GKR Musi Visit

పేదల జోలికొస్తే ఖబర్దార్!

GKRక్రమ నిర్మాణాల కూల్చివేత పేరిట రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన ధ్వంసరచన కనీవినీ ఎరుగని స్థాయిలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నది. హైడ్రా పేరిట సర్కారు సాగిస్తున్న పేద ప్రజల బతుకులను ఛిద్రం చేస్తున్నది. పైసా పైసా కూడబెట్టి కట్టుకున్న ఇండ్లు కండ్లముందే చెదిరిపోతుంటే ప్రజలు గుండెబరువుతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఈ నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి భరోసా కల్పించారు. మూసీ సుందరీకరణలో నిర్వాసితులవుతున్న బాధిత కుటుంబాలను అక్టోబర్ 2న పరామర్శించారు. అంబర్‌పేట్ నియోజకవర్గంలోని ముసారాంబాగ్, అంబేద్కర్ నగర్ నుంచి తులసి నగర్ మీదుగా కృష్ణానగర్ వరకు బస్తీల్లో నిర్వాసితులను స్వయంగా కలిసి, వారి గోడును ఆవేదనను విన్నారు. మూసీ ప్రక్షాళన పేరుతో తమ ఇళ్లను కూల్చేసేందుకు అధికారులు మార్క్ చేశారని, బాధిత ప్రజలు కేంద్రమంత్రికి గోడు వెళ్లబోసుకున్నారు. మూసీ పరివాహక ప్రజలెవ్వరూ అధైర్యపడొద్దని, వారందరికీ అండగా ఉంటామని కిషన్ రెడ్డి భరోసా కల్పించారు. కూల్చివేతలకు వ్యతిరేకంగా పోరాడుతామని హామీ ఇచ్చారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజల బాధ చూస్తుంటే ఆవేదన కలుగుతోందని అన్నారు. పేదల ఇండ్లను కూల్చేందుకు బుల్డోజర్లు రావాలంటే… తమపై నుంచి పోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ముందుగా పేద ప్రజలకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు.

మూసీ సుందరీకరణ పేరుతో మూసీ పరివాహక ప్రాంతాల్లో పేదల ఇండ్లు కూలగొట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పేదల ఇండ్లు కూల్చివేసిందని, ప్రజలకు ప్రభుత్వం ఇవ్వకపోగా.. ప్రజలు తమ కష్టార్జితంతో ఒక్కో ఇటుక పేర్చుకుని కట్టుకున్న ఇండ్లను కులుస్తారా అంటూ మండిపడ్డారు. బస్తీలు, మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పేదల ఇండ్లు కూల్చే అధికారం ఏ ప్రభుత్వానికి కూడా లేదని.. గతంలో మాజీ సీఎం కేసీఆర్ మూసీ సుందరీకరణ పేరుతో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, హైడ్రా తరహాలోనే కూల్చివేతల కోసం ఇండ్లపై మార్కింగ్ చేశారని గుర్తుచేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామంటూ నాన్చివేత ధోరణితో మభ్యపెట్టి, ఒక్క పేదవాడికి ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణకు రూ. లక్షా 50 వేల  కోట్లు ఖర్చు పెడుతామంటూ గొప్పలు చెప్పుకుంటోందని ఎద్దేవా చేశారు. అయితే, నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అందులో రూ.50 వేల కోట్ల నిధులతో ఇల్లు లేని పేదలకు ఇండ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదల ఇండ్లు కూలుస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదంటూ హెచ్చరించారు. గతంలో అంబర్ పేటలో పేదల కోసం ప్రభుత్వ ఖర్చులతో రోడ్లు నిర్మించి, డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించడంతో పాటు రేషన్ కార్డులు ఇచ్చి హౌస్ నెంబర్లు కల్పించామని చెప్పారు. అయితే, అనేక సంవత్సరాల తర్వాత నేడు సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్లు కూల్చేందుకు పూనుకుందని మండిపడ్డారు. మూసీ నిర్వాసితులకు బిజెపి అండగా ఉంటుందని, వారికి అన్యాయం జరిగితే ఊరుకోబోమంటూ కిషన్ రెడ్డి.. రేవంత్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పేదవాడి ఇంటిపై బుల్డోజర్ వస్తే తీవ్రమైన పరిణామాలుంటాయన్నారు. పేదవాడి సమాధులపై మొక్కలు పెట్టి సుందరీకరణ చేయాలనుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.

మూసీ నిర్వాసితుల పక్షాన నిలుస్తూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన సంఘీభావ పర్యటనలో తమ సొంతింటిని కోల్పోతున్న వేలాది మంది జనాలు తరలి వచ్చారు. బిక్కుబిక్కుమంటూ హైడ్రా భయంతో బతుకీడుస్తున్నామని.. గుండెలు బాదుకుంటూ తమ ఆవేదనను కిషన్ రెడ్డికి తెలిపారు. హైడ్రా పేరుతో పేదల గూడు కూలుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు.  పేదలకు ఇండ్లు కట్టించాల్సిందిపోయి.. పేదల ఇండ్లను కూల్చివేయడం దుర్మార్గమంటూ కిషన్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రమంత్రి భరోసాతో కిషన్ రెడ్డికి మద్దతుగా నినాదాలు చేశారు. అంబర్ పేట గుండెధైర్యం కిషన్ రెడ్డి అంటూ స్లోగన్స్ ఇచ్చారు.

పేదల ఇళ్లు కూలగొడుతున్న రేవంత్ రెడ్డి.. షాడిస్ట్ ముఖ్యమంత్రి

Eatal Musi Dharnaతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రజాకార్ల వారసునిలా ఉన్నాడని మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ విరుచుకుపడ్డారు. హైడ్రా పేరిట పేదల ఇళ్లు కూలగొడుతున్న రేవంత్ రెడ్డిని షాడిస్ట్ ముఖ్యమంత్రిగా అభివర్ణించారు. ఇతరులు ఏడిస్తే నవ్వుకొనే మనస్తత్వం ఆయనదని విమర్శించారు. మూసీ ప్రక్షాళన అంటే సంతోషించానని.. అయితే ప్రణాళిక ఏంటని అడిగితే అధికారుల దగ్గర సమాధానం లేకపోయిందన్నారు. బాస్ ల మాటలు విని పని చేసిన ఐఏఎస్ లు, ఐపీఎస్ లు జైలుకు పోయారని, మీరు కూడా జైలుకు పోతారు జాగ్రత్త అని కూల్చివేతలు చేపడుతున్న అధికారులను హెచ్చరించారు. హైడ్రా కూల్చివేతలను నిరసిస్తూ, బాధితులకు మద్దతుగా సెప్టెంబర్ 27న ఈటల రాజేందర్ కొత్తపేట మారుతీనగర్ లో ధర్నాకి దిగారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘‘అబద్ధాలు చెప్తేనే ప్రజలు నమ్ముతారు అనే కల్చర్ ఉన్న వ్యక్తి రేవంత్. ఈ విషయం ఆయనే స్వయంగా అమెరికాలో చెప్పారు. అందుకే ఆయన హైడ్రా గురించి చెప్పిన మాటలు నమ్మలేకపోయా… పెద్దల పేరు చెప్పి పేదల ఇళ్లు కూలగొడుతున్నారు.’’ అని ఈటల అన్నారు. ‘‘గగనపహాడ్ లో వాటర్ పాకెట్లు అమ్ముకునే ఆమె ఆవేదన చూసాం. కూకట్ పల్లి నల్లచెరువులో లీజుకు తీసుకుని పెట్టుకున్న కాటరింగ్, ఫ్లెక్సీ ఫ్రింట్ షాపులను కూలగొట్టారు. అందులో ఉన్న మిషన్లు, సామాన్లు బయటపెట్టుకుంటం అని కాళ్ళ మీద పడ్డా వినకుండా బూటు కాళ్లతో తన్ని పక్కన పడవేయడమే కాదు.. మిషన్లను బుల్ డోజర్లతో తొక్కించి నాశనం చేసి శత్రువుల్లా వ్యవహరించారు. మూసీ చుట్టూ ఉన్న పట్టా భూముల్లో ఎన్నో ఏళ్ళ కింద లే-అవుట్ లో కొనుక్కున్న భూములు, కట్టుకున్న ఇల్లు. ఇప్పుడు వచ్చి ఎఫ్టీఎల్ కింద ఉన్నాయని చైతన్యపురిలో నోటీసులు ఇచ్చారు. ఆదమరిస్తే ఇళ్లు కూలగొట్టి మా శవాల మీద పేలాలు ఏరుకుంటారు. జనప్రియ అపార్ట్మెంట్ 30 ఏళ్ల కింద కట్టుకున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తాం తీసుకోండి, లేకపోతే అది కూడా దక్కదు అని బెదిరిస్తున్నారు. ఇక్కడ ఉన్న ఇల్లు పోగొట్టుకొని ఊరు బయటికి పొమ్మంటే వారికి ఉపాధి ఎలా? రెక్కల కష్టం నమ్ముకుని బ్రతుకుతున్న వారి జీవితాలను ఛిద్రం చేయవద్దు. దవాఖానాలో మందులు లేవు, పని చేసిన వారికి బిల్లులు లేవు, జీతాలకు డబ్బులు లేవు కానీ లక్ష 50 వేల కోట్లు పెట్టి మూసీ ప్రక్షాళన చేస్తా అంటే ఎలా నమ్మాలి? కమీషన్ల కోసమే ఇదంతా తప్ప చిత్తశుద్ధి లేదు. మూసీ ప్రక్షాళన పేరుతో పేదోళ్ల భూములు లాక్కొని పెద్దోళ్ళకి ఇచ్చి మాల్స్ కట్టి రంగుల ప్రపంచం చూపించే ప్రయత్నం చేస్తున్నారు.’’ అని అన్నారు. హైడ్రా బాధితులకు బిజెపి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పేదల కన్నీళ్లకు పరిష్కారం చెప్పడానికి, పేదలకు న్యాయం చేసేందుకు కొట్లాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు.