ప్రజారోగ్యాన్ని బలోపేతం చేసే ఫోర్టిఫైడ్ బియ్యం కార్యక్రమం
75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పోషకాహార లోపాన్ని ఎదుర్కోవాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. ఆరోగ్యవంతమైన, బలమైన భారతదేశం కోసం ప్రతి పౌరుడు, ముఖ్యంగా బడుగు వర్గాలు పోషకాహారాన్ని పొందేందుకు అర్హులని స్పష్టం చేశారు. ఈ లక్ష్యానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సంపూర్ణ పోషకాహారం అందేటట్టు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటోంది. అన్ని ప్రభుత్వ పథకాల కింద బలవర్ధక (ఫోర్టిఫైడ్) బియ్యాన్ని పంపిణీ చేసేందుకు ఇటీవల మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం పోషకాహార లోపంలేని భారతదేశం కోసం ప్రధానమంత్రి దార్శనికతను సాకారం చేయడంలో ఒక కీలకమైన మైలురాయిని సూచిస్తుంది.
బియ్యం ఫోర్టిఫికేషన్ విస్తరణ
ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకేవై)తో సహా అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద ఫోర్టిఫైడ్ బియ్యాన్ని సార్వత్రిక సరఫరాను జూలై 2024 నుంచి డిసెంబర్ 2028 వరకు పొడిగించాలని మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. బియ్యాన్ని ఫోర్టిఫై చేసే కార్యక్రమాన్ని డిసెంబర్ 31, 2028 వరకు కొనసాగించాలని, వివిధ ప్రభుత్వ పథకాల కింద బియ్యాన్ని ఫోర్టిఫై చేసే కార్యక్రమాన్ని 100 శతం కేంద్రం నిధులతో కేంద్ర కార్యక్రమంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఇనుము, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి 12 వంటి అవసరమైన సూక్ష్మపోషకాలతో సమృద్ధిగా ఉన్న బలవర్ధకమైన (ఫోర్టిఫైడ్) బియ్యాన్ని పంపిణీ చేయడం ద్వారా బలహీనంగా ఉన్న వారికి మెరుగైన పోషకాహారాన్ని అందించడం ఈ కార్యక్రమం లక్ష్యం. భారత ఆహార రక్షణ, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం ఈ బియ్యం పంపిణీ జరుగుతుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్లేషణ ప్రకారం, బియ్యం ఫోర్టిఫికేషన్ ఇనుము లోపం ముప్పును 35 శాతం తగ్గిస్తుంది. రూ.2,565 కోట్ల వార్షిక వ్యయంతో, ఈ కార్యక్రమం సంవత్సరానికి 1.66 కోట్ల మంది అంగవైకల్య జీవన సంవత్సరాలను నివారించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీని ఫలితంగా స్థూల జాతీయోత్పత్తి పరంగా రూ.49,800 కోట్లకు సమానమైన వైద్య వ్యయాలు ఆదా అవుతాయి. ప్రజా పంపిణీ వ్యవస్థపై ఈ బియ్యం కోసం చేసే ఖర్చు పౌరుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో విలువైన పెట్టుబడి అవుతుంది. 2020లో 15 రాష్ట్రాల్లో బియ్యం ఫోర్టిఫికేషన్ పైలట్ పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఈ కార్యక్రమం గణనీయమైన పురోగతి సాధించింది. 2019-20 – మార్చి 31, 2024 మధ్య, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సుమారు 406 లక్షల మెట్రిక్ టన్నుల బలవర్ధక బియ్యాన్ని పంపిణీ చేయడం ద్వారా దేశవ్యాప్తంగా కోట్ల మంది మందికి పోషకాహారాన్ని అందించారు. ప్రతి ప్రభుత్వ పథకంలో కస్టమ్-మిల్లింగ్ బియ్యం స్థానంలో ఫోర్టిఫైడ్ బియ్యం సరఫరా చేస్తున్నారు. 2024 మార్చినాటికి ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీలో 100 శాతం కవరేజీ సాధించారు.
ఫోర్టిఫికేషన్ అనేది పోషక విలువలను మెరుగుపరచడానికి విటమిన్లు, ఖనిజాలు వంటి అవసరమైన సూక్ష్మపోషకాలతో ఆహారాన్ని సుసంపన్నం చేసే ప్రక్రియ. జనాభాలో రక్తహీనత, సూక్ష్మపోషక ఆహార లోపాన్ని పరిష్కరించడానికి ప్రపంచవ్యాప్తంగా సురక్షితమైన, ప్రభావవంతమైన చర్యగా ఆహార ఫోర్టిఫికేషన్‌ను గుర్తించారు. 2008 ‘కోపెన్‌హాగన్ ఏకాభిప్రాయం’ ప్రకారం, అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆహార ఫోర్టిఫికేషన్ (బలవర్థకం చేయడం) అనేది మొదటి మూడు ప్రాధాన్యాల్లో ఒకటి. పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మనదేశంలో ఆహార ఫోర్టిఫికేషన్ గతంలో విజయవంతమైంది. ఉదాహరణకు, అయోడైజ్డ్ ఉప్పు అయోడిన్ లోపం, గాయిటర్ వంటి వ్యాధులను గణనీయంగా తగ్గించింది. 2019-2021 మధ్య నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్ హెచ్ఎస్-5) ప్రకారం, రక్తహీనత భారత్‌లో ప్రబలమైన సమస్యగా ఉంది. ఐరన్ లోపంతో పాటు, విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్ వంటి ఇతర విటమిన్-ఖనిజ లోపాలు కూడా ఉంటాయి. ఇవి జనాభా ఆరోగ్యాన్ని, ఉత్పాదకతను ప్రభావితం చేస్తాయి. ఈ సవాళ్లను అధిగమించేందుకు ప్రభుత్వం బలవర్థకమైన బియ్యం పంపిణీతో సహా ముఖ్యమైన చర్యలను చేపట్టింది. మనదేశంలో 65 శాతం జనాభాకు బియ్యం ప్రధాన ఆహరం. ఇది ముఖ్యమైన పోషకాలను అందించడానికి సరైన సాధనం. ఈ ప్రక్రియలో ఎఫ్ఎస్ఎస్ఏఐ నిర్దేశించిన ప్రమాణాలను అనుసరించి సాధారణ కస్టమ్-మిల్లింగ్ బియ్యానికి ఫోర్టిఫైడ్ (బి 12, ఐరన్, ఇతర ముఖ్య పోషకాలు చేర్చిన) బియ్యం గింజలను జోడిస్తారు. బియ్యం ఫోర్టిఫికేషన్ ద్వారా లక్షల మంది, ముఖ్యంగా పోషకాహార లోపం ఉన్నవారి పోషకాహార వినియోగాన్ని త్వరగా పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. బలవర్ధకమైన (ఫోర్టిఫైడ్) బియ్యాన్ని సరఫరా చేయడంతో పాటు, కేంద్ర ప్రభుత్వం వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలలో పోషకాహారాన్ని పెంచడానికి, దేశవ్యాప్తంగా ఆరోగ్యకరమైన జీవనాన్ని ప్రోత్సహించడానికి వివిధ పథకాలు, కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ కార్యక్రమాలు పోషకాహారలోపం వివిధ కోణాలపై దృష్టి సారించి, ప్రత్యక్షంగా అవసరమైన వారికి పోషకాహారాన్ని అందజేస్తాయి.
పోషకాహార పథకాలు
పోషన్ అభియాన్: 2018 నుంచి పిల్లలు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులకు పోషకాహార లభ్యతను పెంచేందుకు పోషన్ మాహ్ (ప్రధాన మంత్రి సంపూర్ణ పోషకాహార పథకం), పోషన్ పఖ్వాడా (పక్షోత్సవాలు) దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల లక్ష్యం పోషకాహారం, ఆరోగ్యకరమైన ఆహారం గురించి అవగాహన పెంచడం. పోషణ్ మాహ్-2024 ముఖ్యంగా పోషకాహారానికి సంబంధించిన కీలక అంశాలను నొక్కిచెప్పింది. ఆరోగ్యకరమైన ఆహారపు పద్ధతులను ప్రోత్సహించడం, ఆహార వైవిధ్యాన్ని మెరుగుపరచడం, స్థానికంగా లభించే పోషకాహారాల గురించి ప్రజలలో అవగాహన కల్పించడం కోసం 97.69 లక్షల కార్యకలాపాలు నిర్వహించారు.
ప్రధానమంత్రి మాతృ వందన యోజన: ఇది గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులకు ఆర్థిక సహాయం అందించే కేంద్ర ప్రాయోజిత పథకం. ఇది వేతన నష్టాన్ని భర్తీ చేయడం, గర్భధారణ సమయంలో సరైన పోషకాహారం, విశ్రాంతి అందేటట్లు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
సమీకృత బాలల సంక్షేమ కార్యక్రమం (ఐసీడీఎస్): అక్టోబర్ 2, 1975న ప్రారంభించిన ఈ సమగ్ర పథకంలో అంగన్‌వాడీ సేవలు, లబ్ధిదారులకు అనుబంధ పౌష్టికాహారాన్ని అందించడానికి కౌమార బాలికల కోసం పథకాలు ఉన్నాయి. అనుబంధ ఆహార కార్యక్రమాల ద్వారా పిల్లలు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులకు ఈ పథకం కింద తగిన పోషకాహారం అందేలా చూస్తారు.
పీఎం పోషణ శక్తి నిర్మాణ్: గతంలో దీన్ని మధ్యాహ్న భోజన పథకంగా పిలిచేవారు. ఈ కార్యక్రమం పాఠశాల పిల్లల పోషకాహార స్థితిని మెరుగుపరచడం, తద్వారా వారి శారీరక, మానసిక వికాసానికి తోడ్పాటు అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2021-22 నుంచి నుండి 2025-26 వరకు ఐదేళ్ల పాటు పాఠశాలల్లో జాతీయ పీఎం పోషణ పథకాన్ని కొనసాగించడానికి ఆమోదం తెలిపారు
ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన: కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభాల కారణంగా పేదలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించేందుకు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ప్రథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. సుమారు 81.35 కోట్ల మంది లబ్ధిదారులకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించడం ఈ కార్యక్రమం లక్ష్యం.
ఆరోగ్యకరమైన దేశాన్ని నిర్మించడంలో పోషకాహారం కీలక పాత్రను గుర్తిస్తూ బలవర్ధక బియ్యం కార్యక్రమాన్ని కొనసాగించాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం కోట్ల జనాభాలో పోషకాహార లోపాన్ని పరిష్కరించడంలో, వారి సంక్షేమాన్ని పెంపొందించడంలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలుస్తుంది. పోషకాహార లోపాన్ని అన్ని రకాలుగా అంతం చేసే ‘సుస్థిర అభివృద్ధి లక్ష్యం 2’ని సాధించడానికి భారత్ కృషి చేస్తున్నందున, పోషకాహార, రక్తహీనత సమస్యను పరిష్కరించడానికి ఫోర్టిఫైడ్ బియ్యం కార్యక్రమం అత్యంత ప్రభావవంతమైన కార్యక్రమాల్లో ఒకటి కాగలదు.