నక్సలిజం నిర్మూలనకు చతుర్ముఖ వ్యూహం
2019లో అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు జమ్మూకశ్మీర్ కంటే వామపక్ష తీవ్రవాదం పెద్ద ముప్పుగా భావించారు. ఒక జాతీయ వార పత్రికకు ఇచ్చిన ఈ సుదీర్ఘమైన ఇంటర్వ్యూలో ఆయన 2026 మార్చి నాటికి భారతదేశంలో నక్సల్స్ ముప్పును పూర్తిగా నిర్మూలించడానికి తమ ప్రభుత్వం అనుసరిస్తున్న బహుముఖ వ్యూహాన్ని వివరించారు. ఐదు దశాబ్దాలకు పైగా నలుగుతున్న సమస్యను ఇంత తక్కువ గడువులో పరిష్కరించగలమన్న విశ్వాసం మీకు ఎలా ఏర్పడిందన్న ప్రశ్నకు, “విశ్వాసం తనంతట తానుగా నక్సలిజాన్ని నిర్మూలించదు. ఇప్పటికే చేసిన పనిని బట్టి ఈ ప్రకటన చేశాను,” అని సమాధానమిచ్చారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు:
ప్ర. 2019లో మీరు కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు నక్సల్స్ లేదా వామపక్ష తీవ్రవాదం ముప్పుపై మీ అంచనా ఏమిటి? దేశంలో దానిని నిర్మూలించడానికి మీరు ఏ వ్యూహాన్ని రూపొందించారు?
జ: 2019లో కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కాశ్మీర్ కంటే నక్సల్స్ లేదా వామపక్ష తీవ్రవాదం సమస్య చాలా పెద్దదని నాకు చెప్పారు. ఒకరకంగా చెప్పాలంటే అభివృద్ధి కొరవడిందనే అసంతృప్తి నక్సలిజానికి కారణమని చెప్పవచ్చు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 1990 వరకు మన దేశం వనరుల కొరతను ఎదుర్కొంది. వ్యవస్థాగతమైన అభివృద్ధి సాధ్యం కాకపోవడం వల్ల ఈ ప్రాంతాలు అభివృద్ధి పరంగా వెనుకబడి ఉన్నాయి. వామపక్ష తీవ్రవాదులు ఈ ప్రాంతాలను తమకు అనుకూలమైనవిగా భావించి హింస అభివృద్ధికి దారితీస్తుందనే భావనను నాటారు. వారు ఈ ప్రాంతాల ప్రజలను హింసకు ప్రేరేపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో నేపాల్ లోని పశుపతినాథ్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి వరకు విస్తరించిన రెడ్ కారిడార్‌లో ఆయుధాలు, హింస స్థానంలో అభివృద్ధి, విశ్వాసంతో కూడిన చతుర్ముఖ వ్యూహాన్ని రూపొందించాం.
ప్ర . మీరు ప్రస్తావించిన నాలుగు కోణాల్లో మొదటిది ఏమిటి?
జ: నక్సల్స్‌కు వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణ ప్రణాళికలో మొదటి అంశం తుపాకులు పట్టుకుని హింసకు కారణమైన వారిపై నిర్దాక్షిణ్యమైన చర్యలు తీసుకోవడం. ఈ ప్రాంతంలో మోహరించిన రాష్ట్ర పోలీసు బలగాలు, సెంట్రల్ సాయుధ పోలీసు బలగాల (సీఏపీఎఫ్) శిక్షణ, ఏకీకరణ, సామర్థ్యాన్ని పెంపొందించడం ద్వారా గరిష్ట స్థాయిలో భద్రతా బలగాలను మోహరించాం. ఆయుధ ఆధిపత్యం కోసం అత్యాధునిక ఆయుధాలను వినియోగంలోకి తెచ్చాం.
ప్ర. ప్రధాన నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో భద్రతాపరమైన లోటును భర్తీ చేయడానికి అనుసరించిన వ్యూహం ఏమిటి?
జ: ఇది రెండో వ్యూహం. చాలా నక్సల్ ప్రభావిత జిల్లాల్లో భద్రతా దళాల లోటును భర్తీ చేసేందుకు సీఏపీఎఫ్, రాష్ట్ర పోలీసుల సహకారంతో ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ (ఎఫ్ఓబీ) అని పిలిచే శిబిరాలను ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేసింది. ఇవి ఆయా ప్రాంతాల్లో నక్సలైట్లను తుడిచిపెట్టేందుకు క్రమపద్ధతిలో పనిచేశాయి. గత ఐదేళ్లలో 302 కొత్త శిబిరాలను ఏర్పాటు చేశాం. వ్యూహాత్మకంగా నక్సల్స్ ఉన్న ప్రాంతాలను క్షాళన చేయడంతో ఆ ప్రాంతాలను పోలీసులకు అప్పగించి ఎఫ్ఓబీలు మరింత ముందుకు వెళ్ళాయి. ఇందుకోసం 2014 నుంచి పటిష్టం చేసిన (ఫోర్టిఫైడ్) పోలీస్ స్టేషన్ కార్యక్రమాన్ని 66 నుంచి 612 స్టేషన్లను విస్తరించాం. ఈ స్టేషన్లలో నక్సల్స్ నుంచి విముక్తి పొందిన ప్రాంతాల్లో స్థానికులకు భద్రత కల్పించేందుకు కమ్యూనికేషన్ సౌకర్యాలతో తగినంత సాయుధ సిబ్బందిని నియమించాం.
ప్ర. నిఘాతో సహా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో ఏ మేరకు పురోగతి సాధించారు ?
జ: నక్సల్స్‌తో పోరాడే మన దళాలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో అనుసంధానమయ్యేలా శిక్షణ ఇచ్చాం. డ్రోన్లు, ఉపగ్రహ ఇమేజింగ్, కృత్రిమ మేధ సహా సాంకేతిక పరిజ్ఞానంతో ఇంటెలిజెన్స్ సేకరణను ఆధునికీకరించాం. దీంతో మన బలగాలు నక్సల్స్ కదలికల నమూనాలను రూపొందించగలిగాయి. గతంలో నక్సల్స్ మెరుపుదాడులు చేసినప్పుడు ప్రభుత్వ బలగాలకు ఎక్కువ ప్రాణనష్టం జరిగేది. భద్రతా దళాలు దాడి చేసిన నక్సలైట్లను వెంబడిస్తూ వెళ్ళి వారు పన్నిన వలలో చిక్కుకుపోయేవాళ్ళు . ఇప్పుడు డ్రోన్ల సాయంతో నక్సల్స్ ఎక్కడ దాక్కున్నారో తెలుసుకుని చర్యలు తీసుకోవచ్చు. అలాగే లొకేషన్ ట్రాకింగ్, మొబైల్ ఫోన్ కార్యకలాపాలు, సైంటిఫిక్ కాల్ లాగ్స్, సోషల్ మీడియా విశ్లేషణ వంటి పద్దతుల ద్వారా నక్సల్స్ కదలికలను నిశితంగా పరిశీలించగలుగుతున్నాం. మా భద్రతా సిబ్బంది మనోధైర్యాన్ని మెరుగుపరచడానికి, ఆపరేషన్లు, క్షతగాత్రుల తరలింపు రెండింటినీ సులభతరం చేయడానికి హెలికాప్టర్లను మోహరించాం. వీటితో పాటు ప్రభావిత జిల్లాల నుంచి 1,143 మందిని పోలీస్ స్టేషన్లలో సేవలందించేందుకు నియమించాం.
ప్ర. ఎంత మంది నక్సల్స్ లొంగిపోయారు, అది ఎలా ఉపయోగపడుతోంది?
జ: గత పదేళ్లలో దాదాపు 7,500 మంది నక్సల్స్ లొంగిపోయారు. దీనికి ప్రధాన కారణం భద్రతా దళాల కార్యకలాపాలు పెరగడమే. ఇలా లొంగిపోయిన వారు భవిష్యత్తులో జరిగే లొంగుబాట్లలో కీలక పాత్ర పోషిస్తారు. లొంగిపోయిన ఈ నక్సలైట్లలో చాలా మంది జిల్లా రిజర్వ్ గార్డులతో సహా రాష్ట్ర పోలీసు శాఖలో చేరారు. వారికి ఆయా ప్రాంతాల భూభాగం, నక్సల్స్ వ్యూహాలు బాగా తెలుసు, వారు మాకు ఒక కీలకమైన బాలగంగా మారారు. నక్సలిజం నిర్మూలనకు ఉద్దేశించిన విస్తృత ప్రణాళికలో లొంగిపోయిన నక్సల్స్‌ను ఉపయోగించుకోవడం మానవ వనరుల సమర్థ వినియోగానికి ఒక ఉదాహరణ. దీనిని విశ్లేషించాలి, ఒక నమూనాగా అధ్యయనం చేయాలి.
ప్ర. నక్సల్స్ అత్యున్నత స్థాయి నాయకత్వాన్ని నిర్మూలించడంలో మీరు ఎంతవరకు విజయం సాధించారు?
జ: నక్సల్స్ పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యులను గుర్తించడం, లక్ష్యంగా చేసుకోవడం, హతమార్చడం మా విధానం. గత ఐదేళ్లలో ఇలాంటి 15 మంది నక్సలైట్ నాయకులను మట్టుబెట్టాం. గత ఏడాదిలోనే ఒక జోనల్ కమిటీ సభ్యుడు, ఐదుగురు సబ్ జోనల్ కమిటీ సభ్యులు, ఇద్దరు రాష్ట్ర కమిటీ సభ్యులు, 31 మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 59 మంది ఏరియా కమిటీ సభ్యులను హతమార్చాం. వారి నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకోవడం నక్సల్ ఉద్యమాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. అయితే హింసను విడనాడి ప్రధాన స్రవంతిలో చేరాలని నక్సల్స్‌ను ఒప్పించేందుకు మేం ముందుగా ప్రయత్నిస్తాం. లొంగిపోడానికి బదులు తుపాకులు పట్టుకుని తిరుగుతూ అమాయక గిరిజన ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన కరుడుగట్టిన నేరగాళ్ళ విషయంలో మాత్రమే నిర్మూలన మార్గాన్ని ఎంచుకుంటాం.
ప్ర. నక్సల్స్‌కు నిధులు, ఆయుధాల ప్రవాహాన్ని నిరోధించడానికి ఏమి చేశారు?
జ: నక్సల్స్ నిధులు, వారి ఆయుధాల సరఫరాను అడ్డుకోవడం మోదీ ప్రభుత్వ వ్యూహంలో మూడో అంశం. తెండు పట్టా సేకరించేవారి నుంచి, రోడ్డు కాంట్రాక్టర్ల నుంచి బలవంతపు వసూళ్ళు వీరికి ప్రధాన ఆర్థిక వనరు. మేం చేసిన పనులలో ఒకటి ఆన్లైన్ చెల్లింపు వ్యవస్థలను ప్రవేశపెట్టడం, ఇది వారికి డబ్బు ప్రవాహాన్ని నిరోధించడంలో సహాయపడింది. నక్సలైట్లకు కాంట్రాక్టర్లు సొమ్ము చెల్లించకుండా నిరోధించడానికి, మేం వారిలో భద్రతా భావాన్ని పెంపొందించాం. జాతీయ దర్యాప్తు సంస్థలో మేం ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం రూ.40 కోట్లకు పైగా నక్సల్స్ ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా వారి మనీలాండరింగ్ కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తూ రూ.12 కోట్ల వారి ఆస్తులను స్వాధీనం చేసుకుంది. వామపక్ష తీవ్రవాద ప్రాంతాల్లో విదేశీ సాయాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టాం. అనుమానిత స్వచ్ఛంద సంస్థ ఖాతాలను స్తంభింపజేశాం.
ప్ర. అర్బన్ నక్సల్స్ లేదా నక్సల్ సానుభూతిపరులు లేదా నగరాల్లో వారికి వివిధ రకాలుగా మద్దతిస్తున్న వారు కూడా నిఘా కింద ఉన్నారా?
జ: అలాంటి వారిని గుర్తించడం చాలా కష్టం. మహారాష్ట్రలో మాదిరిగా వారు వాడే ఫోన్ల వంటి పరికరాలు ప్రభుత్వ ఏజెన్సీల చేతుల్లోకి వచ్చినప్పుడు మాత్రమే అలా గుర్తించడం సాధ్యమవుతుంది. ముఖ్యంగా నక్సల్స్‌ను దూరం నుంచి ఎవరూ రిక్రూట్ చేసుకోలేరు, అందుకోసం గ్రామాలకు వెళ్లాల్సి ఉంటుంది. రిక్రూట్‌మెంట్ కోసం వారు గ్రామాలకు వెళ్లకుండా చూసుకున్నాం.
ప్ర. మీరు రాహుల్ గాంధీని అర్బన్ నక్సల్ అని కూడా పిలిచారు?
జ: ఆయన వాడిన భాష అర్బన్ నక్సల్ దని అన్నాను.
ప్ర. ఈ రాష్ట్రాల్లో అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి జరగకపోవడమే నక్సల్స్ వ్యాప్తికి కారణం. ఈ పరిస్థితిని మార్చేందుకు మోదీ ప్రభుత్వం ఏమి చేసింది?
జ: ఇది మా కార్యాచరణ ప్రణాళికలో నాలుగో అంశం. ఒక ప్రాంతం నుంచి నక్సలైట్లను ఖాళీ చేసిన మరుక్షణమే అభివృద్ధి పథకాలతో ముందుకు సాగాం. ప్రజలు తిరిగి నక్సలిజం వైపు వెళ్లకుండా చూడాలన్నది దీని ఉద్దేశం. ఈ పథకాల ఫలాలు అందుకోవడం మొదలు పెట్టాక వారు తమ గ్రామాల్లోని నక్సల్స్ నుంచి ముఖం తిప్పేసుకుంటారు. ఈ మారుమూల ప్రాంతాలకు దీర్ఘకాలంగా అవసరమైన మౌలిక సదుపాయాలను తీసుకురావడం మేం చేసిన పనులలో ఒకటి. మోదీ ప్రభుత్వ పదేళ్ల పాలనలో 11,503 కిలోమీటర్ల రోడ్లు నిర్మించాం. రాబోయే సంవత్సరాల్లో అదనంగా 17,589 కిలోమీటర్ల నిర్మాణానికి రూ.20,815 కోట్లు మంజూరు చేశాం. సెల్ ఫోను సౌకర్యాల కోసం మొబైల్ టవర్లను ఏర్పాటు చేస్తున్నాం. మొదటి విడతలో ఇప్పటివరకు రూ.4,080 కోట్ల వ్యయంతో 2,343 టవర్లను నిర్మించాం. ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా కూడా 4జీకి అనుగుణమైన మరో 8,527 టవర్లను నిర్మించాలని యోచిస్తున్నాం. వీటితో పాటు 90 జిల్లాల్లో 1,007 బ్యాంకు శాఖలు, 5,731 పోస్టాఫీసులను ప్రారంభించాం. ప్రభుత్వ పథకాల్లో సంతృప్తతను సాధించడం అంత సులువైన పని కాదు. గ్యాస్ కనెక్షన్లు, మరుగుదొడ్లు, ఇళ్లు, ఆహారధాన్యాలు సహా 300 పథకాల్లో 112 పథకాలను స్థానిక అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసి వాటి ప్రయోజనాలు ప్రజలకు చేరేలా చేస్తున్నాం.
ప్ర. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోని యువత కోసం చేపట్టిన కార్యక్రమాల మాటేమిటి?
జ: పేదరికం అనే విషవలయాన్ని ఛేదించడానికి నైపుణ్యమే ఉత్తమ మార్గమని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. అందుకే గత ఏడు దశాబ్దాలుగా జరిగిన నష్టాన్ని భర్తీచేసేందుకు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోని యువతకు నైపుణ్యాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించాం. 48 జిల్లాల్లో 48 పారిశ్రామిక శిక్షణా కేంద్రాల (ఐటీఐ)కు రూ.495 కోట్లు కేటాయించగా, 61 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు ఆమోదం తెలిపారు.
ప్ర: ఈ వ్యూహాలు ఎంతవరకు ప్రభావం చూపాయి?
జ: 2019 ఆగస్టు నుంచి 2020 డిసెంబర్ వరకు ఏర్పాట్లు పూర్తి చేసి, ఆ వెంటనే ఒక సమగ్ర ప్రచార కార్యక్రమం ప్రారంభించాం. ఒకదాని తర్వాత ఒకటిగా రాష్ట్రాల్లో ప్రక్షాళన చేయడం మొదలుపెట్టాం. నేను హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఆంధ్రా, తెలంగాణలో నక్సల్స్ సమస్య పెద్దగా లేదు. కానీ ఈ రాష్ట్రాలలో పూర్తిగా నక్సల్ సమస్యను నిర్మూలించాం. 2023 నాటికి ఒడిశా, బిహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో నక్సలైట్లను తుడిచిపెట్టాం. 2014లో 126గా ఉన్న నక్సల్స్ ప్రభావిత జిల్లాలను 10 రాష్ట్రాల్లో ఇప్పుడు 12కు తగ్గించాం. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో 2014 నుంచి భద్రతా సిబ్బంది, పౌరుల మరణాలు 70 శాతానికి పైగా తగ్గాయి. ఈ ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు సగానికి తగ్గాయి. 2026 మార్చి 31 నాటికి నక్సల్స్ ముప్పు నుంచి భారత్ పూర్తిగా విముక్తి పొందుతుందని నేను బలంగా నమ్ముతున్నాను.
ప్ర. ఇన్ని రాష్ట్రాల ప్రమేయం ఉన్న నేపథ్యంలో కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య సమన్వయం ఎలా సాధ్యమైంది? ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా?
జ: మోదీ ప్రభుత్వం సమన్వయానికి మూడంచెల పద్దతిని అనుసరించింది. కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో సమన్వయం, ఆ తర్వాత రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో సమన్వయం, మూడోది కేంద్ర సంస్థలు, రాష్ట్ర స్థాయి శాంతిభద్రతల సంస్థల మధ్య సమన్వయం. 2019లో నేను బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటనలతో పాటు కేంద్ర మంత్రులతో సహా వామపక్ష ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో 11 సమీక్షా సమావేశాలు, ఏజెన్సీలతో 83 వ్యూహాత్మక సమావేశాలు నిర్వహించాను. వీటిలో కేంద్ర భద్రతా దళాలను మోహరించడం, ఆయుధాలు వంటి అవసరమైన వనరులను సమకూర్చడంతో సహా వ్యూహాలను రూపొందించి సత్వర పరిష్కారాలను అందించాం. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఛత్తీస్‌గఢ్ విషయంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. అది మినహా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల నుంచి కూడా మాకు పూర్తి సహకారం లభించింది.
ప్ర. 2018 నుంచి 2023 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఛత్తీస్‌గఢ్‌తో ఎలాంటి సమస్యలు ఉన్నాయి?
జ: వారు భద్రతా దళాలకు వ్యతిరేకంగా ఉన్నారని నేను చెప్పను కానీ వారు అంత ఉత్సాహంగా మాత్రం లేరు. తలాతీలు, ఠాణాలు (రాష్ట్ర పోలీసు), అటవీ, గిరిజన శాఖలతో సహా రాష్ట్ర అధికార యంత్రాంగం నుంచి మాకు అవసరమైన పూర్తి సహకారం అందలేదు. చత్తీస్‌గఢ్‌లో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత గత 15 నెలలుగా నక్సల్ వ్యతిరేక చర్యలను పునరుద్ధరించాం. 2024 జనవరి నుంచి కొత్త ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులు, కేంద్ర ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సవివరంగా సమీక్షా సమావేశాలు నిర్వహించి కార్యాచరణ రూపొందించాను. ఆ తర్వాత 2024 ఆగస్టు, డిసెంబరు నెలల్లో పలు నక్సలైట్ ప్రాంతాలను స్వయంగా సందర్శించాను. ఫలితాలు కళ్ళకు కడుతున్నాయి. 2014లో ఛత్తీస్‌గఢ్‌లో 18 వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతం నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా ఉండేది. ప్రస్తుతం అది 8,500 చదరపు కిలోమీటర్లకు పడిపోయి ప్రతినెలా వేగంగా తగ్గుతోంది. గత ఏడాది బస్తర్ ఒలింపిక్స్ నిర్వహించగా అందులో నక్సల్స్ హింసకు గురైన వారు పాల్గొన్నారు. నక్సలైట్ల ప్రభావిత సుక్మా, గుండం ప్రాంతాలను సందర్శించి అక్కడ నివసిస్తున్న ప్రజలకు అభివృద్ధి కోసం జరిగే పోరాటంలో మోదీ ప్రభుత్వం తమకు నమ్మకమైన మిత్రుడన్న సందేశం పంపాను.