ప్రజారోగ్యానికి పటిష్టమైన భరోసా ‘జనఔషధి’
ఒక దేశం సాధించిన ప్రగతికి అసలైన కొలమానం, ఆ దేశ పౌరులకు ఆరోగ్య సంరక్షణ వంటి ప్రాథమిక సౌకర్యాలు ఎంత సులభంగా అందుతున్నాయనేదానిపై ఆధారపడి ఉంటుంది. దశాబ్దాలుగా మందుల అధిక ధరలు దేశంలోని కోట్లాది ప్రజల ఆరోగ్యానికి, సంక్షేమానికి ప్రధాన ఆర్థిక అడ్డంకిగా మారుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రారంభమైన ‘ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన’ (పిఎంబిజెపి) ప్రజారోగ్య రంగంలో ఒక నిర్మాణాత్మక మార్పును తీసుకొచ్చింది. బ్రాండెడ్ మందులతో పోలిస్తే అత్యంత తక్కువ ధరకే నాణ్యమైన జెనెరిక్ మందులను అందుబాటులోకి తేవడం ద్వారా ఈ పథకం పేద, మధ్యతరగతికి ఒక వరంగా మారింది.
జెనెరిక్ మందులు: విశ్వసనీయతకు మారుపేరు
ప్రపంచవ్యాప్తంగా సరసమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలకు జెనెరిక్ మందులే మూలస్తంభాలు. అనేక దేశాల్లో వైద్యులు రాసే ప్రిస్క్రిప్షన్ లో దాదాపు 80 శాతం నుంచి 90 శాతం వరకు ఇవే ఉంటాయి. అత్యవసర మందుల లభ్యతను పెంచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. జెనెరిక్ మందులు ప్యాకేజింగ్, లేబులింగ్ లేదా ఇతర క్రియారహిత పదార్థాల విషయంలో బ్రాండెడ్ మందులతో భిన్నంగా అనిపించినప్పటికీ, వాటి ప్రభావంలో ఎటువంటి తేడా ఉండదని పరిశోధనలు నిరూపించాయి. మోతాదు, భద్రత, సామర్థ్యం, నాణ్యత, వినియోగం వంటి అన్ని అంశాలలో ఇవి బ్రాండెడ్ మందులతో సమానంగా ఉంటాయి. అంతేకాకుండా ఇవి కఠినమైన ఉత్పత్తి, నాణ్యత ప్రమాణాలను పాటిస్తాయి.
ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ బలోపేతం
పిఎంబిజెపి కేవలం మందుల విక్రయ కేంద్రం మాత్రమే కాదు; ఇది భారతదేశ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసే ఒక వ్యవస్థాగత ప్రక్రియ. ఈ ఏడాది ‘జనఔషధి సప్తాహ’ ఇతివృత్తం’జనఔషధి: చౌకైనది, నమ్మదగినది; ఆరోగ్యంతో పాటు పొదుపు’. ఇది కోట్లాది లబ్ధిదారుల ఆకాంక్షలకు అద్దం పడుతోంది. దేశవ్యాప్తంగా విస్తరించిన 18,000 పైగా జనఔషధి కేంద్రాల ద్వారా, మార్కెట్ ధరల కంటే 50 నుంచి 80 శాతం తక్కువ ధరకే మందులు అందుబాటులోకి వచ్చాయి. ఇది అన్ని సామాజిక, ఆర్థిక నేపథ్యాల గల కుటుంబాలకు అండగా నిలుస్తోంది. క్షేత్రస్థాయి సర్వేల ప్రకారం, లబ్ధిదారులు ఈ ధరల తగ్గింపు, మందుల సులభ లభ్యత పట్ల అత్యంత సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
విస్తృత శ్రేణి ఉత్పత్తులు
ఈ పథకం పరిధిని దాని ఉత్పత్తుల జాబితా ద్వారా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. జనఔషధి కేంద్రాలలో ప్రస్తుతం 2,110 రకాల మందులు, 315 రకాల సర్జికల్ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ఇవి 29 రకాల విభిన్న చికిత్సా విభాగాలకు సంబంధించినవి. ‘ఫార్మాస్యూటికల్స్ అండ్ మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా’ ప్రత్యక్ష పర్యవేక్షణలో మార్కెట్ విశ్లేషణలు, నిపుణుల కమిటీ సూచనల మేరకు ఈ జాబితాను నిరంతరం పెంచుతున్నారు. దీనివల్ల మారుతున్న ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా మందులు అందుబాటులో ఉంటున్నాయి.
ప్రపంచ ఔషధాగారంగా భారత్
బలమైన నియంత్రణ, పర్యవేక్షణ కారణంగా భారతీయ ఫార్మా కంపెనీలు అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ వంటి కఠినమైన నిబంధనలు గల దేశాలతో సహా 200కి పైగా దేశాలకు నమ్మకమైన సరఫరాదారులుగా ఎదిగాయి. లాటిన్ అమెరికా, ఆఫ్రికా, తూర్పు యూరప్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు కూడా భారతీయ కంపెనీలు విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం ఈ పరిశ్రమ ‘బయోసిమిలర్స్’ (బయోలాజిక్ మందుల జెనెరిక్ వెర్షన్లు) పై దృష్టి పెట్టడంతో పాటు, సంక్లిష్టమైన జెనెరిక్స్, స్పెషాలిటీ ఔషధాల తయారీకి పరిశోధన, అభివృద్ధిలో భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఈ చర్యలు భారత్ ను కేవలం ప్రాథమిక ఉత్పత్తి కేంద్రంగానే కాకుండా సరసమైన ధరల మందుల తయారీలో అగ్రగామి ఆవిష్కర్తగా నిలబెడుతున్నాయి.
నాణ్యతపై రాజీ లేని నిఘా
“తక్కువ ధర అంటే తక్కువ నాణ్యత” అనే అపోహను పిఎంబిజెపి సమర్థంగా తొలగించింది. బహుళ అంచెల నాణ్యత హామీ యంత్రాంగం ద్వారా ఉత్పత్తి ప్రమాణాలను ఇది కాపాడుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరించిన తయారీదారుల నుంచే జనఔషధి మందులను సేకరిస్తారు. ప్రతి బ్యాచ్ మందులు ఫార్మసీకి చేరడానికి ముందు జాతీయ లేబరేటరీల ధ్రువీకరణ సంస్థ (NABL) ఆమోదించిన ల్యాబ్ లలో వాటిపై కఠినమైన పరీక్షలు నిర్వహిస్తారు. ఈ మందులు డ్రగ్స్, కాస్మెటిక్స్ చట్టం, 1940 కి లోబడి ఉంటాయి. మందుల సేకరణకు ముందు, తర్వాత కూడా క్రమం తప్పకుండా ఆడిట్లు నిర్వహిస్తూ, నాణ్యతలో ఎటువంటి లోపాలు లేకుండా చూస్తారు.
పంపిణీ వ్యవస్థ, భవిష్యత్తు ప్రణాళిక
ఐదు అత్యాధునిక గిడ్డంగులు, దేశవ్యాప్తంగా ఉన్న 41 మంది ప్రత్యేక పంపిణీదారుల మద్దతుతో నడిచే ఐటి-ఆధారిత పంపిణీ వ్యవస్థ, సరఫరా గొలుసులో ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూస్తోంది. లభ్యత, నాణ్యత, చౌక ధర అనే మూడు సూత్రాలపై దృష్టి పెట్టడం ద్వారా పిఎంబిజెపి కోట్ల మంది వైద్య ఖర్చులను గణనీయంగా తగ్గించింది. ప్రతి జిల్లాలో ఒక జనఔషధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యం ఇప్పుడు సాకారం అవుతోంది. ‘వికసిత భారత్ @2047’ దార్శనికతలో భాగంగా ప్రతి ఒక్కరికీ పటిష్టమైన, సమానమైన, సరసమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను నిర్మించడం మా ప్రధాన లక్ష్యం. మెరుగైన ఆస్పత్రులు, తక్కువ వైద్య ఖర్చులు, సులభంగా అందుబాటులో ఉండే చికిత్స ఇందులో భాగం. సరైన దార్శనికత ఉంటే నాణ్యమైన వైద్యం అందరికీ చేరువవుతుందని పిఎంబిజెపి నిరూపించింది. ప్రధాని మోదీ నాయకత్వంలో ఈ పథకం ప్రపంచానికే ఒక ఆదర్శంగా నిలుస్తుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది.
జె.పి. నడ్డా,
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి

