Solar plant

కిషన్ రెడ్డి చొరవతో తెలంగాణకు 200 మెగావాట్ల సౌర విద్యుత్

Solar plantకేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి చొరవతో ఏటా 200 మెగావాట్ల సౌర విద్యుత్ తెలంగాణకు అందించేందుకు నేవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ సంస్థ అంగీకరించింది. తెలంగాణకు చవకగా అందుబాటులోకి రానున్న ఈ విద్యుత్ రాష్ట్ర భవిష్యత్ అవసరాలను తీరుస్తుంది.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ  డెవలప్‌మెంట్ ఏజెన్సీ పథకంలో భాగంగా సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ స్కీమ్‌కు లోబడి నేవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ సంస్థ 510 మెగావాట్ల సామర్థ్యం గల విద్యుదుత్పత్తి కేంద్రాన్ని గుజరాత్ లోని కచ్ జిల్లా బిబర్ ప్రాంతంలో ఏర్పాటుచేస్తోంది. రూ.1,214 కోట్లతో నిర్మిస్తున్న ఈ సౌర విద్యుదుత్పత్తి కేంద్రం పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయి. 2025 జూన్ నుంచి ఈ ప్రాజెక్టు ద్వారా విద్యుదుత్పత్తి ప్రారంభమ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ సోలార్ పవర్ ప్రాజెక్ట్ తెలంగాణ విద్యుత్ అవసరాలు తీర్చడంలో కీలకంగా మారనుంది. ఈ సోలార్ ప్రాజెక్టు ద్వారా రూ.2.57కే యూనిట్ విద్యుత్ అందుబాటులోకి వస్తోంది. ఫలితంగా వచ్చే 25 ఏళ్లలో దాదాపు రూ.2 వేల కోట్లు తెలంగాణ ట్రాన్స్‌కోకు ఆదా అవుతుంది. అంతేకాదు, ఈ ప్రాజెక్టులో వినియోగించే సోలార్ ప్యానెళ్లతో పాటు సంబంధిత పరికరాలను తెలంగాణ మార్కెట్ నుంచే కొనుగోలు చేస్తారు. దీంతో తెలంగాణలో సోలార్ ప్యానళ్ల ఉత్పత్తికి బాటలు పడతాయి. ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్జీఎస్టీ రూపంలో ఆదాయం కూడా సమకూరనుంది. ఈ సోలార్ ప్రాజెక్టు ద్వారా గ్రీన్ ఎనర్జీలో తెలంగాణ రాష్ట్ర భాగస్వామ్యాన్ని మరింత పెంచుతుంది. ఈ సోలార్ ప్రాజెక్టు జీవిత కాలంలో సరఫరా చేసే 12.5 బిలియన్ యూనిట్ల గ్రీన్ ఎనర్జీ ద్వారా 8.9 మిలియన్ టన్నుల కర్బన ఉద్ఘారాలను అడ్డుకోవచ్చు. ‘మేక్ ఇన్ ఇండియా’ లక్ష్యానికి ఊతమిచ్చేలా ఈ ప్రాజెక్టులో దేశీయంగా తయారైన సోలార్ సెల్స్ నే వినియోగించడం మరో విశేషం. రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ముందడుగు వేసి వీలైనంత త్వరగా ఎన్ఎల్సీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ)పై సంతకాలు చేసుకోవాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సూచించారు.

రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి తెలంగాణలో విద్యుదుత్పత్తిని పెంచి ఇక్కడి గృహ వినియోగ, పారిశ్రామిక అవసరాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారాన్ని అందిస్తోంది. ఇందులో భాగంగా దాదాపు రూ.11వేల కోట్లతో ఎన్టీపీసీ  ఆధ్వర్యంలో 800 మెగావాట్ల సామర్థ్యంతో 2 విద్యుదుత్పత్తి కేంద్రాలను (మొత్తం 1,600 మెగావాట్ల సామర్థ్యం) రామగుండంలో ఏర్పాటు చేసుకోవడం, వాటిని ప్రధానమంత్రి స్వయంగా ప్రారంభించి తెలంగాణ ప్రజలకు అంకింతం ఇవ్వడం తెలిసినదే. ఎన్టీపీసీ ఆధ్వర్యంలోనే మరో 2,400 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుదుత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా ఉంది. అయితే ఇక్కడ ఉత్పత్తయ్యే విద్యుత్ కొనుగోలు విషయంలో రాష్ట్రం ముందుకొచ్చి పీపీఏ (విద్యుత్ కొనుగోలు ఒప్పందం) చేసుకుంటే పనులు ప్రారంభించేందుకు మార్గం సుగమం అవుతుంది. రామగుండంలో ఎన్టీపీసీ ఏర్పాటు చేసిన 100 మెగావాట్ల సామర్థ్యం గల ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్‌ను కూడా జూలై 31, 2022న ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న ఇతర పవర్ ప్రాజెక్టులకు కూడా కేంద్రం ఇతోధికంగా సహాయం అందిస్తోంది.