Modi ji

నేటి సవాళ్లు వేరు.. పోరాటమూ వేరు..

RSS Coinర్థిక అవసరాల కోసం విదేశాలపై ఆధారపడటం, జనాభా నిర్మాణంలో మార్పుల కుట్రలు, ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నాలు మన ముందున్న సవాళ్లని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం ఈ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటోందని, సంఘం కూడా ఈ సవాళ్లను ఎదుర్కొనే స్పష్టమైన రోడ్‌మ్యాప్ రూపొందించిందని అన్నారు. 2047లోని భారత్ జ్ఞానంతో, శాస్త్రసాంకేతికతతో, సేవతో, సమానత్వంతో నిండిన, వైభవమయమైన భారతంగా ఉండాలని ఆకాంక్షించారు. “వికసిత భారత్” పునాదులుగా పేర్కొంటూ ఈ పంచ పరివర్తనాలను వివరించారు. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్ఎస్‌) శతాబ్ది వేడుకల్లో భాగంగా అక్టోబర్ 1న దిల్లీలోని బీఆర్‌ అంబేడ్కర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో మోదీ పాల్గొనారు. ఈ కార్యక్రమంలో మోదీతో పాటు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌కార్యావాహ దత్తాత్రేయ హోసబోలే, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో పెద్దసంఖ్యలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.100 స్మారక నాణెం, స్మారక స్టాంప్‌ను ప్రధాని ఆవిష్కరించారు. నాణెం ఒకవైపు జాతీయచిహ్నం, రెండో వైపు భరతమాత చిత్రం ఉన్నాయి. నాణెంపై భరతమాత చిత్రం ముద్రించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగంలోని ముఖ్యాంశాలు వారి మాటల్లోనే చూద్దాం..

‘‘ఈ రోజు మహానవమి. ఈ రోజు దేవి సిద్ధిదాత్రి అమ్మవారి తిథి. ఈ సందర్భంగా దేశ పౌరులందరికీ నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రేపు విజయదశమి -మహా పర్వదినం. అన్యాయంపై న్యాయం గెలిచిన రోజు, అసత్యంపై సత్యం గెలిచిన రోజు, చీకటిపై వెలుగులు గెలిచిన రోజు. విజయదశమి అంటే భారతీయ సంస్కృతిలో మహత్తరమైన రోజు. ఇలాంటి మహా పర్వదినం నాడు, నూరేళ్ల క్రితం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపన జరగడం యాదృచ్ఛికం కాదు. అది వందల సంవత్సరాలుగా కొనసాగుతున్న భారతీయ జాతీయ చైతన్యానికి పునరుథ్థానం. కాలం విసిరిన సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రతి యుగంలో “జాతీయ చైతన్యం” కొత్త కొత్త రూపాలలో వ్యక్తమవుతూ వుంటుంది – అదే సంఘ్.

మన తరం స్వయంసేవకుల అదృష్టం – ఈ సంఘ్ శతాబ్ది ఉత్సవాన్ని ప్రత్యక్షంగా చూసే భాగ్యం కలిగింది. ఈ సందర్భంగా, దేశసేవా సంకల్పానికి అంకితమవుతున్న కోట్లాది స్వయం సేవకులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మనందరికి ఆరాధ్యుడు, సంఘ్ స్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ పవిత్ర పాదాలకు నమస్కరిస్తున్నాను. సంఘ్ శతాబ్ది వేడుకల జ్ఞాపకార్థం భారత ప్రభుత్వం ప్రత్యేకంగా స్మారక తపాలా స్టాంపులు, రూ.100 స్మారక నాణేలు విడుదల చేసింది. ఆ నాణెంకు ఒక వైపు భారత జాతీయ చిహ్నం, మరోవైపు సింహంతో వరదముద్రలో భారతమాత చిత్రం, ఆమె పాదాలకు భక్తితో నమస్కరిస్తున్న స్వయంసేవకుల రూపం కనిపిస్తుంది. భారతీయ కరెన్సీపై భారతమాత చిత్రం కనిపించడం స్వతంత్ర భారత చరిత్రలో ఇదే తొలిసారి. ఆ నాణెం మీద సంఘ్ బోధవాక్యం “రాష్ట్రాయ స్వాహా, ఇదం రాష్ట్రాయ, ఇదం న మమ” కూడా ముద్రించి ఉంది. ప్రత్యేక స్మారక స్టాంప్‌లో 1963 గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో సంఘ్ స్వయంసేవకులు పాల్గొనడం గుర్తు చేసే చిత్రం ముద్రించి ఉంది. గణతంత్ర ఉత్సవ పరేడ్‌లో పాల్గొనడం సామాన్యమైన విషయం కాదని మనందరికి తెలుసు. 1963 గణతంత్ర ఉత్సవాల్లో స్వయం సేవకులు క్రమశిక్షణతో, దేశభక్తి గీతాల నడుమ కవాతు చేశారు.

నదుల ఒడ్డున మానవ నాగరికతలు వికసించినట్లే సంఘ్ ప్రవాహంలో కూడా అనేక జీవితాలు పుష్పించాయి. నది ఎక్కడ ప్రవహించినా ఆ భూమిని సారవంతం చేస్తుంది. అలాగే సంఘ్ కూడా దేశంలోని ప్రతి రంగంలో పని చేస్తోంది. ఒక్క నది అనేక పాయలుగా విడిపోయినట్లుగా, సంఘ్ వందేళ్ల యాత్రలో ఎన్నో విభాగాలు (విద్యారంగం, వనవాసీ, వ్యవసాయం, మహిళా సాధికారత, కళా, సాంకేతిక రంగాల్లో) పుట్టుకొచ్చినా, ఎప్పుడూ విభజన, విరోధం జరగలేదు. ఎందుకంటే ప్రతి ప్రవాహం (వివిధ క్షేత్రాలన్నీ) ఒకే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి – నేషన్ ఫస్ట్.

సంఘ్ ఎంచుకున్న మహత్తరమైన లక్ష్యం- వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం. అందుకోసం రూపొందించిన కార్యపద్ధతి – నిత్యనియమితంగా నడిచే శాఖ. డాక్టర్ హెడ్గేవార్ ఎప్పుడూ చెప్పేవారు: ప్రతి వ్యక్తి దేశభక్తిని పెంపొందించుకొని, దేశం కోసం జీవించడం నేర్చుకొంటే దేశం అభివృద్ధి చెందుతుందని. వారి పద్ధతి చాలా భిన్నంగా ఉండేది. “మన దగ్గర ఉన్నవారు ఎలా ఉంటే అలాగే వారిని తీసుకోవాలి, కానీ మనకవసరమైన రీతిలో వారిని తీర్చిదిద్దాలి.” అది మట్టి తీసుకొని ఇటుకలు చేసే కుమ్మరి లాగా ఉంటుంది. సాధారణ మట్టి తీసుకొని, దానికి ఆకారం ఇచ్చి, కాల్చి, భవనాలు కట్టే ఇటుకలుగా మార్చుతాడు. అలాగే హెడ్గేవార్ కూడా సాధారణ వ్యక్తులను ఎంచుకుని, వారికి దార్శనికత ఇచ్చి, తీర్చిదిద్ది, దేశసేవకులుగా తయారు చేశారు. అందుకే సంఘం గురించి సాధారణ వ్యక్తులు కలసి అసాధారణ విజయాలు సాధిస్తుంటారని చెబుతారు.

వ్యక్తి నిర్మాణ ప్రక్రియను నేటికీ మనం శాఖలలో చూస్తున్నే ఉన్నాం. శాఖలు జరిగే మైదానాల నుండే స్వయంసేవకుల “అహం” నుంచి “వయం” వైపు ప్రయాణం మొదలవుతుంది. శాఖల్లోనే వ్యక్తిత్వం శారీరక, మానసిక, సామాజికంగా అభివృద్ధి చెందుతుంది. శాఖలు వ్యక్తి నిర్మాణానికి యజ్ఞ వేదికలు. త్యాగం, సమర్పణ అనేవి వారికి అత్యంత సహజ లక్షణాలుగా మారిపోతాయి. వారిలో వ్యక్తిగత స్వార్థం సమాప్తమవుతుంది. సామూహిక నిర్ణయం, సామూహిక కార్యం చేసే సంస్కారం అలవడుతుంది. రాష్ట్ర నిర్మాణ లక్ష్యం, వ్యక్తి నిర్మాణ మార్గం, శాఖ అనే సరళమైన సాధన.. ఈ మూడు విషయాల ఆధారంగా ఈ వందేళ్ల సంఘ యాత్ర సాగింది. అందుకే లక్షలాది స్వయం సేవకులు దేశంలోని వివిధ రంగాలలో అంకితభావంతో సేవ చేస్తున్నారు. దేశాభివృద్ధికై సేవా సమర్పణ భావనతో నిరంతరం శ్రమిస్తున్నారు. సంఘం ఆవిర్భవించినప్పటి నుండి కూడా దేశ ప్రాధాన్యాలే తమ ప్రాధాన్యాలుగా పని చేస్తున్నది. 

దేశం కీలకమైన సవాళ్లను ఎదుర్కొన్న ప్రతి సందర్భంలోనూ సంఘం తనవంతు పాత్ర పోషించింది. దేశస్వాతంత్ర్య పోరాటంలోనూ, హైదరాబాదు విమోచనంలో , గోవా విమోచనలోనూ, దాద్రా–నగర్ హవేలీ విముక్తిలోనూ –సంఘం ఎన్నో బలిదానాలు చేసింది. వీటన్నింటి విషయంలో ఒకే నినాదం: నేషన్ ఫస్ట్ – ఒకే భారత్, శ్రేష్ఠ భారత్. ఈ వందేళ్ల యాత్రలో సంఘం మీద ఎన్నో దాడులు, కుట్రలు జరిగాయి. స్వాతంత్ర్యం తరువాత నిషేధం, తప్పుడు కేసులు, అణచివేత, గురూజీని కూడా జైల్లో నిర్బంధించారు. గురూజీ జైలు నుంచి విడుదలైన తర్వాత ఎంతో స్ఫూర్తిదాయకమైన మాట చెప్పారు “ఒక్కొక్కసారి మన నాలుక మన పంటి కిందనే పడుతుంది అంతమాత్రాన మనం పళ్ళు ఊడగొట్టుకోం. పళ్ళూ మనవే, నాలుకా మనదే”. ఇదే గురూజీ రుషితుల్య వ్యక్తిత్వం. ఇవన్నీ ఎదురైనా స్వయంసేవకులు ఎప్పుడూ ద్వేషం పుట్టనివ్వలేదు.” సమాజమే మనం, దాని లోపాలూ మనవే, దాని గొప్పతనమూ మనదే” అనే దృక్పథం ఎల్లప్పుడూ కాపాడారు. ఇది స్వయంసేవకులకు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పట్ల ఉన్న నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.

అత్యవసర పరిస్థితులలో (ఎమర్జెన్సీ) కూడా స్వయంసేవకులు రాజ్యాంగం మీద విశ్వాసం కోల్పోలేదు. దానికి వ్యతిరేకంగా పోరాడే శక్తిని ప్రదర్శించారు. సంఘం ప్రతి కఠిన పరిస్థితుల్లో ఇంకా దృఢంగా తయారై నేటికి ఒక వటవృక్షంలా నిలబడింది. వైయక్తిక గీత్‌లోని విషయాలన్నీ అక్షర సత్యాలు. దేశమే మన దేహం అని నమ్మాం. దేశభక్తి, సేవ రెండూ సంఘానికి పర్యాయ పదాలుగా మారిపోయాయి. విభజన సమయంలో లక్షలాది శరణార్థులకు సేవ చేయటం, 1956లో కచ్ భూకంపం సమయంలో సహాయంగా నిలవటం ఇవన్నీ స్వయంసేవకులు సహజంగా చేసారు. కచ్ భూకంపం తర్వాత గురూజీ నాటి సంఘ వరిష్ఠ ప్రచారక్ వకీల్ సాబ్ (ఇంద్రేష్ కుమార్)కు ఒక లేఖ రాశారు. ఇతరుల కష్టాలను నిస్వార్థంగా తమ కష్టాలుగా భావించగలవారు శ్రేష్ఠమైన హృదయులు అని ఆ లేఖలో పేర్కొన్నారు. స్వయంసేవకులు 1962 యుద్ధంలో సైనికులకు అండగా నిలబడ్డారు, 1971లో బంగ్లాదేశ్ శరణార్థులకు అన్నం, ఆశ్రయం ఇచ్చారు, 1984 సిక్కు హత్యాకాండలో సిక్కు కుటుంబాలను రక్షించినవారూ – సంఘ స్వయంసేవకులే.

చిత్రకూట్ లో నానాజీ దేశ్‌ముఖ్ వంటి మహనీయుల సేవను చూసి డాక్టర్ ఏ.పీ.జె. అబ్దుల్ కలాం ఆశ్చర్యపోయారు. అలాగే ప్రణబ్ ముఖర్జీ కూడా నాగ్‌పూర్‌లోని సంఘ్ క్రమశిక్షణను చూసి మంత్ర ముగ్ధులయ్యారు. ఎక్కడ ఏ ఆపద వచ్చినా స్వయంసేవకులు ముందుంటారు. కరోనా సమయంలో మనం ప్రత్యక్షంగా చూశాం. మన దేశంలో పది కోట్ల ఆదివాసీలున్నారు. వారి సంక్షేమం కోసం వనవాసి కళ్యాణాశ్రమం ఎన్నో ఏళ్లుగా పని చేస్తోంది. వారి సంస్కృతిని, సంప్రదాయాలను గౌరవిస్తూ వారి సాధికారత కోసం నిరంతరంగా కృషి చేస్తున్నది. సేవాభారతి, విద్యాభారతి, ఏకలవ్య విద్యాలయాలు, ఇవన్నీ సంఘ ప్రవాహం నుంచే పుట్టాయి. శతాబ్దాలుగా సమాజంలో ఉన్న అసమానత, అణచివేత, అశుచిత భావాలు తొలగించడం కోసం సంఘం నిరంతర పని చేస్తున్నది. మహాత్మా గాంధీ కూడా వార్ధాలో జరిగిన సంఘ్ శిబిరాన్ని సందర్శించి అక్కడి సమానత్వాన్ని ప్రశంసించారు. “హైందవా స్సోదరా సర్వే- న హిందూ పతితో భవేత్’’ – హిందువులలో ఎవరూ పతితులు కారు, అందరూ సోదరులే అనే భావనను గురూజీ నుంచి నేటి వరకు ప్రతి సర్‌సంఘ్‌చాలక్ ముందుకు నడిపారు. తృతీయ సర్‌సంఘచాలక్ బాలాసాహెబ్ దేవరస్ జీ – “అస్పృశ్యత నేరం కాకపోతే ఈ దేశంలో ఇంకేదీ నేరం కాదు’’ అనేవారు. ప్రస్తుత సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ కూడా “ఒకే బావి, ఒకే దేవాలయం, ఒకే శ్మశానం” అనే సమానత్వ లక్ష్యాన్ని ముందుకు తెచ్చారు.

100 సంవత్సరాల క్రితం సంఘం పుట్టినప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి. అప్పుడు మనం వందల ఏళ్ల రాజకీయ బానిసత్వం నుంచి విముక్తి పొందాలి, మన సంస్కృతిని కాపాడుకోవాలి అనే కర్తవ్యం ముందున్నది. ఇప్పుడు 100 ఏళ్ల తరువాత, భారతదేశం అభివృద్ధి మార్గంలో వేగంగా పయనిస్తోంది. భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది. ఇప్పుడు దేశంలోని నిరుపేదలు – పేదరికాన్ని అధిగమించి ముందుకు వస్తున్నారు. మన యువతకు కొత్త రంగాలలో కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయి. ప్రపంచ రాజకీయాల నుంచి వాతావరణ విధానాల వరకు భారత్ తన స్వరాన్ని బలంగా వినిపిస్తోంది. కాబట్టి ఈ యుగంలో సవాళ్లు వేరు, పోరాటం కూడా వేరు. విదేశాలపై ఆర్థిక అవసరాల కోసం ఆధారపడటం, జనాభా నిర్మాణంలో మార్పుల కుట్రలు, మన ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నాలు – ఇవన్నీ మన ముందున్నాయి. ప్రధానమంత్రి హోదాలో నేను గర్వంగా చెప్పగలను –మన ప్రభుత్వం ఈ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటోంది. మరోవైపు, ఒక స్వయంసేవకుడిగా నాకు ఆనందముంది –సంఘం కూడా ఈ సవాళ్లను గుర్తించి వాటిని ఎదుర్కొనే స్పష్టమైన మార్గపటాన్ని (రోడ్‌మ్యాప్) రూపొందించింది.

దత్తాజీ చెప్పిన పంచ పరివర్తనాల గురించి నేను నా తరహాలో చెబుతాను: 

1.స్వబోధం – అంటే స్వీయ అవగాహన.

  • బానిస మనస్తత్వం నుండి విముక్తి పొంది మన వారసత్వంపై గర్వపడడం.
  • మన భాషపై గర్వపడడం.
  • స్వదేశీ భావనతో ఆత్మనిర్భరంగా మారడం.
  • “వోకల్ ఫర్ లోకల్” అనే ఉద్యమం మనందరికీ శాశ్వత నినాదం కావాలి.

 

2.సామాజిక సమరసత –

  • సమాజంలో వెనుకబడిన వారికి ప్రాధాన్యం ఇచ్చి న్యాయం సాధించడం.
  • జాతి, భాష, ప్రాంతం, విదేశీ శక్తుల ప్రేరేపణ వల్ల వచ్చే విభేదాలను అధిగమించడం.
  • “వైవిధ్యంలో ఐక్యత” అనే భారతీయ ఆత్మను కాపాడుకోవడం.

 

3. కుటుంబ ప్రబోధన –

  • భారత సమాజం బలం – కుటుంబ వ్యవస్థ.
  • పెద్దలను గౌరవించడం, స్త్రీశక్తిని సత్కరించడం, యువతలో విలువలు పెంపొందించడం 
  • కుటుంబం పట్ల బాధ్యతను గుర్తుచేయడం.

 

4.పౌర విధులు –

  • ప్రతి పౌరుడు తన కర్తవ్యాన్ని గుర్తించాలి.
  • పరిశుభ్రత, జాతీయ సంపదకు గౌరవం, చట్టాల పట్ల విధేయత.
  • రాజ్యాంగం మనపై ఉంచిన బాధ్యతలను బలపరచుకోవాలి.

 

5.పర్యావరణ పరిరక్షణ –

  • ఇది ప్రస్తుత, భవిష్యత్ తరాల కోసం అత్యవసరం.
  • ఆర్థికాభివృద్ధితో పాటు పర్యావరణ రక్షణ. 
  • నీటి సంరక్షణ, పచ్చ శక్తి, శుద్ధ శక్తి – ఇవన్నీ సంఘం చూపిన దిశలో సాగాలి.

ఈ పంచ పరివర్తనాలు – దేశానికి శక్తి ఇచ్చేవి, భారతదేశాన్ని 2047 నాటికి “వికసిత భారత్”గా తీర్చిదిద్దే పునాదులు. 2047లోని భారత్ జ్ఞానంతో, శాస్త్రసాంకేతికతతో, సేవతో, సమానత్వంతో నిండిన, వైభవమయమైన భారతంగా ఉండాలి. ఇది సంఘం దృష్టి. ఇది మన అందరి సాధన. ఇదే మన సంకల్పం. 

సంఘం పుట్టింది – దేశంపై అచంచలమైన విశ్వాసంతో.. సంఘం నడుస్తోంది – దేశసేవ పట్ల అహర్నిశల తపనతో.. సంఘం కరిగింది – త్యాగం, తపస్సు అగ్నిలో.. సంఘం నిలబడింది – సంస్కారం, సాధన సంగమంపై.. సంఘం అనుసంధానమైంది – దేశధర్మాన్ని పరమ ధర్మంగా భావించే మనోభావంతో.. సంఘం కలలుగంటోంది – భారతమాత సేవ అనే విశాల స్వప్నాన్ని.. సంఘం ఆదర్శం – సంస్కృతి మూలాలు బలపడాలి.. సంఘం ప్రయత్నం – సమాజంలో ఆత్మవిశ్వాసం పెరగాలి.. సంఘం లక్ష్యం – ప్రతి హృదయంలో సేవ జ్యోతి వెలిగాలి.. సంఘం దృక్కోణం – భారత సమాజం సామాజిక న్యాయం ప్రతీక కావాలి.. సంఘం ధ్యేయం – ప్రపంచ వేదికపై భారత వాణి ప్రభావవంతంగా వినిపించాలి.. సంఘం సంకల్పం – భారత భవిష్యత్తు సురక్షితంగా, ప్రకాశవంతంగా ఉండాలి..’’

బీరం.వెంకటేశ్వర్ రెడ్డి