Dharna

పేదలకు ఇబ్బందొస్తే అండగా నిలబడతాం

Musi Dharnaపేదవాడికి ఇబ్బంది వస్తే అండగా నిలబడతామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్​ రెడ్డి మూసీ బాధితులకు భరోసా ఇచ్చారు. గత రెండు నెలలుగా మూసీ సమీపంలో ఉన్న నిరుపేదలందరూ నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం కడుపు నిండా తినలేని పరిస్థితుల్లో ఉన్నారని అన్నారు. కష్టపడి కట్టుకున్న ఇళ్లను కూల్చివేస్తుంటే ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారని వాపోయారు. దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, నగరంలో కానీ… ఎక్కడైనా సరే పేదలకు అండగా బిజెపి నిలుస్తుందని స్పష్టం చేశారు. పేదలకు ఇబ్బంది కలగకుండా చేపడితే బిజెపి కార్యకర్తలు కరసేవ చేసేందుకు సిద్ధంగా ఉంటారని స్పష్టం చేశారు. మూసీ బాధితులకు అండగా, కాంగ్రెస్​ ప్రభుత్వం కూల్చివేతలకు నిరసనగా అక్టోబర్ 25న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్దనున్న ధర్నా చౌక్ లో బిజెపి మహాధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో బిజెపి నాయకులు, కార్యకర్తలతో పాటు మూసీ బాధితులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

ఈ ధర్నాలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్​ రెడ్డి అధికారంలోకి వచ్చి 10 నెలలు పూర్తి కావొస్తున్నా ఈ సమయంలో ఏ ఒక్క ఇంటికి భూమిపూజ, శంకుస్థాపన చేయలేదన్నారు. పైగా తమ రక్తాన్ని చెమటగా మార్చి ఇటుక మీద ఇటుక పేర్చి నిర్మించుకున్న పేదల గూళ్లను కూల్చి వేసే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ ప్రాంతానికి వెళితే వారి కష్టాలు విని కడుపు తరుక్కుపోతుందన్నారు. ఎన్నికల వేళ పేదలకు ఇళ్లు కట్టిస్తాం, మహిళలకు రూ.2500, రైతులకు రుణమాఫీ, రైతు కూలీలకు రూ.12వేలు, పెన్షన్​ ల పెంపు, నిరుద్యోగులకు భృతి, రైతులకు సబ్సిడీ లాంటి అనేక రకాల హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చాక విస్మరించిందన్నారు. 6 గ్యారంటీల పేరుతో సోనియా, రాహుల్​, రేవంత్​ రెడ్డిలు ప్రజలను మభ్యపెట్టి గ్యారంటీలను గారడీలుగా మార్చి మసి బూసి మారెడుకాయ చేస్తున్నారని మండిపడ్డారు. గత బీఆర్​ఎస్ ప్రభుత్వం కూడా​ ప్రజలను ఇలానే భయపెట్టిందన్నారు. అప్పుడు కూడా బిజెపి ప్రజల పక్షాన నిలబడి పేదల ఇళ్లను రక్షించామన్నారు. స్థానిక ఎంపీలు, పార్టీ నాయకులు నిరంతరం ప్రజల మధ్యనే ఉంటున్నారని, మూసీ పరివాహక ప్రాంతంలోని బాధితులందరినీ స్వయంగా వారిని కలిసి వారి ఆవేదన, ఆక్రోశం, కష్టాలు, కన్నీళ్లను చూశామన్నారు. మూసీ ప్రాంతంలో నివసిస్తున్న పేద ప్రజలకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నామన్నారు. మూసీ ప్రక్షాళనకు, సుందరీకరణకు వ్యతిరేకం కాదని, కానీ పేద ప్రజల ఇళ్ల జోలికి వస్తే బిజెపి అడ్డుకుంటుందన్నారు. ఇప్పటికైనా పేదల ఇండ్ల కూల్చివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు. అనేక సంవత్సరాల నుంచి ఉన్న ఇళ్లను ఏ రకంగా కూలుస్తారని ప్రశ్నించారు. మూసీ పరివాహక ప్రాంతం చరిత్ర రేవంత్​ రెడ్డికి తెలుసా? అని ప్రశ్నించారు. మూసీలో అనేక ప్రాంతాల నుంచి డ్రైనేజీ నీరు కలుస్తుందన్నారు. దానిని మళ్లించకుండా ఎస్టీపీలు నిర్మించకుండా మూసీ ప్రక్షాళన చేయలేరన్నారు. హైదరాబాద్​ లో అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలన్నారు. ముందుగా పేదలకు కనీస సౌకర్యాలు కల్పించి ఆ తరువాత మూసీ సుందరీకరణ చేపట్టాలని డిమాండ్​ చేశారు. జీహెచ్​ఎంసీకి రూపాయి రాల్చే దిక్కు దివానం లేదు, డ్రైనేజీ వ్యవస్థ, వీధి లైట్లు సరి చేసే దిక్కేలేదన్నారు. ఆ కార్మికులకు కూడా జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నారన్నారు. కనీసం కాలిపోయిన బల్బులకూ డబ్బుల్లేవన్నారు. మూసీ ప్రాంతంలో బస్సు డిపో, మెట్రో స్టేషన్, కార్యాలయం ఏ విధంగా నిర్మించారని ప్రశ్నించారు. అనేక ప్రాంతాలలో ఈ సమస్య ఉందన్నారు. పెద్ద పెద్ద వ్యాపారులు రియల్ ఎస్టేట్​ విల్లాలు కడుతున్నారని, ఫాంహౌస్​ లు కట్టుకుంటున్నారని వాటి గురించే మాట్లాడరని, రెక్కాడితేగానీ డొక్కాడని మూసీ ప్రాంత వాసుల మీద కాంగ్రెస్​ ప్రతాపం ఏంటని నిలదీశారు. రూ.25వేలు ఇస్తున్నాం ఖాళీ చేయడానికి ఏమైందని అంటున్నారు, 40, 50 ఏళ్లుగా తమ శ్రమతో కట్టుకున్న ఇళ్లు ఖాళీ చేయాలంటే ఏ విధంగా ఉంటుందో ఆలోచించాలన్నారు. పేదలెవ్వరూ ఆందోళన చెందవద్దని అన్నారు. ఈ విషయంపై చివరి వరకూ పోరాడుతామన్నారు.

అల్లుడి కోసమే మూసీ ప్రక్షాళన: బండి సంజయ్

ఈ మహాధర్నాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ ‘‘మూసీ ఒకప్పుడు హైదరాబాద్ కు తాగునీటిని అందించిన నది.. నేడు విషంతో నిండిపోయింది. 12 వేల పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యంతో మూసీ నిండిపోయింది. మూసీ పరివాహక ప్రాంతంలో భూగర్భ జలాలన్నీ కలుషితమయ్యాయి. దీనికి కారణం 40-50 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్సే. నేను పాదయాత్ర చేసినప్పుడు కళ్లారా చూశా.. మూసీ సర్వ నాశనం కావడానికి కారణం కాంగ్రెస్. మూసీని ప్రక్షాళన చేస్తామని గత పదేళ్లు బీఆర్ఎస్ మాయ మాటలు చెప్పింది. మూసీలో ప్రవహించే మురుగునీటితో వ్యవసాయ పొలాలు నాశనమవుతున్నాయి. మూసీ ప్రక్షాళన పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ అబద్ధాలు ఆడుతున్నడు. ఓసారి మూసీ సుందరీకరణ అని మరోసారి మూసీ పునరుజ్జీవం అంటున్నారు. మూసీ ప్రక్షాళన అనేది కాంగ్రెస్ పార్టీ అల్లుడి కోసం మాత్రమే. సోనియాగాంధీ అల్లుడికి సంబంధించిన కాంట్రాక్టుల కోసం మాత్రమే. మూసీ సుందరీకరణకు లక్షన్నర కోట్లు ఎక్కడికి నుంచి వస్తున్నయో రేవంత్ రెడ్డి చెప్పాలి. లక్షన్నర కోట్లతో ముందు ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయాలి. 6 గ్యారెంటీలను డైవర్ట్ చేసేందుకే హైడ్రా, మూసీ అంటూ డ్రామాలు చేస్తున్నారు. సబర్మతి ఖర్చు రూ.7వేల కోట్లు. నమామి గంగ ఖర్చు రూ. 40వేల కోట్లు.. అయితే మూసీకి లక్షన్నర కోట్లా? మూసీ పేరుతో ఒక్క కిలోమీటర్ కు 2 వేల కోట్లా.. ఖర్చుపెట్టేది? ఇంతకంటే ఖరీదైన ప్రాజెక్టు, స్కామ్ ప్రపంచంలో లేదు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి తెలంగాణ రాష్ట్రంలో పేదలు అనేక ఇబ్బందులు పడుతున్నరు.’’ అని అన్నారు.

లక్షన్నర కోట్లు ఎక్కడి నుంచి తెస్తరు: ఈటల రాజేందర్

మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ ‘‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన పేరుతో హైడ్రా తీసుకొచ్చి పేదల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నరు. మేం బస్తీలకు వెళ్లినప్పుడు మూసీ బాధితులు తమ గోడు వెల్లబోసుకున్నరు. 70-80 ఏండ్ల క్రితం నుంచి వేలాది కుటుంబాలు తెలంగాణ పల్లెల నుంచి ఉపాధి కోసం కుటుంబాలతో కలిసి హైదరాబాద్ కు వచ్చిన్రు. గుడిసెలు వేసుకుని బతుకుతున్న వారికి 40 ఏండ్ల క్రితమే ప్రభుత్వం ఇండ్ల పట్టాలిచ్చింది. బఫర్ జోన్ లో కట్టుకున్న ఇండ్లంటూ రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నరు. పేదలు ఎక్కడ కూడా ఆక్రమించుకోలేదు. పట్టా భూములను కొనుక్కున్నరు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం కట్టుకున్న ఇండ్లను కూలగొడుతోంది. సామాన్లు తీసుకునేందుకు సమయం కూడా ఇవ్వకుండా ఇండ్లు కూలగొడుతున్నరు. మూసీ ప్రక్షాళనకు.. ఇండ్ల కూల్చివేతలకు ఏం సంబంధం.. రేవంత్ చెప్పాలి.

డీపీఆర్ కు రూ.140 కోట్లు ఖర్చవుతుందని రేవంత్ రెడ్డి చెబుతున్నరు. పేదల ఇండ్లకు ఆర్బీఎక్స్ అని రాస్తూ కూలగొడుతున్నరు. దొంగల్లా ప్రతి ఇంటికి రంగు వేస్తున్నరు. రాష్ట్ర ప్రభుత్వానికి 10వేల కోట్లు అప్పు తెచ్చే సామర్థ్యం లేనప్పుడు లక్షన్నర కోట్ల అప్పు ఎక్కడి నుంచి తీసుకొస్తరు..? కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పేర్కొన్న హామీలను ఎప్పటి లోగా పూర్తి చేస్తారు.. రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. పేదల ఇండ్లను రక్షించుకునేలా ప్రజలకు అండగా మేముంటాం.’’ అని అన్నారు.

గుత్తేదారులకు మేలు చేసేందుకే మూసీ సుందరీకరణ: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ‘‘తెలంగాణలో లంకబిందెలు ఉన్నాయనుకుంటే ఖాళీ బిందెలున్నాయని చెప్పిన రేవంత్ రెడ్డి.. మరి మూసీ పరివాహక ప్రాంతాల్లో లంకెబిందల కోసమే ప్రక్షాళన చేస్తామంటున్నారా..? మూసీ సుందరీకరణ ఎందుకోసమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ సరిగ్గా అమలు చేయకుండా మేనిఫెస్టో లేని అంశాలను ముందుకు తెచ్చి ప్రజలను భయబ్రాంతులకు, ఇబ్బందులకు గురి చేస్తున్నరు. మూసీ ప్రక్షాళన పేరుతో వేల మంది పేద, అట్టడుగు వర్గాల ప్రజల ఇండ్లు కూల్చే ప్రయత్నం చేస్తున్నరు. మూసీ పరివాహక ప్రాంతంలో కట్టుకున్న ఇండ్లకు పర్మీషన్లు ఇచ్చింది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే కదా..? మరి అక్రమమైతే ఎట్లా రిజిస్ట్రేషన్లు చేసినట్లు..? బడా బాబులకు కాంట్రాక్టులు ఇచ్చేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంగా వాడుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు తమ గుత్తేదారులకు మేలు చేసేలా మూసీ సుందరీకరణను ముందుకు తీసుకొచ్చింది. దమ్ముంటే.. బుల్డోజర్లు మమ్మల్ని దాటుకుని పేదల ఇండ్లపైకి వెళ్లాలి. బడుగు బలహీన వర్గాల ఇండ్లను కూల్చివేయాలనుకుంటే సహించేది లేదు. గతంలో కేసీఆర్ హుస్సేన్ సాగర్ ను కొబ్బరి నీళ్లలా మారుస్తమని ప్రగల్భాలు పలికితే.. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం మూసీని థేమ్స్ లా చేస్తమంటూ చెబుతున్నది. గతంలో కేసీఆర్ సర్కారు హైదరాబాద్ ను ఇస్తాంబుల్, పారిస్ గా మారుస్తమంటే.. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం సియోల్ గా, లండన్ గా చేస్తమంటూ ప్రగల్భాలు పలుకుతోంది.’’ అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ గూడెం నగేష్​, ఆదిలాబాద్​ ఎమ్మెల్యే పాయల్​ శంకర్​, ఆర్మూర్​ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి, నిజామాబాద్​ ఎమ్మెల్యే సూర్యనారాయణ, ఆసిఫాబాద్​ ఎమ్మెల్యే హరీష్​, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ పదాధికారులు, నాయకులు, కార్యకర్తలు, మూసీ బాధితులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.