వార్తల్లో కనిపించని రైళ్ళు.. మన భద్రతా విజయాలకు నిదర్శనం
ప్రతిరోజూ భారతావని నిద్రలేచే సమయానికి భారతీయ రైల్వేలు అప్పటికే పరుగులు తీస్తూ ఉంటాయి. కార్యాలయాలకు వెళ్లేవారు, విద్యార్థులు, వలస కార్మికులు, సామాన్య కుటుంబాలు, సైనికులతో సహా నిత్యం రెండు కోట్లకు పైగా ప్రయాణికులు రైలు ఎక్కుతుంటారు. వీరిలో చాలామందికి రైలు ప్రయాణం అనేది కావాలని ఎంచుకున్నది కాదు, అదొక అనివార్యమైన అవసరం. ఇంతటి అపారమైన జనసమూహాన్ని సుదూర ప్రాంతాలకు చేరవేసే వ్యవస్థలో భద్రత కేవలం ఒక సాంకేతిక గణాంకం మాత్రమే కాదు; అది ప్రజా విశ్వాసానికి సంబంధించిన అత్యంత కీలకమైన అంశం.
ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న భారతీయ రైల్వేలు, ప్రతిరోజూ 25,000కి పైగా రైళ్లను నడుపుతోంది. ఇందులో 14,000 కంటే ఎక్కువ ప్యాసింజర్ సర్వీసులు ఉన్నాయి. దశాబ్దాలుగా ప్రభుత్వం కేవలం రైల్వే విస్తరణ – అంటే కొత్త మార్గాలు, అదనపు రైళ్లు, వేగవంతమైన అనుసంధానంపైనే దృష్టి కేంద్రీకరించింది. కానీ భద్రత లేని విస్తరణ వినాశకరమైన పరిణామాలకు దారితీస్తుందని దాదాపు పదేళ్ల క్రితం గుర్తించిన ప్రభుత్వం, ఈ వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ మొదటి హయాంలోనే ఒక స్పష్టమైన సందేశం ఇచ్చారు: “భద్రతే ప్రథమం”. దీని ఫలితంగా 2014 నుండి రైల్వే శాఖ తన భద్రతా వ్యవస్థలో సాంకేతికత, అవసరమైన నిధులతో కూడిన సమగ్రమైన మార్పులు చేపట్టింది. ఈ విజయానికి అత్యంత స్పష్టమైన నిదర్శనం – ఘోర రైలు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గడం. 2014-15లో భారతీయ రైల్వేలో 135 ప్రమాదాలు నమోదు కాగా, 2025-26 నాటికి ఆ సంఖ్య కేవలం 16కు పడిపోయింది. ప్రయాణికుల సంఖ్య, రైళ్ల రాకపోకలు పెరిగినప్పటికీ ప్రమాదాలు 89 శాతం మేర తగ్గడం విశేషం. ఇదే కాలంలో ప్రతి కిలోమీటరు ప్రయాణానికి జరిగే ప్రమాదాలను కొలిచే సూచీ 0.11 నుండి 0.01కి పడిపోయింది. ఇది ప్రతి కిలోమీటరు ప్రయాణంలో మన రైల్వే వ్యవస్థ ఎంతటి భద్రతను సాధించిందో ప్రతిబింబిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా రైల్వే భద్రతను ప్రతి 100 కోట్ల మంది ప్రయాణికుల-కిలోమీటర్లకు సంభవించే మరణాలు లేదా ప్రమాదాల ఆధారంగా కొలుస్తారు. ప్రమాణాలకు మారుపేరుగా భావించే యూరోపియన్ యూనియన్‌లో రైలు ప్రయాణికుడి మరణించే ప్రమాదం ప్రతి 100 కోట్ల కిలోమీటర్లకు 0.09గా ఉంది. ఇది రోడ్డు రవాణా కంటే సురక్షితమైనది, విమానయానంతో సమానమైనది. ఇక జపాన్ విషయానికి వస్తే, అక్కడ రైలు ప్రమాదాలు దాదాపు సున్నాకు చేరుకున్నాయి. నేడు అక్కడ సంభవిస్తున్న మరణాలు రైళ్ల నిర్వహణ లోపాల వల్ల కాకుండా, అనధికారికంగా ట్రాక్ దాటడం లేదా లెవల్ క్రాసింగ్‌ల వద్ద జరుగుతున్నవే. భారత్ సాధించిన పురోగతిని ఇతర దేశాలతో పోల్చడం కంటే మనం చేపట్టిన మార్పుల వేగం, ఉద్దేశం ద్వారానే మెరుగ్గా అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం 0.01 వద్ద ఉన్న మన ‘ప్రమాదాల సూచి’, అంతర్జాతీయ రైల్వే సంస్థలు పర్యవేక్షించే పెద్ద రైల్వే వ్యవస్థల ప్రపంచ సగటుతో పోటీపడుతోంది.
ప్రయాణీకులు, సరుకుల రవాణా, సబర్బన్, ఎక్స్‌ప్రెస్ సర్వీసులు ఒకే కారిడార్లను పంచుకునే ప్రపంచంలోని అత్యంత సంక్లిష్టమైన నెట్‌వర్క్‌లలో ఒకటైన భారత్‌లో ఈ ఘనత సాధించడం సామాన్యం కాదు. స్థిరమైన పెట్టుబడులు, లెవల్ క్రాసింగ్‌ల తొలగింపు, ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ, పటిష్టమైన భద్రతా సంస్కృతి ద్వారానే శాశ్వత భద్రత సాధ్యమని అంతర్జాతీయ అనుభవాలు చెబుతున్నాయి. అన్నింటికంటే ముఖ్యమైనది మనం కాపాడిన ప్రాణాలు. 2014-15లో రైలు ప్రమాదాల్లో 292 మంది మరణించగా, 2025-26లో జరిగిన 16 ప్రమాదాల్లో ప్రాణనష్టం 16కు పరిమితమైంది. ప్రతి ప్రాణం విలువైనదే. అయితే మరణాల సంఖ్య ఇంత భారీగా తగ్గడం మన వ్యవస్థ ప్రమాదాలు జరిగినప్పుడు స్పందించే స్థాయి నుంచి అసలు ప్రమాదాలే జరగకుండా నిరోధించే స్థాయికి ఎదిగిందని చాటిచెబుతోంది. ఈ పరివర్తన కేవలం సంకల్పం వల్ల మాత్రమే రాలేదు; దీని వెనుక ముందెన్నడూ లేని స్థాయిలో భారీ ఆర్థిక మద్దతు ఉంది. వార్షిక భద్రతా వ్యయం 2013-14లో రూ.39,200 కోట్ల నుండి 2026-27 నాటికి దాదాపు రూ.1.2 లక్షల కోట్లకు, అంటే మూడు రెట్లు పెరిగింది. దీనివల్ల ట్రాక్‌లు, సిగ్నలింగ్, రోలింగ్ స్టాక్, భద్రతా వ్యవస్థల ఆధునికీకరణ ఎక్కడా ఆగకుండా వేగంగా సాగుతోంది. 2014 నుండి సాంకేతికత వినియోగం ముమ్మరమైంది. గతంలో కేవలం 900 లోపు ఉన్న డిజిటల్ రైల్వే స్టేషన్ల సంఖ్య ఇప్పుడు దాదాపు 4,000కు చేరింది. పొగమంచు సమయాల్లో కీలకమైన జిపిఎస్ ఆధారిత పొగమంచు రక్షణ పరికరాలు 90 నుంచి 30,000 కు పెరిగాయి. ట్రాక్ విశ్వసనీయతలో ఒక నిశ్శబ్ద విప్లవం వచ్చింది. 60 కిలోల బరువుండే పట్టాలు, మెరుగైన వెల్డింగ్ పద్ధతులు, అత్యాధునిక పరీక్షల వల్ల వెల్డింగ్ వైఫల్యాలు 93 శాతం, పట్టాల పగుళ్ళు 92 శాతం తగ్గాయి.
సుమారు 9,000 మానవ రహిత లెవల్ క్రాసింగ్‌ల (కాపలా లేని రైల్వే గేట్లు)ను పూర్తిగా తొలగించడం ఒక మైలురాయి. దీనికి తోడు 14,000 కంటే ఎక్కువ రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, అండర్ పాస్‌లను నిర్మించాం. ప్రమాదాలు జరిగినప్పుడు ఒక కోచ్ పైకి మరొకటి ఎక్కకుండా నిరోధించే LHBల ఉత్పత్తిని 2014 నుండి 20 రెట్లు పెంచడం ద్వారా ప్రయాణికుల భద్రతను మరింత పటిష్టం చేశాం. ఈ ప్రయాణంలో అత్యంత కీలకమైన ఆవిష్కరణ ‘కవచ్’. ఇది భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ‘స్వయంచాలిత రైలు రక్షణ’ (ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్) వ్యవస్థ. అంతర్జాతీయ భద్రతా ప్రమాణాల ప్రకారం అత్యున్నత స్థాయి ధ్రువీకరణ పొందిన ‘కవచ్’, లోకో పైలట్ సిగ్నల్ దాటినా లేదా వేగ పరిమితిని ఉల్లంఘించినా ఆటోమేటిక్‌గా బ్రేకులు వేస్తుంది. ఒక లోకో పైలట్ మాటల్లో చెప్పాలంటే, “కవచ్ కేవలం ప్రయాణికులకే కాదు, రైల్వే ఉద్యోగుల కుటుంబాలకు కూడా ఒక వరం.” దీనిని జాతీయ రక్షణ వ్యవస్థగా గుర్తించి, దిల్లీ-ముంబై, దిల్లీ-హౌరా వంటి రద్దీ మార్గాల్లో ఇప్పటికే అందుబాటులోకి తెచ్చాం. మిగిలిన చోట్ల విస్తరణ వేగంగా సాగుతోంది. అయితే సాంకేతికత ఎంత ఉన్నా మానవ అప్రమత్తతకు అది సాటి రాదు. దీనిని గుర్తించిన రైల్వే శాఖ రన్నింగ్ స్టాఫ్ కోసం ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి గదులు, క్రమబద్ధీకరించిన విధి నిర్వహణ గంటలు, కౌన్సెలింగ్, మెరుగైన వసతుల కల్పనపై పెట్టుబడులు పెట్టింది. నేడు భద్రత కేవలం యంత్రాల ద్వారానే కాకుండా, ఆ వ్యవస్థలను నమ్మే సిబ్బంది ద్వారా కూడా పటిష్టం చేయబడింది. రైల్వే భద్రత సక్రమంగా ఉన్నప్పుడు అది పెద్దగా ఎవరి దృష్టినీ ఆకర్షించదు. ప్రమాదానికి గురికాని రైళ్లు వార్తల్లో రావు. కానీ, వార్తల్లో కనిపిస్తున్న ఈ ‘నిశ్శబ్దమే’ ప్రతి ఒక్క ప్రయాణికుడి ప్రాణం ఎంత విలువైనదో చెప్పడానికి నిలువెత్తు సాక్ష్యం.
అశ్విని వైష్ణవ్,
రైల్వే మంత్రి

