modi

సృజనాత్మకతను పెంచుకోండి

27 అక్టోబర్ 2024న ప్రసారమైన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగంలోని ముఖ్యాంశాలు

నేటి ‘మన్ కీ బాత్’లో ధైర్యం, దూరదృష్టి ఉన్న ఇద్దరు మహానాయకుల గురించి చర్చిస్తాను. వారి 150వ జయంతి ఉత్సవాలను జరుపుకోవాలని దేశం నిర్ణయించింది. అక్టోబర్ 31న సర్దార్ పటేల్ 150వ జయంతి సంవత్సరం ప్రారంభమవుతుంది. దీని తరువాత భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సంవత్సరం నవంబర్ 15న మొదలవుతుంది. ఈ మహానుభావులు ఇద్దరూ వేర్వేరు సవాళ్లను ఎదుర్కొన్నారు. అయితే ఇద్దరి దృక్కోణం దేశ సమైక్యతే. ఈ మహనీయుల 150వ జయంతి ఉత్సవాలను జాతీయ స్థాయిలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మనం కలసికట్టుగా ఈ ఉత్సవాలను భిన్నత్వంలో భారతదేశ ఏకత్వాన్ని చాటేవిధంగా, గొప్ప వారసత్వాన్ని వికాస ఉత్సవంగా జరుగపుకుందాం. 

‘ఛోటా భీమ్’ను పిల్లలు ఎప్పటికీ మర్చిపోలేరు. ఇతర యానిమేషన్ సీరియళ్లు ‘కృష్ణ’, ‘హనుమాన్’, ‘మోటు-పత్లు’లకు కూడా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. భారతీయ యానిమేషన్ పాత్రలు, ఇక్కడి యానిమేషన్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజల మక్కువను చూరగొంటున్నాయి. స్మార్ట్‌ఫోన్ నుండి సినిమా స్క్రీన్ వరకు, గేమింగ్ కన్సోల్ నుండి వర్చువల్ రియాలిటీ వరకు యానిమేషన్ ప్రతిచోటా ఉంటుందని మీరు తప్పక చూసి ఉంటారు. యానిమేషన్ ప్రపంచంలో భారత్ సరికొత్త విప్లవం దిశగా అడుగులు వేస్తోంది. భారతదేశ గేమింగ్ స్పేస్ కూడా వేగంగా విస్తరిస్తోంది. ఈ రోజుల్లో భారతీయ ఆటలు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. కొన్ని నెలల క్రితం నేను భారతదేశంలోని ప్రముఖ గేమర్లను కలిశాను. అప్పుడు భారతీయ గేమ్‌ల అద్భుతమైన సృజనాత్మకత, నాణ్యతను తెలుసుకునే, అర్థం చేసుకునే అవకాశం నాకు లభించింది. యానిమేషన్ ప్రపంచంలో ‘మేడ్ ఇన్ ఇండియా’, ‘మేడ్ బై ఇండియన్స్’ ప్రబలంగా ఉన్నాయి. నేడు భారతీయ ప్రతిభ కూడా విదేశీ నిర్మాణాలలో కూడా ముఖ్యమైన భాగంగా మారుతున్నది. ప్రస్తుత స్పైడర్ మ్యాన్ అయినా, ట్రాన్స్‌ఫార్మర్స్ అయినా ఈ రెండు సినిమాల్లో హరినారాయణ్ రాజీవ్ అందించిన సహకారానికి ప్రశంసలు లభించాయి. భారతదేశ యానిమేషన్ స్టూడియోలు డిస్నీ, వార్నర్ బ్రదర్స్ వంటి ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థలతో కలిసి పని చేస్తున్నాయి.

నేడు మన యువత అసలైన భారతీయ కంటెంట్‌ను సిద్ధం చేస్తోంది. మన సంస్కృతికి ప్రతిబింబమైన ఇవి ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నాయి. ఇతర పరిశ్రమలకు బలాన్ని ఇచ్చే స్థాయిలో యానిమేషన్ రంగం నేడు పరిశ్రమ రూపాన్ని సంతరించుకుంది. ఈ రోజుల్లో వీఆర్ టూరిజం చాలా ప్రసిద్ధి చెందుతోంది. మీరు వర్చువల్ యాత్ర ద్వారా అజంతా గుహలను చూడవచ్చు. కోణార్క్ మందిర ఆవరణలో షికారు చేయవచ్చు. వారణాసి ఘాట్‌లను ఆస్వాదించవచ్చు. ఈ వీఆర్ యానిమేషన్‌లన్నీ భారతీయులు సృష్టించినవే. వీఆర్ ద్వారా ఈ స్థలాలను చూసిన తర్వాత చాలా మంది ఈ పర్యాటక ప్రదేశాలను వాస్తవంగా సందర్శించాలని కోరుకుంటారు. అంటే పర్యాటక గమ్యస్థానాల వర్చువల్ టూర్ ప్రజల మనస్సుల్లో ఉత్సుకతను సృష్టించడానికి ఒక మాధ్యమంగా మారింది. నేడు ఈ రంగంలో యానిమేటర్లతో పాటు స్టోరీ టెల్లర్లు, రచయితలు, వాయిస్ ఓవర్ నిపుణులు, సంగీతకారులు, గేమ్ డెవలపర్లు, వర్చువల్ రియాలిటీ- ఆగ్మెంటెడ్ రియాలిటీ నిపుణులకు కూడా డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. కాబట్టి సృజనాత్మకతను పెంచుకోవాలని నేను భారతదేశ యువతకు చెప్తాను.

భారతదేశం ప్రతి రంగంలో అద్భుతాలు చేస్తోంది. ఒకప్పుడు మొబైల్ ఫోన్ల దిగుమతిదారుగా ఉన్న భారతదేశం నేడు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద తయారీదారుగా మారింది. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యధికంగా రక్షణ పరికరాల కొనుగోలుదారుగా ఉన్న భారతదేశం ఇప్పుడు 85 దేశాలకు ఎగుమతి చేస్తోంది. అంతరిక్ష సాంకేతికతలో ఈ రోజు భారతదేశం చంద్రుని దక్షిణ ధృవాన్ని చేరుకున్న మొదటి దేశంగా మారింది. ప్రతి రంగంలో దేశం విజయాలు సాధిస్తోంది. ఉదాహరణకు ఈ నెలలో లద్దాక్ లోని హాన్లేలో ఆసియాలోనే అతిపెద్ద ఇమేజింగ్ టెలిస్కోప్ MACEను కూడా ప్రారంభించాం. ఇది 4300 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది భారతదేశ తయారీ-‘మేడ్ ఇన్ ఇండియా’. మైనస్ 30 డిగ్రీల చల్లటి వాతావరణం ఉన్న ప్రదేశంలో- ఆక్సిజన్ కొరత కూడా ఉన్న ప్రదేశంలో- మన శాస్త్రవేత్తలతో పాటు స్థానిక పరిశ్రమలు ఆసియాలో మరే దేశం చేయని పనిని చేశాయి. హాన్లే టెలిస్కోప్ సుదూర ప్రపంచాన్ని చూస్తూ ఉండవచ్చు. అది మనకు మరొక విషయాన్ని కూడా చూపుతోంది – అది స్వయం సమృద్ధ భారతదేశ సామర్థ్యం.

డిజిటల్ అరెస్ట్ మోసంలో కాలర్లు కొన్నిసార్లు పోలీసులుగా, కొన్నిసార్లు సీబీఐ అధికారులుగా, కొన్నిసార్లు నార్కోటిక్స్ అధికారులుగా, కొన్నిసార్లు రిజర్వ్ బ్యాంక్ అధికారులుగా వేర్వేరు హోదాలను పెట్టుకుని, మాట్లాడతారు. చాలా నమ్మకంతో చేస్తారు. మీ వ్యక్తిగత సమాచారం అంతటినీ వారు సేకరిస్తారు. “మీరు గత నెలలో గోవా వెళ్లారు. కదా? మీ అమ్మాయి దిల్లీలో చదువుతుంది కదా?” ఇలా వారు మీ గురించి మీరు ఆశ్చర్యపోయేలా సమాచారాన్ని సేకరిస్తారు. రెండవ ఉపాయం – భయానక వాతావరణాన్ని సృష్టించడం. యూనిఫాం, ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు, చట్టపరమైన విభాగాలు, అవి మిమ్మల్ని ఎంతగా భయపెడతాయంటే ఫోన్లో మాట్లాడేటప్పుడు మీరు ఆలోచించలేరు. ఆపై వారి మూడవ ఉపాయం ప్రారంభమవుతుంది. మూడవ ఉపాయం – సమయం ఒత్తిడి. ‘మీరు ఇప్పుడు నిర్ణయించుకోవాలి. లేకపోతే మిమ్మల్ని అరెస్టు చేయవలసి ఉంటుంది’ -ఇలా ఈ వ్యక్తులు బాధితులు భయపడేంతగా చాలా మానసిక ఒత్తిడిని కలిగిస్తారు. డిజిటల్ అరెస్ట్ బాధితుల్లో ప్రతి వర్గం, ప్రతి వయో బృందంలోనివారు ఉన్నారు. ప్రజలు కష్టపడి సంపాదించిన లక్షల రూపాయలను భయంతో నష్టపోయారు. మీకు ఎప్పుడైనా ఇలాంటి కాల్ వస్తే భయపడాల్సిన పనిలేదు. ఫోన్ కాల్ లేదా వీడియో కాల్ ద్వారా ఏ దర్యాప్తు సంస్థ కూడా ఇలాంటి విచారణలు చేయదని మీరు తెలుసుకోవాలి. డిజిటల్ భద్రతలోని మూడు దశలను నేను మీకు చెప్తాను. ఈ మూడు దశలు – ‘వేచి ఉండండి- ఆలోచించండి- చర్య తీసుకోండి’ కాల్ వస్తే ‘వేచి ఉండండి’. భయాందోళనలకు గురికాకండి. ప్రశాంతంగా ఉండండి. తొందరపాటుతో ఎటువంటి పనులూ చేయకండి. మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ ఇవ్వకండి. వీలైతే స్క్రీన్ షాట్ తీసుకొని రికార్డింగ్ చేయండి. దీని తరువాత రెండవ దశ ఆలోచించడం. ఏ ప్రభుత్వ సంస్థ కూడా ఫోన్‌లో ఇలాంటి బెదిరింపులు చేయదు. వీడియో కాల్‌ల ద్వారా విచారణ చేయదు. ఇలా డబ్బులు డిమాండ్ చేయదు. మీకు భయం అనిపిస్తే ఏదో పొరపాటు జరిగిందని అర్థం చేసుకోండి. మొదటి దశ, రెండవ దశ తర్వాత మూడవ దశలో – ‘చర్య తీసుకోండి’. జాతీయ సైబర్ హెల్ప్‌లైన్ 1930కి డయల్ చేయండి. cybercrime.gov.inలో రిపోర్ట్ చేయండి. మీ కుటుంబానికి, పోలీసులకు తెలియజేయండి. సాక్ష్యాలను భద్రపరచండి. ‘వేచి ఉండండి’, ‘ఆలోచించండి’, ఆపై ‘చర్య తీసుకోండి’. ఈ మూడు దశలు మీ డిజిటల్ భద్రతకు రక్షణగా మారతాయి.

చట్టంలో డిజిటల్ అరెస్ట్ లాంటి వ్యవస్థ లేదని మరోసారి చెప్తున్నాను. ఇది కేవలం మోసం, వంచన, అబద్ధం. ఇది దుష్టుల ముఠా చేసే పని. డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో దర్యాప్తు సంస్థలన్నీ కలిసి పని చేస్తున్నాయి. ఈ ఏజెన్సీల మధ్య సమన్వయం కోసం నేషనల్ సైబర్ కో-ఆర్డినేషన్ సెంటర్‌ను ఏర్పాటు జరిగింది. ఇలాంటి మోసాలకు పాల్పడిన వేలాది వీడియో కాలింగ్ ఐడీలను దర్యాప్తు సంస్థలు బ్లాక్ చేశాయి. లక్షలాది సిమ్ కార్డులు, మొబైల్ ఫోన్లు, బ్యాంకు ఖాతాలు కూడా బ్లాక్ అయ్యాయి. ఏజెన్సీలు తమ పనిని చేస్తున్నాయి. కానీ డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసాలను నివారించడానికి చాలా ముఖ్యమైంది – ప్రతి ఒక్కరికీ అవగాహన, ప్రతి పౌరునికీ అవగాహన.

కొన్ని వారాల క్రితం నేను లావోస్ కు వెళ్ళాను. అక్కడ స్థానిక కళాకారులు “ఫలక్ ఫలం” అనే ‘లావోస్ రామాయణం’ ప్రదర్శించారు. రామాయణం పట్ల మనకున్న అంకితభావమే వారి కళ్లలో శక్తిగా, వారి స్వరంలో సమర్పణా భావంగా కనబడింది. అదేవిధంగా కువైట్‌లో అబ్దుల్లా అల్-బారూన్ రామాయణ మహాభారతాలను అరబిక్‌ భాషలోకి అనువదించారు. ఈ రచన కేవలం అనువాదం మాత్రమే కాదు- రెండు గొప్ప సంస్కృతుల మధ్య వారధి. ఆయన ప్రయత్నాలు అరబ్ ప్రపంచంలో భారతీయ సాహిత్యంపై కొత్త అవగాహనను పెంచుతున్నాయి. పెరూకు చెందిన ఎర్లిందా గార్సియా అక్కడి యువతకు భరతనాట్యం నేర్పుతున్నారు. మరియా వాల్దెజ్ ఒడిస్సీ నృత్యంలో శిక్షణ ఇస్తున్నారు. ఈ కళల ప్రభావంతో ‘భారతీయ శాస్త్రీయ నృత్యం’ దక్షిణ అమెరికాలోని అనేక దేశాల్లో ప్రాచుర్యం పొందుతోంది.