నైపుణ్యాభివృద్ధి.. ఉద్యోగ కల్పన..
దేశంలో భారీగా కొత్త ఉద్యోగాల కల్పన, అందుకు వీలు కల్పించేలా యువతకు నైపుణ్య శిక్షణ లక్ష్యంతో మోదీ 3.0 సర్కారు అడుగులు వేసింది. తమ ప్రభుత్వం నిర్దేశించుకున్న తొమ్మిది అత్యంత ప్రాధాన్య అంశాల్లో ‘ఉద్యోగ కల్పన, నైపుణ్య శిక్షణ’ ఒకటి. వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 4.1 కోట్ల మంది యువతకు ప్రయోజనం కలిగేలా, రూ.2 లక్షల కోట్లను ఖర్చు చేయనున్నారు. ఉద్యోగాల కల్పన కోసం మూడు, నైపుణ్యాల అభివృద్ధి కోసం రెండు ప్రోత్సాహక పథకాలను చేపట్టనున్నారు. కొత్త ఉద్యోగాల కల్పన పథకాలను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)లో నమోదయ్యే వివరాల ఆధారంగా అమలు చేస్తారు. మొత్తంగా ప్రస్తుత 2024–25 కేంద్ర బడ్జెట్లో విద్య, ఉద్యోగ కల్పన, నైపుణ్య శిక్షణ కోసం రూ.1.48 లక్షల కోట్లను కేటాయించారు. ఇందులో ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్‌కు రూ.23 వేల కోట్లు, జాబ్ క్రియేషన్ ఇన్ మాన్యుఫాక్చరింగ్ స్కీమ్‌కు రూ.52 వేల కోట్లు, సపోర్ట్ టుఎంప్లాయర్స్ స్కీమ్‌కు రూ.32 వేల కోట్లు కలిపి రూ.1.07 లక్షల కోట్లను ఖర్చు చేయనున్నారు.
అందుబాటులో ఉన్న ఉద్యోగాలు, వాటికి అవసరమైన నైపుణ్యాలు, తగిన నైపుణ్యమున్న కార్మికులతో కూడిన డేటాబేస్‌ను సిద్ధం చేస్తామని మంత్రి వెల్లడించారు. ఇందుకోసం ఈ–శ్రమ్, శ్రమ్ సువిధ, సమాధాన్ వంటి పోర్టల్స్‌ను అనుసంధానం చేస్తామని తెలిపారు. దీనితో స్కిల్ ప్రొవైడర్స్, ఎంప్లాయర్స్‌కు.. ఉద్యోగాలు కోరుకునే యువతకు మధ్య అనుసంధానం కుదురుతుందని వెల్లడించారు. దేశంలో యువత సులభంగా ఉద్యోగాలు పొందేందుకు వీలు కల్పించేలా, ఉద్యోగంలో చేరే ముందే తగిన అనుభవం సాధించేలా.. విస్తృతస్థాయిలో ఇంటర్న్‌షిప్ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో 500 టాప్ కంపెనీల్లో మొత్తంగా కోటి మంది యువతకు ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఇంటర్న్‌షిప్‌లో చేరేప్పుడు ఒకసారి రూ.6 వేలు అందిస్తామని, తర్వాత ప్రతినెలా రూ.5 వేలు ఇంటర్న్‌షిప్ అలవెన్స్ అందుతుందని వెల్లడించారు. ఏడాదిపాటు కొనసాగే ఈ ఇంటర్న్‌షిప్ సమయంలో సంబంధిత ఉద్యోగం, పని వాతావరణంపై యువతకు అవగాహన ఏర్పడుతుందని.. దీనితో మంచి ఉద్యోగం పొందేందుకు అవకాశం వస్తుందని వివరించారు. ఈ ఇంటర్న్‌షిప్ పథకానికి ఎంపికయ్యే యువతకు శిక్షణ ఇచ్చేందుకయ్యే వ్యయాన్ని, ఇంటర్న్‌షిప్ అలవెన్స్‌లో పది శాతాన్ని కంపెనీలు తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధుల నుంచి భరిస్తాయని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు బడ్జెట్లో రూ.309.74 కోట్లను కేటాయించారు. ఇందులో ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్రటేరియట్ ట్రైనింగ్ అండ్ మేనేజ్మెంట్, లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌కు రూ.103.05 కోట్లు, వివిధ శిక్షణ స్కీమ్‌లకు రూ.120.56 కోట్లు, మిషన్ కర్మయోగికి రూ.86.13 కోట్లు ఇచ్చారు. వీటితో ఉద్యోగులకు వివిధ నైపుణ్యాలపై రిఫ్రెషర్ కోర్సులు, మిడ్ కెరీర్ శిక్షణ ఇస్తారు.
ఉద్యోగాల కల్పన కోసం :
ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ : వ్యవస్థీకృత రంగాల్లో కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి ప్రోత్సాహకంగా ఒక నెల వేతనం చెల్లింపు. మూడు వాయిదాల్లో.. గరిష్టంగా రూ.15 వేల వరకు అందిస్తారు. దీనితో వచ్చే ఐదేళ్లలో 2.1 కోట్ల మందికి లబ్ధి కలుగుతుందని అంచనా.
జాబ్ క్రియేషన్ ఇన్‌మాన్యుఫాక్చరింగ్ స్కీమ్: కొత్తగా ఉద్యోగంలో చేరేవారు, కొత్తగా ఉద్యోగాలిచ్చే సంస్థలు చెల్లించే ఈపీఎఫ్ఓ చందాలపై తొలి నాలుగేళ్ల పాటు ప్రోత్సాహకాలు. సుమారు 30 లక్షల మంది యువతకు ప్రయోజనం కలుగుతుందని అంచనా.
సపోర్ట్ టు ఎంప్లాయర్స్ స్కీమ్: కంపెనీలు కొత్తగా/అదనంగా ఇచ్చే ఉద్యోగాలకు సంబంధించి యాజమాన్య వాటాగా చెల్లించే ఈపీఎఫ్ చందాల రీయింబర్స్మెంట్. ఒక్కో ఉద్యోగికి నెలకు గరిష్టంగా రూ.3 వేల చొప్పున రెండేళ్లపాటు చెల్లిస్తారు. దీనితో కొత్తగా 50 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందని అంచనా. (ఈ మూడు స్కీమ్‌లను గరిష్టంగా నెలకు రూ.లక్ష వేతనం ఇచ్చే ఉద్యోగాలు/ఉద్యోగులకు మాత్రమే వర్తింపజేస్తారు.)
నైపుణ్యాల శిక్షణ కోసం
వచ్చే ఐదేళ్లలో 20 లక్షల మంది యువతలో నైపుణ్యాల అభివృద్ధి కోసం ప్రత్యేక పథకం. రాష్ట్రాలు, పరిశ్రమలు, కంపెనీలతో కలసి దీనిని అమలు చేస్తారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా కేంద్రీకృత విధానంలో 1,000 పారిశ్రామిక శిక్షణ ఇన్స్టిట్యూట్ల (ఐటీఐ) అప్‌గ్రెడేషన్.
వచ్చే ఐదేళ్లలో కోటి మందికి 500 టాప్ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ అందించే మరో పథకం అమలు.
పరిశ్రమలు, కంపెనీల అవసరాలకు తగినట్టుగా ఉండేలా కోర్సులు, పాఠ్యాంశాల రూపకల్పన.
నైపుణ్య శిక్షణ కోసం ‘మోడల్ స్కిల్ లోన్ స్కీమ్’ కింద ఏటా 25 వేల మంది యువతకు రూ.7.5 లక్షల వరకు రుణాలు.
మహిళలకే ప్రత్యేకించిన నైపుణ్యాల శిక్షణ కార్యక్రమాలు. ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగడం కోసం.. పరిశ్రమలు, కంపెనీల సహకారంతో వర్కింగ్ విమెన్ హాస్టళ్లు, చిన్న పిల్లల సంరక్షణను చూసుకునే క్రెచ్‌ల ఏర్పాటుకు నిర్ణయం.
విద్యకు ఘనమైన కేటాయింపులు
దేశీయ విద్యాసంస్థల్లో ఉన్నత చదువులు అభ్యసించే విద్యార్థులకు రూ.10 లక్షల వరకు విద్యా రుణాలు అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. విద్యా రుణాలకు సంబంధించి ఏటా లక్ష మంది విద్యార్థులకు రుణాలపై మూడు శాతం సబ్సిడీతో ఈ–వోచర్లు నేరుగా అందించనున్నట్లు సీతారామన్ తెలిపారు. విద్యాశాఖకు 2024–25 బడ్జెట్లో రూ.1.25 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఇందులో పాఠశాల విద్యకు రూ.535 కోట్లు, ఉన్నత విద్య గ్రాంట్ కు రూ.9,600 కోట్లు, యూజీసీకి రూ.2,500 కోట్లు, ఐఐఎంలకు రూ.212 కోట్లు, ఐఐటీలకు రూ.10,324.50 కోట్లు, సెంట్రల్ వర్సిటీలకు రూ.15,472 కోట్లు కేటాయించారు. విద్యాసంస్థలలో ఆవిష్కరణలు, సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు బడ్జెట్లో మరో రూ.161 కోట్లు అదనంగా కేటాయించారు. ప్రపంచ స్థాయి విద్యాసంస్థలకు కేటాయింపులు రూ.1,800 కోట్లకు పెరిగాయి.
పండగలా వ్యయ‘సాయం’
బడ్జెట్‌కు సంబంధించిన తొమ్మిది ప్రాధాన్య అంశాల్లో వ్యవసాయ ఉత్పాదకతను ఒకటిగా చేర్చిన కేంద్రం వ్యవసాయానికి పెద్దపీట వేసింది. మధ్యంతర బడ్జెట్లో పేర్కొన్న పథకాలను కొనసాగిస్తూనే కొత్త విధానాలకు శ్రీకారం చుట్టింది. సాగు ఉత్పాదకతను పెంచడమే లక్ష్యంగా కేటాయింపులు జరిపింది. వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లు కేటాయించింది. ప్రతికూల వాతావరణాన్ని సైతం తట్టుకుని అధిక ఉత్పాదకతనిచ్చే సరికొత్త వంగడాలను ప్రోత్సహించనుంది. ఈ మేరకు నిధులు కూడా అందజేయనుంది. ప్రైవేటు రంగానికి కూడా ఇందులో భాగస్వామ్యం కల్పిస్తారు. ప్రభుత్వ, ప్రభుత్వేతర వ్యవసాయ రంగ నిపుణులు ఈ పరిశోధనలను పర్యవేక్షిస్తారు. 32 వ్యవసాయ అలాగే ఉద్యాన పంటలకు సంబంధించి ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకోగలిగే, అధిక దిగుబడినిచ్చే 109 కొత్త వంగడాలను విడుదల చేయనున్నారు. సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం, రసాయన ఎరువులు, క్రిమిసంహారాలపై ఆధారపడటాన్ని తగ్గించడం లక్ష్యంగా రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించాలని కేంద్రం భావిస్తోంది. ప్రకృతి వ్యవసాయం భూసారాన్ని పెంచడమే కాకుండా జీవవైవిధ్యానికి దోహదపడుతుంది. వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా కోటి మంది రైతులను సర్టిఫికేషన్, బ్రాండింగ్‌తో కూడిన ప్రకృతి వ్యవసాయం దిశగా ప్రోత్సహించనున్నారు. 10 వేల అవసరాధారిత బయో ఇన్పుట్ రిసోర్స్ కేంద్రాలు (సేంద్రియ ఎరువుల కేంద్రాలు) ఏర్పాటు చేయనున్నారు. అధిక వినియోగ కేంద్రాలకు సమీపంలో భారీ స్థాయిలో కూరగాయల ఉత్పత్తి క్లస్టర్లు అభివృద్ధి చేయనున్నారు. రైతు–ఉత్పత్తిదారు సంఘాలను, అలాగే కూరగాయల సేకరణ, నిల్వ, మార్కెటింగ్‌తో సహా కూరగాయల సరఫరా వ్యవస్థల కోసం సహకార సంఘాలు, స్టార్టప్‌లను ప్రోత్సహిస్తామని మంత్రి తెలిపారు. పప్పు దినుసులు, నూనెగింజల్లో స్వయం సమృద్ధి సాధన దిశగా వాటి ఉత్పత్తి, నిల్వ, మార్కెటింగ్‌ను బలోపేతం చేయనున్నారు. వేరుశనగ, నువ్వులు, సోయాబీన్, పొద్దుతిరుగుడు తదితర నూనెగింజలకు ‘ఆత్మనిర్భరత’ సాధన కోసం ఓ ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించనున్నారు. పైలట్ ప్రాజెక్టు విజయవంతమైన నేపథ్యంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వచ్చే మూడేళ్లలో దేశవ్యాప్తంగా రైతులు, వారి భూముల కోసం వ్యవసాయంలో డిజిటిల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) అమలు చేయనున్నారు. ఈ ఏడాది 400 జిల్లాల్లో డీపీఐ ద్వారా ఖరీఫ్ పంటల డిజిటల్ సర్వే నిర్వహించనున్నారు. రైతులు వాతావరణ సూచనలు, పంటలకు సంబంధించిన సలహా సేవలు, మార్కెట్ ధరల గురించిన సమాచారం తెలుసుకునేందుకు ఈ డిజిటిల్ ఫ్రేమ్‌వర్క్ ద్వారా వీలు కలుగుతుంది.
6 కోట్ల మంది రైతులు, వారి భూముల వివరాలను రైతు, భూమి రిజిస్ట్రీల్లో పొందుపరుస్తారు. ఐదు రాష్ట్రాల్లో జన్ సమర్థ్ ఆధారిత కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేయనున్నారు. రొయ్యల సాగు కేంద్రాల నెట్వర్క్ ఏర్పాటుకు ఆర్థిక సాయంతో పాటు నాబార్డ్ ద్వారా రొయ్యల సాగు, శుద్ధి, ఎగుమతికి నిధులు అందజేయనున్నారు. వేగవంతమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, పెద్దయెత్తున ఉపాధి కల్పన, అవకాశాలు లక్ష్యంగా సహకార రంగ సర్వతోముఖాభివృద్ధికి వీలుగా జాతీయ సహకార విధానాన్ని కేంద్రం తీసుకురానుంది.
గ్రామీణాభివృద్ధే దేశాభివృద్ధి
మోదీ 3.0 సర్కారు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు నడుం బిగించింది. కీలకమైన కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఈసారి బడ్జెట్లో దండిగానే నిధులు కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరం (2023–24)లో గ్రామీణాభివృద్ధికి (మౌలిక సదుపాయాలతో సహా) రూ.2,38,204 కోట్లు కేటాయించగా (సవరించిన అంచనా రూ.2,38,984 కోట్లు).. ఈ సారి బడ్జెట్లో (2024–25) దీన్ని రూ.2,65,808 కోట్లకు పెంచింది. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి (ఎంజీఎన్ఆర్ ఈజీఏ) రూ. 86,000 కోట్లు కేటాయించారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన నాలుగో దశలో భాగంగా 25,000 పల్లె ప్రాంతాలను పక్కా రోడ్లతో అనుసంధానం చేయనున్నారు. ఇందుకు రూ.19,000 కోట్లు కేటాయించారు. ఈ పథకం మొదలైనప్పటి నుంచి ఈ ఏడాది జనవరి వరకు మొత్తం 8,15,072 కిలోమీటర్ల పొడవైన రోడ్లకు అనుమతులు మంజూరు కాగా, 7,51,163 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం పూర్తయింది.
పేదలు, మధ్య తరగతి వర్గాలకు సొంతింటి కల నెరవేర్చేలా బడ్జెట్లో భారీగా రూ.80,671 కోట్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి కేటాయించారు. గ్రామీణ ప్రాంతాల్లో పేద, బలహీన వర్గాలకు 2.95 కోట్ల ఇళ్లను నిర్మించాలనేది లక్ష్యం కాగా, 2023 మార్చి నాటికి 2.94 కోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. కాగా, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వచ్చే ఐదేళ్లలో అదనంగా మరో 3 కోట్ల ఇళ్ల నిర్మాణాన్ని ఈ స్కీమ్ కింద చేపట్టనున్నారు. ఇందులో రెండు కోట్ల ఇళ్లను గ్రామాల్లో, కోటి ఇళ్లను పట్టణ పేదలు, మధ్య తరగతి కుటుంబాలకు అందించనున్నారు. పీఎంఏవై (అర్బన్) 2.0 స్కీమ్ కోసం ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు సీతారామన్ వివరించారు. ఇందులో భాగంగా వడ్డీ రాయితీ, చౌక రుణాల రూపంలో రూ. 2.2 లక్షల కోట్ల సాయం అందిస్తామని చెప్పారు. రుణ ఆధారిత సబ్సిడీ స్కీమ్ (సీఎల్ఎస్ఎస్) కోసం ఈ బడ్జెట్లో రూ.4,000 కోట్లను కేంద్రం కేటాయించింది. మొత్తం మీద పీఎంఏవై (అర్బన్)కు ఈ బడ్జెట్లో రూ.30,170 కోట్లు దక్కాయి.
స్వచ్ఛ భారత్ మిషన్ కు రూ. 12,192 కోట్లు కేటాయించారు. ఇందులో స్వచ్ఛ భారత్ (అర్బన్)కు రూ.5,000 కోట్లు, స్వచ్ఛభారత్ (గ్రామీణ)కు రూ.7,192 కోట్లు కేటాయించారు. దేశంలో బహిరంగ మలమూత్ర విసర్జనను పూర్తిగా తుడిచిపెట్టడానికి (ఓడీఎఫ్) 2014లో ఆరంభమైన ఈ స్వచ్ఛ భారత్ పథకం (ఎస్బీఎం) కిందికి ఘన వ్యర్థాల (చెత్త నిర్మూలన), జల వ్యర్థాల నిర్వహణను కూడా తీసుకొచ్చారు. ఈ మిషన్ కింద, గ్రామీణ ప్రాంతాల్లో ఓడీఎఫ్ స్టేటస్‌ను పూర్తిగా సాధించినట్లు కేంద్రం ప్రకటించింది. దీన్ని స్థిరంగా కొనసాగించడంతో పాటు అన్ని గ్రామాల్లోనూ ఘన వ్యర్థాల నిర్వహణ, మురుగు నీటి నిర్వహణను అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
తాగునీటికి రూ.69,927 కోట్లు కేటాయించారు. గ్రామీణ కుటుంబాలన్నింటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందరికీ అందించేందుకు 2019–20లో జల్ జీవన్ మిషన్ ప్రకటించారు. 2024 నాటికి దీన్ని సాధించాలనేది కేంద్రం లక్ష్యం. కాగా, దేశంలోని మొత్తం 19.26 కోట్ల గ్రామీణ కుటుంబాలకు గాను ఇప్పటివరకు 14.22 కోట్ల కుటుంబాలకు తాగు నీటి సదుపాయం (కుళాయి కనెక్షన్లు) కల్పించినట్లు అంచనా.
దేశంలో 30 లక్షలకు పైగా జనాభా కలిగిన 14 పెద్ద నగరాలకు రవాణా ఆధారిత అభివృద్ధి ప్రణాళికను కేంద్రం ప్రతిపాదించింది. నగరాల సృజనాత్మకతో కూడిన పునర్ అభివృద్ధి కోసం ఓ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందిస్తామని తెలిపింది. నగరాలను అభివృద్ధి కేంద్రాలు (గ్రోత్ హబ్‌లు)గా తీర్చిదిద్దేందుకు వీలుగా రాష్ట్రాలతో కలిసి పనిచేస్తామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. టౌన్ ప్లానింగ్ పథకాల వినియోగంతో నగర చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధి, ఆర్థిక, రవాణా ప్రణాళిక ద్వారా దీనిని సాధిస్తామని చెప్పారు.
నారీశక్తికి ప్రోత్సాహం
దేశంలో మహిళల అభివృద్ధిని ప్రోత్సహించేందుకు 2024–25 బడ్జెట్ లో పెద్దపీట వేసినట్లు కేంద్రం తెలిపింది. వివిధ మంత్రిత్వశాఖలు, పథకాల కింద బాలికలు, మహిళల కోసం రూ.3 లక్షల కోట్లకుపైగా కేటాయింపులు చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. దేశ ఆర్థికాభివృద్ధిలో మహిళలు పోషిస్తున్న పాత్రను మరింత పెంచాలన్న ప్రభుత్వ చిత్తశుద్ధికి ఈ కేటాయింపులే నిదర్శనమన్నారు. మహిళలు అధిక సంఖ్యలో ఉద్యోగాల్లో చేరేలా ప్రోత్సహించేందుకు దేశంలో మహిళా హాస్టళ్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. పనిచేసే తల్లులకు ఆలంబనగా ఉండేందుకు పని ప్రదేశాల్లో శిశు సంరక్షణ కేంద్రాలను నిర్మిస్తామన్నారు. ఈ విషయంలో పరిశ్రమల సహకారం తీసుకుంటామని వివరించారు. మహిళలకు ప్రత్యేకంగా నైపుణ్య శిక్షణ, స్వయం సహాయక బృందాలకు మార్కెట్ అవకాశాలు లభించేలా చూస్తామని చెప్పారు.
స్త్రీ, శిశు సంక్షేమానికి కేటాయింపులు ఇలా..
- స్త్రీ, శిశు సంక్షేమానికి రూ. 26,092 కోట్లుకేటాయించింది. ఇది గతేడాది సవరించినఅంచనాలు రూ.25,448 కోట్ల కంటే 2.5 శాతం అధికం.
- చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు ఉద్దేశించిన సాక్షం అంగన్వాడీ, పోషణ్ 2.0 పథకాలకు అత్యధికంగా రూ. 21,200 కోట్లు.
- శిశు సంరక్షణ సేవలు, సంక్షేమానికి ఉద్దేశించిన మిషన్ వాత్సల్య కార్యక్రమానికి రూ.1,472 కోట్లు.
- సంబాల్, సామర్థ్య ఉప పథకాలతో కూడిన మిషన్ శక్తి పథకానికి రూ. 3,145 కోట్లు. ఇందులో బేటీ బచావో.. బేటీ పఢావో లాంటి పథకాలతో కూడిన సంబాల్ పథకానికి రూ.629 కోట్లు.
- పిల్లల అభివృద్ధి, శిక్షణ, పరిశోధనా సంస్థ ఎన్‌ఐపీసీసీడీకిరూ. 88.87 కోట్లు, చిన్నారుల దత్తతను పర్యవేక్షించే సీఏఆర్ఏ (కారా)కు రూ. 11.40 కోట్లు.
- మహిళా భద్రతను పెంచేందుకు ఉద్దేశించిన నిర్భయా ఫండ్‌కు రూ. 500 కోట్లు.
- ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్‌కు రూ.5.60 కోట్లు.
ఆరోగ్యశాఖకు 13 శాతం ఎక్కువ
కేంద్ర ఆరోగ్యశాఖకు 2024–25 బడ్జెట్లో రూ.90,958.63 కోట్లను కేటాయించారు. ఇది 2023–24 సవరించిన అంచనాల కంటే (రూ.80,517.62 కోట్లు) 12.96 శాతం ఎక్కువ. ఇందులో రూ.87,656.90 కోట్లను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు, ఆరోగ్య పరిశోధన విభాగానికి రూ.3,301.73 కోట్లను కేటాయించారు. కేన్సర్ చికిత్సకు ఉపయోగించే మూడు కీలక మందుల (ట్రాస్తుజుమబ్ డెరక్స్‌టెకన్, ఒసిమెర్టినిబ్, డుర్వాలుమాబ్)పై కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా మినహాయించారు. ఆయుష్ మంత్రిత్వ శాఖకు రూ. 3,712.49కోట్లు కేటాయించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలైన జాతీయ ఆరోగ్య మిషన్‌కు కేటాయింపులు రూ. 36,000 కోట్లకు పెరిగాయి. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎం జేఏవై)కి కేటాయింపులు రూ.6,800 కోట్ల నుంచి రూ.7,300 కోట్లకు పెరగడం గమనార్హం. జాతీయ టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్‌కు కేటాయింపులను రూ.90 కోట్లకు పెంచారు. స్వయంప్రతిపత్తి విభాగాలకు రూ.18,013.62 కోట్లు కేటాయించారు. ఢిల్లీ ఎయిమ్స్‌కు రూ.4,523 కోట్లు ఇచ్చారు. భారత మెడికల్ కౌన్సిల్‌కు రూ.2,732.13 కోట్లు కేటాయించారు.
రక్షణరంగంలో ఆత్మనిర్భరత దిశగా
చైనా కవ్వింపులు, పాక్ ముష్కరుల చొరబాట్లతో సరిహద్దుల వెంట అప్రమత్తంగా ఉండే సైన్యంతోపాటు భూతల, గగనతల రక్షణ వ్యవస్థల మరింత పటిష్టతే లక్ష్యంగా మోదీ సర్కార్ మరోమారు రక్షణ రంగానికి పెద్దపీట వేసింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రక్షణ రంగానికి రూ.6,21,940.85 కోట్లు కేటాయించింది. అత్యాధునిక డ్రోన్లు, యుద్ధవిమానాలు, నౌకలు, ఆయుధాలు, ఇతర సైనిక ఉపకరణాల కొనుగోలు కోసం ఏకంగా రూ.1,72,000 కోట్లను కేటాయించారు. తాజా కేంద్ర బడ్జెట్లో రక్షణరంగ వాటా 12.9 శాతానికి పెరగడం విశేషం.
గత ఆర్థికసంవత్సరంతో పోలిస్తే ఈసారి రక్షణ రంగానికి కేటాయింపులు 4.79 శాతం పెంచారు. రక్షణ రంగంలో స్వావలంబనే లక్ష్యంగా సైనిక ఉపకరణాల స్థానిక తయారీని మరింత ప్రోత్సహించేందుకు మోదీ సర్కార్ నడుం బిగించింది. అందుకే స్థానిక ఉపకరణాల సేకరణ కోసం రూ.1,05,518.43 కోట్లను కేటాయించింది. దీంతో రక్షణరంగంలో ఆత్మనిర్భరత మరింతగా సాకారం కానుంది. గత బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి సరహద్దుల వెంట రహదారుల నిర్మాణానికి కేటాయింపులు 30 శాతం పెరగడం విశేషం. బీఆర్వోకు కేటాయించిన రూ.6,500 కోట్ల నిధులతో సరిహద్దుల వెంట మౌలికవసతుల కల్పన మెరుగుపడనుంది. రక్షణరంగ పరిశ్రమల్లో అంకుర సంస్థలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఐడెక్స్ పథకానికి రూ.518 కోట్లు కేటాయించారు. అంకుర సంస్థలు, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు, ఆవిష్కర్తలు ఇచ్చే కొత్త ఐడియాలను ఆచరణలో పెట్టేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు.
కోస్ట్‌గార్డ్ ఆర్గనైజేషన్‌కు రూ.7,651 కోట్లు కేటాయించారు. తేజస్ వంటి తేలికపాటి యుద్ధవిమానాలను తయారుచేస్తూ నూతన విమానాల డిజైన్, రూపకల్పన, తయారీ కోసం కృషిచేసే హిందుస్తాన్ ఏరోనాటిక్స్‌కు రూ.1,600 కోట్లు కేటాయించారు. రాష్ట్రీయ రైఫిల్స్ విభాగం కోసం రూ.10,535 కోట్లు కేటాయించారు. ఎన్సీసీ కోసం రూ.2,726 కోట్లు, త్రివిధ దళాల్లో అగ్నిపథ్ పథకం నిర్వహణ కోసం రూ.5,980 కోట్లు కేటాయించారు.
కేంద్ర పన్నుల్లో పెరిగిన తెలంగాణ వాటా
కేంద్ర పన్నుల్లో తెలంగాణకు రూ.26,216.38 (2.102 శాతం) కోట్ల వాటా లభించనుంది. అందులో ఆదాయ పన్ను రూ.9,066.56 కోట్లు, కార్పొరేషన్ పన్ను రూ.7,872.25 కోట్లు, కేంద్ర జీఎస్టీ రూ.7,832.19 కోట్లు, కస్టమ్స్ రూ.1,157.45 కోట్లు, కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ రూ. 243.98 కోట్లు, సర్వీస్ టాక్స్ రూ.0.86 కోట్లు, ఇతర పన్నులు రూ.43.09 కోట్లు ఉన్నాయి. ఈ మేరకు 2024–25 బడ్జెట్ ప్రతిపాదనల్లో తెలిపారు. గతేడాది బడ్జెట్లో కేంద్ర పన్నుల రూపంలో తెలంగాణకు రూ.23,066.20 కోట్లు కేటాయించగా దానితో పోలిస్తే ఈసారి బడ్జెట్లో పన్నుల వాటా రూ.3,150.18 కోట్లు అధికం కావడం విశేషం.
బడ్జెట్లో ఐఐటీ హైదరాబాద్ (ఈఏపీ)కు రూ.122 కోట్లు, హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్‌కు రూ.10.84 కోట్లు, సింగరేణి కాలరీస్‌కు రూ.1,600 కోట్లు, హైదరాబాద్‌లోని అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఆఫ్ ఎక్స్‌ప్లొరేషన్ అండ్ రీసెర్చ్‌కు రూ.352.81 కోట్లు, హైదరాబాద్‌లోని ఇన్‌కాయిస్‌కు రూ. 28 కోట్లు కేటాయించారు.
హైదరాబాద్ సహా దేశంలోని 7 నైపర్ సంస్థలకు కలిపి రూ.242 కోట్లు, హైదరాబాద్ సహా మరో మూడు ప్రాంతాల్లో ఉన్న డైరెక్టరేట్ ఆఫ్ హిందీ సంస్థకు రూ.16.54 కోట్లు, హైదరాబాద్ సహా 12 నగరాల్లో ఉన్న సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీ–డాక్)కు రూ.270 కోట్లు, నేషనల్ ఫిషరీస్ డెవలస్‌మెంట్ బోర్డుకు రూ.16.78 కోట్లు, స్వాతంత్య్ర సమరయోధులకు (పెన్షన్లు) రూ.603.33 కోట్లు, హైదరాబాద్ జాతీయ పోలీసు అకాడమీ సహా పోలీసు విద్య, శిక్షణ, పరిశోధనకు మొత్తం రూ.1,348.35 కోట్లు కేంద్ర బడ్జెట్లో కేటాయించారు. హైదరాబాద్‌లోని సీడీఎఫ్‌డీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ సహా దేశంలోని ఇతర స్వయం ప్రతిపత్తి సంస్థలకు కలిపి రూ.940.66 కోట్లు, మణుగూరు సహా కోటా (రాజస్తాన్)లోని భార జల ప్లాంట్లకు రూ.1,485.21 కోట్ల మేర కేటాయించారు.

