India Defence

రక్షణకు భారీగా నిధుల పెంపు

క్షణ రంగానికి బడ్జెట్ కేటాయింపులను కేంద్రం భారీగా పెంచింది. పాకిస్థాన్, చైనాలతో భద్రతా సవాళ్లు కొనసాగుతున్న తరుణంలో సైనిక పోరాట సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఈ చర్యను చేపట్టింది. 2026-27 బడ్జెట్లో రక్షణ రంగానికి రూ.7,84,678 కోట్లు కేటాయించింది. గత ఏడాది కేటాయింపుల (రూ.6.81 లక్షల కోట్ల)తో పోలిస్తే ఇది 15 శాతం అధికం. ఈ దఫా ప్రధానంగా ఆధునికీకరణకు పెద్దపీట వేశారు. మొత్తం బడ్జెట్ లో రక్షణ వాటా 14.67 శాతం. 

  • మొత్తం కేటాయింపుల్లో రూ.2,19,306 కోట్లను మూలధన వ్యయం కింద కేటాయించారు. ఈ సొమ్మును కొత్త ఆయుధాలు, యుద్ధవిమానాలు, యుద్ధనౌకలు, ఇతర సైనిక సాధన సంపత్తి కొనుగోలుకు వినియోగిస్తారు. గత ఏడాది బడ్జెట్‌లో ఈ పద్దు కింద రూ.1.80లక్షల కోట్లను కేటాయించగా సవరించిన అంచనాలను రూ.1,86,454 కోట్లకు పెంచారు. 2025-26 బడ్జెట్‌ అంచనాలతో పోలిస్తే తాజాగా కేటాయించిన మూలధన వ్యయం 21.84% అధికం.
  • మూలధన వ్యయం కింద విమానాలు, ఏరో ఇంజిన్ల కొనుగోలుకు రూ.63,733 కోట్లు కేటాయించారు. నౌకాదళ ఆధునికీకరణ అవసరాల కోసం రూ.25,023 కోట్లు ప్రత్యేకించారు. 
  • రెవెన్యూ వ్యయం కింద రూ.5,53,668 కోట్లను కేటాయించారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 17.24 శాతం అధికం. దళాల రోజువారీ కార్యకలాపాలు, వేతనాలు, ఇంధనం, రేషన్, ఆయుధాల నిర్వహణ, మందుగుండు వంటి అవసరాలకు ఈ సొమ్మును వెచ్చిస్తారు. ఇందులోనే పింఛన్ల కోసం రూ.1,71,338 కోట్లను కేటాయించారు.
  • మూలధన వ్యయ కేటాయింపుల్లో 75 శాతాన్ని (రూ.1.39 లక్షల కోట్లు) దేశీయ పరిశ్రమల నుంచి చేసే కొనుగోళ్లకు మాత్రమే వెచ్చించాలని నిర్ణయించారు.
  • పౌర, శిక్షణ, ఇతర అవసరాలకు ఉపయోగించే విమానాల తయారీకి అవసరమైన భాగాల దిగుమతులను బేసిక్‌ కస్టమ్స్‌ సుంకం నుంచి మినహాయించారు. అలాగే రక్షణ రంగంలో నిర్వహణ, మరమ్మతుల అవసరాలకు ఉపయోగపడే విమాన భాగాల తయారీకి దిగుమతి చేసుకునే ముడిపదార్థాల పైన ఈ సుంకాన్ని తొలగించారు. ఈ నిర్ణయాల వల్ల రక్షణ ఏరోస్పేస్‌ రంగానికి ఊతం లభిస్తుంది.
  • సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు సరిహద్దు రహదారి సంస్థ (BRO)కు రూ.7,394 కోట్లు కేటాయించారు.
  • రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO)కు గత బడ్జెట్‌లో రూ.26,816.82 కోట్లు కేటాయించగా.. ఈ దఫా దాన్ని రూ.29,100 కోట్లకు పెంచారు. ఇందులో రూ.17,250.25 కోట్లను మూలధన వ్యయం కోసం ప్రత్యేకించారు.
  • మాజీ సైనికోద్యోగుల కంట్రిబ్యూటరీ ఆరోగ్య పథకానికి గత ఏడాదితో పోలిస్తే 45.49 శాతం పెంచి, రూ.12,100 కోట్లను కేటాయించారు.