సౌదీలో కిషన్ రెడ్డికి ఘనస్వాగతం పలికిన ప్రవాసులు
ఖనిజ భవిష్యత్తుపై సౌదీ అరేబియాలో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడానికి జనవరి 13న ఆ దేశ రాజధాని రియాద్ చేరుకున్న కేంద్ర గనుల శాఖ మంత్రి, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డికి తెలుగు ప్రవాసీలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రవాసీలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అరబ్బు దేశమైన సౌదీ అరేబియాలో ఉపాధి కోసం వచ్చిన భారతీయులు, ప్రత్యేకంగా తెలుగు ప్రవాసీలు వాణిజ్య, పరిశ్రమ రంగాల్లోనూ ఎదుగుతుండటం సంతోషకరమని అన్నారు. భారత్-సౌదీ సంబంధాల పటిష్టతలో ఈ పర్యటన ఎంతో కీలకమని చెప్పారు. అందుకే తాను పండుగ మధ్యలోనే సౌదీకి వచ్చినట్లు చెప్పారు. సౌదీలోని ప్రముఖ తెలుగు ప్రవాసీ సంఘం సాటా సెంట్రల్ తో పాటు.. తెలుగు కళాక్షేత్రం, తాసా, హైదరాబాద్ నగరానికి చెందిన ఇతర ప్రవాసీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 20 నిమిషాల పాటు కిషన్ రెడ్డి ప్రసంగించి వెళ్లిపోతారని నిర్వాహకులు ప్రకటించినా.. తెలుగు వారి ఆప్యాయతతో రెండు గంటల పాటు ఆయన అందరితో కలిసి గడిపారు. ప్రప్రథమంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక కేంద్ర మంత్రి సౌదీకి వచ్చి ఆత్మీయంగా గడపడం ఆనందం కలిగించిందని అనేక మంది తెలుగు ప్రవాసీలు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ పర్యటనలో ‘టువర్డ్స్ గ్రాండ్ అగ్రిమెంట్’ థీమ్ తో మూడు రోజులపాటు జరిగిన ‘ఫ్యూచర్ మినరల్స్ ఫోరమ్ మినిస్టీరియల్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్’లో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఖనిజ వనరుల అభివృద్ధి అంశంపై విస్తృతంగా చర్చించారు. పలు దేశాల గనుల శాఖ మంత్రులతో కిషన్ రెడ్డి ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖనిజ సంపద సద్వినియోగం అవ్వాలన్న లక్ష్యంతో సౌదీ అరేబియా ప్రభుత్వం రియాద్ వేదికగా మూడేళ్లుగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.