free bus

మహిళలకు ‘ఉచిత బస్సు ప్రయాణం’ హామీతో ఇరకాటంలో ఆర్టీసీ

Bus Kastaluన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంతోఇంతో అమలు పరుస్తున్నది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మాత్రమే. అయితే అందుకు అవసరమైన నిధులను విడుదల చేయక పోవడంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండో రోజే గొప్పగా ప్రారంభించిన మహాలక్ష్మి పథకం ఆర్టీసీని నష్టాల్లోకి నెట్టివేస్తుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం అమల్లోకి వచ్చిన తరువాత ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ 100 శాతానికి పెరిగిందని, కొన్ని బస్సుల్లో 120 శాతం కూడా ఉంటోందని సంస్థ అధికారులు చెబుతున్నారు. రికార్డు స్థాయిలో రోజుకు 50 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ ద్వారా ప్రయాణాలు సాగిస్తున్నట్టుగా వెల్లడించారు. ఇందులో 70 శాతం మంది మహిళా ప్రయాణికులే కావటం గమనార్హం.

ఈ ఉచిత బస్సు పథకం కింద మహిళలకు జీరో టికెట్‌ ఇస్తుండగా వాటికి డబ్బులను ప్రభుత్వం చెల్లిస్తుంది. మహిళల జీరో టికెట్‌కు సంబంధించి దాదాపు రూ.2500 కోట్ల నిధులను సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం బకాయి ఉన్నట్టు సమాచారం. ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిన కొత్తలో బస్‌పాస్‌ల రాయితీ కోసం రూ.340 కోట్లు విడుదల చేసింది. ఉచిత బస్సు ప్రయాణం టికెట్ల నిధులను ప్రతీ నెలా చెల్లిస్తామని పథకం ప్రారంభం రోజున సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రకటించారు. కానీ ప్రభుత్వం నిధులు విడుదల చేయడం మర్చిపోవడంతో ఆర్టీసీ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకు పోతున్నది. కొద్దిపాటి ఆదాయాన్ని నిర్వహణకు వినియోగిస్తూ, ఉద్యోగులకు చెల్లించాల్సిన మొత్తాల గురించి పట్టించుకోవడం లేదు. ఉద్యోగకాలంలో పోగైన 300 ఆర్జిత సెలవు (ఈఎల్స్‌)లకు ఎన్‌క్యాష్‌మెంట్‌ ఉంటుంది. ఆర్టీసీలో పదవీవిరమణ వయసు 60 ఏళ్లకు పెంచిన తర్వాత, 2022 డిసెంబర్‌ నుంచి ఆర్జిత సెలవుల మొత్తం చెల్లించటం ఆగిపోయింది. ఈ మొత్తం కనిష్టంగా రూ.5 లక్షల వరకు ఉంటుంది. ఆర్టీసీ ఉద్యోగులకు కరువు భత్యం పేరుకుపోయాయి. 2017లో జరగాల్సిన వేతన సవరణను గత మే నెల నుంచి అమలులోకి తెచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం 21 శాతం ఫిట్‌మెంట్‌తో దాన్ని అమల్లోకి తెచ్చింది. కానీ వాటి బకాయిలను రిటైర్మెంట్‌ సమయంలోనే చెల్లించనున్నట్టు అప్పట్లో ఆర్టీసీ వెల్లడించింది. ఆర్టీసీలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఇచ్చే గ్రాట్యుటీ చెల్లింపులకు ఫిబ్రవరి నుంచి బ్రేక్‌ పడింది. డ్రైవర్‌, కండక్టర్‌ లాంటి వారికి దాదాపు రూ.10 నుంచి రూ.15 లక్షల వరకు ఈ మొత్తం అందాల్సి ఉంటుంది. ఈడీ లాంటి పెద్ద పోస్టులోని అధికారులకు రూ.60 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. దాదాపు 500 కుటుంబాలు గ్రాట్యుటీ కోసం ఎదురు చూస్తున్నాయి. ఆర్టీసీలో 2013 వేతన సవరణను 2015లో అమలు చేశారు. రెండేండ్ల బకాయిల్లో 50 శాతం మొత్తాన్ని బాండ్ల రూపంలో చెల్లించాల్సి ఉంది. సర్వీసు ఉద్యోగులకు పెండింగ్‌లో పెట్టినా, రిటైర్‌ అయిన వారికి వెంటనే చెల్లిస్తూ వస్తున్నారు. జనవరి నుంచి రిటైర్‌ అయిన వారికి కూడా చెల్లించటం నిలిపివేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువు దీరిన నేపథ్యంలో అందరు ఉద్యోగులకు బాండ్‌ బకాయిలు చెల్లిస్తామని మూడు నెలల క్రితం సీఎం రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చారు. కొన్ని నిధులే విడుదల కావటంతో కేవలం డ్రైవర్లకు చెల్లించి వదిలేశారు. జనవరి నుంచి రిటైర్డ్‌ ఉద్యోగులకు చెల్లింపులు మాత్రం పునరుద్ధరించలేదు. ఒక్కో ఉద్యోగికి దాదాపు రూ.1.50 లక్షన్నర వరకు అందాల్సి ఉంది. దాదాపు 1500 రిటైర్డ్‌ ఉద్యోగుల కుటుంబాలు ఈ నిధుల కోసం ఎదురుచూస్తున్నాయి. మరోవైపు పెరిగిన రద్దీకి అనువుగా బస్సుల సంఖ్యను పెంచడం లేదు. పండుగలు, ప్రత్యక సందర్భాలలో ప్రత్యేక బస్సులు నడపాల్సి వచ్చినప్పుడు రోజువారీ నడిపే బస్సుల సంఖ్యను తగ్గించి వేస్తున్నారు. ఇంకోవైపు బస్సుల నిర్వహణ గురించి దృష్టి సారించేందుకు ఆర్టీసీ ఖర్చులకు వెనుకాడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

కృష్ణ చైతన్య