మోదీ హయాంలో తెలంగాణ రైల్వేల అభివృద్ధి
నరేంద్ర మోదీ నాయకత్వంలో తెలంగాణలో రైల్వే రంగంలో ఎన్నడూ లేని స్థాయిలో అభివృద్ధి జరుగుతోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. నేడు తెలంగాణలోనే దాదాపు రూ.50 వేల కోట్ల విలువ గల రైల్వే అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. తెలంగాణ ప్రజలు బిజెపికి ఎనిమిది మంది ఎంపీలను గెలిపించకపోయి ఉంటే, ఈ స్థాయిలో రైల్వే అభివృద్ధి జరిగేదా అని ప్రశ్నించారు. మార్చ్ 5న హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులను పరిశీలించారు. పనుల పురోగతి గురించి అధికారులను ఆరా తీశారు. దక్షిణ మధ్య రైల్వే అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ”నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారతీయ రైల్వేల్లో నూతన విప్లవం ప్రారంభమైంది. రైల్వే రంగంలో ఒకదాని తర్వాత ఒకటి కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తూ, సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నాం. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ట్రాన్స్పోర్ట్ సిస్టమ్‌ను మెరుగుపరచాలి. వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను బలోపేతం చేయడం చాలా అవసరం. రైల్వే శాఖ ఈ దిశగా వరుస కార్యక్రమాలు చేపడుతోంది. ప్రస్తుతం ఈ స్టేషన్‌కు రోజుకు సుమారు 60 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రతిరోజూ దాదాపు 20 వేల మంది ప్రయాణికులు నాంపల్లి (హైదరాబాద్) రైల్వే స్టేషన్‌ను వినియోగిస్తున్నారు. పెరుగుతున్న అవసరాలను దృష్టిలో పెట్టుకొని స్టేషన్‌ను సమగ్రంగా అప్‌గ్రేడ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో అభివృద్ధి చేస్తున్నాం. హైదరాబాద్ నగరానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్‌కు అనుగుణంగా, ఆ ప్రతిష్టను మరింత పెంచే విధంగా నాంపల్లి రైల్వే స్టేషన్‌ను నిర్మిస్తున్నాం.
ఈ ప్రాజెక్ట్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.350 కోట్లు కేటాయించింది. టెండర్ ప్రక్రియలో రూ.327 కోట్లు ఖరారయ్యాయి. అవసరమైతే రెండో దశలో మరిన్ని నిధులు సమకూర్చి, అత్యాధునిక ప్రమాణాలతో నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. పైభాగంలో సుమారు 6,500 చదరపు అడుగుల విస్తీర్ణంతో సెంట్రల్ హాల్ నిర్మిస్తున్నాం. అందులో రెస్టారెంట్, ఫుడ్ కోర్ట్, ఇతర స్టాల్స్ ఏర్పాటు చేస్తాం. మొత్తం 16 లిఫ్ట్‌లు, 8 ఎస్కలేటర్లు, రిటైరింగ్ రూమ్స్, డార్మిటరీస్, వైఫై, సీసీటీవీ సహా అన్ని ఆధునిక సదుపాయాలు కల్పిస్తున్నాం. దాదాపు 150 వాహనాలకు పార్కింగ్ సౌకర్యం ఉంటుంది.ఈ పనులను 2027 చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం.
తెలంగాణలో రైల్వే అభివృద్ధి వేగవంతంగా జరుగుతోంది. గతంలో 2014లో తెలంగాణకు రూ.258 కోట్లు మాత్రమే కేటాయించేవారు. ప్రస్తుతం రూ.5,454 కోట్లు కేటాయించారు. తెలంగాణలో మొత్తం రూ.47,984 కోట్ల విలువైన రైల్వే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. 346 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్లు పూర్తి చేశాం. 513 కిలోమీటర్ల లైన్లను డబ్లింగ్/ట్రిప్లింగ్/అప్‌గ్రేడ్ చేశాం. చర్లపల్లి నూతన రైల్వే టర్మినల్‌ను అభివృద్ధి చేసి ప్రజలకు అంకితం చేశాం. బేగంపేట రైల్వే స్టేషన్‌ను పూర్తిగా మహిళల సిబ్బందితో నడిపే ఆధునిక స్టేషన్‌గా తీర్చిదిద్దాం. తెలంగాణలో 1,979 కిలోమీటర్ల రైల్వే లైన్ ఎలక్ట్రిఫికేషన్ పూర్తి చేశాం. ఒక్క కొత్త లైన్ మినహా 100% ఎలక్ట్రిఫికేషన్ సాధించాం. స్వదేశీ సాంకేతికతతో కూడిన “కవచ్” వ్యవస్థను ప్రమాదాలు నివారించేందుకు అమలు చేస్తున్నాం. 639 కిలోమీటర్ల పరిధిలో, 63 స్టేషన్లలో అమలు చేశాం. మరిన్ని 384 కిలోమీటర్లకు టెండర్లు పిలిచాం. “వన్ స్టేషన్ – వన్ ప్రొడక్ట్” ద్వారా స్థానిక ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తున్నాం. తెలంగాణలో 42 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నాం. చర్లపల్లి, కరీంనగర్, బేగంపేట, వరంగల్ స్టేషన్లు పూర్తయ్యాయి. మిగతావి వేగంగా జరుగుతున్నాయి. వరంగల్‌లో రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ అభివృద్ధి జరుగుతోంది. ఇటీవల బడ్జెట్లో ప్రకటించిన హై స్పీడ్ ఎలివేటెడ్ కారిడార్లు.. మొత్తం ఏడు ప్రకటిస్తే, అందులో మూడు తెలంగాణకు రావడం గొప్ప విషయం. ఈ మూడు హై స్పీడ్ కారిడార్లకే రూ.50 వేల కోట్లకు పైగా ఖర్చు చేయడం జరుగుతోంది.” అని అన్నారు.

