నక్సలిజం నిర్మూలన మోదీ ప్రభుత్వ మరో ఘన విజయం
5 దశాబ్దాలకు పైగా దేశంలో భయంకర ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించి వేలాది ప్రజల, వందలాది భద్రతా బలగాల నిర్ధాక్షిణ్యంగా హత్యలు చేసిన ఉన్మాద కమ్యూనిస్టు ఉగ్రవాద సంస్థ మావోయిస్టు పార్టీ తుడిచిపెట్టుకుపోయే దశకు చేరుకుంది. ఇందుకు మోదీ ప్రభుత్వ సమర్థ, కఠిన నిర్ణయాలు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో మన భద్రతా బలగాల చేపడుతున్న ఆపరేషన్ కగార్, అంతకుముందు మోదీ ప్రభుత్వం ఇచ్చిన సరెండర్ ఆఫర్ ప్రధాన కారణం. దేశంలో నక్సల్సిజం గురించి గత చరిత్రగా చెప్పుకొనే రోజు ఎంతో దూరం లేదు.
1967లో సీపీఐ(ఎంఎల్) పార్టీలో వచ్చిన చీలికలతో 70వ దశకం ఆరంభంలో పశ్చిమ బెంగాల్ లోని నక్సల్ బరీలో చారు మజుందార్, కను సన్యాల్ వంటి నాయకుల ఆధ్వర్యంలో నక్సలైట్ ఉద్యమం ప్రారంభమై, దేశవ్యాప్తంగా అనేక రకాలుగా విస్తరించింది. మన తెలుగు రాష్ట్రాల్లో 1970వ దశకంలో అడపాదడపా నక్సల్ కార్యకలాపాలు మొదలైనప్పటికీ 1980లో కొండపల్లి సీతారామయ్య పీపుల్స్ వార్ సంస్థ స్థాపించడంతో నక్సలైట్ ఉద్యమానికి ఊతం లభించింది. నక్సలైట్ సంస్థలకు అనుబంధంగా RSU, PDSU, DSO లాంటి నక్సల్ భావజాల విద్యార్థి సంఘాల కార్యకలాపాలతో వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలల నుంచి రిక్రూట్మెంట్లు జరిగాయి. గద్దర్, వరవరరావు లాంటి అర్బన్ నక్సల్స్ ప్రేరేపణలతో వేలాది మంది యువత అడవుల పాలై, ఒత్తిడితో నక్సల్స్ గా మారి, ఇటు ప్రజలను, అటు పోలీసులను చంపుతూ, వాళ్లూ చస్తూ, నక్సల్స్ ఉద్యమానికి సమిధలయ్యారు. దశాబ్ద కాలం తర్వాత పీపుల్స్ వార్ వ్యవస్థాపకుడైన కొండపల్లి సీతారామయ్యను బహిష్కరిస్తే, ఆయన ప్రాణభయంతో అరెస్టు పేరుతో పోలీసులకు లొంగిపోయాడు.
దేశవ్యాప్తంగా నక్సలైట్లు సాగించిన మారణకాండ దశాబ్దాల పాటు సాగింది. వీరు సృష్టించిన భయానక వాతావరణం దేశ ఆర్థిక వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం చూపింది. దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ కమ్యూనిస్ట్ అనుకూల చర్యల కారణంగా 2009 నాటికి నక్సలిజం దేశంలోని 20 రాష్ట్రాల్లో 223 జిల్లాలకు విస్తరించింది. ఒకరిద్దరు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు వేరువేరు పంథాలతో ఒకసారి చర్చలని, ఇంకోసారి అణచివేత అని నిలకడ లేని విధానాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో నక్సలైట్లకు సానుభూతి, సానుకూల వాతావరణం ఏర్పడింది. యూపీఏ హయాంలో ఇది పెద్దఎత్తున నడిచింది. 2010లో దంతెవాడలో 76 మంది CRPF సిబ్బందిని చంపారంటే నక్సలైట్ల ప్రమాదం ఏ స్థాయిలో ఉందో, కాంగ్రెస్ అసమర్థత ఎంత అధ్వానంగా ఉందో మనకు అర్థమవుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో నక్సలైట్లు జరిపిన దారుణాలు అన్నీఇన్నీ కావు. దేశభక్తులైన ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, బిజెపి కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని హతమార్చారు. జాతీయ జెండాను తగలబెట్టారు. కాకతీయ రైలు బోగీ తగలబెట్టి ప్రజలను అగ్నికి ఆహుతిచ్చారు. రాగ్యా నాయక్ సహా ఎంతో మంది ప్రజాప్రతినిధులను పొట్టన పెట్టుకున్నారు. చత్తీస్ ఘడ్ లో కొంతమంది కాంగ్రెస్ నాయకుల సహకారం పొందిన నక్సలైట్లు ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులనూ చంపేశారు. జనశక్తి దళం వంటి ఇతర ఉగ్ర సంస్థలనూ పీపుల్స్ వార్ నిర్దాక్షిణ్యంగా మట్టుబెట్టారు. ఆ పరిస్థితుల్లో విమలక్క, సాంబశివుడు లాంటి ఎంతో మంది జనశక్తి సభ్యులు నక్సలైట్ల భయంతో పోలీసులకు లొంగిపోయారు. నక్సలైట్ల ఉన్మాదం తోటి నక్సల్స్ నూ సహించని స్థాయిలో ఉందని మనకు అర్థమవుతుంది.
2014లో నరేంద్ర మోదీ నాయకత్వంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుతో నక్సల్స్ సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు మొదలయ్యాయి. నక్సల్ ఫ్రభావిత ప్రాంతాల్లో వీలైనంత వరకు అభివృద్ధి, సంక్షేమ కార్యకలాపాలను చేపడుతూనే మరోవైపు నక్సల్స్ లొంగుబాటు, ఏరివేతకు సమర్థ చర్యలు తీసుకుంది. అవసరం ఉన్న చోటల్లా భద్రతా బలగాలను దీర్ఘకాలిక ప్రాతిపదికన ఏర్పాటు చేస్తూ నక్సల్స్ సమస్యను బహుముఖంగా ఎదుర్కొంది. 2019లో అమిత్ షా హోం మంత్రి అయ్యాక ఈ నక్సల్స్ నిర్మూలన వేగం పుంజుకుంది. కొన్ని బిజెపియేతర రాష్ట్ర ప్రభుత్వాలున్న రాష్ట్రాల నుంచి సరైన సహకారం లభించనప్పటికీ అమిత్ షా సమర్థ నాయకత్వం, సమర్థులైన భద్రతా బలగాల పరిశ్రమ, ఈ నక్సల్స్ సమస్యను నిర్మూలించడంలో ప్రధాన పాత్ర పోషించింది.
2047 నాటికల్లా భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలంటే నక్సల్స్ సంపూర్ణ నిర్మూలన ఆవశ్యం. అందుకే అమిత్ షా 2026 మార్చ్ 31 నాటికి నక్సలైట్లను సంపూర్ణంగా నిర్మూలిస్తామంటూ టైం బౌండ్ ప్రణాళిక ప్రకటించారు. ఇందులో భాగంగా అద్భుతమైన సరెండర్ పాలసీ, ఆపరేషన్ కగార్ లతో వేలాది నక్సల్స్ లొంగుబాటు/అరెస్టు కావడం, వందలాది మంది ఎన్ కౌంటర్ కావడం మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెందిన పీపుల్స్ వార్ కు కోలుకోలేని దెబ్బ అయ్యింది. నంబాల కేశవరావు, హిడ్మా లాంటి భయంకర ఉగ్రవాదుల ఏరివేశారు. మహారాష్ట్రలో మల్లోజులతో పాటు 50 మంది నక్సల్స్ లొంగిపోయారు. తర్వాత దేశవ్యాప్తంగా నక్సల్స్ లొంగుబాటు, అరెస్టు, ఏరివేత నిర్విఘ్నంగా కొనసాగింది. తెలంగాణలో గత వారం 27 మంది నక్సల్స్ లొంగిపోయారు.
ఇప్పుడు నక్సలిజం దేశంలో అంతిమ దశకు చేరుకుంది. 31 మార్చ్ 2026 వరకు నక్సల్ రహిత దేశ అవతరణలో ఎలాంటి అనుమానాలు ఎప్పుడూ లేవు. ఇప్పుడు దేశ ఆర్థికాభివృద్ధికి మార్గం మరింత సుగమం అయ్యింది. మోదీ ప్రభుత్వ ఎన్నో ఘనవిజయాలలో నక్సలైట్ల నిర్మూలన ఒకటి. ఇది అభివృద్ధి చెందిన భారతదేశ కల సాకారానికి మరో ముందడుగు. మోదీ ప్రభుత్వం అంతర్గత శత్రువుల నిర్మూలన ఘనవిజయాలను యావత్ ప్రపంచం అభినందిస్తోంది.

