సైన్యం ఆధునికీకరణలో స్వదేశీకరణ కీలకం
ఆపరేషన్ సిందూర్ ‘ప్రతిస్పందించే’ స్థితి నుండి ‘ముందస్తు లేదా నివారణ చర్యలు’ తీసుకునే దిశగా వచ్చిన మార్పు అని సైన్యాధ్యక్షుడు జనరల్ ఉపేంద్ర ద్వివేది స్పష్టం చేశారు. ముప్పు తీవ్రతరం అయ్యే వరకు వేచి చూడకుండా, దాని మూలాల్లోనే తుంచివేస్తామన్నారు. 2047 నాటికి భారత సైన్యాన్ని ఆధునిక, క్రియాశీల, సాంకేతికతతో కూడిన స్వయం సమృద్ధి గల శక్తిగా మార్చడమే లక్ష్యమన్నారు. యుద్ధరంగంలో తుపాకీ గుళ్ల కంటే వేగంగా తప్పుడు కథనాలు ప్రచారమవుతాయని, అందుకే వ్యూహాత్మక కమ్యూనికేషన్, సైబర్ రక్షణ, నెట్‌వర్క్ భద్రతకు సంబంధించిన శిక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఆపరేషన్ సిందూర్, చైనాతో సరిహద్దు సంబంధాలు, సైన్యం ఆధునికీకరణ, ఆధునిక యుద్ధతంత్రంలో అత్యాధునిక సాంకేతికత అవసరాలు వంటి పలు కీలక అంశాలపై సైన్యాధ్యక్షుడు జనరల్ ఉపేంద్ర ద్వివేది ఒక జాతీయ వార పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు:
ప్ర: ప్రస్తుతం ‘కొత్త సాధారణ స్థితి’, ‘సిందూర్ 2.0’ సాధ్యాసాధ్యాలపై పెద్దయెత్తున చర్చ జరుగుతోంది. దీనిపై మీ స్పందన?
జ: ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత వ్యూహం ఎంత స్పష్టంగా, ఆత్మవిశ్వాసంతో పరిణామం చెందిందో ‘ఆపరేషన్ సిందూర్’ వెల్లడిస్తుంది. ప్రజలు మాట్లాడుకునే ‘కొత్త సాధారణ స్థితి’ లేదా ‘సిందూర్ 2.0’ ను సైన్యం కేవలం ఒక నినాదంగా కాక దేశ సాయుధ దళాల సంకల్పానికి ఒక వ్యూహాత్మక సంకేతంగా పరిగణిస్తుంది. ఉగ్రవాదంపై భారత్ స్పందన నివారణాత్మకంగా, నిర్ణయాత్మకంగా, సమగ్రంగా ఉంటుందని ఇది సూచిస్తుంది. అయితే ఈ ప్రక్రియలో అనవసర ఉద్రిక్తతలకు తావులేకుండా కేవలం లక్ష్యంపైనే దృష్టి పెడతాం.
ప్ర: ఈ కొత్త వ్యూహంలో ప్రధానాంశాలు ఏవి?
జ: ఈ విధానం మూడు దృఢమైన సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. మొదటిది ఉగ్రవాదాన్ని ఎంతమాత్రం సహించకపోవడం. రెండోది, చర్చలు, ఉగ్రవాదం కలిసి సాగవు. మూడోది, ఏ రకమైన ఉగ్రవాద చర్యనైనా యుద్ధ చర్యగానే పరిగణించడం. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులకు, వారికి మద్దతు ఇచ్చే వారికి మధ్య సైన్యం ఎలాంటి వ్యత్యాసాన్ని చూపదు. ఆపరేషన్ సిందూర్ ‘ప్రతిస్పందించే’ స్థితి నుండి ‘ముందస్తు లేదా నివారణ చర్యలు’ తీసుకునే దిశగా వచ్చిన మార్పు. ముప్పు తీవ్రతరం అయ్యే వరకు వేచి చూడకుండా, దాని మూలాల్లోనే తుంచివేస్తాం. మా స్పందనలు కేవలం బెదిరింపులకు లోబడి ఉండవు.
ప్ర: ఉత్తర సరిహద్దుల్లో (చైనా సరిహద్దు) పరిస్థితి ఇంకా సున్నితంగానే ఉంది. అక్కడ సైనిక సంసిద్ధతను, ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
జ: పరిస్థితి స్థిరంగా ఉన్నప్పటికీ నిరంతర నిఘా అవసరం. 2024-2025లో ద్వైపాక్షిక సంబంధాల్లో గణనీయమైన సానుకూలత కనిపించింది. క్షేత్రస్థాయి కమాండర్ల మధ్య చర్చలు పెరిగాయి. పరస్పర ఆందోళనల పట్ల ఇరుపక్షాలు సున్నితంగా స్పందిస్తున్నాయి. సైన్యాల ఉపసంహరణ ప్రక్రియ వల్ల క్షేత్రస్థాయిలో స్థిరత్వం మెరుగుపడింది. 2025లో దౌత్య, సైనిక మార్గాల ద్వారా పెరిగిన సంబంధాలు ఉద్రిక్తతలను తగ్గించి, నమ్మకాన్ని పెంచాయి. సరిహద్దు నిర్ణయం కోసం నిపుణుల బృందం ఏర్పాటు, కైలాస మానస సరోవర యాత్ర పునరుద్ధరణ, ప్రత్యక్ష విమాన సర్వీసులు, మూడు సరిహద్దు పాయింట్ల ద్వారా వాణిజ్యం , వీసా సడలింపు వంటివి సానుకూల సంకేతాలు.
ప్ర: మరి సైన్యం స్థాయిలో ఉద్రిక్తతల సడలింపు దిశలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
జ: రెండు పక్షాల మధ్య నిరంతర సంప్రదింపులు జరుగుతున్నాయి. ఏటా క్షేత్రస్థాయిలో 1,100 కంటే ఎక్కువ సార్లు ఇరుపక్షాల మధ్య చర్చలు జరుగుతాయి. దీనివల్ల సరిహద్దుల్లో పశువుల మేత, మతపరమైన కార్యకలాపాలకు ఆటంకం కలగడం లేదు. మా భవిష్యత్తు ప్రణాళిక స్పష్టంగా ఉంది: శాంతిని కాపాడటం, సైనిక చర్చల ద్వారా స్థానిక సమస్యలను పరిష్కరించుకోవడం, ముప్పులను తిప్పికొట్టడానికి పటిష్టమైన మోహరింపును కొనసాగించడం. దీనికి సమాంతరంగా మౌలిక సదుపాయాల కల్పనపై కూడా దృష్టి పెట్టాం.
ప్ర: ఈశాన్య సరిహద్దుల్లో శాంతి కోసం ఏం చేస్తున్నారు?
జ: బంగ్లాదేశ్, మయన్మార్‌లతో భారత్‌కు సహకార సంబంధాలు ఉన్నాయి. మయన్మార్‌లో 2021 నుంచి అంతర్గత భద్రతా సమస్యలు ఉన్నాయి, ఇది మన 1,643 కి.మీ సరిహద్దుపై ప్రభావం చూపుతుంది. ఇక బంగ్లాదేశ్‌తో మనకు 4,096 కి.మీ సరిహద్దు ఉంది. అక్కడ ప్రస్తుతం నెలకొన్న రాజకీయ అనిశ్చితిని, అంతర్గత భద్రతను ఇతర విభాగాలతో కలిసి సైన్యం నిశితంగా గమనిస్తోంది. నిరంతర కమ్యూనికేషన్, ఉమ్మడి విన్యాసాల ద్వారా ఆయా దేశాల సైన్యాలతో సమన్వయం చేసుకుంటున్నాం.
ప్ర: సైన్యం 2023-2032ను ‘పరివర్తన దశాబ్దం’గా, రక్షణ శాఖ 2025ను ‘సంస్కరణల ఏడాది’గా ప్రకటించాయి. వీటి ఉద్దేశం ఏమిటి?
జ: 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలంటే ‘సురక్షిత భారత్’ ప్రాథమిక అవసరం. 2047 నాటికి భారత సైన్యాన్ని ఆధునిక, క్రియాశీల, సాంకేతికతతో కూడిన స్వయం సమృద్ధి గల శక్తిగా మార్చడమే మా లక్ష్యం. ఈ దీర్ఘకాలిక ప్రణాళికలో ‘పరివర్తనా దశాబ్దం’ వేగవంతమైన మార్పులను సూచిస్తుంది. దీని తరువాత 2033 నుంచి 2037 వరకు సంఘటితం కావడం, 2038 నుండి 2047 వరకు నాణ్యతను మెరుగుపరచడంపై దృష్టిపెడతాం. ఈ పదేళ్లలో త్రివిధ దళాల ఏకీకరణ, బలగాల నిర్మాణం, ఆధునికీకరణ, వ్యవస్థలలో సంస్కరణ, మానవ వనరుల నిర్వహణ అనే ఐదు స్తంభాలపై దృష్టి పెట్టాం. రక్షణ శాఖ 2025 ను ‘సంస్కరణల ఏడాది’గా ప్రకటించడం దీనికి మరింత ఊపునిచ్చింది.
ప్ర: ఈ పరివర్తనలో భాగంగా వచ్చిన మార్పులను వివరిస్తారా?
జ: గత రెండేళ్లలో ‘సాంకేతికతను ప్రవేశపెట్టడం’ నుంచి ‘సాంకేతికతను జీర్ణించుకోవడం’ వైపు మళ్ళాం. అందుకే 2024-25ను ‘సాంకేతికత అమలు సంవత్సరాలు’గా ప్రకటించాం. డ్రోన్లు, సెన్సార్లు, ఏఐ సాధనాలు వంటి వాటిని నేరుగా ఆపరేషన్లలో భాగం చేస్తున్నాం. దీనికోసం ‘రుద్ర’ బ్రిగేడ్లు, ‘భైరవ్’ బెటాలియన్లు, ‘శక్తిబాన్’ రెజిమెంట్లు వంటి కొత్త విభాగాలను ఏర్పాటు చేశాం. 2026–27 సంవత్సరాలను ‘నెట్‌వర్కింగ్, డేటా సెంట్రిసిటీ (సమాచార-ఆధారిత ప్రక్రియల)’ సంవత్సరాలుగా పరిగణిస్తున్నాం. డేటాను ఒక వ్యూహాత్మక వనరుగా భావిస్తున్నాం. ఏఐ ఆధారిత నిర్ణయాత్మక వ్యవస్థల ద్వారా శత్రువును గుర్తించి, నాశనం చేసే దశలను, సమయాన్ని తగ్గించడమే మా లక్ష్యం. అలాగే సైనిక నెట్‌వర్క్‌లను మరింత సురక్షితంగా చేస్తాం.
ఆధునీకరణకు స్వదేశీకరణ అత్యంత కీలకం. ప్రాథమికంగా స్వదేశీ ఆయుధ వ్యవస్థలపై ఆధారపడుతూనే సైన్యం తనను తాను మార్చుకోగలదు. అదే సమయంలో తక్షణ అవసరాలను, సాంకేతిక సార్వభౌమాధికారం, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి వంటి దీర్ఘకాలిక లక్ష్యాలతో మనం సమతుల్యం చేసుకోవాలి. ఇది ఒక దశలవారీ ప్రక్రియ. ఆత్మనిర్భరత ఒక అనివార్యం. దీనిని సాధించడానికి విద్యాసంస్థలు, పరిశ్రమలు, సైన్యం ఈ మూడు విభాగాల మధ్య సన్నిహిత సహకారం అవసరం. విద్యాసంస్థలు ఆవిష్కరణలను, ప్రాథమిక పరిశోధనలను ప్రోత్సహిస్తే, పరిశ్రమలు ఆ ఆవిష్కరణలను ఉపయోగించుకోగల ఉత్పత్తులుగా మారుస్తాయి. ఇక సైన్యం వీటిని ఉపయోగించి నిగ్గు తెలుస్తుంది. ఈ మూడు అంశాల కలయికతో స్వదేశీకరణ అనేది తిరుగులేని యుద్ధరంగ సామర్థ్యంగా మారుతుందని నేను కచ్చితంగా నమ్ముతున్నాను.
ప్ర: ఉక్రెయిన్, పశ్చిమ ఆసియా యుద్ధాల నుంచి మనం నేర్చుకున్న పాఠాలేమిటి?
జ: ఆ యుద్ధాలను మేం నిశితంగా గమనించాం. అవి మా ప్రాథమిక సిద్ధాంతాలను మార్చలేదు కానీ త్రివిధ దళాల సమన్వయం, సాంకేతికత ప్రాధాన్యతను పునరుద్ఘాటించాయి. యుద్ధంలో కేవలం ఆయుధాల కంటే వ్యవస్థల సమన్వయం ముఖ్యమని అర్థమైంది. డ్రోన్లు, ఎలక్ట్రానిక్ యుద్ధతంత్రం పెరిగిన నేపథ్యంలో భూతల దళాలకు గగనతలంపై నియంత్రణ అవసరమని గుర్తించి మా శిక్షణను తదనుగుణంగా మార్చాం.
ప్ర: యుద్ధ సమయంలో సమాచార యుద్ధం ఎంత కీలకమని మీరు భావిస్తున్నారు?
ప్ర: సమాచార యుద్ధం చాలా శక్తిమంతమైనది. యుద్ధరంగంలో తుపాకీ గుళ్ల కంటే వేగంగా తప్పుడు కథనాలు ప్రచారమవుతాయి. అందుకే వ్యూహాత్మక కమ్యూనికేషన్, సైబర్ రక్షణ, నెట్‌వర్క్ భద్రతకు మా శిక్షణలో ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నాం. క్లుప్తంగా చెప్పాలంటే ప్రతి యుద్ధభూమి నుంచి పాఠాలు నేర్చుకుంటూ భారత సైన్యం వేగంగా మారుతోంది.

