విజ్ఞతతో సంకీర్ణ ప్రభుత్వానికి మన్మోహన్ సారథ్యం
నెహ్రూ కుటుంబం నుంచి కాక కాంగ్రెస్ తరఫున ప్రధాన మంత్రులుగా పనిచేసిన ముగ్గురిలో మన్మోహన్ సింగ్ అత్యధికంగా 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు. ఆఖరి శ్వాస వరకు ఆయన నెహ్రూ కుటుంబానికి విధేయుడిగా ఉన్నప్పటికీ 1991 నుంచి 1996 వరకు ప్రధానమంత్రి పీవీ నరసింహారావు మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా నెహ్రూ సోషలిస్టు ఆర్థిక నమూనా వారసత్వాన్ని చెరిపివేయడంలో కీలక పాత్ర వహించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆర్థిక మంత్రి పదవికి మొదట మన్మోహన్ సింగ్‌ను అనుకోలేదు. నరసింహారావు ఐజీ పటేల్‌ను నియమించాలనుకున్నారు. కానీ ఆర్థిక మంత్రి పదవికి మన్మోహన్ సింగ్ సరైన వ్యక్తి. “నన్ను యాదృచ్ఛిక ప్రధానమంత్రిగా ప్రజలు అంటూ ఉంటారు, కానీ నిజానికి నేను యాదృచ్ఛిక ఆర్థిక మంత్రిని కూడా,” అని మన్మోహన్ సింగ్ ఒకసారి చమత్కరించారు.
ఆర్థిక శాఖలో ఆ ఐదేళ్లు మన్మోహన్ సింగ్ నిస్సందేహంగా అనేక విజయాలు సాధించారు. ముఖ్యంగా ‘లైసెన్స్ పాలన’ను ధ్వంసం చేసి భారత్‌ను ప్రపంచీకరణ బాట పట్టించారు. 2000ల తొలి సంవత్సరాల్లో భారత్ అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో విశ్వసనీయమైన ఆర్థిక పురోగతి సాధిస్తున్న తరుణంలో సింగ్ పెద్దగా ప్రజా జీవితంలో కనిపించలేదు. లోక్‌సభలోకి కూడా ప్రవేశించలేదు. రాజ్యసభ సీటుకే పరిమితం అయిపోయారు. అన్ని సూచీలు సుపరిపాలనను నిర్ధారిస్తున్నప్పటికీ వాజ్‌పేయి ప్రభుత్వం 2004 పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం 138 సీట్లు గెలుచుకుని పరాజయం పాలైంది. ఎన్డీఏ కూటమి కంటే కాంగ్రెస్ కేవలం ఏడు సీట్లు మాత్రమే ఎక్కువ గెలుచుకుంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆశ్చర్యకరంగా ప్రధానమంత్రి పదవిని చేపట్టకూడదని నిర్ణయించడంతో ఆ పదవి నిరాడంబరుడైన సింగ్‌ను వరించింది.
గాంధీల కుటుంబం పట్ల ఆయన విధేయత, నిరాడంబరత, మెతకదనం వీటి కారణంగానే ప్రణబ్ ముఖర్జీ వంటి ఎంతోమంది సమర్థులు ఉన్నప్పటికీ సోనియాగాంధీ ఆయనను ప్రధానమంత్రి పదవికి ఎంపిక చేసినట్టు స్పష్టమవుతుంది. డక్కామొక్కీలు తిన్న రాజకీయ నాయకుడు, రాజనీతిజ్ఞుడు అయిన ముఖర్జీ తనను కాదని సింగ్‌కు పదవి ఇచ్చినందుకు అప్పుడు అసంతృప్తి వ్యక్తం చేయలేదు. పైగా ఆ తర్వాత ఆరేడు సంవత్సరాల పాటు ఆయన గట్టిగా సింగ్‌కు అండగా నిలిచారు. కేంద్ర క్యాబినెట్లో మంత్రిగానే కాక సంక్లిష్టమైన సంకీర్ణ ప్రభుత్వాన్ని నిర్వహించడంలో ఆయన ఎంతో కీలకమైన పాత్ర నిర్వహించారు. కానీ కొందరు ఇతర సహచరులు సింగ్‌ను అంత సాదరంగా చూడలేదు. కొన్ని సందర్భాల్లో ఆయనను అసలు లెక్కచేయకుండా నేరుగా 10 జనపథ్ లోని అధికార కేంద్రాన్ని ఆశ్రయించేవారు. యూపీఏ ప్రభుత్వాన్ని ‘ద్వందాధికార ప్రభుత్వం’గా కొందరు అభివర్ణించినా అది నిజంగా ఏకచత్రాధిపత్యంగా సాగింది. సోనియా గాంధీయే మొత్తం అధికారాన్ని తన చేతుల్లో ఉంచుకునేవారు.
యూపీఏ-1 హయాంలో మన్మోహన్ సింగ్ చాలా తెలివిగా విజ్ఞతతో సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యం వహించారు. ఆర్థిక సంస్కరణల విషయంలో వాజ్‌పేయి ప్రభుత్వం అప్పటికే నెలకొల్పిన కొన్ని ప్రమాణాలకు దీటుగా చర్యలు తీసుకొని మన్మోహన్ ఆర్థిక వ్యవస్థను మరింత ఎత్తుకు తీసుకువెళ్లారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు ఆయన మొదటి హయాంలో సాధించిన విజయాలలో కొన్ని. కాగా, భారత్-అమెరికా అణు ఒప్పందానికి క్షేత్రస్థాయి సన్నాహాలు వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలోనే జరిగినప్పటికీ మన్మోహన్ సింగ్ ఈ ఒప్పందాన్ని సాకారం చేయడంలో, భారత్ ఏకాకితనాన్ని 2008లో ముగించడంలో విజయం సాధించారు. కానీ మన్మోహన్ సింగ్ విజయగాథకు అంతటితో తెరపడిపోయింది. 2008లో సంభవించిన అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం భారత ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపింది. దేశం ద్రవ్యోల్బణంతో, ఆర్థిక మాంద్యంతో కుదేలైంది. ఒక దశలో స్థూల జాతీయోత్పత్తి వృద్ధిరేటు 4 శాతానికి పడిపోయింది. మన్మోహన్ సాధించిన ఆఖరి విజయం 2009 లోక్‌సభ ఎన్నికల్లో కూటమి గెలవడం. అయితే ఇది ఆయన ఘనత కాదని చాలామంది వాదిస్తారు.
యూపీఏ-1 పాలన ఆయన కీర్తి ప్రతిష్టలను పెంచగా యూపీఏ-2 పాలనలో ఆయన ప్రతిష్ట పూర్తిగా మసకబారిపోయింది. 2జీ కుంభకోణం, బొగ్గు కుంభకోణం, టెలికాం కుంభకోణాలు ఆయన ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీశాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మన్మోహన్ సింగ్‌కు ఆయన అధికారం క్షీణించిపోయిందని చెప్పే ప్రయత్నంలో భాగంగా రాహుల్ గాంధీ అపరిపక్వతతో వ్యవహరించి శిక్ష పడిన చట్టసభ సభ్యులను అనర్హత నుంచి కాపాడుతూ మన్మోహన్ ప్రభుత్వం 2013లో జారీ చేసిన ఉత్తర్వును బహిరంగంగా చించి వేశారు. 2014లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంతో మన్మోహన్ సింగ్ తన ప్రధాన మంత్రి పదవిని ముగించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అంతకుముందు ఎన్నడూ ఎరుగని ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఎన్నికల తర్వాత తాను అంతకుముందు ప్రకటించినట్టుగా సింగ్ రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిందే కానీ పార్టీ ఆయనను ఎగువ సభలో కొనసాగించాలని నిర్ణయించింది. అనారోగ్యం కారణంగా పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలగడానికి ముందు అనేక సంవత్సరాలు పాటు ఆయన నిర్లిప్తంగా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. 2004లో ‘ది ఎకానమిస్టు’ పత్రిక ఆయనను ‘అనూహ్యమైన కొత్త నాయకుడి’గా అభివర్ణించింది. 2009లో లాల్ కృష్ణ అద్వానీ ఆయనను ‘అత్యంత బలహీనుడైన ప్రధాన మంత్రి’గా పేర్కొన్నారు. 2014లో మన్మోహన్ సింగ్ గురించి ప్రపంచానికి తెలియని అనేక విషయాలను వివరిస్తూ ఆయన రాజకీయ సహాయకుడు సంజయ్ బారు రాసిన పుస్తకంలో మన్మోహన్ సింగ్‌ను ‘యాదృచ్ఛిక ప్రధానమంత్రి’గా అభివర్ణించారు. ఐదేళ్ల తర్వాత 2019లో అదే పేరుతో ఆయనపై ఒక చలనచిత్రం కూడా తీశారు.
చరిత్ర తన పట్ల దయగా ఉంటుందని మన్మోహన్ సింగ్ ఆశించారు. దేశ విభజన సమయంలో పిల్లవాడిగా ఉండి కష్టపడి పనిచేయడం ద్వారా దేశంలో అత్యున్నత పదవికి చేరుకున్న వ్యక్తిగా, నిజాయితీ కలిగిన మృదుస్వభావి అయిన అజాతశత్రువుగా, భారతదేశాన్ని సోషలిజం కూపం నుంచి విముక్తి చేసిన వ్యక్తిగా చరిత్ర తప్పకుండా ఆయన పట్ల దయగా ఉంటుంది. కానీ రాజధర్మాన్ని విస్మరించి అవినీతిని కుంభకోణాలను చూస్తూ కూడా భీష్మ పితామహుడిలా వ్యవహరించినందుకు మాత్రం బహుశా చరిత్ర ఆయన పట్ల దయ చూపకపోవచ్చు.
రాంమాధవ్,
బిజెపి సీనియుర్ నాయకులు

