Telangana Raitu

రైతుల గోడు పట్టించుకోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం

Telagnana Farmerrరైతులకు ఎన్నెన్నో చేస్తామంటూ హామీల వర్షం కురిపించి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీల అమలుకు గడువుగా ప్రకటించిన 100 రోజులు పూర్తయినా అమలు గురించి పట్టించుకోవడం లేదు. సాగు నీరు లేక, పెట్టుబడులకు అవసరమైన రుణ సదుపాయం లభించక అల్లాడుతున్న రైతులను పలకరించి, కనీసం భరోసా ఇచ్చే ప్రయత్నం కూడా చేయడం లేదు. అధికారం చేపట్టగానే మొదటగా రైతు భరోసా నిధులు డిసెంబర్ 9 నాటికి జమ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మొహం చాటేస్తున్నారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా వర్తింప చేస్తామని హామీలిచ్చిన మంత్రులు ఇప్పుడు ఆ మాట ఎత్తడం లేదు. కనీసం అందుకు మార్గదర్శక సూత్రాలు కూడా రూపొందించే ప్రయత్నం చేయడం లేదు.

సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు హైదరాబాద్ లో గ్రూప్ రాజకీయాలలో, ఇతర పార్టీల వారిని మచ్చిక చేసుకోవడంలో మునిగిపోయి గ్రామాల్లో పర్యటించి రైతుల సమస్యలను పపరిష్కరించాల్సింది పోయి, కనీసం వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేయడం లేదు. గోదావరి నదిలో నీళ్లు ఉన్నప్పటికీ ప్రభుత్వం రైతులకు అందించలేక చేతులెత్తిసిన్నట్లు కనిపిస్తున్నది. ఆరు గ్యారంటీల్లో రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదు. డిసెంబర్ 9న రూ.2 లక్షల మాఫీ చేస్తామని హామీ ఇచ్చి వంద రోజులు దాటినా నెరవేర్చలేదు. రైతుబంధు కింద రూ.15 వేలు ఇస్తామని మోసం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు గణాంకాలు వెల్లడి చేస్తున్నాయి.

కాంగ్రెస్ వచ్చాక నీళ్లు లేవు, కరెంటు లేదు. మోటార్లు కాలిపోతున్నయి. ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోతున్నయి. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. వడగండ్ల వానలో లక్షలాది ఎకరాల్లో పంటనష్టం జరిగింది. అయినా ముఖ్యమంత్రి, మంత్రులు రైతులను పరామర్శించిన పాపాన పోవడం లేదు. కాంగ్రెస్ హామీ ప్రకారం వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చి కొనాల్సి ఉంది. ఆ మాట ఎత్తడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా వడగండ్ల వానలు రైతులకు కడగండ్లు మిగిల్చాయి. కరువు ఒక వైపు, అకాల వర్షాలు మరో వైపు అన్నదాతలను కోలుకోలేని దెబ్బతీశాయి. పంటలు కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతులకు భరోసా ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం విషయంలో పరిహాసమాడుతున్నది. కేవలం అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు మాత్రమే పరిహారం ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు పంట నష్టం సర్వే చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసింది. కానీ నీళ్లు లేక ఎండిపోయిన పంటలపై మాత్రం ప్రభుత్వం ఇప్పటి వరకు నోరు మెదపలేదు. వర్షాలతో దెబ్బతింటేనే పంట నష్టమా? నీళ్లు లేక పంటలు ఎండిపోతే నష్టం కాదా? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఎండిన పంటల సాగుకు పెట్టుబడి పెట్టలేదా? అని నిలదీస్తున్నారు.

ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వడగండ్ల వానతో సుమారు 50 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. క్షేత్రస్థాయిలో అధికారులు సర్వే చేసిన తరువాత వాస్తవ నష్టంపై స్పష్టత వస్తుంది. అయితే రాష్ట్రంలో వడగండ్లతో జరిగిన నష్టం కంటే కాంగ్రెస్‌ తెచ్చిన కరువు కాటే ఎక్కువగా ఉన్నది. సాగునీరు కరువై పంటలు ఎండిపోయి రైతులకు తీరని నష్టం జరిగింది. ఈ యాసంగిలో 66 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో సుమారు 30 శాతం పంటలు సాగునీరు లేక ఎండిపోతున్నట్టు అంచనాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 15 లక్షల ఎకరాల్లో వరి పంట ఎండిపోయినట్లు సమాచారం. వచ్చే నెల రోజుల్లో మరో 5 -10 లక్షల ఎకరాల్లో వరి పంట ఎండిపోయే ప్రమాదం ఉంది. అంటే ఈ ఒక్క సీజన్‌లోనే ఒక్క వరి పంటనే 20-25 లక్షల ఎకరాల్లో ఎండిపోతుండడం గమనార్హం. ఈ విధంగా వర్షాలతో తక్కువ నష్టం జరిగితే సాగునీళ్లు లేక ఎండిన పంటలతో రైతులకు భారీ నష్టం వాటిల్లింది. కరువుతో పోల్చుకుంటే వర్షాలతో జరిగిన నష్టం చాలా తక్కువే. కాంగ్రెస్‌ మంత్రులు కరువు రైతులను గాలికొదిలి.. వడగండ్ల బాధిత రైతులను ఆదుకుంటామంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. దీనిపై పంటలు ఎండిపోయిన రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రవీణ్