కుట్రల కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నేతిబీరకాయ చందంగా మారింది. బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఆలోచనలేని ప్రభుత్వం నుంచి ఇంతకన్నా ఎక్కువ ఆశించలేం. బీసీ రిజర్వేషన్లపై రేవంత్ రెడ్డి బృందం తాపత్రయపడుతున్నదల్లా ‘‘ఇవ్వాలనుకుంటున్నాం, ఇవ్వలేకపోతున్నాం’’ అని చూపించుకోవడం కోసమే. నిర్దిష్ట ప్రక్రియను విస్మరించి అడ్డదిడ్డంగా వ్యవహరిస్తే ఎక్కడో ఒకచోట అడ్డుకట్ట పడడం తథ్యం. ఈ విషయం చెప్పేందుకు న్యాయకోవిదులే కానవసరం లేదు, రాజకీయాలపై కనీస పరిజ్ఞానం ఉన్న వాళ్లు కూడా ఇది చెప్పగలరు. సంక్లిష్టమైన రిజర్వేషన్ల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉంటేనే అన్ని ప్రక్రియలు దాటగలుగుతుంది. ఏ చిన్నపాటి ఏమరపాటు అయినా అడ్డుకట్ట పడేందుకు ఆస్కారం ఉంటుంది. ఇలాంటి అంశంలో కాంగ్రెస్ నేరమయ నిర్లక్ష్యం క్షమించరానిది.
అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లు ఆగస్ట్ 31న రాష్ట్ర గవర్నర్ వద్దకు చేరింది. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు గవర్నర్ కు మూడు నెలల గడువు ఉంటుంది. ఆ గడువు తీరకముందే ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంలో ఆంతర్యమేంటో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. 6 గ్యారెంటీలు సహా హామీలేవీ అమలు చేయని కాంగ్రెస్‌పై ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తుతోంది. దీనికి తోడు హైడ్రా కూల్చివేతలు, యూరియా కొరతకు తోడు తాజాగా బస్సు చార్జీల పెంపు దానికి ఆజ్యం పోస్తున్నాయి. ఈ తరుణంలో ఎన్నికల్లో గట్టెక్కడం కష్టమని భావించిన కాంగ్రెస్ పాలకులు వాయిదా వేయించడమే లక్ష్యంగా పావులు కదిపినట్టు బోధపడుతుంది.
42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు న్యాయస్థానంలో అడ్డుకట్ట పడినదనే అనుకుందాం, మరి కామారెడ్డిలో విడుదల చేసిన బీసీ డిక్లరేషన్‌లోని ఇతర హామీల సంగతేమైంది? బీసీ సబ్‌ప్లాన్ చట్టబద్ధంగా ఏర్పాటు చేస్తామని, ఏటా రూ.20,000 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.1 లక్ష కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కానీ బడ్జెట్లో కనీస నిధులు కేటాయించలేదు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు, రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు, ప్రతి మండలంలో బీసీ గురుకులాలు, చేతివృత్తుల వారికి షాపు స్థలాలు, మెగా పవర్లూమ్ క్లస్టర్లు వంటి హామీలెన్నో అమలుకు నోచుకోకుండానే ఉన్నాయి. వీటికి ఎవరు అడ్డుపడుతున్నారో కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పాలి. బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేసే ఉద్దేశ్యం తమకు లేదని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పకనే చెప్పింది.
స్థానిక సంస్థల ఎన్నికలే కాదు, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక విషయంలోనూ కాంగ్రెస్ దివాళాకోరు రాజకీయాలు బయటపడ్డాయి. హైదరాబాద్ పాతబస్తీకే పరిమితమైన ఎంఐఎం దేశంలో ఎక్కడ ఎన్నికలు వచ్చినా అక్కడికి వెళ్లి పోటీ చేస్తుంది. తమ అడ్డాగా భావించే హైదరాబాద్‌లో జరిగే ఎన్నికలకు మాత్రం దూరం ఉంటుంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఎంఐఎం ఎవరి ప్రయోజనాల కోసం పోటీ చేయడం లేదు? 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం పార్టీ పోటీ చేసి 41,656 ఓట్లు సాధించింది, రెండో స్థానంలో నిలిచింది. 2018, 2023 ఎన్నికల్లో కూడా పోటీ చేసింది. కానీ ఇప్పుడు, 2024 నవంబరులో జరిగే ఈ ఉపఎన్నికలో మాత్రం ఎంఐఎం అభ్యర్థిని ఎందుకు నిలబెట్టడం లేదు? ఎవరితో కుమ్మక్కైంది?
కాంగ్రెస్ అభ్యర్థిని చూస్తే ఈ రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహన, చీకటి ఒప్పందం తేటతెల్లమవుతుంది. గత 2023 ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం తరఫున పోటీ చేసిన నవీన్ యాదవ్ ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి. కాంగ్రెస్, ఎంఐఎం రెండూ ఒకటే అని స్పష్టమవుతోంది. 10 నిమిషాలు సమయమిస్తే దేశంలో హిందువులెవరూ లేకుండా చేస్తామని ప్రగల్భాలు పలికిన పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందంటే మైనార్టీలంటే ఎంత ప్రేమో, హిందువులంటే ఎంత తృణీకరణో అర్థమవుతుంది. రాత్రికి రాత్రే ఖబ్రస్థాన్ జీవోలు జారీ చేసి మైనార్టీ సంతుష్టీకరణను మరోసారి చాటుకున్న కాంగ్రెస్ అసలు స్వరూపాన్ని ప్రజలు గ్రహించాలి. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పడే ప్రతి ఓటు ఎంఐఎంకే చేరుతుందని గుర్తించాలి. వరుసగా పదేళ్లు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ గత లోక్ సభ ఎన్నికల్లో కనీసం ఖాతా కూడా తెరవలేదంటే ఆ పార్టీ పట్ల వ్యక్తమయిన ఆగ్రహావేశాలు ఇంకా చల్లారలేదని అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో బిజెపినే ప్రజలు ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. గత లోక్ సభ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ విషయం స్పష్టమైంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలే కాదు, స్థానిక సంస్థలైనా, మరే ఎన్నికలైనా ప్రజలు బిజెపిని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు.

