భారత్ ఉజ్వల భవిష్యత్తుకు మార్గదర్శనం
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి చారిత్రాత్మక ప్రసంగం చేశారు. దేశ స్వాతంత్య్ర పోరాటాన్ని ప్రేరేపించిన జాతీయవాద ఉద్యమం సైద్ధాంతిక మూలాలతో ముడిపడిన భారత భవిష్యత్తు కోసం స్పష్టమైన దార్శనికతను ప్రకటించారు. ఆయన ప్రసంగం స్వయం సమృద్ధ భారత్ లక్ష్యాన్ని నొక్కిచెప్పింది. శక్తిమంతమైన, ఆధునిక భారత్ ఆకాంక్షలను ఈ ప్రసంగం ప్రతిబింబిస్తుంది. గత దశాబ్దంలో ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం ఒక పరివర్తన శక్తిగా వ్యవహరించింది. స్వాతంత్య్రం తర్వాత సంక్రమించిన రాజకీయ, ఆర్థిక వ్యవస్థలను సవాలు చేసింది. పౌరులందరికీ ప్రాథమిక అవసరాలకు హామీ ఇచ్చింది. ప్రభుత్వంపై ప్రజలు ఆధారపడటం నుంచి పాలనను ప్రభుత్వం వివిధ వినూత్న చర్యల ద్వారా ప్రజలకు ఎలా చేరువ చేసిందో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
చారిత్రకంగా భారత్ లో ప్రభుత్వ వనరులను, ప్రయోజనాలను పొందాలంటే సంక్లిష్టమైన కుల, రాజకీయ సమీకరణాల ద్వారానే సాధ్యమయ్యేది. దళితుల వంటి అట్టడుగు వర్గాలు తరచుగా ప్రభుత్వ ప్రయోజనాలను పొందడానికి స్థానిక ఆధిపత్య కుల నాయకులు లేదా పార్టీలపై ఆధారపడతాయి. ఈ అదృశ్య బంధనాలు స్వేచ్ఛలేని రాజకీయాలను సృష్టించి, ప్రజాస్వామ్య వ్యవస్థలో కొత్త భూస్వామ్య విధానాన్ని శాశ్వతం చేశాయి. రాజకీయ నాయకులు నిర్దిష్ట వర్గాలకు, ఓటర్లకు ప్రయోజనం చేకూర్చేందుకు తమ విచక్షణాధికారాన్ని ఉపయోగించుకున్నందున, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి ప్రజా సదుపాయాలను తగినంతగా అందించకపోవడం వల్ల ఈ వ్యవస్థ మరింత పాతుకుపోయింది. ఇది వివిధ కుల సమూహాల మధ్య విద్వేషాలకు, పోటీకి దారితీసి సామాజిక అశాంతికి, శత్రుత్వానికి ఆజ్యం పోసింది. సంక్షేమ పథకాలను, పౌర సేవలను ప్రజలకు ప్రత్యక్షంగా అందుబాటులోకి తీసుకురావడం, ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) వంటి సాంకేతిక ఆవిష్కరణల ద్వారా నిష్పాక్షిక ప్రమాణాల ఆధారంగా ప్రైవేట్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రధాని మోదీ అట్టడుగు స్థాయిలో ఈ స్వేచ్ఛలేని రాజకీయాలకు ముగింపు పలికారు. ఈ విధానం పేదలు, అట్టడుగు వర్గాలు, దళితులను బలోపేతం చేసింది. కోట్ల మందిని బహుముఖ పేదరికం నుంచి విముక్తులను చేసింది. మరీ ముఖ్యంగా, ఇది ప్రజాస్వామ్య ప్రక్రియపై నమ్మకాన్ని పునరుద్ధరించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసింది. ఫలానా పార్టీకి ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలను కోల్పోతామనే భయం లేకుండా వారు తమకు ఇష్టమైన రాజకీయ పార్టీలను, నాయకులను ఎంచుకునే వీలు కల్పించింది. హక్కులను విశ్వవ్యాప్తం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించి ప్రజాస్వామ్య వ్యవస్థపై విశ్వాసాన్ని పెంపొందించడం ద్వారా కులం, వర్గాల పాత రాజకీయాల పట్టును గణనీయంగా బలహీనపరిచింది.
ఆర్థిక, పాలన సంబంధిత సంస్కరణలకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని గురించి కూడా ప్రధాని మోదీ తన ప్రసంగంలో ప్రముఖంగా ప్రస్తావించారు. ఆయన పదవీకాలంలో భారతదేశంలో చేపట్టిన అత్యంత విస్తృతమైన, ప్రభావవంతమైన ఆర్థిక సంస్కరణలకు తగిన ప్రచారం లభించలేదు. ప్రత్యేకించి కోవిడ్-19 లాక్‌డౌన్ తర్వాత ప్రకటించిన సమగ్ర చర్యలు 1991 సంస్కరణల కంటే మరింత సమూలమైనవి. 1991లో అప్పటి ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్థిక సంస్కరణ చర్యలు చేపట్టింది. అందుకు భిన్నంగా మోదీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా, నిర్దిష్ట లక్ష్యాలతో ఈ పరివర్తనాత్మక సంస్కరణలు చేపట్టింది. నేడు భారతదేశ యువత గొప్ప ఆర్థిక స్వేచ్ఛను అనుభవిస్తున్నారు. భారతీయ వ్యాపారాలు పురాతన చట్టాల నుంచి విముక్తమై తక్కువ పరిమితులతో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. దీని ఫలితంగా ప్రపంచం పలు ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొంటున్నా భారత ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయంగా ఉజ్వలంగా వెలుగొందుతోంది. నేటి యువత మరింత ఆత్మవిశ్వాసంతో ఉన్నారని, ఇంకా ఉన్నత లక్ష్యాల సాధనకు ఉవ్విళ్లూరుతున్నారని, నెమ్మదిగా వస్తున్న మార్పులతో సంతృప్తి చెందడం లేదని ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్య నూటికి నూరుపాళ్ళు నిజం. వారి సామర్థ్యాలు, నాగరికతా విలువలు, భవిష్యత్తుపై నమ్మకంలో మూలాలు కలిగిన వారిలోని ఈ కొత్త విశ్వాసం 2014 నుంచి మోదీ ప్రభుత్వం సాధించిన అత్యుత్తమ విజయాలలో ఒకటి.
భారతదేశం ఇప్పుడు పెద్ద కలలు కంటోంది. భారీ లక్ష్యాలను సాధిస్తూ ముందుకు సాగుతోంది. దేశ ప్రజల ఆలోచనల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. దేశం సామ్యవాద భ్రమలకు దూరంగా, సంపద సృష్టికర్తలను, ఉద్యోగ సృష్టికర్తలను గౌరవించడం, ఐపిఓలు, వెంచర్ క్యాపిటల్, ఏంజెల్ ఇన్వెస్టర్‌లు అనే కొత్త పదజాలాన్ని స్వీకరించడం వైపు మళ్లింది. మెట్రోపాలిటన్ నగరాల నుంచి మారుమూల సరిహద్దు గ్రామాల వరకు దేశంలో చోటుచేసుకుంటున్న మౌలిక సదుపాయాల విప్లవాన్ని కూడా ప్రధానమంత్రి తన ప్రసంగంలో నొక్కిచెప్పారు. కొత్త తరం భౌతిక, డిజిటల్ మౌలిక సదుపాయాలు భారత ఆర్థిక వ్యవస్థను మార్చి వేస్తాయి. చారిత్రాత్మకంగా నిర్లక్ష్యానికి గురైన ఈశాన్య ప్రాంతాల వంటి చోట కూడా పౌరుల జీవన సౌలభ్యాన్ని, అవకాశాలను మెరుగుపరుస్తాయి. నేడు భారతదేశం ప్రజా డిజిటల్ మౌలిక సదుపాయాలలో ప్రపంచానికి ఆదర్శంగా ఉంది. చరిత్రలో సాటిలేని స్థాయిలో ఆర్థిక సమ్మిళితత్వాన్ని సాధించింది. ప్రజలు ప్రభుత్వ సేవలను, విద్య, అవకాశాలను పొందేందుకు వీలు కల్పిస్తోంది.
ప్రధానమంత్రి ప్రసంగం భవిష్యత్తుకు అత్యంత కీలకమైన సెమీకండక్టర్లు, పర్యావరణహిత ఉద్యోగాలు, గ్రీన్ హైడ్రోజన్ కార్యక్రమం, వాతావరణ మార్పులు, పర్యావరణ సమస్యలతో సహా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, ఆర్థిక అవకాశాలపై దృష్టి సారించింది. వీటివల్ల తక్షణ రాజకీయ ప్రయోజనాలేవీ ఒనగూడక పోవచ్చు గాని దేశ భవిష్యత్తుకు ఇవి ముఖ్యం. భారతీయ ప్రమాణాలు అంతర్జాతీయ ప్రమాణాలుగా మారడం, ప్రపంచ మార్కెట్ల కోసం ఉత్పత్తి చేయడానికి స్వదేశీ డిజైన్ సామర్థ్యాలను ఉపయోగించుకోవలసిన అవసరాలన్నీ నొక్కిచెప్పడం ద్వారా ప్రధాని వచ్చే పదేళ్లలో భారత్ ను అంతర్జాతీయ పారిశ్రామిక, ఉత్పాదక కేంద్రంగా మార్చే లక్ష్యాన్ని పునరుద్ఘాటించారు. ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ), ‘ఒక దేశం- ఒక ఎన్నిక‘ అనే క్లిష్టమైన అంశాలను గురించి ప్రధానమంత్రి మాట్లాడారు. చాలా కాలంగా, ‘మత స్వేచ్ఛ‘ ముసుగులో వివక్షాపూరిత చట్టాలు కొనసాగుతున్నాయి. వాటిని ప్రజాస్వామ్య ప్రమాణాల దృక్పథంతో పరిశీలించాల్సిన సమయం ఆసన్నమైంది. దేశంలోని చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం కూడా తరచూ ఎన్నికల చుట్టూ తిరిగేదిగా మారింది. ఇది రాష్ట్రంలో లేదా కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా పాలనకు ఆటంకం కలిగిస్తుంది. జమిలి ఎన్నికలను సమర్థిచడం ద్వారా ప్రధాని రాజకీయ ప్రక్రియలో అత్యంత అవసరమైన వ్యవస్థ సంస్కరణను ప్రతిపాదించారు.
ఈ ప్రసంగం భారత్ నాగరికత పాటవాన్ని, నలంద స్ఫూర్తిని పునరుజ్జీవింపజేయాలని గుర్తు చేసింది. అదే సమయంలో దేశ భవిష్యత్తును అంతరిక్షయాన దేశంగా ఊహిస్తుంది. జాతీయవాద భావజాలం ఆయన ప్రసంగానికి ప్రాతిపదిక. ఇది ఆర్థికంగా అభివృద్ధి చెందిన, సామాజికంగా న్యాయమైన, సార్వభౌమ భారతదేశాన్ని ఊహిస్తోంది. ఈ భావజాలం ఆధునిక భారతదేశాన్ని నిర్మించాలనే లోతైన నిబద్ధతతో పాటు దాని చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాల ఔన్నత్యాన్ని పరిరక్షించుకొంటూ, సమగ్రమైన, స్థిరమైన భవిష్యత్తు కోసం ఒక దార్శనికతను అందిస్తుంది. నేడు మోదీ నేతృత్వంలోని బిజెపి ఈ దార్శనికతకు ప్రతినిధిగా నిలుస్తుంది. యువత రాజకీయాల్లోకి రావాలనే బిజెపి పిలుపు దేశంలో మార్పునకు హామీ ఇస్తుంది.
అభినవ్ ప్రకాష్,
బిజెపి యువ మోర్చా జాతీయ ఉపాధ్యక్షుడు

