ఉన్మాదంతో పాకిస్తాన్ దాడులు – సంయమన భారత్ ధీటైన జవాబు
1947లో స్వాతంత్ర్యంతో పాటు ముస్లిం లీగ్, బాహ్య, అంతర్గత శక్తుల వల్ల దేశం మరోసారి ముక్కలైంది. మనదేశం నుంచి విడిపోయిన ఆ రెండు ముక్కలు తూర్పు, పశ్చిమ పాకిస్తాన్‌లు కాలక్రమంలో ఇస్లామిక్ పాకిస్తాన్, ఇస్లామిక్ బంగ్లాదేశ్‌గా రూపొందాయి. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 5 దశాబ్దాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ హిందూ వ్యతిరేక జీహాదీ అనుకూల విధానాలతో రాజ్యాంగం ఆదేశించిన ఉమ్మడి పౌరస్మృతి తీసుకురాకుండా, హిందూ జనాభా తగ్గించేందుకు హిందూ కోడ్ బిల్లులు, మైనార్టీ కమిషన్ స్పెషల్ రైట్స్, పర్సనల్ లా బోర్డ్, వక్ఫ్ బోర్డ్‌కు న్యాయ వ్యవస్థకు మించి అధికారాలు ఇవ్వడం లాంటి ఎన్నో చర్యలు చేపట్టింది. ఫలితంగా మనదేశంలో జీహాదీ శక్తులు బలపడుతూ వచ్చాయి. ఈ జీహాదీ శక్తులకు పాకిస్తాన్ కూడా మద్దతు ఇస్తూ వచ్చింది. కార్గిల్ సహా వరుసగా నాలుగు యుద్ధాల్లో మన దేశంలో చేతిలో ఓడిపోయినప్పటికీ 1990వ దశకం నుంచి ఒక దశాబ్దం క్రితం వరకు పాకిస్తాన్ ప్రేరేపించిన సరిహద్దు ఉగ్రవాదం వల్ల కాశ్మీరీ పండితులు ఊచకోత, కాశ్మీరీ బహిష్కరణ వంటివి చోటుచేసుకున్నాయి. యూపీఏ దశాబ్ద పాలనలో వందల కొద్దీ బాంబు పేలుళ్లు జరిగాయి, ఆ బాంబు పేలుళ్ల వెనక పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు ఉన్నాయని యావత్ ప్రపంచానికి తెలుసు.
2014లో మోదీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం సమర్థవంతంగా దేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పరుస్తూ, అంతర్గత శాంతిభద్రతలను పెంపొందిస్తూ, అట్టడుగు వర్గాలకు లబ్ధి చేకూర్చేలా దాదాపు 200 సంక్షేమ పథకాలు అమలు పరుస్తూ, మౌలిక వసతులను పెద్దఎత్తున అభివృద్ధి చేస్తూ, దేశ రక్షణ బలగాలకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల నుంచి రాఫెల్ యుద్ధ విమానాలు, ఎస్400 రక్షణ వ్యవస్థ వరకు సమకూర్చుకుంటూ అన్ని రంగాల్లో పరుగులెడుతోంది. పక్కలో బల్లెంలా ఉంటూ వస్తోన్న పాకిస్తాన్ భారతదేశ ప్రగతిని ఓర్వలేక ఉరి, పుల్వామా దాడులతో మన దేశాన్ని దెబ్బతీసే కుట్రలు చేసింది. అయితే.. సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ వైమానిక దాడులతో మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకత్వంలో మన రక్షక దళాలు సమర్థవంతంగా బుద్ధి చెప్పాయి. గత దశాబ్ద కాలంగా పాకిస్తాన్ గురించి చెప్తూ ‘‘ప్రపంచంలో ప్రతి దేశానికి సైన్యం దేశం కోసం అన్నట్టు ఉంటే.. పాకిస్తాన్‌లో మాత్రం సైన్యం కోసమే దేశం అన్నట్టు ఉంటుంది, ఇది ప్రమాదకరం’’ అని ఎంతో మంది అంతర్జాతీయ నిపుణులు హెచ్చరించారు.
కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటూ వస్తోంది. ముఖ్యంగా 2016లో పెద్దనోట్ల రద్దుతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు పెద్దదెబ్బే తగిలింది. ప్రస్తుతం పాకిస్తాన్ ఆహార పదార్థాల కోసం కూడా బిచ్చమెత్తుకునే పరిస్థితిలో ఉంది. పశ్చిమాన బెలూచిస్తాన్ ఉద్యమం, వాయువ్యాన ఖైబర్ ఫఖ్తూన్వా ప్రత్యేక దేశ వాంఛ, షియా, సున్నీల.. కలహాలతో నిరంతరం జరుగుతున్న బాంబు పేలుళ్లు, ఉగ్రవాదుల అంతర్గత పోరాటాలతో వరసగా జరుగుతున్న హత్యలతో సతమతమవుతోన్న పాకిస్తాన్ దేశ ప్రజల దృష్టి మరల్చడానికి మరోసారి తన పాత అస్త్రమైన సరిహద్దు ఉగ్రవాదంతో పహల్గాంలో దాడికి తెగబడింది. పర్యాటకులను మతం పేరు అడిగి, ప్యాంటు విప్పి, పురుషులను చంపి, మహిళలతో మీ మోదీకి చెప్పుకోండని చెప్పడంతో యావత్ దేశం ఉలిక్కి పడింది. దేశం ప్రతీకార చర్యల కోసం దేశ ప్రధాని, కేంద్ర ప్రభుత్వం వైపు చూశాయి. ఈ టెర్రరిస్టులకు, వారిని సమర్థించిన వారికి సరైన శాస్తి చేయాలని, మరొకసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలన్న ఆలోచనతో, పకడ్బందీ ప్రణాళికలతో, వరుస సమావేశాలతో మోదీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటూ, ఈ నెల 6న అర్ధరాత్రి తర్వాత పాకిస్తాన్‌లోని టెర్రరిస్టు స్థావరాలు, ప్రధాన కేంద్రాలపై 9 ప్రాంతాలలో జరిపి, భారత లక్ష్యం కేవలం టెర్రరిస్టులు మాత్రమేనని, ఇతర వ్యక్తులు కాదని స్పష్టమైన సంకేతం పంపించింది. దేశ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్న పాకిస్తాన్ అసమర్థ ప్రభుత్వం ఉగ్రవాదుల, సైన్యం ఒత్తిడితో తొందరపాటు చర్యగా మూడు రోజుల నుంచి అర్ధరాత్రి పూట మన పశ్చిమ, ఉత్తర ప్రాంతాలలో సరిహద్దు వెంబడి డ్రోన్లు, మిస్సైల్లతో దాడులకు పాల్పడుతోంది. అప్రమత్తంగా ఉన్న మన కేంద్ర బలగాలు ఈ దాడులను తిప్పికొడుతూ, పాకిస్తాన్ పౌరులు లక్ష్యంగా కాకుండా దాడులు చేస్తూ, భారతదేశం యుద్ధం కోరుకోవడం లేదని, కాకపోతే ఉగ్రవాద నిర్మూలన బలంగా కోరుకుంటుందన్న సంకేతాలు స్పష్టంగా పంపించింది. ఐఎస్ఐ, ఉగ్రవాదులు, సైన్యం చేతిలో కీలుబొమ్మగా ఉన్న అసమర్థ పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్ర అంతర్గత సమస్యను ఎదుర్కుంటూనే దిక్కుతోచని స్థితిలో మనదేశంపై ఉన్మాద దాడులకు, ముఖ్యంగా పౌరులను, దేవాలయాలను, గురుద్వారాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు యత్నిస్తోంది. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ మన ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ సలహాదారు అజిత్ దోవల్, సీడీఎస్ అధిపతి అనిల్ చవాన్, త్రివిధ దళాధిపతులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ, ప్రణాళికలు రచిస్తూ, అణ్వస్త్ర దేశమైన పాకిస్తాన్ విషయంలో అత్యంత జాగరూకతతో వ్యవహరిస్తూ, యావత్ ప్రపంచానికి విశదీకరిస్తూ, దేశ ప్రజల సంపూర్ణ మద్దతుతో అత్యంత విశిష్టమైన నిర్ణయాలు తీసుకుంటూ, అమలు చేస్తూ వస్తోంది. ఉన్మాద పాకిస్తాన్ మన నిర్ణయాలను కాపీ కొట్టే ఆలోచనలతో ఆపరేషన్ సింధూర్‌కు పోటీగా ఆపరేషన్ బున్యాన్ ఉల్ మర్సూస్ అనే పేరుతో రెచ్చిపోతూ పిచ్చి పనులు చేస్తోంది. మన దాడులను ఎదుర్కోలేక, మరో గత్యంతర లేని పరిస్థితుల్లో పాకిస్తాన్ యుద్ధ విరమణ కోసం అమెరికాను శరణుజొచ్చినట్టు తెలుస్తోంది. ఏమైనప్పటికీ పాకిస్తాన్‌లో ఉగ్రవాద సమూల నిర్మూలనతో యుద్ధం ముగియాలని భారత్ బలంగా కోరుకుంటోంది. సమర్థ సైన్యం, నాయకత్వం, దేశ ప్రజల ఆకాంక్షలు మనందరికీ శ్రీరామరక్షగా ఉంటాయని అందరి ప్రబల విశ్వాసం.