UCC WOMEN

ఉమ్మడి పౌరస్మృతి: స్త్రీలకూ న్యాయం చేసే దిశలో ఒక ముందడుగు

ర్రకోట బురుజుల నుంచి ఆగస్టు 15న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన స్వాతంత్ర దినోత్సవ ప్రసంగం ప్రభుత్వంపై ఆయన పూర్తి పట్టు కలిగి ఉన్నారన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. సంకీర్ణ ప్రభుత్వంలో అస్థిరత, ప్రభుత్వంపై నియంత్రణ గురించి ఎవరిలో ఏమైనా అపోహలు ఉండి ఉంటే వాటిని తొలగిస్తూ మోదీ ఇంతకుముందు మాదిరిగానే అదే ఉత్సాహాన్ని, నిబద్ధతను, పట్టుదలను ప్రదర్శించారు. ‘వికసిత్ భారత్ కేవలం మాటలు కాదు. 140 కోట్ల మంది ప్రజల పట్టుదల, స్వప్నాలకు వ్యక్తీకరణ’ అని ఆయన పునరుద్ఘాటించారు. భారత్ ను ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడం గురించి మాట్లాడారు. అలాగే వ్యవసాయ రంగం, మహిళల రక్షణ, దేశంలో అస్థిరత సృష్టించడానికి విదేశీ శక్తులు చేస్తున్న ప్రయత్నాల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. అసంపూర్ణంగా మిగిలిపోయిన భారత రాజ్యాంగం ఏజెండా గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, దేశంలో ఉమ్మడి పౌరస్మృతిని తీసుకురావాలని పిలుపునిచ్చారు. ‘ఉమ్మడి పౌరస్మృతిపై సుప్రీంకోర్టు అనేకసార్లు చర్చించింది. ఉత్తర్వులు ఇచ్చింది. ఎందుకంటే దేశంలోని ఒక పెద్ద సమూహం ప్రస్తుతం అమలులో ఉన్న పౌరస్మృతి మతపరమైన పౌరస్మృతి అని, వివక్షాపూరితమైన పౌరస్మృతి అని భావిస్తోంది. ఇది నిజం కూడా’ అని ఆయన పేర్కొన్నారు. ‘మతపరంగా దేశాన్ని విభజించే చట్టాలను బుట్టదాఖలు చేయాలి. అధునాతన సమాజంలో వాటికి చోటు లేదు. లౌకిక పౌరస్మృతిని ప్రవేశపెట్టడానికి సమయం ఆసన్నమైంది. అప్పుడే మనం మత వివక్షను తొలగించగలం,’ అని ఆయన ఉద్ఘాటించారు. అయితే ఇక్కడ ప్రధానమంత్రి ‘లౌకిక వాద పౌరస్మృతి’ అనే పదాన్ని వాడటం ఆసక్తికరం.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ సభలో లౌకిక పౌరస్మృతి కోసం వాదించారు. అందరికీ ఒకే పౌరస్మృతి ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. నేడు మోదీ కూడా అదే స్ఫూర్తితో మాట్లాడారు. ఉమ్మడి పౌరస్మృతిని ప్రతిపాదించిన ముసాయిదా రాజ్యాంగంలోని అధికరణం 35పై 1948 నవంబర్ 23న రాజ్యాంగ సభలో చర్చ జరిగినప్పుడు దీనిపై చర్చ మతపపరంగా ఉండరాదని అంబేద్కర్ గట్టిగా వాదించారు. పోకర్ సాహెబ్, హుస్సేన్ ఇమామ్, మొహమ్మద్ ఇస్మాయిల్ సాహెబ్ వంటి సభ్యులు ఈ అధికరణానికి ప్రతిపాదించిన సవరణలను ఆయన గట్టిగా తిరస్కరిస్తూ భారతదేశమంతటా షరియా (ఇస్లామిక్) మత చట్టం ఒకే విధంగా ఉందన్న వారి వాదనను తోసిపుచ్చారు. నేరస్మృతి, వారసత్వ చట్టం, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ చట్టం వంటి అనేక ఇతర చట్టాలు భారతీయులందరికీ వర్తిస్తున్నాయని, వారి జీవితంలోని అనేక పార్శ్వాలను స్పృశిస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. 1937లో బ్రిటిష్ వారు షరియా చట్టాన్ని ఆమోదించే వరకు బ్రిటిష్ పాలనలో వున్న రాష్ట్రాల్లోని చాలామంది ముస్లింలు హిందూ చట్టాలనే అనుసరించారని ఆయన గుర్తుచేశారు. వాయువ్య సరిహద్దు ప్రాంతం ( ఇప్పుడు ఖైబర్ పక్తూన్వాలా) లో 1935 వరకు షరియ అమల్లో లేదు. ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉన్న యునైటెడ్ ప్రావిన్సెస్, సెంట్రల్ ప్రావిన్సెస్, బాంబే వంటి రాష్ట్రాలతో సహా ఎక్కడ 1937 వరకు షరియ అమలులో లేదు. ఆ రాష్ట్రాల్లోని ముస్లింలు వారసత్వం, ఇతర అంశాల విషయంలో హిందూ చట్టాలనే పాటించేవారు. ఉత్తర మలబారు ప్రాంతంలో అక్కడి ప్రజలు పాటించే మరుమక్కదయం అనే చట్టాన్ని అంబేద్కర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇది హిందువులకు, ముస్లింలకు ఇద్దరికీ వర్తించేది. ఈ చట్టం ద్వారా కేరళ ప్రజలు మాతృస్వామ్య వ్యవస్థను అనుసరించేవారు.

ఒక లౌకికవాద చట్టాన్ని దేశంలోని ప్రజలందరికీ వర్తింపజేయడం ఎంత సహజమో ఉమ్మడి పౌరస్మృతిని కూడా అలాగే చూడాలని అంబేద్కర్ వాదించారు. ‘అందువల్ల, మతాలతో ప్రమేయం లేకుండా పౌరులందరికీ వర్తించే ఒకే పౌరస్మృతిని రూపొందించేందుకు హిందూ చట్టాల్లోని కొన్ని భాగాలను అధికరణం 35లో చేర్చినంత మాత్రాన దాన్ని ముస్లిం మనోభావాలకు జరిగిన ఘోరమైన అన్యాయంగా పరిగణించరని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అవి కేవలం హిందూ చట్టాల్లో కూడా ఉన్నాయని మాత్రమే కాక అవి ప్రజలందరికీ వర్తించే స్వభావం కలిగినవనే ఉద్దేశంతో వాటిని ఈ అధికరణలో భాగం చేస్తున్నాం,’ అని ఆయన వ్యాఖ్యానించారు.

1952లో మొదటి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాల్సి ఉండే. జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంలో విద్యామంత్రిగా పని చేసిన ఎంసీ చాగ్లా, ‘అధికరణం 44 (ఉమ్మడి పౌరస్మృతి అమలుకు సంబంధించినది) కి ప్రభుత్వం కట్టుబడి ఉండాలి. ప్రభుత్వం ఈ నిబంధనను అమలు పరచాలి,’ అని పట్టుబట్టారు. అయితే నెహ్రూ 1954లో హిందూ చట్టాలను సంస్కరించే మంచి అవకాశం వచ్చినప్పుడు ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసేందుకు ధైర్యం చేయలేకపోయారు. ‘దాన్ని అమలు చేయడానికి భారతదేశంలో సరైన సమయం ఆసన్నమైందని నేను భావించడం లేదు,’ అని చెప్పి తప్పించుకున్నారు. అప్పటినుంచి ఈ విషయం నలుగుతూనే ఉంది. హిందూ పురుషులు రెండో పెళ్లి చేసుకోవడానికి ఇస్లాం మతంలోకి మారడం వంటి కేసులు అనేకం కోర్టుల్లో విచారణకు వచ్చాయి. షరియ మత చట్టాలను అనుసరించడం అనేది ఇస్లాం మతం వారికే పరిమితం అన్న వాదనను కోర్టులు తిరస్కరిస్తూ పౌర చట్టాల్లో సంస్కరణలు తీసుకురావడం ఏదో ఒక మతానికి మాత్రమే సంబంధించిన అంశం కాదని, అందువల్ల ఉమ్మడి పౌరస్మృతి చాలా ముఖ్యమని అనేక సందర్భాల్లో పేర్కొన్నాయి.

సరళా ముద్గల్ వర్సెస్ యూనియన్ అఫ్ ఇండియా 1995 కేసులో సుప్రీంకోర్టు, ’80 శాతం మంది పౌరులు ఇప్పటికే క్రోడీకరించిన మత చట్టాల పరిధిలోకి తీసుకురాబడినందున పౌరులందరికీ వర్తించే ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని వాయిదా వేయడంలో అర్థం లేదు,’ అని వ్యాఖ్యానించింది. జాన్ వల్లమోటం వర్సెస్ యూనియన్ అఫ్ ఇండియా (2003) కేసులో సుప్రీంకోర్టు మరోసారి ‘రాజ్యాంగంలోని అధికరణం 44ను ఇంతవరకు అమలు చేయకపోవడం దురదృష్టకరం’ అని వ్యాఖ్యానించింది. విభిన్న మత చట్టాల వల్ల ఏర్పడిన గందరగోళాన్ని ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు, ఒక ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి అసలు ఉందా? లేదా? అని 2015 అక్టోబర్లో ప్రశ్నించింది. ‘ఉమ్మడి పౌరస్మృతి అంశం ఏమైంది? దాన్ని మీరు ఎందుకు రూపొందించి అమలు చేయడం లేదు?’ అని కోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది.

సుప్రీంకోర్టు తీర్పులు, వ్యాఖ్యల ఆధారంగా భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ (బిఎంఎంఏ) సహ వ్యవస్థాపకులైన నూర్జహాన్ సఫియా, జకియా సోమన్ లు 2015 నవంబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక లేఖ రాశారు. ‘ముస్లిం మత చట్టాల్లో ఎటువంటి సంస్కరణలను తీసుకురాకుండా కొందరు సనాతన, పురుషస్వామ్య వాదులు అడ్డుపడుతున్నారు. ఈ క్రమంలో ముస్లిం మహిళలకు ఖురాన్ కల్పించిన హక్కులతో పాటు భారతీయ పౌరులుగా లభించాల్సిన హక్కులు సైతం దక్కటం లేదు. మొరాకో, టునీషియా, టర్కీ, ఈజిప్టు, జోర్డాను, చివరికి మన పొరుగు దేశాలైన బాంగ్లాదేశ్, పాకిస్థాన్ లతో సహా ప్రపంచంలోని దాదాపు అన్ని ముస్లిం దేశాలూ వివాహం, కుటుంబానికి సంబంధించిన మత చట్టాలను సంస్కరించాయి. భారతీయ ముస్లింలకు మాత్రం ఈ అవకాశం లభించడం లేదు,’ అని వారు ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. బిఎంఎంఏ నాయకులు వాదించినట్టు మత చట్టాలను క్రోడీకరించడానికి మతానికి సంబంధం లేదు. ఇది స్త్రీలకు న్యాయం చేసే దిశగా వేసే ఒక ముందడుగు. ప్రధానమంత్రి మోదీ చెప్పినట్టు ఒక లౌకికవాద ఆవశ్యకత.

రాం మాధవ్,
బిజెపి సీనియర్ నాయకులు