Modi

రాజకీయ స్థిరత్వం, సంస్కరణలు భారత్‌పై నమ్మకాన్ని పెంచాయి

Modi Standingలస పాలన వల్ల పారిశ్రామిక విప్లవం సమయంలో వెనుకబడ్డామని, కానీ డేటా ఆధారిత విప్లవంలో భారత్ నాయకత్వ పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. 140 కోట్ల జనాభా ఉన్న భారత్ ప్రపంచంలోనే అత్యధికంగా డేటాను ఉత్పత్తి చేస్తుందని, అందుకే డేటాను సురక్షితంగా ఉపయోగించుకోవడానికి ‘డిజిటల్ వ్యక్తిగత సమాచార రక్షణ’ చట్టాన్ని తెచ్చామన్నారు. ప్రపంచంలోని డేటా అంతా భారత్‌లో ఉండాలని, ఇందుకోసం ప్రపంచ స్థాయి డేటా మౌలిక సదుపాయాలను భారత్‌లో నిర్మిస్తున్నామన్నారు. సైనిక దళాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత 11 ఏళ్లుగా రక్షణ రంగం ఆధునికీకరణ, స్వావలంబన దిశగా పని చేస్తున్నామన్నారు. ఆపరేషన్ సిందూర్ లో సైన్యం ప్రదర్శించిన పరాక్రమం పట్ల దేశం గర్విస్తోందన్నారు. పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో నరేంద్ర మోదీ భారత్ ఇటీవల కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రభుత్వం ఇస్తున్న బలమైన మద్దతు, తయారీ రంగం వృద్ధిపై దృష్టి వంటి పలు అంశాల గురించి మాట్లాడారు. మౌలిక సదుపాయాలు, మూలధన వ్యయంపై బడ్జెట్‌లో ఇచ్చిన ప్రోత్సాహాన్ని ఆయన నొక్కి చెబుతూ, ఇది ‘వికసిత భారత్ 2047’ కోసం రూపొందించిన దీర్ఘకాలిక ప్రణాళిక అని అభివర్ణించారు. ఉద్యోగాల సృష్టి, అంతర్జాతీయంగా పోటీతత్వాన్ని పెంచడం, ఆర్థిక వృద్ధిని కొనసాగించడమే దీని లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

ప్రశ్న: గత నెల రోజులుగా అంతర్జాతీయ స్థాయిలో భారత వాణిజ్య ఒప్పందాలు వేగవంతమయ్యాయి. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ (EU)తో కుదిరిన ఒప్పందాలు, అమెరికాతో సుంకాల విషయంలో లభించిన పురోగతి ప్రధానమైనవి. ఇవి భారతదేశ ఆర్థిక వృద్ధి పథాన్ని ఎలా మారుస్తాయి?

జ: గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో భారత్ భాగస్వామ్యం, అనుసంధానత గణనీయంగా పెరిగాయి. ఈ వాణిజ్య ఒప్పందాలు ఇటీవలే జరిగినట్లు అనిపించినా, ఇవి మన దేశీయ పరిశ్రమల పోటీతత్వం, మన ఆత్మవిశ్వాసం, మన దృక్పథం ఫలితమే. నేటి ప్రపంచంలో ఇవి చాలా అరుదైన లక్షణాలు. ఇటీవలి విజయాల గురించి మాట్లాడే ముందు, దశాబ్దం క్రితం మనం ఎక్కడ ఉన్నామో గుర్తు చేసుకోవడం ముఖ్యం. యూపీఏ హయాంలో కొన్ని వాణిజ్య ఒప్పందాల కోసం ప్రయత్నాలు జరిగాయి. కానీ, ఆ ప్రయాణం అనిశ్చితితో కూడుకున్నది. వారి అస్తవ్యస్త ఆర్థిక విధానాల వల్ల భారత్ ఆత్మవిశ్వాసంతో చర్చలు జరిపే స్థితిలో లేదు. చర్చలు మొదలయ్యేవి, కానీ మధ్యలోనే ఆగిపోయేవి. చివరికి సుదీర్ఘ చర్చల తర్వాత కూడా పెద్దగా సాధించిందేమీ లేదు.

మేం అధికారంలోకి వచ్చిన తర్వాత, విధానపరమైన పాలన ద్వారా ఆర్థిక పునరుజ్జీవనం సాధించాం. ఆర్థిక పునాదులను పటిష్టం చేసి, నిబంధనలతో కూడిన వ్యవస్థను రూపొందించాం. రాజకీయ స్థిరత్వం, స్పష్టమైన విధానాలు, సంస్కరణల దిశగా మా అడుగులు చూసి ప్రపంచం భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. మా సంస్కరణలు తయారీ, సేవా రంగాలకు తోడ్పడటమే కాకుండా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (MSME) లో ఉత్పాదకతను, పోటీతత్వాన్ని పెంచాయి. యూరోపియన్ యూనియన్‌తో వాణిజ్య ఒప్పందాన్నే తీసుకోండి; గత ప్రభుత్వం హయాంలోనూ దీనిపై చర్చలు జరిగాయి, కానీ మా ప్రభుత్వం మాత్రమే ఇరుపక్షాలకు ప్రయోజనం చేకూర్చేలా దీనిని కుదుర్చుకోగలిగింది. గత కొన్నేళ్లలో మేG 38 భాగస్వామ్య దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నాం. ఇది భారత వాణిజ్య చరిత్రలో అపూర్వమైన మైలురాయి. ఈ ఒప్పందాల వల్ల మన వస్తువులకు ప్రపంచవ్యాప్తంగా భారీ మార్కెట్ లభిస్తోంది. ఉదాహరణకు, బ్రిటన్, యూరోపియన్ యూనియన్‌లతో కుదిరిన ఒప్పందాల వల్ల మన ఎగుమతుల్లో 99% వస్తువులపై సుంకాలు ఉండవు. ఆస్ట్రేలియా, యూఏఈలతో వాణిజ్యం ఇప్పటికే రెట్టింపు అయింది.

మన సేవా రంగం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఈ ఒప్పందాలు మన యువతకు, నిపుణులకు విదేశాల్లో మరిన్ని అవకాశాలు కల్పిస్తాయి. తయారీ రంగంలో భారత్ అంతర్జాతీయ సరఫరా గొలుసు (వ్యవస్థ)లో అంతర్భాగంగా మారుతోంది. ఇది కేవలం గణాంకాల కోసం కాదు, మన దేశంలో వస్త్రాలు, చెప్పులు, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్ రంగాలలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు దోహదపడుతుంది.

ప్ర: ఇటీవలి వాణిజ్య ఒప్పందాల్లో MSMEలకు ప్రాధాన్యం పెరిగింది. ఇది భారతీయ చిన్న పరిశ్రమల ఎగుమతి సామర్థ్యం పెరగడానికి సంకేతమా? లేక వారిని ప్రపంచ సరఫరా వ్యవస్థలో చేర్చాలనే ప్రభుత్వ వ్యూహమా?

జ: మేం ఈ ఒప్పందాలను ఆత్మవిశ్వాసంతో, సమాన స్థాయిలో ఉండి చేసుకుంటున్నాం. ‘మేక్ ఇన్ ఇండియా’ దార్శనికత మన MSMEలలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మా ‘జీరో డిఫెక్ట్, జీరో ఎఫెక్ట్’ (నాణ్యమైన, పర్యావరణ హితమైన వస్తువులు) నినాదం స్టార్టప్‌లకు, చిన్న వ్యాపారులకు బాగా చేరువైంది. వ్యాపార పోటీతత్వం అంటే కేవలం సుంకాలు తగ్గించడం మాత్రమే కాదు; అది సాంకేతికత, నాణ్యత, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండటం. మన ఒప్పందాలు వస్త్రాలు, తోలు, ఆహార శుద్ధి వంటి రంగాల్లో MSMEలకు ప్రపంచ మార్కెట్లను చేరువ చేస్తున్నాయి. MSMEలు కేవలం చిన్న సరఫరాదారులుగా మిగిలిపోకూడదు, అవి అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సంస్థలుగా ఎదగాలి.

స్మార్ట్‌ఫోన్ల నుంచి విమానాల తయారీ వరకు అనేక అంతర్జాతీయ బ్రాండ్లు నేడు భారతీయ MSMEలతో జతకడుతున్నాయి. ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికా వంటి దేశాలతో కుదిరిన ఒప్పందాల వల్ల మన చిన్న పరిశ్రమలకు సున్నా సుంకాలతో ఎగుమతి చేసే అవకాశం లభిస్తోంది. ఇది కేవలం వాణిజ్యాన్ని పెంచడమే కాదు, మన యువతను అంతర్జాతీయ స్థాయిలో పాత్ర పోషించేవారుగా మారుస్తోంది. మరోవైపు, దేశీయంగా కూడా MSMEలను బలోపేతం చేస్తున్నాం. ఈ ఏడాది బడ్జెట్‌లో వీరికి సులభంగా రుణాలు అందించేందుకు క్రెడిట్ గ్యారెంటీ కవరేజీని పెంచాం. బ్యాంకింగ్ వ్యవస్థలో MSME రుణాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇవన్నీ వికసిత భారత్ 2047 దిశగా మేం వేస్తున్న స్పష్టమైన అడుగులు.

ప్ర: ప్రభుత్వం 2026-27 కేంద్ర బడ్జెట్‌లో మూలధన వ్యయం (కాపెక్స్)పై భారీగా దృష్టి సారించింది. ఈ ఏడాది బడ్జెట్‌లో మీరు తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలేమిటి?

జ: చాలా కాలంగా నాణ్యమైన మౌలిక సదుపాయాల కొరత దేశాభివృద్ధికి అడ్డంకిగా ఉంది. వికసిత భారత్ కావాలనుకునే దేశంలో శిథిలావస్థలో ఉన్న మౌలిక సదుపాయాలకు చోటు లేదు. అందుకే గత దశాబ్ద కాలంలో మేం ఈ రంగాన్ని విప్లవాత్మకంగా మార్చాం.

  • ఒకవైపు వేల సంఖ్యలో విమానాలకు ఆర్డర్లు ఇస్తూ, మరోవైపు విమానాశ్రయాల సంఖ్యను రెట్టింపు చేశాం.
  • నగరాల్లో మెట్రో సేవలు నాలుగు రెట్లు పెరిగాయి.
  • గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్, రోడ్ల నెట్‌వర్క్ వేగంగా విస్తరిస్తోంది.

వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2026-27) మూలధన వ్యయం రూ.12.2 లక్షల కోట్లుగా ఉంది. 2013తో పోలిస్తే ఇది 5 రెట్లు అధికం. మేం స్వల్పకాలిక ప్రజాకర్షక పథకాల కంటే, ఉత్పాదకతను పెంచే ఆస్తులపై పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నాం. రైల్వే రంగానికి దాదాపు రూ.3 లక్షల కోట్లు కేటాయించాం. ప్రధాన నగరాలను అనుసంధానిస్తూ ఏడు కొత్త హై-స్పీడ్ రైలు కారిడార్లను ప్రతిపాదించాం. ఇందులో భాగంగా వచ్చే ‘దక్షిణ హై-స్పీడ్ డైమండ్ కారిడార్’ వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు భారీ ప్రయోజనం చేకూరుతుంది. జాతీయ రహదారుల కేటాయింపులు కూడా గత దశాబ్దంతో పోలిస్తే 500% పెరిగాయి. కేవలం ఇవే కాకుండా, సెమీకండక్టర్ మిషన్, బయో-ఫార్మా శక్తి వంటి భవిష్యత్ రంగాల్లోనూ మేం పెట్టుబడులు పెడుతున్నాం. ప్రజలపై భారం తగ్గించేలా ‘విశ్వాస ఆధారిత పాలన’ కింద నిబంధనలను సరళతరం చేస్తున్నాం.

ప్ర: ఈ ఏడాది బడ్జెట్ కేవలం ఒక జమాఖర్చుల పత్రంలా కాకుండా, భారత భవిష్యత్తుకు ఒక ‘దార్శనికత పత్రం’లా ఉంది. ఇప్పుడు ఈ దూకుడుకు కారణం ఏమిటి?

జ: మా ఏ బడ్జెట్ కూడా కేవలం ఒక ‘జమాఖర్చుల పత్రం’ కాదు. అది మా పనితీరు కాదు. గత 25 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా, ప్రధానిగా నేను చేస్తున్న పనిని గమనిస్తే, మా వ్యూహాల్లో నిరంతరత కనిపిస్తుంది. మేం ఒక సమన్వయం లేకుండా పని చేయం; దేశం మొత్తాన్ని దృష్టిలో పెట్టుకుని దీర్ఘకాలిక ప్రణాళికతో అడుగులు వేస్తాం. 2014 నుంచి ప్రతి బడ్జెట్ ఒక లక్ష్యంతో, ఒక ప్రణాళికతో వస్తోంది. గత పాలకులు విస్మరించిన లోపాలను సరిదిద్దాం, సంస్కరణలు చేపట్టాం, పేదలను సాధికారీకరించాం. ‘సంస్కరణల ఎక్స్‌ప్రెస్’ ఇప్పుడు తదుపరి స్థాయికి చేరుకుంది. కొన్నేళ్ల క్రితం ఎర్రకోట మీద నుంచి నేను అన్నాను- ‘యహీ సమయ్ హై, సహీ సమయ్ హై’ (ఇదే సమయం, సరైన సమయం). నేడు అది దేశ ప్రజలందరి సంకల్పంగా మారింది. ప్రపంచం సంక్షోభంలో ఉన్నా భారత్ ఆశాకిరణంలా మెరుస్తోంది. కరోనా అనంతర ప్రపంచంలో భారత్‌కు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. మన యువత అంతరిక్షం నుండి స్టార్టప్‌ల వరకు సంచలనాలు సృష్టిస్తున్నారు. ఇది కేవలం 2026 బడ్జెట్ మాత్రమే కాదు; ఇది 21వ శతాబ్దపు రెండో పావు శతాబ్దపు తొలి బడ్జెట్. 1920లలో తీసుకున్న నిర్ణయాలు 1947లో స్వాతంత్ర్యానికి పునాది ఎలా వేశాయో, ఇప్పుడు మేం తీసుకుంటున్న నిర్ణయాలు 2047 నాటి ‘వికసిత భారత్’కు పునాది వేస్తాయి.

ప్ర: ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, రక్షణ, బయో-ఫార్మా వంటి తయారీ రంగాలపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టింది. తయారీ రంగం ద్వారానే ఉద్యోగాల సృష్టి, ఆర్థిక వృద్ధి సాధ్యమని మీరు ఎందుకు భావిస్తున్నారు?

జ: ఏ దేశమైనా కేవలం వినియోగదారుగా ఉంటే వృద్ధి సాధించలేదు; నాణ్యమైన వస్తువులను ఉత్పత్తి చేసే దేశంగా మారాలి. అందుకే ‘మేక్ ఇన్ ఇండియా’, పీఎల్ఐ (ఉత్పత్తి-ఆధారిత ప్రోత్సాహకాల) పథకాలు ప్రవేశపెట్టాం. దశాబ్దం క్రితం మనం మొబైల్ ఫోన్లను దిగుమతి చేసుకునేవాళ్లం, నేడు ప్రపంచంలో రెండో అతిపెద్ద మొబైల్ తయారీదారుగా ఎదిగాం. రక్షణ రంగం ఎగుమతులు పెరుగుతున్నాయి. బొమ్మల ఎగుమతులు కూడా గత పదేళ్లలో ఎంతో వృద్ధి చెందాయి. తయారీ రంగం వల్ల అన్ని వర్గాల వారికి ఉద్యోగాలు లభిస్తాయి. స్టార్టప్ విప్లవం కేవలం ఐటీకే పరిమితం కాలేదు, తయారీ రంగంలోనూ వేల సంఖ్యలో స్టార్టప్‌లు వస్తున్నాయి. బడ్జెట్ 2026లో సెమీకండక్టర్లు, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ (అరుదైన ఖనిజాలు) వంటి వ్యూహాత్మక రంగాలకు ప్రాధాన్యం ఇచ్చాం. అయితే ఇక్కడ ప్రైవేట్ రంగానికి నాదొక విన్నపం. ప్రభుత్వం అనుకూలమైన విధానాలను మాత్రమే రూపొందించగలదు. కంపెనీలు పరిశోధన, అభివృద్ధి, కొత్త సాంకేతికతపై పెట్టుబడి పెట్టాలి. నాణ్యతతో ప్రపంచంతో పోటీ పడాలి. అలాగే వృద్ధి ఫలాలు కార్మికులకు కూడా అందాలి. దేశాభివృద్ధిలో ప్రైవేట్ రంగం భాగస్వామ్యం అత్యంత కీలకం.

ప్ర: ఐటీ రంగం, డేటా సెంటర్లకు పన్ను రాయితీలు ప్రకటించారు. ఇది భారత్‌ను సాంకేతిక దిగ్గజంగా, ఏఐ అగ్రగామిగా మార్చడానికి ఎలా సహాయపడుతుంది?

జ: పారిశ్రామిక విప్లవం సమయంలో వలస పాలన వల్ల మనం వెనుకబడ్డాం. కానీ ఈ డేటా ఆధారిత విప్లవంలో మనం నాయకత్వ పాత్ర పోషించాలి. డిజిటల్ చెల్లింపుల రంగంలో భారత్ సాధించిన విజయం మనకు తెలుసు. 140 కోట్ల జనాభా ఉన్న భారత్, ప్రపంచంలోనే అత్యధికంగా డేటాను ఉత్పత్తి చేసే దేశం. ఈ డేటాను సురక్షితంగా ఉపయోగించుకోవడానికి మేం ‘డిజిటల్ వ్యక్తిగత సమాచార రక్షణ’ చట్టాన్ని తెచ్చాం. కృత్రిమ మేధ (AI) అభివృద్ధికి కంప్యూటింగ్ పవర్, డేటా సెంటర్లు చాలా అవసరం. బడ్జెట్ రాయితీల ద్వారా ప్రపంచ స్థాయి డేటా మౌలిక సదుపాయాలను భారత్‌లో నిర్మిస్తున్నాం. ప్రపంచంలోని డేటా అంతా భారత్‌లో ఉండాలని మేం ఆకాంక్షిస్తున్నాం. దీనివల్ల మన యువతకు లక్షల కొత్త ఉద్యోగాలు లభిస్తాయి.

ప్రశ్న: బడ్జెట్‌లో రక్షణ రంగ కేటాయింపులు భారీగా పెరిగాయి. ఇది ఆపరేషన్ సిందూర్ ఫలితమేనా? పొరుగు దేశాలపై అపనమ్మకం ఇంకా కొనసాగుతోందా? పాకిస్థాన్‌తో మరో యుద్ధం వచ్చే ప్రమాదం ఎంతవరకు ఉంది?

జ: ఈ ఏడాది బడ్జెట్‌లో రక్షణ రంగానికి రికార్డు స్థాయిలో 7.85 లక్షల కోట్ల రూపాయలను కేటాయించాం. ఇది గత బడ్జెట్ కంటే 15 శాతం ఎక్కువ మాత్రమే కాకుండా, ఏ ఇతర మంత్రిత్వ శాఖకు కేటాయించనంత భారీ మొత్తం. వివరాల్లోకి వెళ్తే, ఆధునికీకరణ కోసం రూ.1.85 లక్షల కోట్లు కేటాయించాం, ఇది గతేడాది కంటే 25 శాతం ఎక్కువ. త్రివిధ సాయుధ దళాల మూలధన వ్యయం కోసం సుమారు రూ.2.2 లక్షల కోట్లు కేటాయించగా, అందులో 75 శాతాన్ని స్వదేశీ రక్షణ పరిశ్రమల నుంచే కొనుగోలు చేయడానికి కేటాయించాం. దీనివల్ల భద్రత పెరగడమే కాకుండా ఉద్యోగాల సృష్టి జరుగుతుంది, మన పారిశ్రామిక పునాది బలపడుతుంది. గత దశాబ్ద కాలంలో రక్షణ ఎగుమతులు 35 రెట్లు పెరిగి రూ.23,000 కోట్లకు చేరడం మా కృషికి నిదర్శనం. మాజీ సైనికుల సంక్షేమం పట్ల కూడా మేం అంతే కట్టుబడి ఉన్నాం, అందుకే వారి ఆరోగ్య పథకం కోసం రూ.12,000 కోట్లు కేటాయించాం, ఇది 45 శాతం పెరుగుదల.

మా ప్రభుత్వం మొదటి రోజు నుంచే సైనిక దళాలను బలోపేతం చేయడానికి కట్టుబడి ఉంది. గత పాలకులు రక్షణ రంగాన్ని తమ జేబులు నింపుకోవడానికే వాడారు, అందుకు ఆ కాలంలోని కుంభకోణాలే సాక్ష్యం. కానీ మేం ఒకే ర్యాంకు, ఒకే పెన్షన్ వంటి దశాబ్దాల నాటి డిమాండ్లను తీర్చాం. సాంకేతికత మారుతున్న తరుణంలో, మన దళాలకు భారతీయ ఆవిష్కరణల అండ ఉండాలి. గత 11 ఏళ్లుగా మేం ఆధునికీకరణ, స్వావలంబన దిశగా పని చేస్తున్నాం. ఇక ఆపరేషన్ సిందూర్ విషయానికి వస్తే, మన సైన్యం ప్రదర్శించిన పరాక్రమం పట్ల దేశం గర్విస్తోంది. ఆ సమయంలో మనం చేపట్టిన సంస్కరణల ఫలితాలు స్పష్టంగా కనిపించాయి. కాబట్టి రక్షణ బడ్జెట్ లేదా ఆధునికీకరణ అనేది నిరంతర ప్రక్రియే తప్ప, ఏదో ఒక నిర్దిష్ట ఘటనతో ముడిపడి ఉన్నది కాదు. దేశం ఎల్లప్పుడూ బలంగా, అప్రమత్తంగా ఉండాలన్నదే మా లక్ష్యం.

ప్ర: భారత సంస్కరణల ఎక్స్‌ప్రెస్‌ వేగంగా సాగుతోంది. ఈ పురోగతి పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారా? ఇది సామాన్యుడికి ఎలా ఉపయోగపడింది? వచ్చే దశాబ్దానికి మీరు ప్రాధాన్యమిచ్చే మూడు ఆర్థిక సంస్కరణలు ఏమిటి?

జ: పురోగతి పట్ల నేను ఎప్పుడూ పూర్తిగా సంతృప్తి చెందను. ప్రజలకు మరింత మెరుగ్గా సేవ చేయాలనే ‘నిర్మాణాత్మక అసంతృప్తి’ ప్రజా జీవితంలో అవసరమని నేను నమ్ముతాను. అయితే, మా ‘సంస్కరణల ఎక్స్‌ప్రెస్’ సాధించిన పురోగతిని తక్కువ అంచనా వేయలేం. మేం కేవలం చిన్న మార్పులు చేయలేదు, వ్యవస్థాగత పరివర్తనను తీసుకొచ్చాం. జీఎస్టీ సంస్కరణ వల్ల గృహస్తులు, MSMEలపై భారం తగ్గింది. బీమా రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అనుమతించడం వల్ల మధ్యతరగతికి మెరుగైన ప్రత్యామ్నాయాలు దొరికాయి. గతంలో లేని విధంగా నైపుణ్యాభివృద్ధి, మత్స్యశాఖ, సహకార శాఖ వంటి ప్రత్యేక మంత్రిత్వ శాఖలను ఏర్పాటు చేసి ఆయా రంగాలను బలోపేతం చేశాం. యూపీఐ ద్వారా భారత్ నేడు డిజిటల్ రంగంలో ప్రపంచానికే మార్గదర్శిగా నిలిచింది. యువత కోసం స్టార్టప్ వ్యవస్థను అభివృద్ధి చేశాం, తద్వారా వారు తమ ఆలోచనలను సులభంగా వ్యాపారాలుగా మార్చుకోగలుగుతున్నారు. MSMEల కోసం పెట్టుబడి పరిమితులను పెంచి, ప్రపంచ విలువ వ్యవస్థలో వారిని భాగస్వాములను చేశాం. ముఖ్యంగా దళారీ వ్యవస్థను అరికట్టడం ద్వారా సామాన్యుడికి నేరుగా ప్రయోజనం చేకూరుతోంది. 

ప్ర: వికసిత భారత్ దార్శనికతలో మహిళలు కేంద్ర బిందువుగా ఉండాలని మీరు తరచుగా చెబుతుంటారు. ఈ బడ్జెట్ మహిళల భాగస్వామ్యాన్ని ఎలా పెంచుతుంది?

జ: మహిళల సంక్షేమమే మా ప్రభుత్వ ప్రతి నిర్ణయానికి దిక్సూచి. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి ఆమె ఆకాంక్షలు నెరవేరేవరకు ప్రతి దశలోనూ బేటీ బచావో బేటీ పఢావో, ముద్ర, పీఎం ఆవాస్ యోజన వంటి పథకాలు అండగా ఉంటున్నాయి. మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 9వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టడం దేశంలోని కోట్ల మంది మహిళలకు స్ఫూర్తిదాయకం. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా పారిశ్రామికులను ప్రోత్సహించడానికి ఈ బడ్జెట్‌లో వినూత్న ఆర్థిక నమూనాలను ప్రకటించాం. మహిళలకు మార్కెట్ ప్రవేశం, ఉత్పత్తి వ్యవస్థలో భాగస్వామ్యం ఉన్నప్పుడు వారు ఆర్థికంగా మరింత ఎదుగుతారు. లఖ్‌పతీ దీదీలు, స్వయం సహాయక బృందాల ద్వారా ఇప్పటికే కోట్లమంది మహిళలు స్వయం సమృద్ధి సాధించారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ (స్టెమ్) రంగాల్లో భారతీయ మహిళలు అద్భుతాలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంత ఆడపిల్లలకు ఉన్నత చదువుల్లో వసతి ఒక పెద్ద అడ్డంకిగా ఉంది, అందుకే ప్రతి జిల్లాలో ‘స్టెమ్ హాస్టళ్ల’ను ఏర్పాటు చేస్తున్నాం. దీనివల్ల సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేయలేక చదువు మానేసే పరిస్థితి తప్పుతుంది. అలాగే ‘సంరక్షణ ఆర్థిక వ్యవస్థ’ను క్రమబద్ధీకరించడానికి వచ్చే ఏడాది 1.5 లక్షల మంది సంరక్షణ సిబ్బందికి శిక్షణ ఇస్తున్నాం. ఇది మహిళలకు గౌరవప్రదమైన ఉపాధిని కల్పిస్తుంది. కొత్త తరం రంగాలైన యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి స్కూళ్లు, కాలేజీల్లో ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నాం. వికసిత భారత్ నిర్మాణంలో మహిళలే అత్యంత కీలక పాత్ర పోషిస్తారని నా గట్టి నమ్మకం.