సింగరేణి సంక్షోభానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ దోపిడీనే కారణం

త దశాబ్ద కాలానికి పైగా విపరీతమైన రాజకీయ జోక్యం తెలంగాణ తలమానికంగా పేరొందిన 136 సంవత్సరాల సింగరేణిని నిర్వీర్యం చూస్తూ ఉంది. గత కేసీఆర్ ప్రభుత్వం, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం లాభసాటి గనులను సింగరేణికి ఉంచకుండా తమ అనుయాయులకు కట్టబెట్టేందుకు కుట్రలు, కుతంత్రాలు, అవినీతికి పాల్పడడంతో సింగరేణికి తీవ్ర నష్టం కలుగుతూనే ఉంది. చివరకు రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం కేటాయించిన నాణ్యమైన బొగ్గు గనులను సైతం అవినీతి, బంధుప్రీతి గ్రహణం పీడిస్తోంది. గత కేసీఆర్ ప్రభుత్వం సింగరేణికి రూ.32వేల కోట్ల బకాయిలు పెడితే, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దానికి మరో రూ.15వేల కోట్ల బకాయిలు జత చేయడంతో సంస్థకు తీవ్ర నిధుల కొరత ఏర్పడింది. నాణ్యతలేని బొగ్గును సింగరేణి ద్వారా తవ్వించడంతో,  SCCL బొగ్గు నాణ్యత 48 శాతానికి పడిపోయింది. అదనంగా రేటు కూడా పెంచడంతో సింగరేణి బొగ్గు అమ్ముడుపోని పరిస్థితి ఏర్పడింది. కేంద్ర బొగ్గు శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న కోల్ ఇండియా బొగ్గు నాణ్యత 86 శాతం గ్రేడ్ 11 బొగ్గు ధర టన్నుకు దాదాపు రూ.1600 అయితే, 48 శాతం నాణ్యత ఉన్న సింగరేణి గ్రేడ్ 11 బొగ్గు ధర దీనికి రెండున్నర రెట్లుగా నిర్ణయించడంతో సింగరేణి బొగ్గును కొనుగోలు చేయడానికి పలు రాష్ట్రాల ఎన్టీపీసీలు నిరాకరిస్తున్నాయి. 

తాజాగా నైనీ బొగ్గు గనుల కోసం ఇద్దరు రాష్ట్ర మంత్రుల మధ్య జరిగిన గొడవ, గత కేసీఆర్ ఫ్రభుత్వం లాగానే రేవంత్ ప్రభుత్వం కూడా సింగరేణిని దోచుకుంటుందన్న విషయం బయటపెట్టింది. ఈ నైనీ బొగ్గు గనిని 2016లో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాల కోసం క్యాప్టివ్ మైన్ గా కేటాయించింది. తెలంగాణ అవసరాల కోసం కేటాయించిన అత్యంత నాణ్యత కలిగిన నైనీ బొగ్గును గత కేసీఆర్ ప్రభుత్వం, ప్రస్తుత రేవంత్ సర్కార్ సింగరేణి ద్వారా కాకుండా తమ అనుయాయులకు కట్టబెట్టేందుకు కుట్రలు చేయడం, తర్వాత అవి వెలుగు చూడడం, చివరకు టెండర్లు రద్దు కావడం, వెరసి తెలంగాణకు బొగ్గు, విద్యుత్ కొరత ఏర్పడే దుస్థితి దాపురించింది. గత కేసీఆర్ ప్రభుత్వం మరొక లాభసాటి బొగ్గుగని తాడిచర్లను కూడా సింగరేణికి కాకుండా, తమ అనుయాయులకే కట్టబెట్టడం ఈ సంస్థను నష్టపరిచే మరో కార్యక్రమం. దీనికి అదనంగా ఈ రెండు ప్రభుత్వాల నిర్ణయాలు సింగరేణి ఆర్థిక పరిస్థితి మరింత దెబ్బతీసేలా ఉన్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు సింగరేణి భూములను కబ్జా చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఇవన్నీ సింగరేణి ఆర్థిక ఇబ్బందులకు బలమైన కారణాలు.

ఈ నైనీ టెండర్ ప్రక్రియ విధానమే వీళ్ల దోపిడీకి మార్గంగా ఉంది. కాంట్రాక్టు పొందిన కంపెనీలు బొగ్గు గనిపై పూర్తి అవగాహన పొందేందుకు కేంద్ర సైట్ విజిట్ కండీషన్ పెట్టింది. ఇది సదరు సంస్థ గని ప్రాంతాన్ని సందర్శించానని అఫిడవిట్ ఇస్తే సరిపోతుంది. కానీ ఈ నైనీ టెండర్ ప్రక్రియలో మాత్రం సైట్ విజిట్ సర్టిఫికేట్ సింగరేణి సంస్థనే ఇవ్వాలని మెలిక పెట్టి అవినీతికి తెరతీశారు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సిన వారికి కాంట్రాక్టు కట్టబెట్టాలనేది దీని వెనకున్న ఉద్దేశ్యం. 

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని కోల్ ఇండియా ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని వినియోగిస్తూ, యంత్రాలను ఆధునీకరిస్తూ, ఉద్యోగులకు శ్రమ, రిస్క్ తగ్గించే ప్రయత్నాలు నిరంతరం చేస్తూ ఉంటే, సింగరేణి మాత్రం ఆధునిక టెక్నాలజీని వినియోగించుకోవడంలోనూ, యంత్రాలను ఆధునీకరించడంలోనూ పూర్తిగా వెనకబడిపోయింది. ఫలితంగా కార్మికులను తీవ్ర శ్రమకు గురిచేస్తూ, వాళ్ల ప్రాణాలను పణంగా పెడుతూ, SCCL మూతపడే దిశగా ఈ రెండు ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ సర్కార్ల దోపిడీ వల్ల రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.50వేల కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో సింగరేణి ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోలేకపోతుంది. SCCLలో 49 శాతం వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వం సింగరేణిని టేకోవర్ చేస్తే మా కష్టాలు గట్టెక్కుతాయని, కోల్ ఇండియా ఉద్యోగుల్లా మేం కూడా మంచి జీతభత్యాలు పొందుతామని సింగరేణి కార్మికులు ఆశిస్తున్నారు. 

సింగరేణి కాలరీస్ ఒక బొగ్గు గని వీకేఓసీ1 కొత్తగూడెం కాంట్రాక్టు దక్కించుకున్న సుధా కన్ స్ట్రక్షన్స్ ప్రైవేటు లిమిటెడ్ ప్రముఖ బీఆర్ఎస్ నాయకుడు కందాల ఉపేందర్ రెడ్డి కూతురుది. ఆమె తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది భార్య కూడా. దీనిని బట్టి కాంగ్రెస్, బీఆర్ఎస్ బంధం ఎంత దృఢంగా ఉందో అర్థమవుతోంది. ఈ రెండు పార్టీల నాయకులు కుమ్ముక్కై సింగరేణిని దోచుకుంటూ, కార్మికులను ముంచుతూ, మధ్యమధ్యలో ఈ రొంపిని బిజెపి, కేంద్ర ప్రభుత్వం మీదికి జల్లే కుట్రలు చేస్తున్నాయి. ఇందులో గతంలో కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్.. ఇప్పుడు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, కొందరు ఇతర మంత్రులు భాగస్వాములే.

సింగరేణిలో జరగుతున్న దారుణాల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి దర్యాప్తు చేపట్టినా వాస్తవాలు బయటకు రావు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ అయిన సీబీఐతో మాత్రమే సింగరేణిలో జరుగుతున్న దోపిడీ, దుర్మార్గాలు బయటకు వస్తాయని ప్రజలు భావిస్తున్నారు. వీటి మీద సీబీఐ ఎంక్వైరీ జరగాలంటే రెండు మార్గాలు ఉన్నాయి. మొదటిది రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీబీఐని అభ్యర్థించడం. రెండవది హైకోర్టు కానీ, సుప్రీం కోర్టులో కానీ కేసు వచ్చి, న్యాయస్థానాలు సీబీఐను ఆదేశించడం. ఈ విషయం బీఆర్ఎస్, కాంగ్రెస్ ముఖ్య నాయకులందరికీ తెలుసు. కానీ ఈ రెండు పార్టీల నాయకులు కమ్ముక్కై బిజెపిని, కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం సీబీఐ ఎంక్వైరీ చేయమని రాజకీయ ప్రకటనలు, ఉత్తరాల డ్రామాలు తప్పితే, రాష్ట్ర ప్రభుత్వం సీబీఐని కోరాలని అటు బీఆర్ఎస్ నాయకులు కానీ, ఇటు కాంగ్రెస్ నాయకులు కానీ డిమాండ్ చేయడం లేదు. తమ దోపిడీ బయటకు రావద్దు, సీబీఐ ఎంక్వైరీ చేయలేదన్న బదనాం బిజెపికి, కేంద్ర ప్రభుత్వానికి అంటగట్టాలనేది వీరి కుట్ర. బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావు కానీ, కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కానీ కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి లేఖలు రాస్తామంటున్నారు కానీ, సీబీఐ దర్యాప్తునకు ఆస్కారం ఉన్న రేవంత్ ప్రభుత్వాన్ని కోరడం లేదు. ప్రజలను అమాయకులుగా భావించి కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు దోపిడీ చేస్తూ.. బిజెపి, కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసే కుట్రలు చేస్తున్నారు.

ఈ తాడిచర్ల, నైనీ బొగ్గు గనులు ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ చేసిన అక్రమాలు సింగరేణిలో జరుగుతున్న దుర్మార్గాలకు ఒక మచ్చుతునక. గతంలో దాదాపు 1 లక్షా 25 వేల మంది పర్మినెంట్ ఉద్యోగులు ఉన్న సింగరేణి ఇప్పుడు 41వేల దిగువకు పడిపోయారు. ఆ ఉద్యోగులకూ జీతభత్యాలు చెల్లించడంలో కూడా సంస్థ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుందంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల దోపిడీనే ప్రధాన కారణం.