6 గ్యారంటీలు, డిక్లరేషన్లను ముంచేందుకే మూసీ ప్రక్షాళన

త అసెంబ్లీ ఎన్నికల్లో అధికార దాహంతో ఇచ్చిన అలవికాని హామీల అమలులో ఘోర వైఫల్యం చెందిన రేవంత్ ప్రభుత్వం ఆ హామీల దగా నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ‘హైడ్రా’మాలు, కుల గణనలు, ముఖ్యంగా మూసీ ప్రాజెక్టును ఎంచుకుంది. కేసీఆర్ తరహాలోనే మాటల గారడీ, మోసపూరిత హామీల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు దాటినా 100 రోజుల్లో 6 గ్యారెంటీలు, ఇతర హామీల అమలు అడ్రస్ లేకుండా పోయింది. కేసీఆర్ తరహాలోనే ప్రధాన స్రవంతి మీడియాలోని అనేక గ్రూపులను నయానో, భయానో లొంగదీసుకున్న రేవంత్ ప్రభుత్వం ప్రజల్లో కాంగ్రెస్ హామీల దగా చర్చ ఉండకుండా రకరకాల జిమ్మిక్కులు చేస్తున్నది. యోగి వేమన చెప్పినట్టు ‘‘అల్పుడెప్పుడు పలుకు ఆడంబరంగానూ’’ అన్నట్టు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ దగాకోరు హామీలు, రేవంత్ మాయమాటల ఫలితాలు ఇప్పుడు ప్రజలకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ ను గెలిపిస్తే పెనం మీంచి పొయ్యిలో పడే పరిస్థితి వస్తుందన్న బిజెపి హెచ్చరికలు ఇప్పుడు వాస్తవమవుతున్నాయి. బిజెపి, బీఆర్ఎస్ ఒక్కటే అన్న కాంగ్రెస్ భయంకర విష ప్రచారం వలలో పడిన అమాయక తెలంగాణ ప్రజలు కాంగ్రెస్, రేవంత్ గత చరిత్రను మరచిపోయి, మరో దుర్మార్గ పార్టీకి అధికారం అందించి ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నారు.

రైతులను, యువతను, మహిళలను, విద్యార్థులను ఎన్నికల సమయంలో హామీలతో ముంచెత్తిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రైతు భరోసా కాదు, రైతుబంధుకే దిక్కులేదు… రూ.500 బోనసే కాదు వడ్ల కొనుగోలే గతి లేదు. కేసీఆర్ పాలన తరహాలోనే అకాల వర్షాలలో వరి ధాన్యానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. అధికారంలో ఉన్న పార్టీ, నాయకులే మారారు తప్ప పాలన మాత్రం ఏమీ మారలేదని 11 నెలల్లోనే ప్రజలు గ్రహిస్తున్నారు. మహిళలకు నెలకు రూ.2500, రూ.500 గ్యాస్… యువతకు నిరుద్యోగ భృతి..  వృద్ధులకు నెలకు రూ.4000 పెన్షన్… విద్యార్థినులకు స్కూటీలు… లాంటి వందల కొద్ది హామీలను శాశ్వతంగా మూసీలో ముంచేందుకే ‘హైడ్రా’మా, కులగణన నాటకం, ముఖ్యంగా మూసీ ప్రాజెక్టు పేరిట రేవంత్ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోంది. తెలంగాణ ప్రజల నుంచే కాకుండా సొంత పార్టీ కార్యకర్తల నుంచీ రేవంత్ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. సమగ్ర కుటుంబ సర్వే, కుల గణన కోసం పెట్టిన జిల్లా కాంగ్రెస్ మీటింగుల్లో కింది స్థాయి కార్యకర్తలే కాకుండా ద్వితీయ శ్రేణి నాయకులు సైతం మంత్రులపై, ఎమ్మెల్యేలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్షేత్రస్థాయి పరిస్థితులు రేవంత్ ప్రభుత్వానికి తెలియజేయాలని స్పష్టం చేశారు. వడ్లకు బోనస్, రైతు భరోసా గురించి అడిగితే తాము ఏమీ చెప్పలేకపోతున్నామని, ప్రజలకు మొఖం చూపించలేకపోతున్నామని… ఇదే పరిస్థితి కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతవుతుందని తీవ్ర హెచ్చరికలు చేశారు. ఇక ఖమ్మం జిల్లాలో అయితే ఓ మంత్రి తుమ్మల మరో మంత్రి పొంగులేటిని ఓవర్ యాక్షన్ చేయకు అని పబ్లిగ్గా హెచ్చరించే వరకు వెళ్లిందంటే కాంగ్రెస్ పై పెద్దపెట్టున వస్తోన్న వ్యతిరేకత మంత్రుల స్థాయి వరకు చేరిందని అర్థం చేసుకోవచ్చు.

గతంలో కేసీఆర్ అంతుకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించి, తాను అధికారంలోకి వచ్చాక అవే నిర్ణయాలను కొనసాగించినట్టు… ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా 2014లో కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వేను అప్పుడు తీవ్రంగా వ్యతిరేకించిన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇప్పుడు కొత్త పేరుతో అదే సర్వేను మళ్లీ చేయడాన్ని చూస్తున్న ప్రజలు తమను దగా చేయడంలో కేసీఆర్, రేవంత్ మధ్య తేడా లేదని నిప్పులు చెరుగుతున్నారు. కాళేశ్వరంతో కేసీఆర్ ఎలా దోపిడీ చేశాడో రేవంత్ రెడ్డి కూడా మూసీ ప్రాజెక్టుతో అదే దోపిడీ ఎజెండాతో ఉన్నారు. కేసీఆర్ లాగా మాటల గారడీ, కేటీఆర్ లాగా ఉన్మాద అహంకారం… రెంటినీ కలిగిన రేవంత్ రెడ్డి మూసీ ప్రాజెక్టును అడ్డుకుంటే బుల్‌డోజర్లతో తొక్కిస్తానని ఒక దుర్మార్గ, నియంత లాగా చట్టవ్యతిరేకంగా హెచ్చరిస్తున్నాడు. కేసీఆర్ అవినీతిపై ఎన్నో విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఒక్క కేసులోనూ, కేసీఆర్ ఒక్క కుటుంబ సభ్యుడిని కూడా జైలుకు పంపకపోవడం కల్వకుంట్ల కుటుంబానికి, కాంగ్రెస్ మధ్య ఉన్న అంతర్గత అవగాహనకు అద్దం పడుతోంది. దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే బీఆర్ఎస్, బిజెపి ఒక్కటే అని రేవంత్ చేస్తున్న తప్పుడు ప్రచారం కోర్టు చివాట్లు తినే వరకు వెళ్లింది. ఇప్పుడు కేటీఆర్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంతో తమకున్న అంతర్గత అవగాహనను ప్రజలకు తెలియకుండా చేయడానికి బిజెపి, కాంగ్రెస్ ఒక్కటే అని కొత్త రాగాన్ని అందుకున్నారు. వాస్తవానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటే. రెండూ కుటుంబ పార్టీలే, రెండూ హిందూ వ్యతిరేక పార్టీలే, రెండూ ఓటుబ్యాంకు రాజకీయ పార్టీలే, రెండూ భయంకర అవినీతి పార్టీలే, రెండూ మీడియాను నయానా భయానా లొంగదీసుకునే పార్టీలే… ఇది ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థం కావడం మొదలైంది. ఎన్నికల ముందు బిజెపి, ఎంఐఎం ఒక్కటే అన్న రేవంత్ ఫలితాలు రాగానే ప్రోటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీని పెట్టి, అదే అక్బరుద్దీన్ ను ఉప ముఖ్యమంత్రి చేస్తానని అసెంబ్లీలోనే చెప్పడం కాంగ్రెస్ దగాకోరు ప్రచారం, దివాళాకోరు రాజకీయాన్ని ప్రతిబింబిస్తోంది.

కేంద్రంలో మోదీ ప్రభుత్వం, బిజెపి జాతీయ, రాష్ట్ర నాయకులు తెలియజేస్తున్న విషయాలను గ్రహించిన ప్రజలు రాష్ట్రం నుంచి 30లక్షలకు పైగా సభ్యత్వం వచ్చేలా చేసి బిజెపి పట్ల అభిమానాన్ని, మద్దతును చాటుకున్నారు. ఈ పరిస్థితి గమనించిన రెండు దోపిడీ పార్టీలు ముందుముందు ఎన్ని కొత్త డ్రామాలకు తెరతీస్తాయో కొంచెం అవగాహన తెచ్చుకొని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ బిజెపి హెచ్చరిస్తోంది.