తెలంగాణలో 40 సీట్లు మహిళలకే
మహిళా రిజర్వేషన్ అమలైతే తెలంగాణలో 40 సీట్లు మహిళలకే దక్కుతాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. మోదీ ప్రభుత్వంలోనే మహిళలకు 33 శాతం రిజర్వేషన్ సాకారమైందన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల్లో రానున్న ఎన్నికలకు ముందే మహిళల రిజర్వేషన్ల చట్టం అమలు చేయనున్నామని స్పష్టం చేశారు. రాజ్యాంగం రూపకల్పన చేసినప్పుడు మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ ఉండాలని చెప్పారని, గత ప్రభుత్వాలు అనేక చర్చల తరువాత బిల్లులు పెట్టారే గానీ వాటి అమలులో విఫలమయ్యారన్నారు. రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న పార్టీలు సీట్లు తగ్గుతాయని అసత్య ప్రచారాలకు దిగుతున్నారని మండిపడ్డారు. పునర్విభజన జరిగి తీరుతుందని రిజర్వేషన్లను ఏర్పాటు చేసి తీరుతామని ఒక్క సీటు తగ్గకుండా ఆ పరిధిలోనే నిర్ణయం తీసుకుంటుందన్నారు. అత్యధిక కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లుగా మహిళలు బిజెపిలోనే ఉన్నారని అన్నారు. బిజెపి తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా మార్చ్ 7న బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ‘‘మోదీ ప్రభుత్వంలో మహిళా ఆర్థిక సాధికారత’’ సదస్సు నిర్వహించారు. మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డా. శిల్పా రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ సదస్సులో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డి.కె. అరుణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పలువురు మహిళలకు అవార్డులను బహూకరించారు.
ట్రిపుల్ తలాక్ రద్దు
ఈ సదస్సులో కిషన్ రెడ్డి మాట్లాడుతూ మహిళలను శక్తిగా కొలిచే అద్భుతమైన సాంప్రదాయం కేవలం భారతీయ జీవన విధానం, సంస్కృతిలోనే ఉందన్నారు. పురాణాల నుంచి నేటి వరకు కూడా అనేక రంగాల్లో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. రోజువారీ కార్యక్రమాల్లోనూ శక్తి స్వరూపిణుల పేర్లనే ముందుగా ఉచ్ఛరిస్తామని స్పష్టం చేశారు. భారతీయ జీవన విధానంలో ఇల్లును చక్కదిద్దేవారు మాతృమూర్తి అన్నారు. తన ఎంపీ నియోజకవర్గంలో ఐదువేలమంది మహిళలు తమ తమ బూత్ లలో మహిళా శక్తి పనిచేసిందని తన గెలుపులోనూ వారీ పాత్ర కీలకమన్నారు. తాను హోంమంత్రిగా ఉన్నప్పుడు సరిహద్దుల్లోనూ ఆడబిడ్డలు ఏకె 47తో నిరంతరం కాపలా కాస్తున్నారని కొనియాడారు. విమాన రంగంలో అత్యధిక పైలెట్లు అత్యధికంగా భారత్ లోనే ఉన్నారని గుర్తు చేశారు. ట్రిపుల్ తలాక్ 12 కోట్ల మంది ముస్లిం ఆడబిడ్డల హక్కులు కాపాడేందుకు అనేక ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయన్నారు. మూడుమాటలతో ఇంటి నుంచి గెంటివేసే ప్రక్రియ కొనసాగిందని విమర్శించారు. ఇస్లామిక్ దేశాల్లో కూడా ఈ చట్టం లేదన్నారు. సెక్యూలర్ దేశంలో ట్రిపుల్ తలాక్ పై ఎవ్వరూ మాట్లాడే, వ్యతిరేకంగా వెళ్లే ధైర్యం చేయలేదన్నారు. కానీ మోదీ నాయకత్వంలో ట్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసి హక్కులు కల్పించామని అన్నారు. ‘భేటీ బచావో.. భేటీ పడావో’ కేవలం నినాదం కాదన్నారు. ఆడపిల్లలను రక్షించే బృహత్తర కార్యక్రమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేద మహిళలున్నారని, వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో స్వయం సహాయక సంఘాలు తీసుకొచ్చారన్నారు. మోదీ హయాంలో అత్యధికంగా గ్రూపులు ఉన్నాయన్నారు. ప్రసూతి సెలవులు 26 వారాలు పొడిగించిన ఘనత బిజెపిదే అన్నారు. స్టార్టప్ సంస్థల్లోనూ అత్యధిక సంఖ్యలో పని చేస్తున్నారని, స్థాపిస్తున్నారని అన్నారు. మెజార్టీ ఐటీల్లో మహిళలే కీలక పాత్ర పోషిస్తూ అత్యధిక ప్యాకేజీలు అందుకుంటున్నారని అభినందించారు.
2014 తరువాత దురదృష్టవశాత్తు మహిళా మంత్రి లేకుండా బీఆర్ఎస్ పాలించిందన్నారు. మహిళలను అవమానపర్చడం, నిర్లక్ష్యం చేసిందన్నారు. ఐదేళ్లపాటు పాలించడాన్ని మహిళా లోకం ఆలోచించాలన్నారు. మోదీ నేతృత్వంలో మహిళా రాష్ర్టపతిని చేసిన ఘనత బిజెపికే దక్కుతుందన్నారు. స్వామి వివేకానంద, బాబాసాహెబ్ అంబేద్కర్, ఫూలే మహిళా సాధికారతలో ముందంజలో ఉన్నారని అన్నారు. విద్య, వ్యాపార, సామాజిక, అన్ని రంగాల్లో కుటుంబ వ్యవస్థ, భారతీయ సంస్కృతిని రక్షించుకుంటూ మహిళలు ముందుకు వెళ్లడం అభినందనీయమన్నారు. కుటుంబ ఉమ్మడి వ్యవస్థను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మోదీ అధికారంలోకి వచ్చాక ఇంకా గుర్తింపు పొందని వారికి గుర్తింపు లభించిందన్నారు. అట్టడుగు వర్గాల మహిళలకు కూడా పద్మశ్రీలు కేటాయించి ఆదర్శంగా నిలుస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కాలికి గజ్జకట్టి మహిళలు ఉద్యమంలో పాల్గొన్న విషయం తనకు తెలుసన్నారు. తీవ్రమైన వాతావరణంలోనూ ఆడబిడ్డలు పనిచేసి రాష్ట్రాన్ని సాధించుకున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 14 నెలలు గడిచిపోయినా కేసీఆర్ లాగే పరిపాలన ఉందన్నారు.
మోదీ నేతృత్వంలో జనగణన జరుగుతుందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు మానుకోవాలని అన్నారు. జనాభా సేకరణపై విపక్షాలు చేస్తున్నవి తప్పుడు ఆరోపణలేనని హోంమంత్రి కేంద్ర కేబినెట్ లో చెప్పారని అన్నారు. ఒక్కటి కూడా తగ్గే అవకాశం లేదన్నారు. తెలంగాణలో 17కు 17, ఏపీలో 25కు 25 సీట్లు ఉంటాయన్నారు. దక్షిణాది ఆల్ పార్టీ సమావేశం పెట్టుకుంటామని బెదిరింపు ధోరణికి దిగుతున్నారని అందుకు తమకు అభ్యంతరం ఏమీ లేదన్నారు. 2009లో పునర్విభజన ఏ రకంగానైతే జరిగిందో అదే రకంగా పునర్విభజనలో చర్యలు తీసుకుంటామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయని గ్రామ పంచాయితీ వార్డు నుంచి మొదలు పెట్టి జిల్లా పంచాయితీ సీటు వరకు కార్పొరేషన్ లలో మహిళలు కీలక పాత్ర వహించాలని పోటీ చేయాలని అన్నారు. రిజర్వేషన్ స్థానాల్లోనే గాకుండా, జనరల్ స్థానాల్లోనూ మహిళలు పోటీలో ఉండాలని కోరారు. కింది స్థాయి నుంచి రాజకీయ పార్టీలో పనిచేస్తున్న వారికే సీట్లు లభించాల్సిన అవసరం ఉందన్నారు. సిద్ధాంతాల కోసం పని చేస్తున్న వారికే ప్రాధాన్యత రావాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక, రాజకీయ పరంగా పనిచేసే మహిళలకు ప్రాధాన్యత దక్కుతుందన్నారు. మోదీ కుటుంబ రాజకీయాలు ఉండవద్దని తొలి నుంచి చెబుతుంటారని అన్నారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు వచ్చి తమకు నీతులు చెబుతూ హక్కుల గురించి మాట్లాడుతుంటారని ఇది మంచి సాంప్రదాయం కాదని, రానున్న రోజుల్లో మార్పు రావాలని సామాజిక సమస్యలపై పోరాటం చేసే మహిళలకే రాజకీయ అవకాశాలు దక్కాలని ఆ దిశగా పోరాటంలో మహిళలు సిద్ధంగా ఉండాలని జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
మహిళా సాధికారతే లక్ష్యం: డి.కె. అరుణ
డి.కె. అరుణ మాట్లాడుతూ ‘‘స్త్రీని గౌరవించని వారికి భవిష్యత్ ఉండదు. స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే గమనం లేదు.. స్త్రీ లేనిదే అసలు మానవ మనుగడే లేదు. స్త్రీలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ దేవతలు నడయాడుతారు, అభివృద్దికి బీజం పడుతుంది. స్త్రీ సంతోషంగా ఉంటే ఆ కుటుంబం దినదినాభివృద్ధి చెందుతుంది. మహిళలు ఎందులోనూ తీసిపోరు, అన్నిరంగాల్లోను మేమేం తక్కువ కాదని నిరూపిస్తున్నారు. భువి నుంచి దివి వరకు అన్ని రంగాల్లోనూ మహిళల ప్రావీణ్యం ఉన్నది. తెలంగాణలో బిజెపి ప్రభుత్వం రావాలని ప్రజలే కోరుకుంటున్నారు. అందుకే ఎమ్మెల్యే ఎన్నికల్లో 8 స్థానాలు, ఎంపీ ఎన్నికల్లో 8 స్థానాలు, ఈ నెలలో వచ్చిన ఫలితాలలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 స్థానాలు గెలుచుకున్నాము. అంటే తెలంగాణ ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కారు కావాలని కోరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులను మనం సద్వినియోగం చేసుకోవాలి. తెలంగాణలోని ప్రతి గృహిణి బిజెపి వైపు చూస్తున్నారు. మహిళలు రాజకీయాల్లో కి రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అందుకే మోదీ మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇచ్చారు. మోదీ ఇచ్చిన ఈ రిజర్వేషన్ల అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవాలి. ఏ బాధ్యత ఇచ్చినా నిరూపించుకుంటారని ప్రధాని మోదీ మహిళలను నమ్మారు. మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు.’’ అని అన్నారు.

