ఎన్టీపీసీ విద్యుత్ తెలంగాణకు అక్కర్లేదా?
తెలంగాణలో విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచి, రాష్ట్ర ప్రజలకు వీలైనంత ఎక్కువ విద్యుత్‌ను అందుబాటులో ఉంచాలనుకున్న కేంద్రం ప్రయత్నాలకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి 4వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి చేపట్టే ప్రాజెక్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మొదటి విడతగా 800 మెగావాట్ల సామర్థ్యం గల 2 పవర్ ప్లాంట్లను ఎన్టీపీసీ ఆధ్వర్యంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.10,598.98 కోట్లతో చేపట్టిన ఈ రెండు పవర్ ప్రాజెక్టుల్లో మొదటి 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను 3 అక్టోబర్ 2023న, రెండో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను 4 మార్చ్ 2024న ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ఈ 1600 మెగావాట్ల ప్రాజెక్ట్ లో 85 శాతం విద్యుత్ ను తెలంగాణ అవసరాలకే వినియోగిస్తున్నారు.
ఈ 4వేల మెగావాట్ల ప్రాజెక్టులో మిగిలిన 2400 మెగావాట్ల ప్రాజెక్టును కూడా వీలైనంత త్వరగా ప్రారంభించుకొని రాష్ట్రానికి విద్యుత్ భద్రత కల్పించాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకు గానూ ఎన్టీపీసీతో రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ ట్రాన్స్ కో) విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాతే ప్లాంట్ల ఏర్పాటుకు, తగినంత బొగ్గు అందుబాటులో ఉంచుకోవడం తదితర అంశాలపై ఎన్టీపీసీ పని ప్రారంభిస్తుంది. ఒకవైపు, దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఎస్టీపీపీ-II ప్రాజెక్టును కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి విద్యుదుత్పత్తి పెంచాలనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచన. దీనికి అనుగుణంగానే పీపీఏ విషయంలో త్వరగా స్పందించి సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి 4సార్లు లేఖలు రాసినా స్పందన రాలేదు. 5 అక్టోబర్, 2023న, 9 జనవరి, 2024న, 29 జనవరి, 2024న ఆ తర్వాత 29 ఏప్రిల్, 2024న లేఖలు రాస్తే వీటికి టీఎస్ ట్రాన్స్ కో నుంచి సమాధానం రాలేదు. ఇన్ని సార్లు లేఖలు రాసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో రామగుండంలో కేంద్రం నిర్మించనున్న ఎస్టీపీపీ-II ప్రాజెక్టు నుంచి విద్యుత్ కొనుగోలు చేసే ఆసక్తి రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నట్లుగానే భావించాల్సి వస్తుందని ఎన్టీపీసీ లేఖలో పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వానికి ఆసక్తి లేని పక్షంలో దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలకు విక్రయించేందుకు అనుమతి ఉంటుందన్నది ఎన్టీపీసీ రాసిన లేఖల సారాంశం.
30 మే 2024న దేశవ్యాప్తంగా 250 గిగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. మార్చి 2024లో తెలంగాణలో గరిష్టంగా (పీక్ పవర్ డిమాండ్) 15.6 గిగావాట్ల డిమాండ్ ఏర్పడింది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) అంచనాల ప్రకారం 2030 నాటికి తెలంగాణలో పీక్ పవర్ డిమాండ్ ఇప్పుడున్న దానికి రెట్టింపు కానుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పెరుగుతున్న పరిశ్రమలు, గృహ అవసరాలకు నిరంతరాయంగా విద్యుత్ అందించేందుకు రెండోదశ ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ (2400 మెగావాట్లు)ను వీలైనంత త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది. తెలంగాణలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ పై తొలి హక్కు తెలంగాణ ప్రజలదే. కేంద్రం అన్నిరకాలుగా సహకరిస్తున్నా అందుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోందనేది మరోసారి నిరూపితమైంది. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీపీసీ లేఖలపై స్పందించి పీపీఏ చేసుకుంటే అది రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడినట్లు అవుతుంది.
జి. కిషన్ రెడ్డి,
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి