రక్షణ బడ్జెట్: సైనిక పాటవం, సంస్కరణలకు ఊపు
ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్లో భాగంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను రక్షణ రంగానికి కేటాయింపులు గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 9.5 శాతం పెరిగాయి. ఈ ఏడాది రక్షణ మంత్రిత్వ శాఖకు రూ 6,81,210 కోట్లు కేటాయించగా గత ఏడాది రూ 6,21,940 కోట్లు కేటాయించారు. ఆధునికీకరణ, స్వదేశీకరణ (ఆత్మనిర్భరత), సర్వీసులో ఉన్న, మాజీ సైనికుల సంక్షేమమే ధ్యేయంగా రూపొందించిన బడ్జెట్ ను రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రశంసించారు. మొత్తమ్మీద ఈ ఏడాది జనవరి 1న రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించిన ‘రక్షణ సంస్కరణలు 2025’ ప్రయోజనాలను గరిష్ట స్థాయికి తీసుకువేళ్ళే విధంగా కొత్త రక్షణ బడ్జెట్ ను రూపొందించారు. ముందుగా కొన్ని గణాంకాలను పరిశీలిద్దాం. స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) పరంగా చూస్తే రక్షణ బడ్జెట్ కేవలం 1.9 శాతానికే పరిమితమైంది. జీడీపీ పరంగా భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని, అందువల్ల ఈ శాతం కూడా గణనీయంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి.
అత్యధిక సైనిక వ్యయంలో అమెరికా జీడీపీలో 3.4 శాతంతో మొదటి స్థానంలో ఉంది. జీడీపీలో 3 శాతంతో చైనా రెండో స్థానంలో (ప్రకటిత, వాస్తవ రక్షణ వ్యయం అంచనాల ఆధారంగా), జీడీపీలో 5.9 శాతంతో రష్యా మూడోస్థానంలో, భారత్ 1.9 శాతంతో నాలుగో స్థానంలో, సౌదీ అరేబియా 7.1 శాతంతో ఐదో స్థానంలో ఉన్నాయి. తన ఆర్థిక వ్యవస్థ అధ్వానంగా ఉన్నప్పటికీ పాకిస్తాన్ ఇప్పటికీ జీడీపీలో 2.9 శాతం రక్షణ కోసం ఖర్చు చేస్తోంది. భారతదేశానికి సుమారు 15,200 కిలోమీటర్ల భూ సరిహద్దు, 7,517 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్నాయి. పశ్చిమాన పాకిస్తాన్, ఉత్తర, తూర్పు సరిహద్దుల్లో చైనాలో కలిపి ఇద్దరు ప్రత్యర్థులను కలిగి ఉన్న భారతదేశం సుమారు 14 లక్షల సాయుధ దళాలను కలిగి ఉంది. ఇందులో సైన్యం సుమారు 12 లక్షల మందితో ప్రధాన వాటాను కలిగి ఉంది. 20 లక్షలకు పైగా క్రియాశీల సిబ్బందితో చైనా అతిపెద్ద సైన్యాన్ని కలిగి ఉంది; భారత సైన్యం రెండో అతిపెద్దది. అందువల్ల, ఇంత పెద్ద భారత సాయుధ దళాలను నిర్వహించడానికి వార్షిక వ్యయం మిగిలిన ప్రపంచంతో సమానంగా ఉండాలి, శత్రుదేశాల సైనిక స్థితిగతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
ఇప్పుడు రక్షణ బడ్జెట్ లో ఏ రంగానికి ఏంటో చూద్దాం. సాయుధ దళాల ఆధునికీకరణకు 1.8 లక్షల కోట్లు కేటాయించారు. ఇది గత ఏడాది కేటాయింపుల కంటే 5 శాతం ఎక్కువ. ఆధునీకకరణలో ఎక్కువ భాగం భారత నౌకాదళం, వైమానిక దళం ఆయుధ ప్లాట్ ఫారాలకు వినియోగిస్తారు. ఇవి సైన్యానికి అవసరమైన ఆయుధాలతో పోలిస్తే చాలా ఖరీదైనవి. జీతభత్యాలు, ఇంధనం, మందుగుండు సామగ్రి, నిర్వహణకు ఉద్దేశించిన రెవెన్యూ బడ్జెట్ కు రూ.3.11 లక్షల కోట్లు కేటాయించారు. ఇది గత ఏడాదికంటే 10 శాతం ఎక్కువ. రక్షణ పెన్షన్ల ఖర్చు 1.61 లక్షల కోట్లు. ఇది సుమారు 34 లక్షల మంది రక్షణ, పౌర రక్షణ ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వడానికి అవసరమవుతుంది. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (ఓఆర్ఓపీ) పథకాన్ని ప్రభుత్వం మరింత మెరుగుపరిచింది, ఇది వృద్ధుల సంక్షేమం పట్ల దాని నిబద్ధతను తెలియజేస్తుంది. రక్షణ బడ్జెట్లో డీఆర్డీవోకు రూ.26,817 కోట్లు, తీర రక్షక దళానికి రూ.9,677 కోట్లు, సరిహద్దు రహదారుల సంస్థ (బీఆర్వో)కు రూ.7,146 కోట్లు, మాజీ సైనికుల సంక్షేమ పథకానికి రూ.8,313 కోట్లు కేటాయించారు. దేశవ్యాప్తంగా ఉనికి ఉన్న ఎన్సీసీకి కూడా భారీగా రూ.2,900 కోట్లు కేటాయించారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిధులు ఇస్తారు. అందువల్ల రక్షణ బడ్జెట్ సిబ్బంది, మాజీ ఉద్యోగులు, ఆయుధాలు, సామాగ్రి, భవిష్యత్తు అవసరాలను తీర్చే ఒక ఆరోగ్యకరమైన మిశ్రమం.
ప్రస్తుత, భవిష్యత్ సంస్కరణలకు మరింత ఊతమిచ్చేందుకు 2025 సంవత్సరాన్ని భారత్ లో ‘రక్షణ సంస్కరణల సంవత్సరం’గా ప్రకటించాలని రక్షణ మంత్రిత్వ శాఖ ఏకగ్రీవంగా నిర్ణయించింది. రక్షణ రంగంలో ప్రతిపాదించిన తొమ్మిది సంస్కరణలు: థియేటర్ కమాండ్ల స్థాపనకు దారితీసే సంయుక్తత, సమగ్రతలను పెంపొందించడం, సైబర్, అంతరిక్షం, రోబోటిక్స్, కృత్రిమ మేధస్సు వంటి కొత్త రంగాలపై దృష్టి పెట్టడం, సైన్యం, నౌకా, వైమానిక దళాల మధ్య సహకారం, శిక్షణ, సామర్థ్య అభివృద్ధి కోసం వేగవంతమైన సేకరణ ప్రక్రియ, రక్షణ ఉత్పత్తి రంగంలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం, సహకారం, సమర్థమైన పౌర-సైనిక సమన్వయం, రక్షణ ఎగుమతులు, మాజీ సిబ్బంది సంక్షేమం, వారి నైపుణ్యాల వినియోగం, చివరగా భారతీయ సంస్కృతి, ఆత్మగౌరవ భావనలకు ప్రాధాన్యం. ప్రతిపాదిత తొమ్మిది సంస్కరణల్లో స్వదేశీ సైనిక సామగ్రి తో సాయుధ దళాల సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడంపై మోదీ ప్రభుత్వం దృష్టి సారించింది. దీని ప్రకారం రూ.1.8 లక్షల కోట్లు అంటే మొత్తం రక్షణ బడ్జెట్ కేటాయింపుల్లో సుమారు 26 శాతం పెట్టుబడి అవసరాలకు కేటాయించారు. ఈ పెట్టుబడి నిధులతో సాయుధ దళాలకు అత్యాధునిక ఆయుధాలు, మందుగుండు సామగ్రి, పరికరాలు సమకూర్చుతారు, భారత సైన్యాన్ని సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఆధునిక పోరాట శక్తిగా మారుస్తారు. ఇక్కడ కూడా ఆత్మనిర్భరత స్ఫూర్తితో 75 శాతం ఆధునీకీకరణను దేశంలోని సంస్థల ద్వారా అమలు చేయనున్నారు.
రక్షణ రంగంలో ప్రైవేటు పరిశ్రమల సహకారం, పరిశోధన, అభివృద్ధిలో పెట్టుబడులతో ఈ ఆర్థిక సంవత్సరంలో రక్షణ ఎగుమతులు రూ.50,000 కోట్ల ఆదాయం తెచ్చే అవకాశం ఉంది. కొత్త రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ గత సంవత్సరం నవంబర్ 1 బాధ్యతలు చేపట్టారు. అందువల్ల ఆయన రక్షణ సంస్కరణలను ప్రారంభించడం, సాయుధ దళాల కీలక సామర్ధ్యాల అభివృద్ధి విషయంలో ఎటువంటి అంతరాయం కలగకుండా చూస్తారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం బడ్జెట్ కేటాయింపుల్లో రక్షణ బడ్జెట్ వాటా 8 శాతంగా ఉంది. ప్రతిపాదిత రక్షణ సంస్కరణలు మరికొన్ని సంవత్సరాల పాటు పెట్టుబడి ఎక్కువగా అవసరమైనవిగా ఉండబోతున్నాయి. అందువల్ల రక్షణ బడ్జెట్ పెరుగుదల ప్రతిపాదిత సంస్కరణలకు అనుగుణంగా ఉంటుంది.
రక్షణ బడ్జెట్ కోసం సుమారు రూ.6.8 లక్షల కోట్లు కేటాయించడం దేశంలో నాలుగు నెలల మొత్తం జీఎస్టీ వసూళ్లకు సమానం. పైకి చూస్తే సామాన్య పౌరుడికి కేటాయింపులు ఎక్కువగా కనిపించవచ్చు. కానీ దేశ భద్రత, దేశ రక్షణ కోసం దీన్ని ప్రజలు బీమా ప్రీమియంగా చూడాలి. పైగా భారత సాయుధ దళాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా దేశ నిర్మాణానికి గణనీయంగా దోహదం చేస్తాయి. కనుక రక్షణ బడ్జెట్ జాతీయ ప్రయోజనం కోసం చేసే సరైన ఖర్చు. దేశంలోని ప్రతి మూలలో దీనికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ప్రస్తుత బడ్జెట్ 2047నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశలో ‘అనేక రెట్లు ప్రయోజనం కల్పించేది’ (శక్తి గుణకం-ఫోర్స్ మల్టిప్లయర్) గా ప్రధాని మోదీ అభివర్ణించారు. ఫోర్స్ మల్టిప్లయర్ అనేది ఒక సైనిక పదం. దీని అర్థం సైనిక శక్తి ప్రభావాన్ని గణనీయంగా పెంచే ఒక సామర్థ్యం లేదా బలం. ఇది తక్కువతో ఎక్కువ ప్రయోజనం సాధించడానికి వీలు కల్పిస్తుంది. ఉదాహరణకు మన సొంత బ్రహ్మోస్ క్షిపణి ఒక శక్తి గుణకం. రక్షణ బడ్జెట్ సాంకేతికంగా అధునాతనమైన, పోరాటసన్నద్ధమైన సైన్యం కోసం చేసే ప్రయత్నంలో ఒక శక్తిగుణకంగా పనిచేస్తుంది. భూ, వాయు, సముద్ర సరిహద్దుల వెంట బహుళముఖ సామర్థ్యంతో కార్యకలాపాలు సాగించే శక్తితో పాటు సాయుధ దళాలకు దేశ అంతర్జాతీయ ప్రయోజనాలను పరిరక్షించే పాటవాన్ని అందించాలన్న లక్ష్యాలకు అనుగుణంగా ఈ రక్షణ బడ్జెట్ ను రూపొందించారు.
లెఫ్టినెంట్ జనరల్ ఎం కె దాస్

