచ్చిపెట్టే ఓఆర్ఆర్ ను దీర్ఘకాలిక లీజుపై ప్రైవేట్ సంస్థకు అప్పగించటం వెనక కూడా రూ.1,000 కోట్లు చేతులు మారాయని, అడ్డగోలుగా ప్రైవేట్ సంస్థకు ఓఆర్ఆర్ ను అప్పగించటం వల్ల ప్రభుత్వ ఖజానాకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లినట్లు రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా విమర్శించారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో ఓఆర్ఆర్ విషయంపై ఒక సమీక్ష నిర్వహించి, ఈ లీజు విషయంలో సీబీఐ లేదా మరో కేంద్ర సంస్థతో విచారణ జరిపించాలని నిర్ణయం తీసుకున్నారు. అటు కోకాపేట భూముల అమ్మకం ఆయినా.. ఇటు ఓఅర్ఆర్ లీజు విషయం అయినా స్వయంగా రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసిన అంశాలే. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి ఊసెత్తకపోవటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐకి ఫిర్యాదు చేసి, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి వైపు కన్నెత్తి చూడకపోవటం వెనక కథ ఏమై ఉంటుందా? అనే ప్రశ్న తలెత్తుతుంది.
ప్రతిపక్షంలో ఉండగా పలు కీలక అంశాలను పదే పదే ప్రస్తావించి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా విస్మరిస్తే ఎవరికైనా అనుమానాలు రావటం సహజం. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే జరుగుతోంది. ఈ కుంభకోణాలలో లబ్ధిదారులైన వారితో లాలూచీ పడటంతోనే మౌనం వహిస్తున్నారని స్పష్టం అవుతుంది. అధికారంలోకి రాగానే కాళేశ్వరం కుంభకోణం అంటూ హడావుడి చేసిన రేవంత్ రెడ్డి, ఆయన మంత్రులు అందులోని కాంట్రాక్టర్లతోనే ముందుగా మంతనాలు జరపడం గమనార్హం. బ్యారేజీలు కూలిపోయేందుకు కారకులని భావిస్తున్న వారిని ‘బ్లాక్ లిస్టు’లో పెట్టకుండా వారికి మరిన్ని కాంట్రాక్టులను ప్రభుత్వం మంజూరు చేయడం చూస్తుంటే ప్రభుత్వాలు మారినా అక్రమార్కులు మారడం లేదని వెల్లడవుతుంది. అధికారంలో ఉండి కూడా ఆరోపణలు చేయటం తప్ప కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఒక్క విషయంలో కూడా గత బీఆర్ఎస్ సర్కారు పెద్దలను ఫిక్స్ చేయటంలో విఫలమైంది. ఈ విషయంలో కాంగ్రెస్ శ్రేణులలో కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది. ఎంతో హడావుడి చేసిన ఫోన్ ట్యాపింగ్ అందుకు మరో ఉదాహరణ.
కృష్ణ చైతన్య