NEP 2020

నూతన విద్యా విధానంపై విమర్శలు అర్థరహితం

ప్రపంచంలో ఎన్నో దేశాల్లో అక్షర జ్ఞానం అడుగులు పడకముందే మనం నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించాం. మన ఆచార వ్యవహారాలన్నింటిలో శాస్త్ర విజ్ఞానం నిగూఢంగా నిక్షిప్తమై ఉంది. ఇంతటి గొప్ప వారసత్వాన్ని సొంతం చేసుకున్న భారతీయ విద్య విదేశీ దండయాత్రలతో తన ప్రాభవం కోల్పోయింది. ముఖ్యంగా దాదాపు రెండు శతాబ్దాల ఆంగ్లేయుల పాలనలో మన విద్యా వ్యవస్థ తీవ్రంగా విధ్వంసమైంది.

స్వాతంత్ర్యం వచ్చాక కూడా దురదృష్టవశాత్తూ ఆంగ్లేయులు అందించిన విద్యావిధానాలనే కొనసాగిస్తూ వచ్చాం. భారతీయతకు పెద్దపీట వేసి మనదైన సొంత విద్యావిధానాన్ని రూపొందించుకోవడంలో విఫలమయ్యాం. 1948లో స్వేచ్ఛాయుత భారతదేశ అవసరాలను తీర్చే విద్యా వ్యవస్థను నిర్మించే నిమిత్తం రాధాకృష్ణన్ కమిషన్ ఏర్పాటైంది. బ్రిటిష్, మెకాలే విద్యా విధానాలను రూపుమాపి, భారతీయ విలువలతో కూడిన విద్యావిధానం ప్రవేశపెట్టేందుకు మంచి అవకాశం ఈ కమిషన్‌కు లభించింది. కానీ, నాటి సామాజిక పరిస్థితులు, రాజకీయ సమీకరణాలు తదితర కారణాలతో అది సాధ్యపడలేదు.

రాజ్యాంగ సభలో అధికార భాషపై చర్చ జరిగినప్పుడు హిందీని అధికారిక భాషగా ప్రకటించాలని చాలామంది సిఫార్సు చేశారు. జవహర్‌లాల్ నెహ్రూ ‘హిందుస్థానీ’ (హిందీ, ఉర్దూ కలిసి ఉండే భాష)ని సూచించారు. చివరకు మున్షీ–అయ్యంగార్ ఫార్ములా ప్రకారం దేశంలో అత్యధిక మంది మాట్లాడే హిందీని అధికారిక భాషగా నిర్ణయించారు. హిందీతో పాటు ఒక పదేళ్ల వరకు ఇంగ్లీష్‌ను కూడా అధికార భాషగా అమలు చేయాలని, పదేళ్ల తర్వాత కేవలం హిందీని అధికార భాషగా కొనసాగించాలని నిర్ణయించారు. పదేళ్ల అనంతరం 1958 ప్రాంతంలో హిందీయేతర రాష్ట్రాల్లో ముఖ్యంగా తమిళనాడులో హిందీ వ్యతిరేక ఆందోళనలు జరిగాయి. అదే సమయంలో ఉత్తర భారతదేశంలో ‘అంగ్రేజీ హఠావో’ నినాదాలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో నాటి ప్రధాని నెహ్రూ 1961లో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ‘చీఫ్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్’ నిర్వహించారు. ఆ కాన్ఫరెన్సులోనే త్రిభాష సూత్రం ప్రతిపాదన వచ్చింది. దాని ప్రకారం పదేళ్ల వరకే అని ముందుగా అనుకున్నప్పటికీ, ఇప్పటికీ అధికార భాషగా ఇంగ్లీషును కొనసాగిస్తూ వచ్చారు. త్రిభాష సూత్రం ప్రకారం హిందీ, ఇంగ్లీషుతో పాటు మరొక భాష, అంటే ఆయా ప్రాంతం మాతృభాషను సబ్జెక్టులుగా ప్రవేశపెట్టారు. నాడు నెహ్రూ ప్రవేశపెట్టిన త్రిభాషా సూత్రాన్ని నేడు మోదీ ప్రభుత్వం మరింత మెరుగుపరిస్తే, దానిని తప్పుబట్టడం అర్థరహితం.

1964లో ఏర్పాటైన కోఠారీ కమిషన్ 1966లో నివేదికను సమర్పించింది. దీని ఆధారంగా స్వతంత్ర భారతంలో 1968లో తొలిసారి జాతీయ విద్యావిధానం రూపొందించారు. 1986లో నాటి జాతీయ విద్యావిధానంలో కొన్ని సవరణలు తీసుకొచ్చారు. మరిన్ని మార్పుల కోసం 1990లో రామ్మూర్తి కమిటీ ఏర్పాటైంది. 2005లో ఏర్పాటైన నాలెడ్జ్ సెంటర్ ఆఫ్ ఇండియా 2009లో తన నివేదికను సమర్పించింది. ఇవన్నీ ఆంగ్లేయుల ఆలోచన విధానంలో జరిగిన ప్రయత్నాలే. వీటిలో విద్యలో భారతీయ మూలాలను పాదుకొల్పాలన్న దృక్పథం కొరవడింది. ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం వలస పాలకుల వాసనలను వదిలించుకునే దిశగా అనేక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో భారతీయ విజ్ఞానానికి పెద్దపీట వేస్తూనే, ప్రస్తుత ఏఐ జనరేషన్ అవసరాలనూ తీర్చేలా, కస్తూరి రంగన్ నేతృత్వంలో విస్తృత సంప్రదింపుల తర్వాత నూతన జాతీయ విద్యా విధానం–2020 (ఎన్ఈపీ–2020)ను ప్రవేశపెట్టింది.

మోదీ ప్రభుత్వం ఏం చేసినా తప్పుబట్టడమే పనిగా పెట్టుకున్న కొందరు సూడో మేధావులు, కొన్ని పార్టీలు యథావిధిగా ఎన్ఈపీ–2020 పైనా విమర్శలు ఎక్కుపెట్టాయి. త్రిభాషా సూత్రం, విద్యను కేంద్రీకృతం చేయడం, మతం రంగు పులమడం అన్న మూడు ‘లోపాలు’ వారికి ప్రధానంగా కనిపించాయి. త్రిభాషా సూత్రాన్ని బూచిగా చూపి, హిందీయేతర రాష్ట్రాలపై కేంద్రం హిందీని, సంస్కృతాన్ని రుద్దుతుందంటూ తప్పుడు ఆరోపణలతో ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారు. త్రిభాష సూత్రం ప్రస్తుత ఎన్ఈపీ–2020 తీసుకొచ్చినదేమీ కాదు, గతంలో ఉన్న విధానమే. ఇంకా చెప్పాలంటే పాత పద్ధతిని మరింత మెరుగుపర్చింది. పాత విధానంలో హిందీ, ఇంగ్లీష్ తప్పనిసరి చేసి మాతృభాష కోసం మరొక భాషను ఎంచుకునే అవకాశం ఇస్తే, ఇప్పుడు కనీసం రెండు భారతీయ భాషలను తప్పనిసరి చేస్తూ ఏవైనా మూడు భాషలనూ ఎంచుకునే అవకాశం విద్యార్థులకు కల్పిస్తుంది. ఉదాహరణకు హైదరాబాదులో చదువుకునే ఒక బెంగాలీ విద్యార్థి ఇంగ్లీషుతో పాటు తెలుగు, బెంగాలీ భాషలను ఎంచుకోవచ్చు, లేదా హిందీ, తెలుగు, బెంగాలీ భాషలను ఎంచుకోవచ్చు.

3–8 ఏళ్ల వరకు మాతృభాషలోనే విద్యా బోధన జరగాలని ఎన్ఈపీ–2020 ప్రతిపాదిస్తుంది. మాతృభాషలో బోధన జరిగితే విద్యార్థి పాఠ్యాంశాన్ని తొందరగా, సమగ్రంగా అకళింపు చేసుకోగలుగుతాడు. ఇతర భాషలో బోధన జరిగితే విషయాలను అర్థం చేసుకోవడం కన్నా, భాషను అర్థం చేసుకోవడమే పెద్ద సవాలుగా మారుతుంది. ముప్పు ఎదుర్కొంటున్న గిరిజన భాషల్లోనూ విద్యా బోధన జరగాలనేది మోదీ ప్రభుత్వం ఆకాంక్ష. తద్వారా ఆయా గిరిజన విద్యార్థులకు పాఠ్యాంశాలు సులువుగా అర్థమవడమే కాకుండా, గిరిజన భాషను పరిరక్షించవచ్చు అనేది అభిప్రాయం. ఇప్పటివరకు ఇంగ్లీష్‌లోనే అందుబాటులో ఉన్న మెడిసిన్, ఇంజనీరింగ్ వంటి సబ్జెక్టులను సైతం భారతీయ భాషల్లోనూ తీసుకురావాలని మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వాస్తవం ఇలా ఉంటే నూతన విద్యా విధానం ద్వారా మోదీ ప్రభుత్వం హిందీని బలవంతాన రుద్దుతున్నారనడం శుద్ధ అబద్ధం.

సంస్కృతం దైవభాషగా ప్రసిద్ధి. పురాణేతిహాసాలన్నీ సంస్కృతంలోనే రచించారు. భారతీయ సంస్కృతి అందించిన గొప్ప వారసత్వమైన ఈ భాషను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే ఎన్ఈపీ–2020లో విద్యార్థులు సంస్కృతాన్ని కూడా ఒక భాషగా ఎంచుకునే అవకాశం కల్పించారు. కానీ తప్పనిసరి చేయలేదు. ప్రపంచమే కుగ్రామంగా మారిన ఈ ఇంటర్నెట్ యుగంలో టీచర్ సాయం లేకుండానే ఒక భాష నేర్చుకునేందుకు కావాల్సిన వనరులు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తొలిసారి 8వ తరగతి ఆ పై స్థాయి విద్యార్థులు ఇంగ్లీషేతర విదేశీ భాషలు– జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్, కొరియా లాంటి భాషలను సబ్జెక్టులుగా ఎంచుకునే అవకాశం ఎన్ఈపీ–2020 కల్పించింది. విద్యార్థులు ఈ విదేశీ భాషలను సబ్జెక్టుగా ఎంచుకునేందుకు ఎంత స్వేచ్ఛ ఉంటుందో, సంస్కృతంను ఎంచుకునేందుకూ అంతే స్వేచ్ఛ ఉంటుంది. అంతేకాని, సంస్కృతంను బలవంతాన రుద్దుతున్నారన్న వాదనకు తావులేదు.

విద్యను కేంద్రం గుప్పిట పెట్టుకుని, పాఠ్యాంశాలను రాష్ట్రాలపై బలవంతాన రుద్దుతుందనేది సోకాల్డ్ మేధావుల మరో ఆరోపణ. ఇది పూర్తిగా అవాస్తవం. ఎన్ఈపీ–2020 స్థానికతకు, స్థానిక భాషలకు అధిక ప్రాధాన్యమిస్తున్నది. స్థానిక జీవన విధానం, చరిత్ర, ఆర్థిక పరిస్థితులు, అవసరాల మేరకు రాష్ట్రాలు సొంతంగా పాఠ్యాంశాలను రూపొందించుకోవచ్చు. ఇందులో కేంద్రం ఎలాంటి ఒత్తిడి చేసే అవకాశం లేదు. అంతేకాదు, ఈ ఎన్ఈపీ–2020నే అటానమస్ హోదా పొందడాన్ని సులభతరం చేసింది. స్వయం ప్రతిపత్తి పొందిన కాలేజీలు, విద్యా సంస్థలు స్థానిక అవసరాలకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికను రూపొందించుకునే వెసులుబాటు కల్పించింది.

భారతదేశంలో 61.6శాతం పాఠశాలలు త్రిభాషా విధానాన్ని అమలుచేస్తున్నాయి. 74.7శాతం మంది విద్యార్థులు దీని ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఇదే తమిళనాడులో 3శాతం పాఠశాలలు, కేవలం 10.8శాతం మంది విద్యార్థులు మాత్రమే దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అంటే.. తమిళనాడులో కేవలం పార్టీల రాజకీయం కారణంగా 90శాతం మంది విద్యార్థులు ఇతర భాషలను నేర్చుకోలేకపోతున్నారు. దీనివల్ల ఆయా పార్టీలు సాధించేదేమీ లేకపోయినా.. విద్యార్థులకు మాత్రం నష్టం వాటిల్లుతోంది. ఇటీవల విడుదలైన ASER (యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్) నివేదిక ప్రకారం.. 2005లో ఈ నివేదిక ఇవ్వడం మొదలైనప్పటి నుంచి ఉన్న పరిస్థితులతో పోలిస్తే.. 2024 నాటికి (ఎన్ఈపీ అమలు కారణంగా) ప్రాథమిక పాఠశాల విద్యార్థుల్లో నేర్చుకునే తత్వం మెరుగుపడిందని వెల్లడైంది.

విద్యకు మతం రంగు అనేది మరొక ఆరోపణ. దేశ స్వాతంత్ర్యానంతరం విద్యారంగంలో విదేశీ భావజాలం గల వ్యక్తులే కీలక స్థానాలను చేజిక్కించుకున్నారు. వీరు పక్షపాత వైఖరితో చరిత్ర పాఠ్యాంశాలను రూపొందించారు. ఇప్పటివరకు మన దేశంపై దండెత్తిన దురాక్రమణ దారులను కీర్తిస్తూ చరిత్ర పుస్తకాల్లో స్థానం కల్పించారు, కానీ వారిని ఎదురించిన వీరులకు, అంతకుముందున్న సుసంపన్న వారసత్వ చరిత్రకు చోటు కల్పించలేదు. పాశ్చాత్యుల చరిత్రనే భారత చరిత్రగా నమ్మబలికారు. నా వ్యక్తిగత అనుభవమే తీసుకుంటే మా పిల్లల చరిత్ర పుస్తకాల్లో ఫ్రెంచ్ విప్లవం, రోమన్ సామ్రాజ్యం, జర్మనీ ఏకీకరణ వంటి సంఘటనలపై పాఠ్యాంశాలున్నాయే కానీ, నిజాం నుంచి విమోచనం పొంది భారతదేశంలో విలీనమైన నా తెలంగాణ గడ్డ చరిత్ర గురించి ఒక్క పాఠ్యాంశమూ లేదు. ఇలాంటి పక్షపాత వైఖరిని రూపుమాపి అసలైన భారతీయ చరిత్రకు పెద్దపీట వేయాలన్న ప్రయత్నంలో కొన్ని కొత్త చరిత్ర పాఠాలను ప్రవేశపెడితే ఈ సోకాల్డ్ మేధావులు తప్పులు వెతుకుతున్నారు.

భారతీయతకు పట్టం కడుతూ ఆధునిక అవసరాలను తీర్చే భావి పౌరులను తీర్చిదిద్దే నూతన విద్యా విధానం–2020ను తప్పుబట్టడంలో అర్థం లేదు. రాజకీయంగా మోదీని, బిజెపిని వ్యతిరేకించాలన్న ఆదుర్దాతో ఒక మంచి ప్రయత్నాన్ని అడ్డుకోవాలని చూడడం, కట్టుకథలు అల్లి ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టడం ఎంతమాత్రం భావ్యం కాదు.

జి. కిషన్‌రెడ్డి,
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి