సీనియర్ సిటిజన్లకు ఆయుష్మాన్ భారత్ ప్రారంభం
మూడోసారి అధికారంలోకి రాగానే 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరినీ ఆయుష్మాన్ పరిధిలోకి తీసుకువస్తామన్న ఎన్నికల హామీని మోదీ ప్రభుత్వం నెరవేర్చింది. దేశంలోని 70 ఏళ్లు పైబడిన ప్రతి వృద్ధుడికీ ఆయుష్మాన్ వయ వందన కార్డు ద్వారా ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స సాకారమైంది. పేద, మధ్యతరగతి, ఉన్నత వర్గాలు అనే తేడా లేకుండా, ఎలాంటి ఆదాయ పరిమితి లేకుండా 70 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ ఈ పథకం వర్తిస్తుంది. ఫలితంగా అనేక కుటుంబాల్లో వైద్య ఖర్చులు ఆదా కానున్నాయి. అయితే దిల్లీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయకపోవడం వల్ల ఆయా రాష్ట్రాల్లోని వృద్ధులకు ఉచిత చికిత్స పొందే అవకాశం లేకుండా పోయిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. దేశంలోని దాదాపు 4 కోట్ల మంది పేదలు ఆయుష్మాన్ పథకం ద్వారా ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా చికిత్స అందుకుని లబ్ధి పొందారని అన్నారు. ధన్వంతరి జయంతి, 9వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 29న దిల్లీలోని అఖిల భారత ఆయుర్వేద సంస్థ (ఏఐఐఏ)లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆరోగ్య రంగానికి సంబంధించి దాదాపు రూ.12,850 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టుల్లో నరేంద్ర మోదీ కొన్నింటిని ప్రారంభించగా, మరికొన్నింటిని ఆవిష్కరించారు. అలాగే కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ… రుషులు, సాధువులూ ఆరోగ్యాన్ని మహోన్నత సంపదగా పరిగణిస్తారనీ, ఈ పురాతన భావన యోగా రూపంలో ప్రపంచ వ్యాప్తంగా ఆమోదం పొందుతోందని ప్రధాని తెలిపారు. ఆయుర్వేదం పట్ల పెరుగుతున్న ఆదరణకూ, పురాతన కాలం నుంచి ప్రపంచానికి ఆయుర్వేదం ద్వారా భారత్ అందించిన సహకారానికీ ఇది నిదర్శనమే నేడు 150కి పైగా దేశాల్లో ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని అన్నారు. ఒక దేశ పురోగతి నేరుగా ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉంటుందన్న ప్రధాని ప్రజల ఆరోగ్యానికి తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఆరోగ్య విధానం కోసం ఉద్దేశించిన అయిదు మూల స్తంభాలను ఆయన వివరించారు. నివారణాత్మక ఆరోగ్య సంరక్షణ, రోగాలను ముందుగానే గుర్తించడం, చికిత్స, మందులు ఉచితంగా, తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంచడం, చిన్న పట్టణాల్లోనూ వైద్యులు అందుబాటులో ఉండడం, చివరిగా ఆరోగ్య సేవల్లో సాంకేతికతను విస్తరించడం వంటి వాటిని అయిదు మూలస్తంభాలుగా అభివర్ణించారు.
మనలో చాలా మంది అనారోగ్యం అంటే మొత్తం కుటుంబంపై మెరుపు దాడిగా భావించే నేపథ్యం నుంచి వచ్చామని, ముఖ్యంగా పేద కుటుంబంలో ఒక వ్యక్తి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతుంటే, కుటుంబంలో ప్రతి సభ్యునిపై దాని ప్రభావం ఉంటుందని అన్నారు. వైద్యం కోసం ప్రజలు తమ ఇళ్లు, భూములు, నగలు, అన్నింటినీ అమ్ముకునే కాలం ఉండేదనీ, పేద ప్రజలు వారి కుటుంబ ఆరోగ్యం, ఇతర ప్రాధాన్యాల మధ్య ఏదైనా ఒకటే ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఆదాయానికి మించిన ఖర్చులను భరించలేని పరిస్థితి ఉండేదన్నారు. పేదల నిరాశను దూరం చేసేందుకు, మా ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టిందనీ, పేదల ఆసుపత్రి ఖర్చులో రూ.5 లక్షల వరకు ప్రభుత్వమే భరిస్తుందని మోదీ స్పష్టం చేశారు.
80 శాతం తగ్గింపు ధరతో ఔషధాలు అందుబాటులో ఉంచుతూ, దేశవ్యాప్తంగా 14 వేల పిఎమ్ జన్ ఔషధి కేంద్రాలు ఇప్పటికే ప్రారంభమైన విషయాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. పేద, మధ్యతరగతి ప్రజలకు చవక ధరలకు మందులు అందుబాటులోకి రావడంతో రూ.30 వేల కోట్లు ఆదా చేయగలిగామన్నారు. స్టెంట్లు, మోకాలి ఇంప్లాంట్లు వంటి పరికరాల ధరలను తగ్గించామనీ, తద్వారా సామాన్యులకు రూ.80 వేల కోట్లకు పైగా నష్టాన్ని నివారించగలిగామన్నారు. ప్రాణాంతక వ్యాధులను అరికట్టడంతో పాటు గర్భిణులు, నవజాత శిశువుల ప్రాణాలను కాపాడేందుకు గల ఉచిత డయాలసిస్ పథకం, మిషన్ ఇంద్రధనుష్ ప్రచారం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజలు ఖరీదైన వైద్య చికిత్సల భారం నుంచి పూర్తిగా విముక్తి పొందే వరకూ తాను విశ్రమించబోనని ప్రధాని హామీ ఇచ్చారు.
అనారోగ్యాల వల్ల కలిగే నష్టాలను, ఇబ్బందులను తగ్గించడంలో సకాలంలో రోగనిర్ధారణ కీలకమైనదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. సాధ్యమైనంత త్వరగా రోగ నిర్ధారణ చేసి, చికిత్సలను సత్వరమే అందించేందుకు దేశవ్యాప్తంగా రెండు లక్షలకు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఆరోగ్య మందిరాల వల్ల కోట్లాది మంది ప్రజలు క్యాన్సర్, రక్తపోటు, మధుమేహం వంటి వాటి విషయంలో వ్యాధి నిర్ధారణ పరీక్షలను సులభంగా చేయించుకుంటున్నట్లు చెప్పారు. సకాలంలో రోగనిర్ధారణ చేయడం ద్వారా సత్వరమే చికిత్స అందించే వీలుంటుందనీ, దీంతో రోగులకు ఖర్చులు తగ్గుతాయన్నారు. 30 కోట్ల మందికి పైగా ప్రజలు ఆన్‌లైన్‌లో వైద్యులను సంప్రదించిన ఈ-సంజీవని పథకం కింద ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి, ప్రజాధనం ఆదా చేయడానికి ప్రభుత్వం సాంకేతికతను ఉపయోగించుకుంటోందని ప్రధానమంత్రి వివరించారు. ఆరోగ్య రంగంలో ఆధునిక సాంకేతికతను జోడిస్తూ యూ-విన్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించినట్లు శ్రీ మోదీ ప్రకటించారు.
7.5 లక్షల మంది ఆయుష్ వైద్యులు ఇప్పటికే దేశ ఆరోగ్య సంరక్షణ కోసం తమవంతు సహకారాన్ని అందిస్తున్నారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ సంఖ్యను మరింత పెంచాలని ఆయన స్పష్టం చేశారు. దేశంలో మెడికల్, వెల్‌నెస్ టూరిజం కోసం పెరుగుతున్న డిమాండ్‌ను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. భారతదేశం, విదేశాల్లో ప్రివెంటివ్ కార్డియాలజీ, ఆయుర్వేద ఆర్థోపెడిక్స్, ఆయుర్వేద పునరావాస కేంద్రాల వంటి రంగాలను విస్తరించేందుకు యువత, ఆయుష్ వైద్యులు సిద్ధం కావాలంటూ ఆయన పిలుపునిచ్చారు.
అశ్వగంధ, పసుపు, నల్ల మిరియాలు వంటి సంప్రదాయ మూలికలను అధిక-ప్రభావవంతమైన శాస్త్రీయ అధ్యయనాల ద్వారా ధ్రువీకరించాల్సిన అవసరముందని మోదీ స్పష్టం చేశారు. అశ్వగంధకు పెరుగుతున్న డిమాండ్‌ను సూచిస్తూ… ఈ దశాబ్దం చివరి నాటికి దీని మార్కెట్ విలువ 2.5 బిలియన్ డాలర్లకు చేరుకోగలదనే అంచనాలను ప్రస్తావించారు. ఆయుష్ విజయం ఆరోగ్య రంగాన్ని మాత్రమే కాకుండా ఆర్థిక వ్యవస్థనూ ప్రభావితం చేస్తోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఆయుష్ తయారీ రంగం 2014లో 3 బిలియన్ డాలర్ల నుంచి దాదాపు 24 బిలియన్ డాలర్లకు పెరిగిందన్నారు. ఇది కేవలం 10 ఏళ్లలో 8 రెట్లు పెరిగిందని తెలిపారు. భారతదేశంలో ఇప్పుడు 900 లకు పైగా ఆయుష్ అంకుర సంస్థలు పని చేస్తూ, యువతకు కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలకు ఆయుష్ ఉత్పత్తుల ఎగుమతి జరుగుతోందని, స్థానిక మూలికలు, సూపర్‌ఫుడ్‌లను ప్రపంచస్థాయి సరుకులుగా మార్చడం ద్వారా భారతీయ రైతులకు ప్రయోజనం కలిగిస్తున్నట్లు ప్రధానమంత్రి స్పష్టం చేశారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జె.పి. నడ్డా, కార్మిక, ఉపాధి, యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.