కొత్త శక్తినిస్తున్న ‘మహా’ విజయోత్సాహం

పొరబాట్లను సరిదిద్దుకొని విజయపథంపై దూసుకెళ్లడంలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ ముందుంటుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలో ఎదురుదెబ్బ తిన్న బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 6 నెలల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించడం రాజకీయ పండితులను సైతం సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తింది. ముఖ్యంగా గతం కన్నా అధిక సీట్లు సాధించడం పెరుగుతున్న బిజెపి బలానికి అద్దం పడుతుంది. దాదాపు 90 శాతం స్ట్రైక్ రేట్ తో 149 స్థానాల్లో పోటీ చేసి 132 స్థానాలు గెలుచుకోవడం సామాన్య విషయమేమీ కాదు. బిజెపి సొంతంగా మ్యాజిక్ ఫిగర్ కు 13 సీట్ల దూరంలో నిలిచింది.

పరిస్థితులకు అనుగుణంగా తన వ్యూహాలను మార్చుకోవడంలో బిజెపి దిట్ట. పార్టీ పరిస్థితులను గమనించి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక అంశాలకు పెద్దపీట వేసింది. సంక్షేమానికి, అభివృద్ధికి సమ ప్రాధాన్యతనిచ్చింది. ఒకప్పుడు అసాధ్యం అనుకున్న అయోధ్య రామమందిరం, ఆర్టికల్‌ 370 రద్దు వంటి వన్నీ నరేంద్ర మోదీ పాలనలో సాధ్యమయ్యేసరికి ప్రజల్లో బిజెపి పట్ల విశ్వసనీయత మరింత పెరిగింది.

తమదైన వ్యూహాలతో ప్రతిపక్షాలను చిత్తు చేయడంలో ప్రధాని మోదీ, అమిత్‌ షా ద్వయం దిట్ట. పదునైన ప్రసంగాలతో ప్రత్యర్థులపై పైచేయి సాధించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఈ ద్వయం పోరాట స్ఫూర్తి బూత్ స్థాయి వరకు చేరింది. అంది వచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోకూడదన్న పట్టుదల విజయావకాశాలు విస్తృతం చేసింది. ముఖ్యంగా సీట్లు, ఇతర విషయాల్లో కాస్త ఉదారంగా వ్యవహరించి మహారాష్ట్రలోని మూడు పార్టీల కూటమిలో పొరపొచ్చాలు రాకుండా చూసింది. ఈ విషయంలో మహా వికాస్ అఘాడీ ఘోరంగా విఫలమైంది. ఎంవీఏ పార్టీల మధ్య విభేదాలు రచ్చకెక్కడంతో ప్రజల్లో ఆ కూటమి పలుచనైంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉన్న ప్రజాదరణ ఎప్పటిలానే బిజెపికి కలిసొచ్చింది. మహారాష్ట్రలో 10 ప్రచార సభల్లో పాల్గొన్న ప్రధాని 106 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్‌ చేశారు. విపక్షాలపై తనదైన వాక్చాతుర్యంతో చురకలంటిస్తూ ప్రత్యర్థుల్ని ఇరుకున పెట్టారు. రాజకీయ వ్యూహాలతో ప్రత్యర్థులకు చుక్కలు చూపెట్టడంలో దిట్టగా పేరొందిన అమిత్ షా ఈ ఎన్నికల్లోనూ మహాయుతికి గొప్ప ప్రచార వ్యూహాన్ని అందించారు. మహాయుతి సందేశం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చేరేలా ప్రచార వ్యూహాలను రూపొందించడంలో కీలకంగా వ్యవహరించారు. పార్టీ యంత్రాంగాన్ని సమన్వయంతో ముందుకు నడిపించడంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డా అత్యంత కీలకంగా వ్యవహరించారు. మిత్ర పక్షాలతో సమన్వయం చేస్తూనే తెర వెనుక ఉండి పార్టీ యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. 

విదర్భ, మరఠ్వాడా ప్రాంతాల్లో అనేక సవాళ్లు ఎదుర్కొన్న మహాయుతికి అపూర్వ విజయం వెనుక కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ కృషి ఎనలేనిది. 72 ప్రచార ర్యాలీల్లో పాల్గొన్న నితిన్‌ గడ్కరీ ఈ ప్రాంతాల్లో గేమ్ ఛేంజర్‌లా నిలిచారు. అట్టడుగు వర్గాల్లో ఆయన పట్ల సానుకూలత, మౌలికవసతుల అభివృద్ధిపై దృష్టి సారించడం వంటి అంశాలు ఈ ప్రాంతంలో మహాయుతికి అనుకూలించాయి. మంచి వాక్చాతుర్యం కలిగిన దేవేంద్ర ఫడణవీస్‌ తన పదునైన మాటలతో అభివృద్ధి నినాదాన్ని ప్రచారం చేశారు. మహారాష్ట్రలోని గ్రామీణ, పట్టణ ప్రజల మద్దతును కూడగట్టగలగడంలో ఆయన విజయవంతమయ్యారు. గడ్కరీ, ఫడణవీస్‌ వంటి నేతల కృషితో విదర్భలో 62 స్థానాలకు గాను దాదాపు 40కి పైగా స్థానాల్లో కూటమి విజయం సాధించింది. మహారాష్ట్ర ఇన్‌ఛార్జిగా వ్యవహరించిన భూపేంద్ర యాదవ్ అభ్యర్థుల ఎంపిక మొదలుకొని ఎన్నికల యుద్ధభూమిలో ప్రత్యర్థులపై ఆధిపత్యం సాధించేందుకు అవసరమైన ప్రచార సామగ్రి తరలింపు, బిజెపి అధిష్టానానికి, రాష్ట్ర పార్టీకి మధ్య సమన్వయం చేయడం ఇలా అనేక అంశాల్లో అవిశ్రాంతంగా కృషి చేశారు. మహారాష్ట్ర విజయంలో ప్రధానమంత్రి నుంచి బూత్ కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ తమదైన పాత్ర పోషించారు.

మహారాష్ట్ర విజయం తాలూకూ ఉత్సాహం తెలంగాణలోనూ కనిపిస్తోంది. తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్న తరుణంలో మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల జోష్ బిజెపి శ్రేణులకు కొత్త శక్తినిస్తుంది. దీంతో పార్టీ శ్రేణులు మరింత చురుగ్గా పనిచేసేందుకు ప్రేరణనిస్తుంది. ఆ ఉత్సాహంతోనే రాష్ట్ర ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలపై సహా వరుస కార్యక్రమాలతో రాష్ట్రంలో నియంతృత్వ, అప్రజాస్వామిక, ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోంది. దీని ఫలితం ఆయా ఎన్నికల్లో బిజెపి అద్భుత ప్రదర్శనకు భరోసానిస్తోంది.