Dr K Laxman

విజయ సంకల్ప యాత్రతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు

Dr K Laxman

రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బిజెపి నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్ర పెనుమార్పులు తీసుకొస్తుందని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ కే.లక్ష్మణ్ చెప్పారు. ఫిబ్రవరి 23న బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ రాష్ట్రంలో బిజెపి నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్రకు పార్టీలకు అతీతంగా మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలుకుతున్నారని వివరించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వేరువేరు పార్టీలకు ఓటేసినప్పటికీ ప్రజలు రానున్న పార్లమెంటు ఎన్నికల్లో మోదీ కోసం మేమున్నామంటూ కదులుతున్నారని.. రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాలు బిజెపికే వస్తున్నాయని ధీమా వ్యక్తం చేశారు. యాత్ర సాగుతున్న ప్రతి పల్లెలోని ప్రజలు దివ్యమైన రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేసిన మోదీకే మా మద్దతని స్పష్టంగా చెబుతున్నారన్నారు. విజయ సంకల్పయాత్ర పొడుగునా.. తెలంగాణ ప్రజలు ఆప్ కీ బార్… చార్ సౌ పార్ అంటూ… ఫిర్ ఏక్ బార్ అంటే మోదీ సర్కార్ అంటూ బదులిస్తున్నారంటూ ఆనందం వ్యక్తం చేశారు.

తెలంగాణ వ్యాప్తంగా బిజెపి విజయ సంకల్ప యాత్రకు ప్రజల నుండి మంచి స్పందన వస్తోంది. నాలుగు క్లస్టర్లలలో ఆరు పార్లమెంట్ల పరిధిలో 45శాసనసభ నియోజకవర్గాలలో యాత్ర సాగిందని వివరించారు. మోదీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మోదీ సుపరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ విజయ సంకల్ప యాత్ర దోహదపడుందని ఆశాభావం వక్తం చేశారు. బాల రాముడి విగ్రహ ప్రతిష్టలో కాంగ్రెస్ నాయకులు పాల్గొనకపోవడంతో గ్రామాల్లోని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. దేశ ప్రధానమంత్రిగా, 140కోట్ల ప్రజల ప్రతినిధిగా నిష్టతో నరేంద్ర మోదీ పూజలో పాల్గొంటే ప్రతిపక్ష పార్టీలు రాజకీయం చేయడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నా ప్రతిపక్షాలకు బుద్ధి రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేండ్ల నరేంద్ర మోదీ పాలనలో అభివృద్ధి కనిపిస్తోందన్నారు. గ్రామ పంచాయతీలకు కేంద్రం నిధులిస్తున్నట్లు సర్పంచులు చెప్పడం మోదీ పాలనకు గీటురాయి వంటిదన్నారు. ఈ విజయ సంకల్ప యాత్ర రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొని రావడం ఖాయమన్నారు

గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి చిట్టా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న విధానాలను విజయ సంకల్ప యాత్రలో ప్రజలకు వివరిస్తూ వారిని జాగృతం చేస్తున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్, బిజెపి పొత్తు పెట్టుకుంటున్నాయిన పనిలేని కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేయించడంపై డాక్టర్ కే.లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇలానే ప్రజలను దృష్టి మళ్లించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని.. విజయ సంకల్ప యాత్రలో ప్రజల నుండి వస్తున్న స్పందన చూసి ఓర్వలేకనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో వారి ఆటలు సాగబోవన్నారు.

కాంగ్రెస్ అంటేనే అవినీతి, కుంభకోణాలు, వంశపారపర్య రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు, మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు, హిందువుల మనోభావాలను దెబ్బతీసే రాజకీయాలు పాల్పడడం తప్ప వేరే ఏం లేదని తీవ్రంగా దుయ్యబట్టారు. గ్యారంటీలను అమలు చేయడం చేతకాని రేవంత్ ప్రభుత్వం ..పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తినే ఆరు గ్యారెంటీలు అమలుకు సాధ్యమవుతుందని అనడం దివాళాకోరు తనానికి నిదర్శనమన్నారు. ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారాన్ని ప్రజలు గమనిస్తున్నారని డాక్టర్ కే.లక్ష్మణ్ ఎద్దేవా చేశారు.

తలాతోక లేని కుటుంబ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, అవినీతిలో పేరుకపోయిన పార్టీలు, బెయిల్ మీద బయట తిరుగుతున్న నాయకులందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడి మోదీని మూడోసారి ప్రధానిగా కాకుండా నిలువరించాలని కుట్ర పన్నుతున్నా… ప్రజల ఆశీస్సులతో అధిగమించడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ తో కలిసి తెలంగాణలో మోదీ గెలుపు ఆపాలని కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తున్నా.. విజయ సంకల్ప యాత్ర రథ చక్రాల కింద బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నలిగి పోతాయని జోస్యం చెప్పారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి దోపిడిని బయట పెడ్తామని ఎన్నికల సమయంలో ప్రస్తావించిన కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని కాపాడే ప్రయత్నాలు చేయడం దగాకోరుతనానికి పాల్పడున్నారని విమర్శలు గుప్పించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు, దళితులకు ఇచ్చిన భూములు లాగేసుకొని ప్రాజెక్టుల పేరు మీద పెట్టుబడుదారుల చేతిలో పెట్టిందని, వాటి మీద కాంగ్రెస్ స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. చేవెళ్ల పార్లమెంటులోని సీతారామపూర్ గ్రామంలోని 1,110 ఎకరాల దేవాలయ భూమిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యాపారవేత్తలకు అప్పనంగా అప్పజెప్పిందని, రాముడి భూములను కూడా కాపాడడం లేదని అక్కడి ప్రజలు వాపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఊసెత్తడం లేదన్నారు. భారతీయ జనతా పార్టీ తరుఫున రాబోవు రోజుల్లో దేవాలయ భూముల మీద ఉద్యమం చేస్తామని డాక్టర్ కె. లక్ష్మణ్ హెచ్చరించారు.