ఒక్క చొరబాటుదారుడూ ఓటు వేసేందుకు అనుమతించం!
ఓటర్ల జాబితాలో చొరబాటుదారులను ఉంచడం చట్టవిరుద్ధమని, దేశంలో ఒక్క అక్రమ చొరబాటుదారుడికి కూడా ఓటు వేసేందుకు అనుమతించమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఇది మన ఎన్డీయే విధానమని, డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ ద్వారా ఓటర్ల జాబితా నుంచి చొరబాటుదారుల పేర్లను తొలగించడం పూర్తవుతుందని స్పష్టం చేశారు. దేశంలోకి అక్రమంగా చొరబడే వాళ్లు ప్రధానిని, రాష్ట్ర ముఖ్యమంత్రిని నిర్ణయిస్తే ఏ దేశంలోనైనా ప్రజాస్వామ్యం సురక్షితంగా ఉంటుందా అని ప్రశ్నించారు. ఈ దేశ పార్లమెంటుకు, రాష్ట్ర శాసనసభకు ఎవరిని ఎన్నుకోవాలని నిర్ణయించాల్సిన ఓటు హక్కు ఒక విదేశీయుడికి ఎలా ఇస్తామన్నారు. చొరబాటుదారులకు ఆధార్, రేషన్ కార్డులిచ్చి ప్రతిపక్షాలు దేశ భవిష్యత్తు, భద్రతతో ఆటలాడుతున్నాయని విరుచుకుపడ్డారు. చొరబాటుదారుల వల్ల కొన్నిసార్లు ఎన్నికల్లో గెలుస్తారేమో, కానీ ఈ దేశ భద్రతను పణంగా పెడుతున్నారని చెప్పారు. చొరబాట్లకు వ్యతిరేకంగా బీహార్ ప్రజలు నిర్ణయం తీసుకున్నారని, రేపు బెంగాల్ కూడా ఇదే నిర్ణయం తీసుకోబోతుందని జోస్యం చెప్పారు.
ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ఓటరు జాబితాను శుద్ధి చేస్తుందని, అంతకు మించి ఏమీ చేయదని తేల్చి చెప్పారు. ఓటరు జాబితా కలుషితమైందని, దీంతో ఎన్నికలు స్వచ్ఛంగా, పారదర్శకంగా ఎలా నిర్వహించగలమని ప్రశ్నించారు. ఎప్పటికప్పుడు ఓటరు జాబితాలను క్షుణ్ణంగా సవరణ చేయడం అవసరమని, అందుకే ప్రత్యేక సమగ్ర సవరణ చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించిందన్నారు. ఎన్నికల సంస్కరణలపై జరిగిన చర్చలో ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదారి పట్టించేలా, అపోహలు సృష్టించేలా వ్యవహరించాయని తప్పుబట్టారు. ప్రత్యేక సమగ్ర సవరణ బాధ్యత ఎన్నికల సంఘానిదని, కేంద్ర ఎన్నికల సంఘం, ఎన్నికల కమిషనర్ స్వతంత్ర్యంగా పని చేస్తారని, ప్రభుత్వం కింద పని చేయవని అన్నారు.
రాజ్యాంగబద్ధంగా ఎన్నికల ప్రక్రియ
ఎన్నికల సంస్కరణల అంశంపై పార్లమెంటులో జరిగిన చర్చలో డిసెంబర్ 10న అమిత్ షా లోక్‌సభలో ప్రసంగిస్తూ కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాల ద్వంద్వ ప్రమాణాలను ఎండగట్టారు. రాజ్యాంగంలోని 15వ భాగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల కమిషనర్, ఎన్నికల సంఘాన్ని చేశారంటూ.. ”ఎన్నికల సంఘం రాజ్యాంగ సంస్థ. ఎన్నికల సంఘం నియామకం, అధికారాలు, ఎన్నికల ప్రక్రియ, ఓటరు నిర్వచనం, ఓటర్ల జాబితా తయారీ రాజ్యాంగబద్ధంగా జరుగుతాయి. ఓటరు జాబితా సవరణపై స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలు రూపొందించినప్పుడు మా పార్టీ పుట్టనేలేదు. స్వేచ్ఛాయుతంగా, నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత రాజ్యాంగంపై ఉంది. ఓటరు జాబితాల తయారీ, ఓటరు జాబితాను మెరుగుపరచడమనేది ఎన్నికల సంఘం నిర్ణయం. లోక్‌సభ, రాజ్యసభ, శాసనసభ, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి.. ఈ ఎన్నికలన్నింటిపై పూర్తి నియంత్రణను ఎన్నికల కమిషనర్‌కు రాజ్యాంగం ఇచ్చింది.” అని అన్నారు.
ఆర్టికల్ 350 ప్రకారం అర్హతలున్న ఓటరును ఓటరు జాబితా నుండి మినహాయించలేరన్నారు. ఆర్టికల్ 326 ఓటరుకు అర్హత నిర్దేశించిందని, కొన్ని షరతులు కూడా పెట్టిందన్నారు. ”మొదటి షరతు.. ఓటరు భారత పౌరుడై ఉండాలి. విదేశీయుడు కాకూడదు. రెండవది 18 ఏళ్లు నిండాలి. మూడవది, నేరాలు, అవినీతిలో పాల్గొన్న చరిత్ర, మానసిక స్థితి. దీనిని చట్టం ఎప్పటికప్పుడు నిర్ణయిస్తోంది. ఈ మూడు అర్హతలపై ఆధారపడి ఓటుహక్కు కల్పిస్తారు. ఈ విషయాలను ఎన్నికల సంఘం చూస్తుంది. ఆర్టికల్ 327 ప్రకారం ఓటర్ల జాబితాలు, ఎన్నికల నిర్వహణ, పునర్విభజనపై ఎన్నికల సంఘానికి పూర్తి అధికారం ఉంటుంది. దాని కోసం చట్టాలు రూపొందించేందుకు పార్లమెంటుకు సిఫార్సులు చేసే అధికారం కూడా ఎన్నికల సంఘానికి ఉంది.” అని అమిత్ షా అన్నారు.
గతంలోనూ సవరణ
ప్రత్యేక సమగ్ర సవరణ ఇదే తొలిసారి కాదంటూ.. ”1952లో తొలి ప్రత్యేక సమగ్ర సవరణ జరిగింది. అప్పుడు ప్రధాని కాంగ్రెస్ పార్టీకి చెందిన జవహర్‌లాల్ నెహ్రూ. రెండవసారి 1957లో జరిగినప్పుడూ జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నారు. మూడోసారి 1961లో జరిగినప్పుడూ ఆయనే ప్రధానమంత్రిగా ఉన్నారు. 1965-66లో జరిగినప్పుడు కాంగ్రెస్ నేత లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్నారు. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 1983-84లో సవరణ జరిగింది. 1989లో రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు జరిగింది. నరసింహారావు హయాంలో 1993-95లో జరిగింది. 2002లో జరిగినప్పుడు మాత్రం అటల్ బిహారీ వాజ్‌పేయి ఉన్నారు. చివరిసారి 2004లో ప్రత్యేక సమగ్ర సవరణ జరిగినప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నారు. ఆ తర్వాత 2025లో ప్రత్యేక సమగ్ర సవరణ చేపడుతున్నాం. 2004 నుంచి ఇప్పటి వరకు సర్ ప్రక్రియపై ఏ పార్టీ వ్యతిరేకించలేదు. ఎందుకంటే ఇది ఎన్నికలను పవిత్రంగా ఉంచే ప్రక్రియ, ఇది ప్రజాస్వామ్యాన్ని ఆరోగ్యంగా ఉంచే ప్రక్రియ కాబట్టి.” అని అన్నారు.
2010లో తీసుకొచ్చిన నిబంధనల వల్ల అప్పటి నుంచి చనిపోయిన వారి పేర్లను తొలగించలేదన్నారు. అదేవిధంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ అయిన వారి పేర్లను తొలగించకపోవడంతో, వారి పేర్లు రెండు చోట్లా ఉన్నాయన్నారు. ఈ ప్రత్యేక సమగ్ర సవరణలో చనిపోయిన వారి పేర్లు, రెండు చోట్ల జాబితాలో ఉన్న పేర్లు, విదేశీయుల ఓట్లను తొలగిస్తారన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారి పేర్లను జోడిస్తారని తెలిపారు. ఇది కొన్ని పార్టీల రాజకీయ ప్రయోజనాలను దెబ్బతీస్తుందని, ఎందుకంటే వారికి స్వదేశీయులెవరూ ఓటు వేయరని, కేవలం విదేశీయులే ఓటేస్తారని ఎద్దేవా చేశారు. లాల్ బాబు హుస్సేన్ వర్సెస్ ఓటర్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ 1995 తీర్పులో ఓటరు పేరును నమోదు చేసేటప్పుడు రిటర్నింగ్ అధికారి భారత పౌరుడా కాదా అనేది నిర్ధారించుకోవాలని సుప్రీం కోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు.
రాహుల్ గాంధీకి చురకలు
రాహుల్ గాంధీ ‘అణుబాంబు’ ప్రెస్ కాన్ఫరెన్సుని ఎద్దేవా చేస్తూ.. హరియాణాలో ఒకే ఇంట్లో 501 ఓట్లు ఉండడానికి కారణం అక్కడ నివసించే కుటుంబాలకు ఇంటి నెంబర్ కేటాయించకపోవడమేనని వివరించారు. ఓటుచోరీ కథనాన్ని సృష్టించడానికే రాహుల్ గాంధీ దీనిని ఉదాహరణగా తీసుకున్నారని చురకలంటించారు. బీహార్‌లో మరో ఓటరు వయస్సు 124 సంవత్సరాలు అని రావడం కేవలం ప్రింటింగ్ మిస్టేక్ అని తేల్చిచెప్పారు. ”రాహుల్ గాంధీ ఓటర్ల జాబితాలో తప్పులున్నాయని, సరిదిద్దాలని అంటున్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ ఓటరు జాబితాను సవరిస్తుంది. అలా చేస్తే తప్పంటున్నారు. పోనీ పాత జాబితానే ఉంచాలన్నా తప్పంటున్నారు. ఓటరు జాబితా పాతదైనా, కొత్తదైనా వారు ఓడిపోవడం ఖాయం.” అని అన్నారు. బిజెపి ప్రజల ప్రయోజనాల కోసం పని చేస్తుంది కాబట్టే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత లేకుండా ప్రజలు బిజెపి ప్రభుత్వాలను పదే పదే ఎన్నుకుంటున్నారని చెప్పారు. అయితే కొన్ని రాష్ట్రాల్లో బిజెపి ఓడిపోయిన ఉదాహరణలు వివరించారు. బిజెపి ఓడినప్పుడు కాంగ్రెస్ నేతలు ఓటరు జాబితాను వ్యతిరేకించరని, కొత్త బట్టలు వేసుకొని ప్రమాణ స్వీకారం చేస్తారని, కానీ వారు ఓడినప్పుడు మాత్రం ఓటరు జాబితాను వ్యతిరేకిస్తారని చురకలంటించారు. ”ప్రజాస్వామ్యంలో ద్వంద్వ ప్రమాణాలు పనికిరావు. మీరు గెలిస్తే ఎన్నికల సంఘం గొప్పది, ఓడిపోతే పనికిరానిది, ఇది బిజెపి ఆదేశాల మేరకు పని చేస్తుంది. మీరు గెలిస్తే ఓటరు జాబితా బాగుంటుంది. ఓడిపోతే బాగుండదు.. ఇవేం ద్వంద్వ ప్రమాణాలు?” అని నిలదీశారు.
ఓటు చోరీ అంటే ఇది
కాంగ్రెస్ ఓటు చోరీ ఆరోపణలను తిప్పికొడుతూ ”స్వాతంత్య్రానంతరం దేశ ప్రధానమంత్రిగా ఎవరు ఉండాలన్న దానిపై సర్దార్ పటేల్‌కు 28 ఓట్లు వస్తే.. జవహర్‌లాల్ నెహ్రూకు 2 ఓట్లు వచ్చాయి. జవహర్‌లాల్ ప్రధానమంత్రి అయ్యారు. ఇది ఓటు చోరీ. రాయ్‌బరేలీ నుండి ఇందిరా గాంధీ ఎన్నికైన ఎన్నికలు నిబంధనలకు అనుగుణంగా లేదని రాజ్‌నారాయణ్ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికలు నిష్పాక్షికంగా జరగలేదని అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఇందిరా గాంధీ ఎన్నిక రద్దు చేయాలని చెప్పింది. కానీ, కోర్టు తీర్పునకు విరుద్ధంగా ప్రధానమంత్రిపై కేసు పెట్టే అధికారం లేకుండా పార్లమెంటులో చట్టం తీసుకొచ్చారు. ఇది ఓటు చోరీ. తన నిరోధకతపై రాజ్యాంగ సంస్కరణ తీసుకురావడాన్ని కోర్టులో సవాల్ చేస్తే.. సుప్రీంకోర్టు మొదటి ముగ్గురు న్యాయమూర్తులు కాకుండా అనుకూలంగా ఉన్న నాలుగో న్యాయమూర్తిని ప్రధాన న్యాయమూర్తిగా చేసి ఆ కేసు గెలిచారు. ఇది చరిత్ర. ఇది పార్లమెంటు, సుప్రీంకోర్టు రికార్డుల్లో ఉంది. ఎంతోమంది ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడారు. జైలుకు వెళ్లారు. అప్పుడు లక్షలాది మంది ఓటు తొలగించారు. ఇది ఓటు చోరీ. సోనియా గాంధీ ఈ దేశ పౌరురాలు కాకముందే ఓటరుగా ఉన్నారు. ఇది ఓటు చోరీ.” అని అన్నారు.
ఓడిపోతే నిందలా?
ఎన్నికల్లో ఓడిపోతే ఎన్నికల సంఘాన్ని నిందించడం, ఓటరు జాబితాను తప్పుబట్టడం దేశంలో కొత్త సంప్రదాయంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు దేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయంటూ.. ”మేం కూడా ప్రతిపక్షంలో కూర్చున్నాం. మేం గెలిచిన దానికంటే ఎక్కువ ఎన్నికల్లో ఓడిపోయాం. ఒక రకంగా చెప్పాలంటే మా జీవితమంతా ప్రతిపక్షంలోనే గడిచింది. ఎన్నికల సంఘాలను, ఎన్నికల కమిషనర్లను చూశాం. కానీ ఎన్నికల సంఘంపై ఎప్పుడూ అభియోగాలు మోపలేదు. తటస్థంగా ఎన్నికలను నిర్వహించడానికి రాజ్యాంగం ఎన్నికల సంఘం అనే ఒక సంస్థను సృష్టించింది. ఈ రాజ్యాంగ ప్రక్రియను ప్రశ్నించి, నిరాధారమైన ఆరోపణలు చేయడం ద్వారా యావత్ ప్రపంచంలో భారత ఎన్నికల సంఘం ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నారు. దాని గొప్పతనాన్ని మసకబార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తున్నామనుకుంటున్నారు. కానీ భారతదేశ ప్రజాస్వామ్య ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు. తమ ఓటుపై ప్రజలకేమీ ఆందోళన లేదు. తాము అనుకున్న ఫలితం వచ్చింది కాబట్టి.” అని అన్నారు.
2014లో నరేంద్ర మోదీ దేశ ప్రధాని అయినప్పటి నుండీ ఎన్నికల ప్రక్రియపై, ఓటరు జాబితాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉన్నారన్నారు. ముందు ఈవీఎంలను లక్ష్యంగా చేసుకున్నారని తెలిపారు. కానీ ఈవీఎంలను 1989లో రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టారని తెలిపారు. 2004, 2009లో వారు గెలిచినప్పుడు మౌనంగా ఉన్నారని విమర్శించారు. ఈవీఎంలు రాకముందు బిహార్, యూపీలో ఎన్నికలు జరిగితే మొత్తం బ్యాలెట్ బాక్కులను ఎత్తుకెళ్లేవారని, ఓటు చోరీ ఆగిపోయినందుకే వారికి కడుపు నొప్పిగా ఉందని విరుచుకుపడ్డారు. ”ఎన్నికల్లో ఓడిపోతే ఓటరు జాబితా బాలేదంటారు.. కానీ ఓటరు జాబితా సవరణకు సహకరించరు. మీ రాష్టం సర్‌ను బహిష్కరిస్తుంది. అక్కడ బీఎల్ఏలు సహకరించారు. ప్రభుత్వ సహాయం అందదు. ఓటరు జాబితాలను ఎలా శుద్ధి చేస్తారు? ఓటరు జాబితా సరిగ్గా ఉండాలనేది మీ డిమాండ్. ఎన్నికల సంఘం దీన్నే చేస్తోంది. ఒక జర్నలిస్టు నచ్చని ప్రశ్న అడిగితే బిజెపి ఏజెంట్ అంటారు. కేసు ఓడిపోతే న్యాయమూర్తిపై ఆరోపణలు చేస్తారు. ఎన్నికల్లో ఓడిపోతే ఈవీఎంలను నిందిస్తారు. ఈవీఎం వాదన తేలిపోవడంతో ఓట్ చోరీ అంశాన్ని ముందుకు తెచ్చారు. దీనిపై బిహార్‌లో పెద్ద యాత్రే చేపట్టారు. అయినప్పటికీ, ఓడిపోయారు. మీరు ఓడిపోవడానికి కారణం మీ నాయకత్వం. ఈవీఎంలు, ఓటరు జాబితాలు కాదు.” అని అమిత్ షా అన్నారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఎన్నికల సంస్కరణల కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఒక్క ప్రతిపాదన కూడా ఇవ్వలేదన్నారు. ఆరెస్సెస్ భావజాలం కలిగిన వారిని ముఖ్యమైన పదవుల్లో ఉంటే వచ్చే సమస్యేంటని ప్రశ్నించారు. ఆర్ఎస్సెస్ భావజాలానికి చెందిన వారు ముఖ్య పదవుల్లో ఉండకూడదని చట్టమేమైనా ఉందా అని నిలదీశారు. ఈ దేశ ప్రధాని, హోం మంత్రి ఆరెస్సెస్ భావజాలానికి చెందినవారని, ప్రజల తీర్పుతో ఇక్కడికి వచ్చామన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇందిరా గాంధీ దేశంలోని అన్ని సంస్థలపై, విద్యా వ్యవస్థపై, ముఖ్యమైన రాజ్యాంగ పదవులపై కమ్యూనిస్టులను కూర్చోబెట్టిందన్నారు. వామపక్ష భావజాలం దేశ స్వభావాన్ని మార్చడానికి ప్రయత్నించిందని, అందుకే వారు అదృశ్యమయ్యారన్నారు. నరేంద్ర మోదీ వ్యవస్థలను ప్రజాస్వామ్య పద్ధతిలో శుద్ధి చేయడానికి కృషి చేస్తున్నారన్నారు.
కాంగ్రెస్ ను ఉద్దేశిస్తూ ”మీరు సర్జికల్ స్ట్రైక్స్ ను వ్యతిరేకించారు. వైమానిక దాడులను వ్యతిరేకించారు. ఆర్టికల్ 370 రద్దును ప్రతిఘటించారు, రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించారు, చొరబాటుదారుల తొలగింపును ప్రతిఘటించారు, సీఏఏను వ్యతిరేకించారు, ట్రిపుల్ తలాక్ ఎత్తివేతను వ్యతిరేకించారు, ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ను వ్యతిరేకిస్తున్నారు. అందుకే ఓడిపోయారు. ప్రధాని కోట్లాది పేదల ఇళ్లకు గ్యాస్ పంపిణీ చేశారు. తాగునీరు, టాయిలెట్లు, 5 కిలోల ఉచిత ఆహార ధాన్యాలు, రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందించారు. గత 11 సంవత్సరాల్లో జరిగిన మౌలిక సదుపాయాల నిర్మాణం చూడండి.. అంతకుముందు 40 సంవత్సరాలు చూడండి.. మౌలిక సదుపాయాలను మూడు రెట్లు పెంచే పనిని మన ప్రధాని నరేంద్ర మోదీ చేశారు.అందుకే ప్రజలు మమ్మల్ని గెలిపించారు.” అని అమిత్ షా అన్నారు.

