కుమ్మెర బాధితులకు బిజెపి అండ
నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై జరిగిన అమానుష దాడి, పసిపాప మృతి ఘటనపై బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు చలించిపోయారు. ఫిబ్రవరి 24న కుమ్మెర వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, పూర్తి భద్రత కల్పించాలని కోరారు. మల్లన్న స్వామి జాతర సందర్భంగా గణేష్ కుటుంబంపై జరిగిన అమానుష దాడి, రెండు నెలల పసిపాప మృతి ఘటన తెలంగాణ సమాజాన్ని తీవ్రంగా కలచివేసిందని అన్నారు. ఈ ఘటనలో పసికందు ప్రాణాలు కోల్పోయేలా దాడి జరగడం అత్యంత హృదయ విదారకమని, ఇది సమాజం మొత్తం సిగ్గుతో తలవంచుకునే దుస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు. భక్తిశ్రద్ధలతో, శాంతియుతంగా జరగాల్సిన మల్లికార్జున స్వామి జాతరలో నిర్వాహకుల దురుసు ప్రవర్తన కారణంగా ఈ దారుణ సంఘటన చోటుచేసుకోవడం బాధాకరం అన్నారు.
తమ పార్టీ అధికారంలో ఉందన్న అహంకారంతో, స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలతో ఈ దౌర్జన్యం సాగిందని ఆరోపించారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టి, బాధితులపైనే అక్రమంగా కేసులు నమోదు చేయడం అన్యాయమని స్పష్టం చేశారు. బాధితులనే ముద్దాయిలుగా మారిస్తే న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ఈ ఘటనలో పోలీసులు, రెవెన్యూ అధికారులు తమ బాధ్యతను సరిగా నిర్వర్తించలేదని విమర్శించారు. చట్టపరంగా వ్యవహరించాల్సిన అధికార యంత్రాంగం విఫలమైందని అన్నారు. హిందూ ధర్మంలో అన్ని కులాలు ఒక్కటేనని, దేవాలయాలు అందరి కోసం, అన్ని కులాల కోసమేనని స్పష్టం చేశారు. అటువంటి దేవాలయాల్లో కులవివక్ష ఉంటే, అది హిందూ ధర్మానికి మచ్చగా మారుతుందని అన్నారు. గుడి దగ్గరైనా, బడి దగ్గరైనా కుల వివక్షకు ఎలాంటి స్థానం ఉండకూడదని అన్నారు. పేద-ధనిక అనే భేదభావం లేకుండా, చట్టం ముందు అందరూ సమానులేనని స్పష్టం చేశారు. హిందూ మతంలో అందరికీ స్థానం ఉంటుందని, ఎక్కడైనా వివక్ష కనిపిస్తే దాన్ని అంతం చేసే పోరాటంలో బిజెపి ముందువరుసలో ఉంటుందని హెచ్చరించారు. ఈ ఘటనను అసెంబ్లీలోనే కాకుండా, అసెంబ్లీ బయట కూడా బిజెపి ఎమ్మెల్యేలు తప్పకుండా లేవనెత్తుతారని తెలిపారు.
ఏం జరిగిందంటే..
ప్రతి ఏడాది వేలాది భక్తులు హాజరయ్యే నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరకు ఈసారి కూడా భారీగా భక్తులు వెళ్లారు. ప్రేమ వివాహం చేసుకున్న చాకలి కులానికి చెందిన గణేష్, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మౌనిక దంపతులు, వారి రెండు నెలల పసికందుతో పాటు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్లారు. ఆనవాయితీ ప్రకారం శివ లింగానికి తల ఆనించి దర్శించుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఆలయంలో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి వారిని అడ్డుకున్నారు. కారణం అడిగితే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. టికెట్ వ్యవస్థ లేనప్పుడు డబ్బులు ఎందుకు ఇవ్వాలంటూ ప్రశ్నించినందుకు, ఆ యువతి పట్ల దురుసుగా ప్రవర్తించి, ఆమెతో పాటు ఆమె తల్లి, అత్తపై దాడి చేశారు. ఈ దాడిలో ఆమె కింద పడగా, తీవ్ర భయాందోళనలకు గురైంది. ఈ విషయం తెలుసుకున్న గణేష్ అక్కడికి వచ్చి ప్రశ్నించగా, అతనిపై కులం పేరుతో బండ బూతులు తిడుతూ దారుణంగా దాడి చేశారు. ఈ క్రమంలో రెండు నెలల పసికందు చనిపోయింది. గణేష్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ దాడిని చూసిన ప్రతి ఒక్కరూ షాక్‌కు గురయ్యారు. పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. “కాళ్లు పట్టుకుంటాం, వదిలేయండి” అని మహిళలు వేడుకుంటున్నా వారిలో చలనం రాలేదు. రెండు నెలల పసికందు చనిపోయినా పట్టించుకోలేదు. రాష్ట్రంలో సామాన్యులు ఎంత భద్రంగా ఉన్నారో తెలిపేందుకు ఈ ఘటన ఒక ఉదాహరణ మాత్రమే. కాంగ్రెస్ పాలనలో నిత్యం రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట బీసీ, ఎస్సీ, ఎస్టీ, హిందూ సమాజం, దేవాలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి.

