మదర్సాలా? ఉగ్రవాద కార్ఖానాలా?
జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ ఇస్లామిక్ పాఠశాలలైన మదర్సాలపై చేసిన సిఫార్సులు, రూపొందించిన అధ్యయన నివేదిక దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చకు తెర లేపాయి. మదర్సా వ్యవస్థను కొనసాగించాలనుకునే మతమౌఢ్య శక్తులతో పాటు సమస్యను ఓటు బ్యాంకు రాజకీయాల దృష్టితో చూసే రాజకీయ పార్టీలు ఈ అంశంపై నిరసనలకు నేతృత్వం వహించాయి. అయితే కమిషన్ లేవనెత్తిన అంశాల తీవ్రతను, అందులో నిజాలను సమీక్షించే ప్రయత్నం మాత్రం ఎవరూ చేయలేదు. జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) రాజకీయాలు లేదా విద్వేషాల ఆధారంగా సిఫార్సులు గాని, ఉత్తర్వులు జారీ చేయడం గానీ చేయదు. దేశంలో బాలల హక్కులను పరిరక్షించడానికి, వారికి ఇతరత్రా రక్షణలు కల్పించేందుకు బాలల హక్కుల పరిరక్షణ చట్టం 2005 (సీపీసీఆర్) సెక్షన్ 3 కింద ఈ కమిషన్ ను ఏర్పాటు చేశారు. సీపీసీఆర్ చట్టం సెక్షన్ 13 ప్రకారం దేశంలో 18 ఏళ్ల లోపు వయసు పిల్లల సంక్షేమానికి కమిషన్ ఒక్కటే బాధ్యత వహిస్తుంది. బాలల హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు జోక్యం చేసుకునే అధికారం, బాధ్యత ఈ కమిషన్ కు మాత్రమే ఉన్నాయి. అంతేగాక లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ చట్టం -2012 (పోక్సో), బాల నేరస్తుల చట్టం-2015, ఉచిత నిర్బంధ విద్యా చట్టం-2009 వంటి పిల్లలకు సంబంధించిన చట్టాలు సమర్థంగా అమలు జరిగేటట్లు చూడవలసిన బాధ్యత కూడా కమిషన్ మీద ఉంది. వీటితోపాటు దేశంలో పిల్లలకు సంబంధించి అమలులో ఉన్న అన్ని చట్టాలు, విధానాలు, వ్యవస్థలను బాలల సంక్షేమ దృక్కోణం నుంచి సమీక్షించి అవసరమైన చర్యలను ఈ కమిషన్ సూచించాలి. సీపీసీఆర్ చట్టం సెక్షన్ 14 కింద కేసులను విచారించడానికి ఈ కమిషన్ సివిల్ కోర్టు హోదాలో వ్యవహరించే అధికారాన్ని కూడా కలిగి ఉంది.
ప్రాథమిక హక్కులు మతాలకేనా?
వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో పిల్లలు మదర్సాలలో చదువుకుంటున్నారు. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాల వెబ్సైట్లు, ఇతర వర్గాల సమాచారం ప్రకారం భారత్ లో 38వేల మదర్సాలు ఉన్నాయి. వీటిలో 28,107 మదర్సాలకు గుర్తింపు ఉండగా 10,039 మదర్సాలకు గుర్తింపు లేదు. అయితే చిన్న చిన్న గ్రామాల్లో, మారుమూల ప్రాంతంలో కూడా మదర్సాలు ఉన్నందున వాటి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. కొన్ని అంచనాల ప్రకారం దేశవ్యాప్తంగా 2 లక్షలకు పైగా మదర్సాలలో 10 లక్షల కంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వీటిలో ఎక్కువ భాగం ప్రభుత్వ మద్దతుతో పని చేస్తున్నాయి. వీటికి విదేశాల నుంచి వచ్చే నిధులకు జమా లెక్కలు లేవు.
దేశంలో 20 లక్షల మంది ముస్లిం విద్యార్థులు మాత్రమే విద్య కోసం మదర్సాల మీద ఆధారపడుతున్నారని ఒక అంచనా. అయితే మరికొన్ని వర్గాల ప్రకారం వీరి సంఖ్య 30 లక్షలకు పైగా ఉంది. అంటే పాఠశాలల్లో చదివే మొత్తం విద్యార్థుల్లో కేవలం 2.99 శాతం మంది మాత్రమే మదర్సాలలో చదువుతున్నారు, మిగతావారు ఆధునిక విద్యను ఎంచుకున్నారు. ముస్లింలలోనే మదర్సాల విద్య పట్ల ఆసక్తి తగ్గిపోతున్నట్టు అనేక నివేదికలు సూచిస్తున్నాయి. ఉదాహరణకు మదర్సా విద్యా మండలి గణాంకాల ప్రకారం ఉత్తర్ ప్రదేశ్ లో మదర్సాలలో విద్యాభ్యాసం చేయాలనుకునే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. సెకండరీ, సీనియర్ సెకండరీ మదర్సా పాఠశాలల్లో చేరే వారి సంఖ్య గత ఆరేళ్ళలో 3 లక్షలకు పైగా తగ్గింది. విద్యా ప్రమాణాలు అధ్వాన్నంగా ఉండటం, మౌలిక సదుపాయాల లోపం, పిల్లలపై లైంగిక, మానసిక వేధింపులు, మదర్సాలు ఇచ్చే సర్టిఫికెట్లకు విలువ లేక బయట ఉపాధి ఉద్యోగాలు దొరక్కపోవడం, ఉగ్రవాదానికి ప్రోత్సహించడం మదర్సాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోడానికి కొన్ని కారణాలు. పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించగానే నిరసనలు మొదలయ్యాయి. ఈ నిరసనలు చేస్తున్నవారు రాజ్యాంగంలోని 25 నుంచి 30 వరకు గల అధికరణాల్లో పేర్కొన్న మత స్వేచ్ఛ, మైనారిటీ హక్కులను ఇందుకు సాకుగా చూపిస్తున్నారు. అయితే ఈ హక్కులు అపరిమితమైనవి కావన్న విషయాన్ని వారు గ్రహించాలి. అంతేగాక కొన్ని వర్గాల హక్కులు ఇతర ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించరాదు. మదర్సాల కార్యకలాపాలు అనేక రకాలుగా బాలల హక్కులను ఉల్లంఘిస్తున్నాయి. రాజ్యాంగంలో పిల్లలకు కల్పించిన వివిధ హక్కులను పరిరక్షించడం కోసం ప్రభుత్వం కొన్ని రకాల హక్కులను కట్టడి చేయవలసి ఉంటుంది.
రాజ్యాంగంలోని అధికరణం 25 (2) మత, ఆర్థిక, రాజకీయ కార్యకలాపాలలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడాన్ని అనుమతిస్తుంది. అందువల్ల ఏ ధార్మిక సంస్థ అయినా దేశంలో అమల్లో ఉన్న చట్టాల ప్రకారమే నడుచుకోవాలి. దేశంలోని కోర్టులు పౌరుల రాజ్యాంగబద్ధ హక్కులకు భంగం వాటిలినప్పుడు జోక్యం చేసుకునే అధికారాన్ని కలిగి ఉన్నాయి. గతంలో ఇచ్చిన అనేక తీర్పుల్లో కోర్టులు ఈ విషయాన్ని ఉద్ఘాటించాయి. అవసరమైన విద్యను పొందటానికి పిల్లలకు గల ప్రాథమిక హక్కును మదర్సాలు నెరవేర్చడం లేదు. మదర్సాల పనితీరు సరైన విద్యను పొందడానికి బాలలకు గల హక్కును నిరాకరించడమే కాక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని, వారి అభివృద్ధికి దోహదం చేసే మెరుగైన అవకాశాలను వారికి దూరం చేస్తోంది. ఆధునిక విద్య పేరుతో మదర్సాలు మతపరమైన విద్యపై దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. దీని ఫలితంగా మదర్సా పాఠ్యాంశాలు పిల్లలను విస్తృతమైన విద్యావకాశాలను అందుకునేందుకు తయారు చేయకుండా వారు ఆధునిక శ్రామిక శక్తిలో భాగం కాకుండా నిరోధిస్తున్నాయి. తద్వారా పిల్లల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి అవకాశాలను పరిమితం చేస్తున్నాయి. అంతేగాక ప్రపంచానికి సంబంధించిన తప్పుడు దృక్పథాన్ని పిల్లలకు అందించడంలో మదర్సాలు కీలకపాత్ర వహిస్తున్నాయి. ప్రపంచంలోని వివిధ దృక్కోణాలు, సంస్కృతులు, మతాలకు సంబంధించిన పరిజ్ఞానం పిల్లలకు అందకుండా అడ్డుపడుతున్నాయి. ఈ కారణం వల్ల మదర్సా విద్యార్థులు విభిన్న మతాలు, వర్గాలు ఉన్న సమాజంలో ఇమడలేకపోతున్నారు. ఇతర మతాల వారితో ఘర్షణలకు దిగుతున్నారు.
2018 లో ‘ఇండియా టుడే’ పత్రిక కేరళలోని మదర్సాల కార్యకలాపాల గురించి ప్రచురించిన ఒక వార్త సంచలన విషయాలను వెల్లడించింది. కేరళలో అనేక మదర్సాలు అతివాద వహాబీ ఇస్లాం భావజాలాన్ని పిల్లలకు బోధిస్తున్నాయి. ప్రపంచంలో నేడు అనేక ఉగ్రవాద సంస్థలకు ప్రేరణ ఈ భావజాలమే. విదేశాల నుంచి, ముఖ్యంగా గల్ఫ్, సౌద్ అరేబియా దేశాల నుంచి హవాలా ద్వారా వచ్చే నిధులు ఈ అతివాద ఇస్లామిక్ భావజాలాన్ని వ్యాపింప చేయడానికి తోడ్పడుతున్నాయి. ప్రపంచ ఇస్లామిక్ రాజ్యాన్ని (ఖలీఫేట్) ఏర్పాటు చేయాలన్న క్రూరమైన అతివాద భావజాల ప్రేరణతోనే ఇక్కడ కొందరు ఐసిస్ కు మద్దతు ధరలుగా మారారు. అయితే అతివాద ఇస్లాం ప్రభావం కేరళలోని ఏదో ఒకటి రెండు కేంద్రాలకు మాత్రమే పరిమితం కాదు. ఇది దేశవ్యాప్తంగా విస్తరించింది. అంతేగాక మదర్సాలలో బాలబాలికలపై లైంగిక అత్యాచారాలు, మానసిక వేధింపులకు సంబంధించిన అనేక సంఘటనలు వెలుగు చూశాయి. పోలీస్ స్టేషన్లు, జాతీయ, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లు, బాలల హక్కుల కమిషన్లు, కోర్టులలోను కేసులు నమోదయ్యాయి. ఈ వేధింపులతో పాటు మదర్సాలలో బాలికల పట్ల వివక్ష చూపుతారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ వివక్ష దేశంలో మహిళల సాధికారీకరణకు, వారి పురోగతికి అవరోధంగా మారుతుంది. అందుకే విద్యావంతులు, ఆర్థికంగా స్తోమత గల ముస్లింలు తమ పిల్లలకు ఆధునిక విద్య నేర్పిస్తున్నారు. కానీ మత నాయకులు ఒత్తిడి కింద పేద ముస్లింలు మాత్రం తమ పిల్లలను మదర్సాలకు పంపుతున్నారు.
కమిషన్ వైఖరిలో తప్పేముంది?
మదర్సాల చరిత్ర, బాలల విద్యాహక్కు ఉల్లంఘనలో వాటి పాత్రపై బాలల హక్కుల కమిటీ ఈ సిఫార్సులు చేసింది. ‘మత విశ్వాసాల సంరక్షకులా? హక్కుల అణచివేతదారులా?: బాలల రాజ్యాంగ హక్కులు వర్సెస్ మదర్సాలు’ అనే శీర్షికతో ఈ నివేదికను రూపొందించారు. 2009లో ఆమోదించిన విద్యాహక్కు చట్టం ఆధారంగా దేశంలోని పిల్లలందరికీ ఉచిత, నిర్బంధ విద్యను అందించాలని కమిషన్ అన్ని రాష్ట్రాలను కోరింది. 2009 చట్టంలోని సెక్షన్ 2(ఎన్)లో పేర్కొన్న విధంగా పిల్లలందరికీ అధికారిక విద్య అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం వివక్ష, పక్షపాతం లేకుండా పిల్లలందరికీ ఉచిత, నిర్బంధ విద్యను అందించాలని, పిల్లలు అధికారిక విద్యను పొందడానికి పాఠశాలలకు హాజరయ్యేలా ప్రభుత్వం చూడాలి. పై వాస్తవాల దృష్ట్యా, సీపీసీఆర్ చట్టం-2005 లోని సెక్షన్ 13 (1) కింద కమిషన్ తన అధికారాలను ఉపయోగించి, ఈ విషయంలో అవసరమైన చర్యలను ఆదేశించే అధికారం కలిగి ఉంది. దీని ఆధారంగా కమిషన్ అధికారిక విద్య అందని పిల్లలకు ఆ అవకాశం కల్పించాలని, వారిని పాఠశాలల్లో చేర్పించాలని కోరింది. అధికారిక, ఆధునిక విద్యను అందించని మదర్సాలకు ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని నిలిపివేయాలని, అనధికార మదర్సాలను మూసివేయాలని కమిషన్ కోరింది. విద్యార్థుల హక్కులను గౌరవిస్తూ మదర్సాల్లో అశాస్త్రీయ విద్యను పొందుతున్న ముస్లిమేతర విద్యార్థులను పాఠశాలలకు బదిలీ చేయాలని కమిషన్ డిమాండ్ చేసింది. ఇది ఏ మతాన్ని నాశనం చేయడం లేదా నిర్మూలించడం కాదు. మరోవైపు దేశ భవిష్యత్ తరాన్ని సరైన దృక్పథంతో తీర్చిదిద్దడం.
మదర్సాల నియంత్రణ భారత్‌కే పరిమితమా?
మదర్సాల ప్రమాణాలు పెంచాలని, ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని, నిబంధనలను ఉల్లంఘించే వారికి ఆర్థిక సహాయాన్ని నిలిపివేయాలని, వాటిని మూసివేయాలని కమిషన్ చేసిన సిఫార్సును సంఘ్ పరివార్ ఎజెండాగా ప్రచారం చేస్తున్నారు. అయితే వాస్తవం ఏమిటంటే బాలల హక్కుల చట్టం, బాలల హక్కుల కమిషన్ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ఉన్నాయి. భారతదేశంలోనే కాకుండా అనేక ఇతర దేశాలలో కూడా మదర్సాల పనితీరుపై సందేహాలు ఉన్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా, మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి ఈ దేశాల్లో ఆంక్షలు విధించారు. అమెరికాలో 2001 సెప్టెంబర్ 11న జరిగిన ఉగ్రదాడి తర్వాత ఈ దాడుల్లో పాల్గొన్న తాలిబన్లు, అల్ ఖైదా సభ్యులు మదర్సాల్లో శిక్షణ పొందినట్లు గుర్తించారు.
జూలై 2004లో అమెరికాలో ఉగ్రవాద దాడులపై జాతీయ కమిషన్ ఒక నివేదిక మదర్సాలను ‘ఉగ్రవాదానికి ఇంక్యుబేటర్లు’గా అభివర్ణించింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న 1,000కి పైగా మదర్సాలను మూసివేయాలని 2021లో శ్రీలంక ప్రభుత్వం నిర్ణయించింది. 2015లో ఇంగ్లాండులోని మదర్సాలు పిల్లలలో ఉగ్రవాదాన్ని పెంపొందిస్తాయని, వాటిని ప్రభుత్వ ఆధీనంలో ఉంచాలని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది. మదర్సాల్లో విద్యనభ్యసిస్తున్న పిల్లలు తమ తలలను విషంతో, హృదయాలను ద్వేషంతో నింపుకొన్నారని అప్పటి బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరాన్ అన్నారు. 2021లో ఫ్రెంచ్ పార్లమెంటు ఆమోదించిన అతివాద నిరోధక చట్టం పిల్లలు మదర్సాలకు వెళ్లడాన్ని నిషేధించింది. ఈ బిల్లుతో మత తీవ్రవాదాన్ని ప్రోత్సహించే అన్ని అక్రమ పాఠశాలలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. పిల్లల అధికారిక విద్యను ప్రోత్సహించడమే ఈ చట్టం లక్ష్యం. అంతేకాకుండా, చైనా ప్రభుత్వం ఇస్లాంను తమ సంస్కృతిని నాశనం చేసే ఒక విదేశీ మతంగా భావిస్తుంది. షీ షిన్ పింగ్ అధికారం చేపట్టిన తర్వాత మత విద్యపై సంపూర్ణ నిషేధం, మత పండితుల నియంత్రణ, ఖురాన్ దహనం, మసీదులు, శ్మశాన వాటికల విధ్వంసం, హిజాబ్ నిషేధం, ఇస్లామిక్ ఆచారాల రద్దు, అరబిక్ నేర్చుకోవడంపై నిషేధం వంటి చర్యలు తీసుకున్నారు. భారతదేశంలో పౌరులందరూ అరబిక్ విశ్వాసాన్ని పూర్తి స్వేచ్ఛతో అనుసరించడానికి అనుమతి ఉంది, కాని ఈ స్వేచ్ఛ అపరిమితమైనది కాదు.
విష్ణు అరవింద్