పునరుత్పాదక ఇంధనంలో ప్రపంచానికి మార్గదర్శి భారత్
ఆరోగ్యం, విద్య, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి విద్యుత్ శక్తి ఎంతో కీలకమని భారత ప్రభుత్వం గుర్తించింది. పునరుత్పాదక ఇంధన వనరులు అందుబాటు ధరల్లోకి రావడంతో, ప్రభుత్వం ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని దేశ ఇంధన ముఖచిత్రాన్ని మార్చేసింది. 2024లో రాజస్థాన్‌కు చెందిన నిర్మల్ దాస్ స్వామి అనే రైతు సౌరశక్తి వినియోగంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. తన భూమిలో ఒక మెగావాట్ సామర్థ్యం గల సోలార్ పార్కును ఏర్పాటు చేసి తన గ్రామానికే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా విద్యుత్ అందించగలుగుతున్నారు. నిరంతరాయమైన, చవకైన, స్వచ్ఛమైన ఇంధనం అందుబాటులోకి రావడంతో నిర్మల్ దాస్ ఆదాయం గణనీయంగా పెరిగింది. నిర్మల్ దాస్ కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు, ప్రస్తుతం భారత్‌లో సాగుతున్న ఒక భారీ మార్పునకు నిదర్శనం. పునరుత్పాదక ఇంధన రంగంలో ఆర్థిక లాభాలు మెరుగుపడటంతో, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే భారత్ ఈ రంగంలో వేగంగా దూసుకుపోతోంది. ఈ ఏడాది అమెరికా కంటే భారత్ తన గ్రిడ్‌కు అత్యధికంగా పునరుత్పాదక ఇంధనాన్ని అందించే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం దేశ మొత్తం విద్యుత్ స్థాపిత సామర్థ్యంలో శిలాజేతర ఇంధన వనరుల వాటా 50 శాతానికి చేరుకోవడం విశేషం. భారత్ సాధించిన ఈ విజయం వెనుక మూడు కీలక అంశాలు ఉన్నాయి: అందరికీ విద్యుత్ అందించడానికి ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యం, కొత్త ప్రయోగాలకు సిద్ధపడటం, ప్రభుత్వ-ప్రైవేట్-దాతృత్వ సంస్థల మధ్య బలమైన భాగస్వామ్యం.
- ఇంధన లభ్యతే అభివృద్ధికి మూలం: ఆరోగ్యం, విద్య, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడాలంటే విద్యుత్ సౌకర్యం అత్యావశ్యకమని ప్రభుత్వం బలంగా నమ్మింది. శిలాజ ఇంధనాల కంటే పునరుత్పాదక ఇంధనం చౌకగా మారడంతో ఆ అవకాశాన్ని ప్రభుత్వం అందిపుచ్చుకుంది. 2018 నాటికి ప్రతి గ్రామానికి విద్యుత్ అందించాలనే లక్ష్యాన్ని భారత్ చేరుకుంది. 2022 తర్వాత విద్యుత్ ఉత్పత్తి అత్యంత వేగంగా వృద్ధి చెందింది.
- ఆవిష్కరణలు, సత్వర అమలు: భారత్ కొత్త సాంకేతికతలను పరీక్షించడం, అమలు చేయడంలో ఎంతో సాహసోపేతంగా వ్యవహరిస్తోంది. ఉదాహరణకు, ‘పీఎం కుసుమ్’ పథకం ద్వారా రైతులు తమ భూములను సోలార్ ప్లాంట్ల కోసం వినియోగించుకునేలా ప్రోత్సహించింది. దీంతో పాటు రివర్స్ ఆక్షన్లు (పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిదారులు తక్కువ ధరలకు విద్యుత్ సరఫరా చేసేందుకు పోటీ పడటం), స్వదేశీ తయారీకి ప్రోత్సాహకాలు, శిలాజేతర ఇంధన వనరులకు ఊతమిచ్చే చర్యలు చేపట్టింది.
- వినూత్న భాగస్వామ్యాలు: 21వ శతాబ్దపు అభివృద్ధికి ప్రభుత్వ-ప్రైవేట్-దాతృత్వ భాగస్వామ్యాలు ఒక స్థిరమైన మార్గమని భారత్ నిరూపిస్తోంది. ఇవి ఏ ఒక్క రంగం ఒంటరిగా సాధించలేని వేగవంతమైన ఆవిష్కరణలను సాధ్యం చేస్తాయి. రాజస్థాన్ ప్రభుత్వంతో కలిసి గ్లోబల్ ఎనర్జీ అలయన్స్ (GEA) పనిచేస్తూ, రైతులు తమ భూములను సోలార్ ప్రాజెక్టుల కోసం లీజుకు ఇచ్చేలా డిజిటల్ సాధనాలను అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల రెండేళ్లలోనే అదనంగా 183 మెగావాట్ల సామర్థ్యం పెరగడమే కాకుండా, 14,000 వ్యవసాయ పంపుసెట్లను డీజిల్ నుంచి సోలార్‌కు మార్చడంలో రైతులకు వీలుకలిగింది.
అయితే 500 గిగావాట్ల శిలాజేతర విద్యుత్ సామర్థ్యాన్ని చేరుకోవాలనే లక్ష్యం ఇంకా దూరంగానే ఉంది. గ్రిడ్ నమ్మదగ్గదిగా ఉండటానికి బ్యాటరీ స్టోరేజ్ పెంచడం, డిజిటల్ పరిష్కారాలను వేగవంతం చేయడం ఇప్పుడు చాలా ముఖ్యం. ముంబై వాతావరణ వారోత్సవాలలో GEA ప్రారంభించిన ‘ఇండియా గ్రిడ్స్ ఆఫ్ ది ఫ్యూచర్ యాక్సిలరేటర్’ ద్వారా 30 కోట్ల భారతీయులకు స్వచ్ఛమైన విద్యుత్తును చేర్చడం, 15 విద్యుత్ సంస్థలను డిజిటలైజ్ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
అందరికీ చవకగా, సమృద్ధిగా విద్యుత్తును అందించాలనే భారత్ సంకల్పం ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియా-పసిఫిక్ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ప్రపంచ బ్యాంక్, ఆఫ్రికా అభివృద్ధి బ్యాంకు సంయుక్తంగా చేపట్టిన ‘మిషన్ 300’ దీనికి ఒక ఉదాహరణ. 2030 నాటికి సబ్-సహారా ఆఫ్రికాలోని 30 కోట్ల ప్రజలకు విద్యుత్ సౌకర్యం కల్పించడం దీని లక్ష్యం. ప్రైవేట్ రంగం, దాతృత్వ సంస్థలు స్వచ్ఛమైన ఇంధనంపై ఆసక్తి చూపుతున్న తరుణంలో, భవిష్యత్తులో మరిన్ని బలమైన కూటములు ఏర్పడి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మరింత మంది ప్రజలను భాగస్వామ్యం చేసే అవకాశం ఉంది.
రాజీవ్ జె షా,
రాకె ఫెల్లర్ ఫౌండేషన్ అధ్యక్షుడు

