2 లక్షల ఉద్యోగాలేవి? జాబ్ క్యాలెండర్ ఏది?
కాంగ్రెస్ భర్తీ చేస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడికి పోయాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి నిలదీశారు. సీఎం జాబ్ క్యాలెండర్ గురించి మర్చిపోయారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అమలు చేయలేదని, ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డులు ఏవన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటీ ఇస్తామని చెప్పి మాట తప్పారని మండి పడ్డారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూలై 20న బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సేవెళ్ల మహేందర్ అధ్యక్షతన బీజేవైఎం నిరుద్యోగ మహాధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి విద్యార్థులు, నిరుద్యోగులు, బీజేవైఎం కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ యువత న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ‘‘ఎన్నికలకు ముందు కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ పేరుతో నిరుద్యోగులకు అనేక హామీలిచ్చి, అధికారంలోకి వచ్చాక మోసం చేసింది. 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తామని చెప్పి ఏ ఒక్కటీ అమలు చేయడం లేదు. ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న అనే చందంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోంది. ఉస్మానియా విద్యార్థులను, నిరుద్యోగులను అవమానపర్చేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడటాన్ని ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాభవన్ కు వెళ్లడంలేదు.. దరఖాస్తులు తీసుకోలేదు. సెక్రటేరియట్ కు కాంగ్రెస్ నాయకులు, పైరవీకారులకు ఎంట్రీ ఉంది. కాని, నిరుద్యోగ యువకులను వెళ్లనివ్వడం లేదు. కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం, తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు అతి తక్కువ కాలంలోనే ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్నవి. బిజెపి రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోంది. అబద్ధాలు ఆడటం, మోసం చేయడం కాంగ్రెస్ కు వెన్నతో పెట్టిన విద్య. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలే గుదిబండలుగా మారుతాయి.
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్, కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయకుండా, నోటిఫికేషన్లు ఇ్వకుండా తెలంగాణ యువతను వెన్నుపోటు పొడిచి మోసం చేసింది. ధర్నాచౌక్ లో ఉద్యమాలు చేయొద్దని నిషేధం విధించిన ఘనుడు కేసీఆర్. గులాబీ జెండా పోయి.. చేయి గుర్తు జెండా వచ్చింది. కేసీఆర్ దోపిడీ పోయి.. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి దోపిడీ వచ్చింది. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ పార్టీ మంత్రులు, హైకమాండ్ కు మాత్రమే లాభం జరిగింది. కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పిన విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు. అధికార దుర్వినియోగం, పార్టీ ఫిరాయింపులు కొనసాగుతున్నాయి. నాడు ప్రజాతీర్పునకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చకున్నారు. నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారు. ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. మార్పు కోసం కాంగ్రెస్ అన్నారు.. కాని, పాలనలో, తెలంగాణ ప్రజల జీవితాలలో మార్పు రాలేదు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి. బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీలు దొందు దొందే. రెండు పార్టీలు ఒకే తాను ముక్కలే. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్యాయానికి గురవుతున్న, మోసపోయిన విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, మహిళలకు అండగా బిజెపి ఉంటుంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చేలా ఒత్తిడి తీసుకువచ్చేలా బిజెపి పోరాటం చేస్తుంది.’’ అని కిషన్ రెడ్డి అన్నారు.
రేవంత్ బాబా 11 దొంగలు
బీజేఎల్పీ నాయకులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ బాబా 11 దొంగలుగా మంత్రులు ఎక్కడికక్కడ కౌంటర్లు ఏర్పాటు చేసుకుని పాలన కొనసాగిస్తున్నారని విరుచుకుపడ్డారు. ‘‘మన నీళ్లు, నిధులు, ఉద్యోగాలు మనకు వస్తాయని యువత తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందుండి పోరాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో యువతను పూర్తిగా విస్మరించి, తీవ్ర అన్యాయం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో యువతకు మరింత అన్యాయం చేస్తున్నరు. యువత డిక్లరేషన్ పేరుతో 2 లక్షల ఉద్యోగాల కల్పన, రూ. 4 వేల చొప్పున నిరుద్యోగ భృతి, స్వయం ఉపాధి కోసం రూ. 10 లక్షల ఇస్తామన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మాట మార్చి అన్యాయం చేసింది. డిమాండ్ల సాధన కోసం నిరసన తెలుపుతున్న నిరుద్యోగులపై లాఠీచార్జ్ లతో, కేసులు, నిర్భంధాలతో అణచివేస్తున్నరు.’’ అని అన్నారు.
బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సేవెళ్ల మహేందర్ మాట్లాడుతూ ‘‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగుల భవిష్యత్తును తాకట్టు పెట్టారు. బీజేవైఎం ఆధ్వర్యంలో చేపట్టిన పోరాటాన్ని నీరుగార్చేలా కార్యకర్తలను, నిరుద్యోగులను ప్రభుత్వం అరెస్టు చేసింది. నిరుద్యోగులకు న్యాయం చేయమని కోరితే లాఠీలతో కొట్టించారు. నిరుద్యోగులు ఏకమై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఘోరీ కడతారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా నిరుద్యోగుల తరఫున ఉద్యమాన్ని ఆపం. వాగ్దానాలు నెరవేర్చకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం.’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రాంచంరద్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. కాసం వెంకటేశ్వర్లతో బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

