రజాకార్ల సానుభూతిపరులు మన శత్రువులే
ఇప్పటికీ రజాకార్లకు సానుభూతి చూపించే వారు కొందరు ఉన్నారని, వారు మనకు పెద్ద శత్రువని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆ ఆలోచనను, ఆ విధానాన్ని, ఆ మానసికతను భారతదేశం నుండి పూర్తిగా తొలగించేవరకు మనం దృఢ సంకల్పంతో నిలబడాలన్నారు. భారతీయ ఐక్యత, సమగ్రత కంటే గొప్ప విలువ మరేదీ లేదని చెప్పారు. 1948లో రజాకార్ల కుట్ర విఫలమైనట్లే… నేడు పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదం, ఆ దేశపు ఏజెంట్లూ విఫలమయ్యారన్నారు. ఆపరేషన్ సిందూర్‌తో భారత్ మరోసారి తగిన సమాధానమిచ్చిందని తెలిపారు. ఐక్యత, సాంస్కృతిక వైవిధ్యమే మన గొప్ప బలమని మరోసారి నిరూపించామని రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన అధికార తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో రాజ్‌నాథ్ సింగ్ ముఖ్యఅతిథిగా పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగరేశారు. ఈ సందర్భంగా సైనిక దళాల వందనం స్వీకరించారు. జూబ్లీ బస్ స్టేషన్ సమీపంలోని కంటోన్మెంట్ పార్క్‌లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు. హైదరాబాద్ విమోచన దినోత్సవ ఛాయాచిత్ర ప్రదర్శననూ తిలకించారు. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బొగ్గు-గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బలమైన, దృఢ నిశ్చయంతో కూడిన నవ భారత్ చర్చల ప్రక్రియను విశ్వసిస్తుందన్నారు. శాంతి, సద్భావన భాషను అర్థం చేసుకోలేని వారికి తగిన సమాధానం ఎలా ఇవ్వాలో కూడా నవ భారత్‌కు తెలుసునని ఆయన స్పష్టం చేశారు. “ఆపరేషన్ సిందూర్, 2016 సర్జికల్ స్ట్రయిక్స్, 2019 బాలకోట్ వైమానిక దాడులు భారత్ సహనమో, బలహీనతో కాదు… అతిపెద్ద బలమని రుజువు చేస్తున్నాయి. చర్చలు ఎటువంటి పరిష్కారాన్నీ ఇవ్వనప్పుడు మనం శక్తితో కూడిన కఠినమైన మార్గాన్ని ఎంచుకుంటాం” అని అన్నారు. పహల్గాంలో అమాయక పౌరులను మతం ఆధారంగా ఉగ్రవాదులు చంపితే.. వారి కర్మ సిద్ధాంతాన్ని అనుసరిస్తూ వారు భారత సాయుధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో హతమయ్యారనీ.. పాకిస్తాన్, పీఓకేలోని వారి ఆవాసాలు పూర్తిగా నాశనమయ్యాయని తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతంగా అమలు చేసిన సాయుధ దళాల శౌర్యం, అంకితభావాన్ని ప్రశంసిస్తూ.. ఈ ఆపరేషన్‌ను తాత్కాలికంగానే నిలిపివేశామన్నారు. సరిహద్దు అవతల నుంచి మళ్లీ ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగితే పూర్తిస్థాయిలో దాడి తిరిగి ప్రారంభమవుతుందని రాజ్‌నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో కాల్పుల విరమణపై మూడో పక్షం జోక్యాన్ని భారత్ తిరస్కరించిందనీ.. భారత అంతర్గత విషయాల్లో మూడో పక్షం ఏదీ జోక్యం చేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.
ఉత్తర, దక్షిణ భారతదేశాన్ని ఏకం చేయడంలో ‘ఉక్కు మనిషి’గా సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషిని రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. హైదరాబాద్ విమోచన దినోత్సవం.. ప్రధానమంత్రి మోదీ పుట్టినరోజు సెప్టెంబర్ 17నే జరుపుకొంటున్నామని గుర్తుచేసిన రాజ్‌నాథ్ సింగ్… “సర్దార్ పటేల్ లాగే మన ప్రధానమంత్రి దేశాన్ని సాంస్కృతికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు.” అని వ్యాఖ్యానించారు. దేశాన్ని తిరుగులేని శక్తిగా మార్చిన ఘనత ప్రధానమంత్రికే చెందుతుందని.. త్వరలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. “నేటి భారత్ ఎవరి ఆదేశాలూ తీసుకోదు… తన సొంత నిర్ణయాలతోనే ముందుకు సాగుతుంది” అని ఆయన తెలిపారు.
నిజాం కుట్రలను భగ్నం చేసిన పటేల్
“నిజాం పాలనలో రజాకార్లు అనేక దారుణాలు చేశారు. రజాకార్ల ఆగడాలు తట్టుకోలేక ప్రజలు తిరగబడ్డారు. నిజాం, రజాకార్ల కుటిల ప్రయత్నాలను సర్దార్ వల్లభాయ్ పటేల్ భగ్నం చేశారు. 17 సెప్టెంబర్ 1948 ఆపరేషన్ పోలో విజయవంతమైన రోజు మన దేశ ఐక్యతకు చిహ్నంగా నిలిచింది. ఆపరేషన్ పోలో దేశ చరిత్రలో గొప్ప ఘట్టం. సర్దార్ వల్లభాయ్ పటేల్ సమర్థత వల్ల హైదరాబాద్ సంస్థానం భారత్ లో కలిసింది. సర్దార్ పటేల్ ముందు నిజాం తన ఓటమిని ఒప్పుకున్నాడు. పరాజయం అనంతరం నిజాం భారతదేశంలో అంతర్భాగం కావాల్సి వచ్చింది, ఐక్యరాజ్యసమితిలో చేసిన వినతులను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది, చివరికి ప్రజాస్వామ్య వ్యవస్థను అంగీకరించాల్సి వచ్చింది. సర్దార్ పటేల్ చివరి క్షణం వరకు శాంతి మార్గాన్ని అన్వేషించారు, తప్పని పరిస్థితుల్లో ప్రజలకు రక్షణ కల్పించడానికి పోలీసు చర్యకు వెళ్ళాల్సి వచ్చింది. నిజాం ప్రపంచంలో అత్యంత ధనవంతులలో ఒకరు. తన ధనబలంతో భారత్‌ను తనకిందకు తిప్పుకోవాలని భ్రమించాడు. కానీ ధనం, గర్వం ఎప్పుడూ దేశ ఐక్యత, సంకల్పం కన్నా పెద్దది కాదు.” అని అన్నారు. ఆపరేషన్ పోలోలో పాల్గొన్న సైనికుల ధైర్యాన్ని రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. ఈ ఆపరేషన్ కేవలం సైనిక చర్య కాదన్నారు. సర్దార్ పటేల్ నిర్ణయాత్మక వ్యూహంతో రజాకార్ల కుట్రలను బద్దలు కొట్టి హైదరాబాద్‌ను తిరిగి భారత్‌లో విలీనం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ఆపరేషన్ పోలో విజయం.. భారత్‌లో హైదరాబాద్ విలీనం.. జాతి ఐక్యతను కాపాడుకోవడంలో భారత్ ఎల్లప్పుడూ సమర్థంగా, శక్తిమంతంగా ఉందని ప్రపంచానికి నిరూపించిన అద్భుతమైన అధ్యాయంగా రక్షణ మంత్రి అభివర్ణించారు.
చరిత్రను తొక్కిపెట్టిన కాంగ్రెస్, బీఆర్ఎస్ : కిషన్ రెడ్డి
ఈ కార్యక్రమంలో జి. కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ.. “భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడే నిజాం రాజ్యం భారతదేశంతో కలవకుండా స్వతంత్రంగా ఉండాలని ఐక్యరాజ్య సమితికి అనేక ఉత్తరాలు రాశారు. పాకిస్తాన్‌తో కలవడం కోసం కూడా చర్చలు జరిపారు. నిజాం ప్రైవేట్ ఆర్మీ అయిన ఎంఐఎం పార్టీకి సంబంధించిన రజాకారులు గ్రామాల మీద దాడులు చేసి దోచుకోవడం, గ్రామీణ ప్రజలపై అనేక రకాలుగా దౌర్జన్యాలు చేయడం, వేలాది మందిని హత్య చేయడం వంటి దురాగతాలకు పాల్పడ్డారు. హిందూ మహిళలను వివస్త్రలు చేసి బతుకమ్మలాడించిన ఘటనలు కూడా జరిగాయి. అటువంటి దౌర్జన్యకాండ జరుగుతున్నప్పుడు1948 సెప్టెంబర్ 17న సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో భారత సైన్యం హైదరాబాద్ సంస్థానం మీద యుద్ధం ప్రకటించారు. విజయవాడ, నాగపూర్, బాంబే నుండి మూడు దిక్కుల నుంచి ట్యాంకుల మీద సైన్యం వచ్చి ప్రజల రక్షణ కోసం నిజాం సైనికులు, రజాకార్లతో పోరాడింది. ఇక్కడ స్వేచ్ఛ, స్వాతంత్రం కల్పించారు. మూడు రంగుల జెండాను ఎగురవేశారు. అటువంటి చరిత్రను కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకులు ఈ తరానికి తెలియకుండా దుర్మార్గంగా తొక్కిపెట్టారు. మనకు స్వాతంత్ర్యం వచ్చిన రోజు పాఠ్యాంశాల్లో లేకపోవడం దారుణం. మన తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు, మూడు రంగుల జెండా ఎగిరిన రోజును ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా అణిచివేస్తూ, చరిత్రను దాచిపెడుతున్నాయో ప్రజలందరూ ఆలోచించాలి.
హైదరాబాద్ సంస్థానంలోని కొన్ని జిల్లాలు కర్ణాటకలో, కొన్ని జిల్లాలు మహారాష్ట్రలో కలిశాయి. అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా హైదరాబాద్ ముక్తి దివస్ పేరుతో అధికారిక వేడుకలు నిర్వహిస్తున్నాయి. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ ముక్తి దివస్ ను ఎందుకు అధికారికంగా నిర్వహించడం లేదు? ఎందుకు పేర్లు మార్చి తెలంగాణ ప్రజల పోరాటాన్ని, స్వాతంత్రం కోసం సమర్పించిన అమరవీరుల త్యాగాలను, ఫలితాలను, ఆకాంక్షలను అవమానిస్తున్నారు? ఎంఐఎం పార్టీకి భయపడి ఇన్ని సంవత్సరాలుగా ఈ చరిత్రను, త్యాగాలను, బలిదానాలను, వాస్తవాలను కొన్ని పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వం తొక్కిపెడుతున్నాయి. ఓట్ల కోసమే తెలంగాణ చరిత్రను వక్రీకరించి అనేక రకాలుగా పేర్లు పెడుతున్నారు. అందుకే ఈరోజు కేంద్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను నిర్వహించుకుంటున్నాం. మూడు సంవత్సరాల తర్వాత బిజెపి తెలంగాణలోనూ అధికారంలోకి వచ్చాక గ్రామ గ్రామాన రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విముక్తి ఉత్సవాలు నిర్వహిస్తాం.
విమోచన పేరు మార్చడం దారుణం : బండి సంజయ్ కుమార్
బండి సంజయ్ కుమార్ ప్రసంగిస్తూ.. భారత్ లో తెలంగాణ విలీనం కాకుండా ఉంటే మన పరిస్థితి ఎట్లుండేదో ఒక్క క్షణం ఆలోచించాలని అన్నారు. మరో పాకిస్తాన్, మరో శ్రీలంక, మరో బంగ్లాదేశ్ లా మారి ఆకలి కేకలతో కల్లోల దేశంగా తెలంగాణ మారేదని ఆందోళన వ్యక్తం చేశారు. సర్దార్ వల్లభాయి పటేల్ లేకపోతే తెలంగాణకు విముక్తి కలిగేది కాదని చెప్పారు. ఇంతటి చరిత్ర కలిగినందునే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. భారత ప్రభుత్వం గెజిట్ ప్రకటించినందున జనవరి 26, పంద్రాగస్టు మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ విమోచన ఉత్సవాలు’ పేరుతో అధికారికంగా నిర్వహంచాలని కోరారు. తెలంగాణ ప్రజా పాలన పేరుతో ఉత్సవాలు నిర్వహించడం సరికాదని, దానికంటే తెలంగాణ ప్రజా వంచక పాలన దినోత్సవం పేరుతో కార్యక్రమాలు నిర్వహించుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు.
“భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం లభిస్తే…. 399 రోజుల తరువాత మనకు స్వాతంత్ర్యం వచ్చింది. నిజాం నిరంకుశ పాలనలో రజాకార్ల రాక్షస పాలనలో ప్రజలు పడ్డ కష్టాలను గుర్తు చేసుకుంటే ప్రజల నెత్తురు పొంగుతుంది. భర్తలను కట్టేసి వాళ్ల కళ్ళముందే భార్యలను, బిడ్డలను మానభంగాలు చేసి హింసించారు. నగ్నంగా మహిళలతో బతుకమ్మ ఆడించారు. హిందువుల ఇండ్లల్లో పడి దోచుకుతిన్నరు. తెలుగు చదివే అవకాశమే లేకుండా చేశారు. ఉర్దూను బలవంతంగా రుద్దారు. బలవంతపు మతమార్పిళ్లు చేశారు. మతం మారకపోతే పన్నుల మీద పన్నుల వేసి ప్రజలను పీక్కుతిన్నారు. పరకాలలో జాతీయ జెండాను ఎగరేశారనే సాకుతో 1500 మందిని జలియన్ వాలాబాగ్ తరహాలో కాల్చి చంపారు. జలియన్ వాలాబాగ్ ఘటనను ప్రపంచం ముందుంచిన చరిత్ర కారులు… అంతకు మించి పరకాల దురాగతాన్ని, వీర బైరాన్‌పల్లి, గుండ్రాంపల్లి, వెయ్యి ఊడల మర్రి ఘటనల్లో రజాకార్ల సాగించిన రాక్షసత్వాన్ని మాత్రం విస్మరించడం దారుణమైన విషయం. నాటి బలిదానాలకు, పోరాటాలను భావితరాలకు చెప్పి త్యాగధనులకు సరైన గుర్తింపు నివ్వాలనే ఉద్దేశంతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాలతో ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ అధికారికంగా జరుపుకుంటున్నాం. గొప్ప చరిత్ర కలిగిన తెలంగాణ విమోచన దినాన్ని రాష్ట్ర పాలకులు పేరు మార్చి కార్యాలయాలకే పరిమితం చేయడం దారుణం. తెలంగాణ పోరాట యోధుల త్యాగాలను, బలిదానాలను అవమానించడమే. తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో అధికారికంగా ఉత్సవాలు నిర్వహిస్తే వచ్చే ఇబ్బంది ఏమిటో ప్రజలకు సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని గల్లీగల్లీలో అధికారికంగా నిర్వహిస్తాం.” అని బండి సంజయ్ కుమార్ అన్నారు.

