తెలంగాణలో కమలం జయకేతనం
తెలంగాణలో కమలం వికసించింది. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి బిజెపి 8 సీట్లు గెలుచుకొని సత్తా చాటింది. తెలంగాణ చరిత్రలో బిజెపి ఇన్ని సీట్లు ఎప్పుడూ గెలవలేదు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనూ బిజెపి 8 సీట్లు సాధించలేదు. కానీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి 8 సీట్లు సొంతం చేసుకొని రికార్డు సృష్టించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు సాధించిన భారతీయ జనతా పార్టీ.. ఈసారి లోక్‌సభ పోరులో ఎనిమిది స్థానాలను కైవసం చేసుకుంది. అంటే రెట్టింపు సీట్లు దక్కించుకుంది.
గత లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలను గెలిచిన బిజెపి ఇప్పుడు ఎనిమిదింటిని దక్కించుకొని బలాన్ని గణనీయంగా పెంచుకొంది. గత ఎన్నికల్లో గెలిచిన నాలుగింటితో పాటు మరో నాలుగు చోట్ల నెగ్గింది. సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ స్థానాలను నిలబెట్టుకుంటూనే మల్కాజిగిరి, చేవెళ్ల, మహబూబ్‌నగర్, మెదక్ సీట్లలో గెలుపొందింది. సిటింగ్ ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, ధర్మపురి అర్వింద్ తమ స్థానాల్లో గెలుపొందారు. సోయం బాపూరావు స్థానంలో గోడం నగేష్ కు టికెటిచ్చి, సిట్టింగ్ సీటు ఆదిలాబాద్ ను సైతం బిజెపి నిలబెట్టుకుంది. గత లోక్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గెలిచిన మల్కాజ్ గిరి, ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం ఉండే మహబూబ్‌నగర్ స్థానాల్లో కమలమే వికసించింది. మల్కాజిగిరిలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ 3.91 లక్షల ఓట్ల ఆధిక్యంతో గెలవగా, మహబూబ్ నగర్ నుంచి డి.కె. అరుణ 4500 మెజారిటీతో విజయం సాధించారు. బీఆర్ఎస్ కు ఆయువుపట్టు లాంటి కరీంనగర్లో భారీ ఆధిక్యంతో విజయాన్ని నమోదు చేసింది. కరీంనగర్లో బండి సంజయ్ 2.25 లక్షల ఓట్ల మెజార్టీని సాధించారు. కేసీఆర్, పార్టీ సీనియర్ నేత హరీశ్‌రావులు ప్రాతినిధ్యం వహించే గజ్వేల్, సిద్దిపేట అసెంబ్లీ స్థానాలు ఉన్న మెదక్ లోక్‌సభ స్థానంలో కూడా బిజెపి చిరస్మరణీయ విజయం సాధించింది. మెదక్ లో 39,139 ఓట్లతో రఘునందన్ రావు జయకేతనం ఎగరేశారు. తెలంగాణలో బిజెపికి 35.08 శాతం ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ కు 40.10 శాతం ఓట్లు రాగా, బీఆర్ఎస్ కు కేవలం 16.68 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.
రాష్ట్రంలో ఎన్నిక ఎన్నికకు బలాన్ని పెంచుకుంటూ బిజెపి బలమైన శక్తిగా ముందుకు వెళ్తోంది. తాజా లోక్‌సభ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటుకుంది. పదేళ్లలో పార్టీ రాష్ట్రంలో ఓట్లను… సీట్లను గణనీయంగా పెంచుకుంటోంది. ఈ ఎన్నికల్లో నువ్వానేనా అన్నట్లు పోటీ పడి ఎనిమిది చోట్ల నెగ్గి.. మరో ఏడు స్థానాలలో రెండో స్థానంలో నిలిచింది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గాలలో మాత్రం మూడో స్థానానికి పరిమితమైంది. 2023 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఒక్క అసెంబ్లీ స్థానంలో కూడా బిజెపి గెలవకున్నా తాజా ఎన్నికల్లో విజయ దుందుభి మోగించింది. కరీంనగర్, సికింద్రాబాద్ మహబూబ్‌నగర్, మెదక్, మల్కాజిగిరి, చేవెళ్ల లోక్‌సభ స్థానాల్లోని 42 అసెంబ్లీ స్థానాల్లో ఒక చోట కూడా విజయం సాధించకున్నా తాజా ఎన్నికల్లో ఈ ఆరు లోక్‌సభ స్థానాలను బిజెపి సొంతం చేసుకుంది. ప్రతి లోక్‌సభ స్థానంలో పార్టీ ఓట్లను గణనీయంగా పెంచుకుంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలలో ఆయా లోక్‌సభ స్థానాల పరిధిలోని సెగ్మెంట్లలో వచ్చిన ఓట్లకు తాజాగా వచ్చిన వాటికి మధ్య భారీ పెరుగుదల ఉంది.
గ్రేటర్లో రిక్త‘హస్తం’
ఆరు నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లతో అధికారాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ 8 సీట్లు సాధించింది. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, నల్గొండ, భువనగిరి, నాగర్‌కర్నూల్, జహీరాబాద్, పెద్దపల్లి స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. గ్రేటర్లో కాంగ్రెస్‌కు రిక్తహస్తమే మిగిలింది. గత శాసనసభ ఎన్నికల్లో ఒక్క స్థానం గెలవకపోయినా లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించగలమన్న ఆత్మవిశ్వాసంతో కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేశారు. గ్రేటర్ పరిధిలో హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్‌సభ స్థానాలుండగా.. ఇందులో హైదరాబాద్ మినహా సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్‌సభ స్థానాల నుంచి గెలుస్తామన్న నమ్మకంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ ప్రచారం నిర్వహించినా ప్రయోజనం లేకుండాపోయింది. మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్లలో కమలం పార్టీ విజయదుందుభి మోగించగా.. కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంతో సరిపెట్టుకుంది. హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ అభ్యర్థిని బరిలో దింపి ధరావతు కోల్పోయింది. హైదరాబాద్ స్థానాన్ని ఎంఐఎం నిలబెట్టుకుంది.
నామమాత్రంగానే బీఆర్ఎస్
తెలంగాణ ఆవిర్భావం తర్వాత తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన బీఆర్ఎస్ ను లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కోలుకోలేని దెబ్బతీశాయి. ఈ ఎన్నికల్లో గులాబీ జెండా వైభవం కోల్పోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలు సాధించిన బీఆర్ఎస్.. ఒక్క ఎంపీ సీటు కూడా గెలుచుకోలేకపోయింది. పార్టీ అధినేత కేసీఆర్ సహా ముఖ్యనేతలు విస్తృతంగా ప్రచారం చేసినా ఫలితం దక్కకపోగా, పలు నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు నామమాత్రపు పోటీ కూడా ఇవ్వలేకపోయారు. ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఆధిక్యం సాధించగా, ఆ ఏడింటిలోనూ ఇప్పుడు బీఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితమైంది. శాసనసభ ఎన్నికల్లో అన్ని అసెంబ్లీ స్థానాలను గెల్చుకొన్న మల్కాజిగిరి, సికింద్రాబాద్ లోక్‌సభ స్థానాల్లో కూడా సత్తా చాటలేకపోయింది. మొత్తం 14 లోక్‌సభ స్థానాల్లో మూడో స్థానానికే పరిమితమైంది. హైదరాబాద్‌లో నాలుగో స్థానానికి చేరింది. కేవలం ఖమ్మం, మహబూబాబాద్‌లలో మాత్రమే ఆ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచీ చూస్తే.. ఏ ఎన్నికల్లోనూ ‘సున్నా’ ఫలితాలు నమోదు చేయలేదు. ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాకపోవడం ఇదే తొలిసారి. ప్రధాన పోటీ కాంగ్రెస్, బిజెపిల మధ్యనే సాగడంతో బీఆర్ఎస్ నామమాత్రంగానే మిగిలిపోయింది.
పని చేసిన మోదీ గాలి
పకడ్బందీ కార్యాచరణ… పక్కా ప్రణాళిక… ముందస్తు వ్యూహం… అభ్యర్థుల ఎంపిక… జాతీయ నేతల విస్తృత ప్రచారం… ‘మరోసారి మన మోదీ సర్కార్’ నినాదం.. క్షేత్రస్థాయిలో అమలు చేసిన సూక్ష్మ ప్రణాళిక లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో సత్తా చాటేందుకు బిజెపికు ఉపకరించాయి. ఎనిమిది లోక్‌సభ స్థానాలను దక్కించుకునేందుకు బాటలు వేశాయి. పార్టీ జాతీయ నాయకత్వం పకడ్బందీ ప్రణాళికను రాష్ట్ర పార్టీకి నిర్దేశించడం.. రాష్ట్ర నాయకత్వం దానిని బలంగా క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం కలిసొచ్చింది. మరోసారి మోదీ ప్రధానమంత్రి కావాలనే నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. దాన్ని ఎన్నికల నినాదంగా మార్చింది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై విస్తృత ప్రచారం చేసింది. ఎప్పటికప్పుడు సర్వేలు, అంచనాలతో అంతర్గత పరిస్థితులను గుర్తించి దానికి అనుగుణంగా ప్రణాళిక అమలు చేసింది. బహుముఖ కార్యాచరణ పార్టీకి ఉపకరించింది. రెండంకెల స్థానాలు లక్ష్యంగా బరిలో దిగిన పార్టీ ఎనిమిది స్థానాలను దక్కించుకుంది. బిజెపి, అనుబంధ విభాగాలు చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇచ్చాయి.
మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంలో వంశీచంద్ రెడ్డి పోటీలో నిలిపిన రేవంత్ రెడ్డి…. ఆయన గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డారు. లోక్‌సభ పరిధిలోని మహబూబ్‌నగర్, దేవరకద్ర, షాద్‌నగర్, మక్తల్, కొడంగల్, నారాయణపేట శాసనసభ నియోజకవర్గాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్‌కి చెందిన ఎమ్మెల్యేలే ఉన్నారు. ప్రధానంగా కొడంగల్, జడ్చర్ల, షాద్‌నగర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు భారీ మెజార్టీ వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. కానీ ప్రజలు మాత్రం బిజెపినే ఆదరించారు. నారాయణపేటలో ప్రధాని మోదీ ప్రచారం చేయడం బిజెపికి కలిసి వచ్చింది. మొత్తానికి ఈ ఫలితాలు తెలంగాణ రాజకీయాల్లో బిజెపిని ప్రత్యామ్నాయ శక్తిగా నిలబెట్టాయి.
కంటోన్మెంట్ నూ కోల్పోయిన బీఆర్ఎస్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నికలో బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును కోల్పోయింది. ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్ 13,206 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఆయనకు 53,651 ఓట్లు పోలయ్యాయి. రెండో స్థానంలో నిలిచిన బిజెపి అభ్యర్థి డాక్టర్ వంశతిలక్కు 40,445 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత 34,462 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఇక్కడ మొత్తం 1,31,294 ఓట్లు పోలయ్యాయి. నోటాకు 969 ఓట్లు వచ్చాయి. 2023 డిసెంబరులో వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఈ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత గెలుపొందారు. కానీ రెండు నెలల్లోనే రోడ్డు ప్రమాదంలో ఆమె చనిపోవడంతో కంటోన్మెంట్‌కు ఉపఎన్నిక అనివార్యమైంది. మే 13న ఎన్నికలు జరగగా, జూన్ 4న ఫలితం వెలువడింది.
క్లుప్తంగా
- ఈ ఎన్నికల్లో బిజెపి 8 లోక్ సభల్లో గెలిచింది, 7 స్థానాల్లో రెండో స్థానం, రెండింటిలో మూడో స్థానంలో నిలిచింది.
- 8 ఎమ్మెల్యేలు ఉన్న బిజెపి ఈ ఎన్నికల్లో 46 అసెంబ్లీ సెగ్మెంట్లలో మెజార్టీ సాధించింది. 24 బీఆర్ఎస్, 15 కాంగ్రెస్ సెగ్మెంట్లలో బిజెపి ఆధిక్యం ప్రదర్శించింది.
- 64 స్థానాలున్న కాంగ్రెస్ 49 అసెంబ్లీలో ఆధిక్యాన్యి ప్రదర్శించింది. 15 అసెంబ్లీల్లో ఆధిక్యం నిలబెట్టుకోలేకపోయింది. కాంగ్రెస్ ఆధిక్యం కోల్పోయిన 15 సెగ్మెంట్లలో బిజెపి మెజార్టీ సాధించింది.
- 119 అసెంబ్లీల్లో 64 సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఆధిక్యం ప్రదర్శించింది. కాంగ్రెస్ 12 బీఆర్ఎస్ అసెంబ్లీల్లో… బిజెపి, ఎంఐఎం, సీపీఐ గెలిచిన ఒక్కో అసెంబ్లీల్లో మెజార్టీ దక్కించుకుంది.
- గత అసెంబ్లీ ఎన్నికల్లో 39 సెగ్మెంట్లు గెలుచుకున్న బీఆర్ఎస్ కేవలం 3 స్థానాల్లోనే ఆధిక్యం నిలబెట్టుకుంది. 36 స్థానాల్లో ఆధిక్యం చేజారింది.
- ఆధిక్యం నిలబెట్టుకున్న గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాకలోనూ గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే మెజారిటీ గణనీయంగా తగ్గింది.
- 24 బీఆర్ఎస్ అసెంబ్లీ సెగ్మెంట్లలో బిజెపి ఆధిక్యం ప్రదర్శించింది. 12 బీఆర్ఎస్ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఆధిక్యం ప్రదర్శించింది.
- 6 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎంఐఎం ఆధిక్యం నిలబెట్టుకుంది.
- 8 పార్లమెంటు స్థానాలు గెలిచిన కాంగ్రెస్… 8 స్థానాల్లో రెండవ స్థానం… హైదరాబాద్ లో మూడో స్థానం పొందింది.
- ఒక్క పార్లమెంట్ గెలవని బీఆర్ఎస్ కేవలం రెండింటిలోనే రెండో స్థానం దక్కించుకుంది. 8 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది. సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, చేవెళ్ల, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, జహీరాబాద్, హైదరాబాద్ బీఆర్ఎస్ డిపాజిట్ కోల్పోయిన స్థానాలు.