‘శాంతి’ చట్టంతో 2047 నాటికి 100 గిగావాట్ల అణువిద్యుత్
అణుశక్తి రంగంలో దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూనే, ప్రైవేటు భాగస్వామ్యానికి ‘శాంతి’ (SHANTI) చట్టం ద్వారాలు తెరుస్తుందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. అంతరిక్ష ప్రయోగ వాహనాల తయారీలో భారత్ ఇప్పటికే పూర్తి స్వావలంబన సాధించిందని, అన్ని రకాల ఉపయోగాల కోసం ఉపగ్రహాలను రూపొందించిందని ఆయన తెలిపారు. 2047 నాటికి 100 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా అణుశక్తి రంగంలో సాధించిన పురోగతి, తదితర అంశాలపై ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పంచుకున్న విశేషాలు:
ప్ర: భారత్ దీర్ఘకాలిక పౌర అణు ప్రయోజనాల దృష్ట్యా ‘శాంతి’ చట్టాన్ని మీరు ఎలా చూస్తారు?
జ: ఇది నిస్సందేహంగా మోదీ ప్రభుత్వం చేపట్టిన అత్యంత కీలకమైన సైన్స్ సంస్కరణల్లో ఒకటి. శాంతియుత ప్రయోజనాల కోసం అణుశక్తి సామర్థ్యాన్ని వెలికితీయడం దీని ప్రధాన ఉద్దేశం. సైన్స్, ఆర్థిక వ్యవస్థ, పరిశ్రమలు, వ్యాపార రంగాలను అనుసంధానిస్తూ భారత్ భవిష్యత్ సామాజిక-ఆర్థిక గమనాన్ని ఇది నిర్దేశిస్తుంది. అణుశక్తి లేదా విద్యుత్ స్వచ్ఛమైన, సమృద్ధిగా లభించే ఇంధన వనరు. ఇది ‘వికసిత్ భారత్’ ఇంధన అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా కృత్రిమ మేధ (AI), అధిక సామర్థ్య కంప్యూటింగ్, సెమీకండక్టర్ తయారీ వంటి డేటా సెంటర్లకు అవసరమైన నిరంతర విద్యుత్ సరఫరాను ఇది అందిస్తుంది. కేవలం విద్యుత్ మాత్రమే కాకుండా వైద్యం, ఆహారం, వ్యవసాయం, పరిశోధన రంగాలలో కూడా అణుశక్తి వినియోగం భారత్ అభివృద్ధికి దోహదపడుతుంది.
ప్ర: ‘శాంతి’ చట్టం ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడంలో విజయం సాధించిందా?
జ: అవును. అణు విద్యుత్ కేంద్రాలను నిర్మించి, యాజమాన్య హక్కులతో నిర్వహించేందుకు (బిల్డ్, ఓన్, ఆపరేట్) ఈ చట్టం ప్రైవేటు రంగానికి మార్గం సుగమం చేసింది. 2047 నాటికి 100 గిగావాట్ల లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రైవేటు భాగస్వామ్యం తప్పనిసరి. చిన్న మాడ్యులర్ రియాక్టర్ల వంటి ఆధునిక పరిజ్ఞానంపై కూడా మేం దృష్టి పెడుతున్నాం. భద్రత, సుస్థిరతను కాపాడుకుంటూనే భారత్ అణుశక్తి వ్యవస్థను సమకాలీన అవసరాలకు అనుగుణంగా ఈ చట్టం ఆధునీకీకరిస్తుంది.
ప్ర: ప్రైవేటు రంగానికి ఈ చట్టం సరిగ్గా ఎలా సహాయపడుతుంది?
జ: ప్రైవేటు సంస్థలు ఇప్పుడు అణు విద్యుత్ ప్లాంట్లను నిర్మించి నిర్వహించవచ్చు. అణు ఇంధనాన్ని తయారు చేయవచ్చు, అణు విజ్ఞాన రంగంలో పరిశోధనలు చేయవచ్చు. విదేశీ భాగస్వామ్యం అనేది భారత్ ఎఫ్‌డీఐ (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల) విధానాలకు లోబడి ఉంటుంది. దేశ సార్వభౌమత్వాన్ని పూర్తిస్థాయిలో కాపాడుకుంటూనే ఈ రంగాన్ని ప్రైవేటు భాగస్వామ్యం కోసం తెరిచాం.
ప్ర: అణుశక్తి రంగంలో భారత్ ఎప్పటికి స్వావలంబన (ఆత్మనిర్భరత) సాధిస్తుంది?
జ: గత 70 ఏళ్లుగా అణువిద్యుత్ ఉత్పత్తి, వినియోగంలో భారత్ స్వయంసమృద్ధిని పెంచుకుంటూనే వస్తోంది. ‘వికసిత్ భారత్’ అణుశక్తి మిషన్‌లో భాగంగా, స్వదేశీ పరిజ్ఞానం, అంతర్జాతీయ సహకారంతో 2047 నాటికి 100 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని సాధించాలనే బహుముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్నాం.
ప్ర: అణు బాధ్యత (ప్రమాదాలు సంభవించినప్పుడు బాధ్యత) అంశాన్ని ఈ చట్టం ఎలా పరిష్కరిస్తుంది? సరఫరాదారులపై దీని ప్రభావం ఏమిటి?
జ: ‘శాంతి’ చట్టం భారత అణు బాధ్యత నిబంధనలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మారుస్తుంది. రియాక్టర్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి ఆపరేటర్ల బాధ్యతను వర్గీకరించారు. ఇది భవిష్యత్తులో అణుశక్తి భారత్ అభివృద్ధికి వెన్నెముకగా మారడానికి పునాది వేస్తుంది.
ప్ర: భద్రత, పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలేమిటి?
జ: భారత్‌లోని పౌర అణు కేంద్రాల భద్రతను పర్యవేక్షించే పూర్తి బాధ్యత అణు విద్యుత్ నియంత్రణ బోర్డుకు ఉంది. ఒకేవిధమైన ప్రమాణాలను ప్రోత్సహించడానికి బోర్డు సమగ్రమైన భద్రతా కోడ్లను, మార్గదర్శకాలను రూపొందించింది.
ప్ర: ప్రస్తుతం భారత్‌లో అణు విద్యుత్ ఉత్పత్తి ఎంత? భవిష్యత్తు లక్ష్యాలేమిటి?
జ: ప్రస్తుతం భారత్ 8.8 గిగావాట్ల అణు విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది. 2031-32 నాటికి దీనిని 22,480 మెగావాట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
- ప్రస్తుతం 25 స్వదేశీ ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లు అందుబాటులో ఉన్నాయి.
- మరో 8 రియాక్టర్లు (6,600 మెగావాట్ల సామర్థ్యం) నిర్మాణంలో ఉన్నాయి.
- ప్రాజెక్ట్-పూర్వ దశలో 10 రియాక్టర్లు (7,000 మెగావాట్ల) ఉన్నాయి (ఉదా: కైగా 5&6, చుట్కా 1&2 మొదలైనవి).
భారత్ తన విశిష్టమైన ‘మూడంచెల అణు విద్యుత్ కార్యక్రమం’ ద్వారా తన వద్ద ఉన్న యురేనియం, అపారమైన థోరియం నిల్వలను సమర్థంగా వినియోగించుకోవడానికి స్వదేశీ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లను అభివృద్ధి చేస్తోంది.
ప్ర: శాస్త్ర సాంకేతిక రంగంలో పరిశోధనలు, స్టార్టప్‌లకు బడ్జెట్ మద్దతు ఏ మేరకు ఉంది?
జ: 2014లో శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ బడ్జెట్ రూ.8,257 కోట్లు కాగా, 2025 నాటికి అది రూ.38,613 కోట్లకు పెరిగింది. అంటే సుమారు 4.7 రెట్లు. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ (GII)లో భారత్ 81వ స్థానం (2015) నుంచి 38వ స్థానానికి (2025) చేరుకుంది. స్టార్టప్‌ల సంఖ్యలో భారత్ ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంది. ప్రభుత్వం రూ.1 లక్ష కోట్లతో ఆర్డీఐ ఫండ్‌ను ఏర్పాటు చేసి పరిశోధనలకు పెద్దపీట వేస్తోంది.
ప్ర: అంతరిక్ష రంగంలో భారత్ సాధించిన ప్రగతి ఏమిటి?
జ: ప్రయోగ వాహనాల తయారీలో భారత్ నేడు పూర్తి స్వావలంబన సాధించింది. చంద్రయాన్, ఆదిత్య ఎల్-1 వంటి విజయవంతమైన మిషన్లే కాకుండా, చంద్రుని నుంచి నమూనాలను తీసుకువచ్చే ‘లూనార్ శాంపిల్ రిటర్న్’ మిషన్‌కు కూడా ప్రణాళికకు సిద్ధం చేస్తున్నాం. 2020లో చేపట్టిన సంస్కరణల ఫలితంగా ఐదేళ్లలోనే 350కి పైగా అంతరిక్ష స్టార్టప్‌లు వచ్చాయి. 2014లో ఇవి కేవలం ఒకటి లేదా రెండు మాత్రమే ఉండేవి. ‘గగన్‌యాన్’ ద్వారా భారత గడ్డపై నుంచి భారతీయుడిని అంతరిక్షంలోకి పంపబోతున్నాం. అలాగే 2035 నాటికి భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావడమే మా లక్ష్యం.

