6 గ్యారంటీల పేరిట 60 దగాలతో కేసీఆర్ నే మించిన రేవంత్
అలవికాని హామీల వర్షం, బిజెపిపై విష ప్రచారంతో గత డిసెంబర్ లో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రేవంత్ సర్కార్ 9 నెలల పాలన… రైతులు, యువత, మహిళలను వంచించడం, ప్రజల దృష్టి మరల్చడం, న్యాయస్థానాలతో చివాట్లు తినడం, ఆనక క్షమాపణలు చెప్పడం అన్నట్టు సాగింది.
హామీల అమలులో యూటర్న్ తీసుకున్న రేవంత్… కేసీఆర్ తో లోపాయికారీ ఒప్పందంలో భాగంగా గత ప్రభుత్వం అవినీతిపై కమీషన్లతో కాలయాపన చేస్తూ, కల్వకుంట్ల కుటుంబం జైలుకు వెళ్లకుండా జాగ్రత్తపడుతున్నారు. రజాకార్ ఎంఐఎంకు దాసోహమంటూ మళ్లీమళ్లీ ‘‘బిజెపి-బీఆర్ఎస్ ఒక్కటే’’ అని పని గట్టుకొని అబద్ధపు విష ప్రచారం చేస్తున్నారు. కవిత బెయిలు విషయంలోనూ బిజెపిపై బురద జల్లే కుట్రలో సర్వోన్నత న్యాయస్థానానికి దురుద్దేశ్యాలు ఆపాదించి సుప్రీం కోర్టు చివాట్లు తిన్న రేవంత్ మరోసారి క్షమాపణలు చెప్పారు. కవిత బెయిల్ కోసం సుప్రీం కోర్టులో తీవ్రంగా శ్రమించిన అభిషేక్ సింఘ్వీకి తెలంగాణ నుంచే రాజ్యసభకు పంపించడం కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి అద్దం పడుతుంది. అయినా తెలంగాణ కాంగ్రెస్ నిస్సిగ్గుగా తన అధికారిక వెబ్ సైట్ లో ‘‘కవితకు బెయిల్ వచ్చిందా..? ఇచ్చారా..? ఈ రెండింటిలో ఏది కరెక్ట్? కమలంతో స్నేహం… తైతక్కకు మోక్షం’’ అని పోస్టు పెట్టడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పీసీసీ అధ్యక్షుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రి, హోం మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఇలాంటి నీచ పనులకు ఒడిగడుతూ న్యాయస్థానాలను అవమానపర్చడంపై నోటీసులు కూడా జారీ చేసింది. గతంలో కూడా రేవంత్ రెడ్డి తన నోటి దూలతో ఇలాంటి సమస్యలు ఎన్నో తెచ్చుకున్నారు. రేవంతే కాదు ఆయన దిల్లీ బాసు రాహుల్ గాంధీ కూడా రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఆరోపణల విషయంలో సుప్రీం ఆగ్రహానికి గురై, క్షమాపణలు కూడా చెప్పారు.
పార్టీ ఫిరాయింపులను అరికడతామని ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చి, అదే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, పదవికి రాజీనామా చేయకుండా వచ్చిన దానం నాగేందర్ కు ఎంపీ టికెట్ ఇచ్చి, సికింద్రాబాద్ నుంచి పోటీ చేయించడం కాంగ్రెస్ దగాకోరు నైజానికి మరొక నిదర్శనం. స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరితే ఆయన బిడ్డకు ఎంపీ టికెట్ ఇవ్వడం మరో దగా. అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ ఫిరాయించినవారిని రాళ్లతో కొట్టాలని ప్రజలను రెచ్చగొట్టిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మాత్రం పార్టీ ఫిరాయింపులను భయంకరంగా ప్రోత్సహిస్తున్నారు. ఎంపీ టికెట్, పీఏసీ చైర్మన్ లాంటి పదవులను ఎర వేస్తూ ఫిరాయింపుల్లో కేసీఆర్ నే మించిపోయారు.
రైతులకు రైతు భరోసా కాదు కదా రైతుబంధు కూడా ఇవ్వకుండా, కౌలు రైతుల కన్నీరు తాగుతూ, రైతు కూలీలను నరకయాతన పెడుతూ, రుణమాఫీని నిర్వీర్యం చేస్తూ, బోనస్ కు బొందపెడుతూ గత 9 నెలలుగా కాంగ్రెస్ రైతులను నిట్టనిలువునా ముంచింది. నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.4000 భృతి ఇస్తామని ఎన్నికల ముందు ఆశ పెట్టి ఓట్లు దండుకున్న కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత అసెంబ్లీలోనే సాక్షాత్తూ ఉప ముఖ్యమంత్రే మేం అలాంటి హామీ ఇవ్వలేదని బుకాయించి యావత్ రాష్ట్ర ప్రజలను మోసం చేశారు. ఉద్యోగ ప్రకటనల విషయంలో కావాలనే పరీక్షలను వరసగా ఏర్పాటు చేసి, వాయిదాలు కోరే పరిస్థితి తెప్పించి, వాయిదా వేసి, కేవలం డేట్ లతో మోసపూరిత జాబ్ క్యాలెండర్ ను ప్రకటించింది. వంద రోజుల్లో లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి 270 రోజులైనా వాళ్ల నోటిఫికేషన్ ఒక్కటి కూడా రిక్రూట్మెంట్ స్థాయికి చేరుకోలేదు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని జనాభాలో సగం ఉన్న మహిళలకు గత 9 నెలలుగా మొండిచేయి చూపిస్తూ వస్తోంది.
ఎన్నికల ముందు బిజెపి-బీఆర్ఎస్ ఒక్కటే… బిజెపి-ఎంఐఎం ఒక్కటే అన్న భయంకర విషప్రచారంతో తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ ఎన్నికలు అయిపోగానే 15 నిమిషాలు సమయమిస్తే దేశంలో హిందువులు లేకుండా చూస్తామన్న ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీని ప్రోటెం స్పీకర్ గా నియమించింది. అంతేకాకుండా, ఆయనను తన కొడంగల్ నియోజకవర్గం నుంచి గెలిపించి, రాష్ట్ర ఉపముఖ్యమంత్రిని చేసి, తన పక్కనే కూర్చోబెట్టుకుంటానని అసెంబ్లీలోనే ప్రకటించి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలను, హిందువులను మరోసారి దగా చేశారు. కొమరం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ లో ఆగస్ట్ 31న ఓ గిరిజన మహిళ(45 ఏళ్లు)పై కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ మతోన్మాది అత్యాచారానికి (అత్యాచారం?) యత్నించి, తర్వాత చావబాదిన ఘటనలో నిందితుడిని కాపాడేందుకు కాంగ్రెస్ సర్కార్ పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చొరవతో, బిజెపి మహిళా, గిరిజన నాయకుల పోరాటంతో ఆ అంశం ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లింది. ఇలాంటి ఘోరాలు రాష్ట్రంలో నిత్యకృత్యమయ్యాయి. రేవంత్ రెడ్డి 9 నెలల పాలన 9 ఏండ్ల కేసీఆర్ పాలనను మించి ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుంది. కాంగ్రెస్ ను గెలిపిస్తే పెనం మీంచి పొయ్యిలో పడట్టు తెలంగాణ పరిస్థితి మారుతుందన్న బిజెపి హెచ్చరికలు ఇప్పడు అక్షరసత్యాలయ్యాయి.