బీఆర్ఎస్ తో పొత్తు అంటే చెప్పుతో కొట్టండి
బిజెపి కార్యకర్తలకు బండి సంజయ్ పిలుపు
బిజెపి కార్యకర్తలారా…… ఇకపై ఎవరైనా బీఆర్ఎస్ తో బిజెపి పొత్తు ఉంటుందని చెప్పే వాళ్లను చెప్పుతో కొట్టండి అంటూ బిజెపి ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. పొత్తుపై మీడియాకు పదేపదే లీకులిచ్చే ఫాల్తు రాజకీయ నాయకులను సైతం చెప్పులతో కొట్టాలని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం నడుస్తోందన్నారు. అందులో భాగంగానే కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని కాగ్, విజిలెన్స్, కేంద్ర నివేదికలు తేల్చినా కేసీఆర్ సహా బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయడం లేదని మండిపడ్డారు. అందుకు ప్రతిఫలంగా బీఆర్ఎస్ నేతలు సైతం గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని అసెంబ్లీలో నిలదీయలేదన్నారు. తాను బతికున్నంత వరకు ప్రజల పక్షాన, హిందుత్వం కోసం పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. హిందుత్వం గురించి మాట్లాడలేని రోజు రాజకీయాల నుండి తప్పుకుంటానని చెప్పారు. 370 ఆర్టికల్ ను రద్దు చేయడంతోపాటు దేశాన్ని నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతూ నవభారత నిర్మాణం కోసం పాటుపడుతున్న నరేంద్ర మోదీకి 370 ఎంపీ సీట్లను బహుమతిగా ఇవ్వాలని ప్రజలను కోరారు. రాజరాజేశ్వర విజయ సంకల్ప యాత్రను కేంద్రమంత్రి బీఎల్ వర్మ, బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, ఎమ్మెల్యే కాటెపల్లి వెంకటరమణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ ‘‘రాముడిని కొలిచే వాళ్లంతా బిజెపికే ఓటేస్తారు. అయోధ్య అక్షింతలను రేషన్ బియ్యం, అయోధ్యలోనే రాముడు పుట్టారనడానికి ఆధారాలేమిటని హేళన చేసే కాంగ్రెస్ నేతలు దుర్మార్గులు. 370 ఆర్టికల్ ను రద్దు చేసిన మోదీకి 370 ఎంపీ సీట్లను గిఫ్ట్ ఇద్దాం. రామ మందిరం వద్దనుకునే వాళ్లు కాంగ్రెస్ కు ఓటేసుకోవచ్చు. మావైపు రాముడు, మోదీ ఉన్నారు.. వాళ్లవైపు రాక్షసులు, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలున్నయ్. ఎవరు కావాలో తేల్చుకోండి? 80 కోట్ల మందికి ఉచిత బియ్యం ఇస్తున్న మోదీ కావాలా? ఎలుకల మాదిరిగా బియ్యాన్ని కూడా మెక్కేందుకు సిద్ధమైన కాంగ్రెస్ కావాలా? ట్రిపుల్ తలాఖ్ చట్టాన్ని రద్దు చేయడంతోపాటు కరోనా వ్యాక్సిన్ తో దేశ ప్రజల ప్రాణాలను కాపాడిన మహానుభావుడు మోదీ. భారత్ నెంబర్ వన్ కావాలంటే మోదీ రావాల్సిందే. ఈ దేశంలో ప్రజల బతుకులు మారాలంటే… దేశం అభివృద్ధి చెందాలంటే మోదీ రావాల్సిందే. కాంగ్రెస్, బీఆర్ఎస్ అసెంబ్లీలో డ్రామాలాడినయ్. ఒకరు కాళేశ్వరం అంటే.. ఇంకొకరు క్రిష్ణా జలాలంటూ నాటకాలాడుతున్నరు. కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయమైందని, కాళేశ్వరం పేరుతో రూ.లక్ష కోట్ల ధనాన్ని దుర్వినియోగం చేసిందని సీఎం సహా ప్రభుత్వం చెప్పింది. విజిలెన్స్, కాగ్ సహా నివేదికలిచ్చింది. మరి కేసీఆర్ సహా బాధ్యులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? వాళ్ల ఆస్తులను ఎందుకు జప్తు చేయడం లేదు? అట్లాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీలెందుకు అమలు చేయడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నిలదీసిందా? ఎందుకు ప్రశ్నించలేదో తెలుసా? వీళ్లిద్దరి మధ్య ఒప్పందం ఉంది. ఈసారి ఎవరెన్ని కుట్రలు చేసినా బిజెపికి 370 సీట్లు రాబోతున్నయ్. తెలంగాణలో బిజెపి సింగిల్ గా పోటీ చేస్తది. 17 కు 17 ఎంపీ సీట్లు రాబోతున్నయ్. బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు…’’ అని అన్నారు.