Mugguru

ఒక్క రోజు.. మూడు సమస్యలు.. ముగ్గురు నాయకులు..

సమస్య ఎక్కడున్నా సరే అక్కడ బిజెపి వాలిపోతుంది… ప్రజల పక్షాన పోరాడుతుంది… ఉధృతమైన ఉద్యమాలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతుంది.. సమస్య పరిష్కారానికి కృషి చేస్తుంది.. ప్రజలు అన్యాయం అవుతున్నారంటే తమ హోదాను సైతం పక్కకుపెట్టి బాధితుల తరఫున నిలబడుతుంది.. ఈ అక్టోబర్ 19న ఒకటి కాదు.. రెండు కాదు… మూడు సమస్యలపై బిజెపి పోరుబాట పట్టింది. ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజల ఉసురుపోసుకుంటున్న కాంగ్రెస్ సర్కార్‌ను నిలదీసింది.

మూసీ పునరుజ్జీవనం పేరుతో దశాబ్దాలుగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న తీరంలోని బస్తీల్లో కాంగ్రెస్ సర్కార్ పేదల ఇండ్ల కూల్చివేతకు సిద్ధమైంది. ఆయా బస్తీల్లో కూల్చాల్సిన ఇండ్లపై మార్కింగ్ కూడా చేసింది. గూడు చెదిరిపోతున్న ఆందోళనతో మూసీ బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ నేపథ్యంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసానిచ్చారు.

జీవో నెంబర్ 29 తీసుకొచ్చి గ్రూప్-1 నియామకాల్లో రాజ్యాంగ విరుద్ధంగా, రిజర్వేషన్ల స్పూర్తికి నీళ్లొదిలిన కాంగ్రెస్ సర్కార్ తీరుపై గ్రూప్-1 అభ్యర్థులు, నిరుద్యోగుల పెద్దఎత్తున ఆందోళన చేపడుతున్నారు. న్యాయబద్ధమైన వారి డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించాల్సింది పోయి రేవంత్ ప్రభుత్వం ఉక్కుపాదంతో వారి ఆందోళనను అణిచివేసేందుకు పోలీసులను ప్రయోగించింది. పోలీసుల లాఠీచార్జీలో గాయాలపాలైన నిరుద్యోగుల ఆవేదన చూసి చలించిపోయిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అశోక్ నగర్ వెళ్లి వారిని పరామర్శించారు, వారి సమస్యలు విన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం సరైన భద్రత కల్పించడంలో విఫలమవడంతో ఓ మతోన్మాది సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడిలో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. పథకం ప్రకారం అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఈ కేసులో సూత్రధారులు, కుట్రదారులను కనుగొనాల్సిన పోలీసులు ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు దర్యాప్తును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ స్థానికులు, అమ్మవారి భక్తులు, హిందూ సంఘాలు సికింద్రాబాద్ బంద్ కు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా వారు చేపట్టిన నిరసన కార్యక్రమంలో మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని సంఘీభావం తెలిపారు.

ఒకే రోజు మూడు వేరువేరు సమస్యలపై బాధితులపై పక్షాన నిలబడిన బిజెపి నాయకులు ప్రజల మనసులు చూరగొన్నారు.

మూసీకి ఇరువైపులా రిటైనింగ్ వాల్ కట్టాలి

GKRమూసీకి రెండు వైపులా రిటైనింగ్ వాల్ ను నిర్మించి, ఆ తర్వాత మూసీ సుందరీకరణ చేపట్టండంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బిజెపి తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి తీవ్రస్థాయిలో హెచ్చరించారు. పేదల జీవితాలంటే తమాషాగా ఉందా అంటూ నిలదీశారు. అక్టోబర్ 19న లంగర్‌హౌస్‌ డివిజన్, రాందేవ్‌గూడ ప్రాంతాల్లో మూసీ పరివాహక ప్రాంతాల్లో కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పర్యటించారు. కాలనీవాసులతో మాట్లాడి, వారి ఇబ్బందులను సావధానంగా అడిగి తెలుసుకున్నారు. సుమారు 150 ఇండ్లపై ఎర్ర అక్షరాలతో ఆర్‌‌‌‌‌‌‌‌బీ–ఎక్స్‌‌‌‌‌‌‌‌ అని మార్కింగ్‌‌‌‌‌‌‌‌ చేయడాన్ని చూసి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం వల్ల వేలాది పేదలు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. హైడ్రా బాధితుల ఇండ్లనూ పరిశీలించారు. ప్రభుత్వం తమ ఇండ్లను కూల్చుతోందంటూ కేంద్రమంత్రికి బాధితులు మొర పెట్టుకున్నారు. పునరుజ్జీవం పేరుతో మూసీ వెంట నివాసితులను ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వ తీరుపై భగ్గుమన్నారు. కోపంతో ఊగిపోతూ ఆక్రోశాన్ని వెల్లగక్కారు. కాయకష్టం చేసుకుంటూ ఒక్కో రూపాయి కూడబెట్టి కట్టుకున్న ఇళ్ళను ఖాళీ చేయమంటారా..? కాంగ్రెస్‌కు ఓటేసిన పాపానికి ఇదేనా శిక్ష అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మూసీ పునరుజ్జీవం పేరిట విధ్వంసం సృష్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ బాధిత, నిర్వాసిత ప్రజలకు మద్దుతుగా నిలిచి, భరోసానిచ్చారు. పేదల బతుకులను ఛిద్రం చేయాలనుకుంటే ఊరుకునే ప్రసక్తి లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కిషన్ రెడ్డి హెచ్చరించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని పేదలకు బిజెపి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ‘‘మూసీ పునరుజ్జీవం పేరుతో ప్రజల ఇండ్లకు మార్కింగ్ చేస్తూ కూల్చివేస్తామంటూ రేవంత్ ప్రభుత్వం ప్రకటిస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో అనేక సంవత్సరాలుగా మూసీ పరివాహక ప్రాంతాల్లో నివాసముంటున్న పేదలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. రూ.1లక్షా 50వేల కోట్లతో మూసీ పునరుజ్జీవం చేస్తామంటున్న రేవంత్ రెడ్డి.. ముందు పేదల ఇండ్లు కూల్చకుండా మూసీకి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించాలి. పేదవాడి ఇల్లు కూల్చి ఆ స్థలంలో సుందరీకరణ చేస్తామనుకుంటే బిజెపి సహించదు. బాధితుల పక్షాన మేం నిలబడుతాం. బస్తీల్లో డ్రైనేజీ వ్యవస్థను నిర్మించడం, ఆధునీకరించడం, రోడ్ల నిర్మాణం, ప్రజలకు ఆధార్, రేషన్ కార్డులు ఇప్పించడంతో పాటు అనేక మౌలిక సదుపాయాలు కల్పించేలా బిజెపి అండగా ఉంటున్నది. ఇక్కడి ప్రజలెవ్వరూ తమకు ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇండ్ల కూల్చివేతలకు పాల్పడుతోంది. ఏండ్లకేండ్లు కాయాకష్టం చేసి ఇటుక, ఇటుక పేర్చి ఇండ్లు కట్టుకుంటే.. ఇప్పుడు ఆ పేదల ఇండ్లను కూల్చుతామనడం అన్యాయం. రాత్రికి రాత్రి బుల్డోజర్లతో ఇండ్లు కూల్చాలనుకోవడం ఏమాత్రం సరికాదు. ప్రాణాలకు తెగించైనా పేదల ఇండ్ల కూల్చివేతలను అడ్డుకుంటాం. పేదలను ఈ ప్రాంతం నుంచి వేరు చేస్తామంటే ఊరుకునేది లేదు. గతంలో కేసీఆర్ మూసీనదిని కొబ్బరినీళ్లతో నింపుతామని ప్రకటించి, అడ్రస్ లేకుండా పోయిండు. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవం పేరుతో ఇండ్లు కూల్చివేయాలని ప్రయత్నిస్తున్నడు. వాటర్ వర్క్స్ డిపార్ట్ మెంట్, జీహెచ్ఎంసీ సహా ప్రభుత్వ సంస్థలే మూసీలో డ్రైనేజీ నీళ్లను కలుపుతున్నాయి. డ్రైనేజీ మళ్లింపు, డైవర్షన్ లేకుండా లక్షల కోట్లు ఖర్చు పెట్టినా మూసీ పునరుజ్జీవం సాధ్యం కాదు. ముందుగా ప్రభుత్వం డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చాలి. పైపులైన్లు నిర్మించి ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. పేదవాడి ఇండ్లు కూల్చాలనుకుంటే బాధిత ప్రజల పక్షాన బిజెపి నిలబడుతుంది. ముందు మాపై బుల్డోజర్లు తీసుకొచ్చి.. అప్పుడు పేదల ఇండ్ల కూల్చివేయండి.’’ అని అన్నారు.

 రాష్ట్రంలో రిజర్వేషన్లు రద్దు చేసే కుట్ర

BSKఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను నీరుగారుస్తున్న 29 జీవోను ఎత్తేయాలని శాంతియుతంగా హైదరాబాద్ అశోక్ నగర్‌లో ఆందోళన చేస్తున్న గ్రూప్-1 అభ్యర్థులపై పోలీసులు వరుసగా ఝుళిపిస్తున్న లాఠీఛార్జ్ కు నిరసనగా సాక్షాత్తు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అక్టోబర్ 19న అశోక్ నగర్ చౌరస్తాకు వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ దమనకాండను తీవ్రంగా ఖండించారు. నిరుద్యోగులతో కలిసి ఏకంగా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కేంద్ర మంత్రికి నిరసనగా వేలాది మంది నిరుద్యోగులు, గ్రూప్-1 అభ్యర్థులు తరలివచ్చారు. బండి సంజయ్‌తో కలిసి రోడ్డుపై బైఠాయించారు. ‘‘సీఎం డౌన్ డౌన్… 29 జీవోను రద్దు చేయాలి. గ్రూప్ 1 పరీక్షలను రీషెడ్యూల్ చేయాలి’’ అంటూ నినాదాలు చేశారు. రోడ్డపై బైఠాయించినంత సేపు ‘‘వ్యూ వాంట్ జస్టిస్ ’’ అంటూ నినదిస్తూనే ఉన్నారు.

మరోవైపు కేంద్ర మంత్రి రోడ్డుపై బైఠాయించిన విషయం తెలుసుకున్న బిజెపి యువ మోర్చా, మహిళా మోర్చా నాయకులు, బిజెపి కార్యకర్తలు సైతం అక్కడికి తరలివచ్చి సంజయ్‌కు సంఘీభావం తెలుపుతూ రోడ్డుపై బైఠాయించారు. కేంద్ర మంత్రికి మద్దతుగా భారీగా తరలివస్తున్న నిరుద్యోగులను కట్టడి చేసేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు. అశోక్ నగర్ చుట్టుపక్కల ఉన్న హాస్టళ్ల వద్ద పోలీసులు పహారా కాస్తూ.. నిరుద్యోగులను బయటకు రాకుండా అడ్డుకునేందుకు యత్నించారు. ముళ్లకంచెలు, బారికేడ్లు పెట్టి అనేక నిర్బంధాలకు గురిచేశారు. అయినప్పటికీ వాటన్నింటినీ తప్పించుకుని వేలాది నిరుద్యోగులు అశోక్ నగర్ చౌరస్తాకు తరలివచ్చారు. బండి సంజయ్‌తో కలిసి బైఠాయించారు. దీంతో అశోక్ నగర్ చౌరస్తా వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

మరోవైపు పోలీసులు భారీగా తరలివచ్చి అక్కడ మోహరించారు. ఒకవైపు వేలాదిగా తరలివచ్చి నినదిస్తున్న నిరుద్యోగులు, మరోవైపు పోలీసుల మోహరింపుతో అశోక్ నగర్ చౌరస్తా వద్ద పూర్తిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్డుపై బైఠాయించిన కేంద్ర మంత్రిని కలిసేందుకు నిరుద్యోగులు క్యూ కట్టారు. పోలీసులు తమపై అన్యాయంగా లాఠీలు ఝుళిపించి గంటల తరబడి నిర్బంధించారని వాపోయారు. జీవో నెం.29 రద్దు చేసేవరకు తమకు అండగా నిలవాలని కోరారు. నిరుద్యోగుల విషయంలో నాటి బీఆర్ఎస్, నేటి కాంగ్రెస్ పాలకులు చేసిన అన్యాయాన్ని ఏకరవు పెడుతూ వినతి పత్రాలు అందించారు.

ఈ నేపథ్యంలో సీఎంను కలిసి వాస్తవాలు వివరిస్తామంటూ బండి సంజయ్ ‘చలో సెక్రటేరియట్’ పిలుపునిచ్చారు. సెక్రటేరియట్ దిశగా వెళుతున్న ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. కేంద్ర మంత్రిని ముందుకు వెళ్లకుండా పోలీసు ఉన్నతాధికారులు అడ్డుపడ్డారు. సచివాలయానికి వెళ్లి తీరుతామంటూ బండి సంజయ్ స్పష్టం చేశారు. వేలాది నిరుద్యోగులతో కలిసి లిబర్టీ చౌరస్తా వద్దకు చేరుకున్నారు. లాఠీలతో భారీ ఎత్తున పోలీసులు మోహరించినా నిరుద్యోగులు వెనకడుగు వేయలేదు. పోలీసులు బండి సంజయ్‌ను బలవంతంగా వాహనం ఎక్కించారు. వాహనం తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్దకు రాగానే బండి సంజయ్ వాహనం దిగి రోడ్డుపై బైఠాయించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కూడా బండి సంజయ్‌తో పాటు రోడ్డుపై బైఠాయించారు. బండి సంజయ్ రక్షణగా వేలాది నిరుద్యోగులు నిలిచారు. పోలీసులు ఎంత ప్రయత్నించినా బండి సంజయ్ దాదాపు 4 గంటల పాటు తీవ్రంగా ప్రతిఘటించారు. చివరకు పోలీసు వాహనంలోకి ఎక్కించిన పోలీసులు నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయం వద్ద విడిచిపెట్టారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ‘‘తెలంగాణలో రిజర్వేషన్లను రద్దు చేసే కుట్రకు జీవో నెంబర్ 29 ఓ సంకేతం. సోనియా జన్మదినం… నిరుద్యోగుల బలిదినం కాబోతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా దిగి రావాలి.’’ అని అన్నారు. తనపై విమర్శలు గుప్పించిన కేటీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఇదిలా ఉంటే బండి సంజయ్ ర్యాలీలోకి బీఆర్ఎస్ మూకలు చొరబడ్డాయి. నిరుద్యోగ ర్యాలీని హైజాక్ చేసేందుకు యత్నించాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దాసోజు శ్రవణ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే కుమారుడు జై సింహాతో సహా పలువురు కార్యకర్తలు వస్తే ‘బీఆర్ఎస్ నేతలారా… గో బ్యాక్’ అంటూ నిరుద్యోగులు నినదించారు. నిరుద్యోగులతో బీఆర్ఎస్ నేతలు వాగ్వాదానికి దిగారు. భారీగా నిరుద్యోగులు రావడంతో బీఆర్ఎస్ నేతలు తోకముడిచారు. 

భక్తుల రక్తం కళ్ల చూసిన పాపం ఊరికే పోదు

Eatalaఅక్టోబర్ 14న కుమ్మరిగూడలోని ఆలయంలోకి అక్రమంగా చొరబడిన ముంబయికి చెందిన 30 ఏళ్ల మతోన్మాది విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ హిందూ సంఘాలు అక్టోబర్ 19న సికింద్రాబాద్‌ బంద్‌కు పిలుపునిచ్చాయి. అక్కడి వ్యాపారులు, హోటళ్ల నిర్వాహకులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్, హిందూ వాహిని సంఘాలతో కలిసి సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి దేవాలయం వద్ద బైఠాయించి హనుమాన్‌ చాలీసా పఠించారు. అనంతరం అక్కడి నుంచి హిందూ సంఘాల కార్యకర్తలు ర్యాలీగా కుమ్మరిగూడ ఆలయం వద్దకు చేరారు. నిందితుడిని శిక్షించాలని డిమాండ్‌ చేశారు. నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో వాటర్‌ బాటిల్లు విసిరారు. పోలీసులు లాఠీఛార్జి చేయడంతో యువకుల తలలకు గాయాలయ్యాయి. అనేకమంది రక్తమోడారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మరింత మంది యువకులు అక్కడికి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వారు ఆలయం సమీపంలోనే బైఠాయించి అక్కడే భోజనాలు చేసి నిరసన తెలిపారు.

ఈ ఘటనపై ప్రభుత్వ తీరును దుయ్యబడుతూ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ముత్యాలమ్మ దేవాలయం వద్ద భక్తులపై పోలీసుల లాఠీఛార్జిని తీవ్రంగా ఖండిస్తున్నాం. భక్తుల రక్తం కళ్ల చూసిన పాపం ఊరికే పోదు. అమ్మవారిని కాళ్ళతో తన్ని అవమానించిన వ్యక్తి వెనుక ఉన్నది ఎవరో ఇప్పటివరకు ప్రకటించని ప్రభుత్వం, హిందువుల తలలు పగిలేలా దాడి చేయించింది. వివిధ రాష్ట్రాల నుండి 200 మంది సికింద్రాబాద్ మెట్రోపోలీస్ హోటల్ లో మత విద్వేషాలు రెచ్చగొట్టే సమావేశం పెట్టుకున్నారని తెలిసినా ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. లుంబిని పార్క్, గోకుల్ చాట్, దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్లలో తెగిపడ్డ మాంసపు ముద్దలు గుర్తుకు వస్తున్నాయి. మీ చిల్లర రాజకీయాల కోసం తాత్సారం చేస్తే.. బలయ్యేది అమాయక ప్రజలు, మూల్యం చెల్లించాల్సింది మీ ప్రభుత్వమే అని మరోసారి హెచ్చరిస్తున్నా. ఒక్క పిలుపు ఇస్తే ఇంతమంది భక్తులు వచ్చారంటేనే హిందువులు ఎంత రగిలిపోతున్నారు.. ఎంత అభద్రతతో ఉన్నారో.. ఈ ర్యాలీ ఒక ఉదాహరణ. ఇకనైనా ప్రభుత్వం వెంటనే స్పందించి విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వచ్చిన ముఠా వివరాలు బయటపెట్టి, కఠిన చర్యలు తీసుకోవాలి.’’ అని అన్నారు.