చిన్న పరిశ్రమల విప్లవానికి మహిళా చోదకశక్తి
సెప్టెంబర్ 2023లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటులో నిలబడి ‘నారీ శక్తి వందన్ అధినియం’ గురించి గళమెత్తినప్పుడు— లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలలో మహిళలకు మూడో వంతు సీట్లు కేటాయించాలని ప్రతిపాదించినప్పుడు— ఒక బలమైన నమ్మకాన్ని ఆయన ప్రపంచానికి చాటి చెప్పారు. అదేమిటంటే, దేశంలోని మహిళలు అభివృద్ధి చెందనిదే భారతదేశం ఎదగదు. అదే సంకల్పం MSME (ఎంఎస్ఎంఈ – సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల) రంగంలో ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పనిలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. MSME రంగాన్ని తరచుగా భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని పిలుస్తుంటాం. కానీ నిశితంగా పరిశీలిస్తే, ఆ వెన్నెముకకు ప్రాణశక్తిగా నిలిచింది మహిళా పారిశ్రామికుల నిశ్శబ్ద పోరాటం. నేడు ఆ నిశ్శబ్ద శక్తికి తగిన జాతీయ గుర్తింపు, సంస్థాగత మద్దతు, విధానపరమైన ఊతం లభిస్తున్నాయి.
గణాంకాలే సాక్ష్యం
భారతదేశ MSME వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం నిరంతరం విస్తరిస్తోంది. 2026 ప్రారంభం నాటికి ‘ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్’, ‘ఉద్యమ్ అసిస్ట్ ప్లాట్‌ఫారమ్’లో 3.11 కోట్లకు పైగా మహిళా నేతృత్వంలోని సంస్థలు నమోదయ్యాయి. ఈ గణాంకాల ప్రకారం, దేశంలోని మొత్తం నమోదైన MSME లలో మహిళా యాజమాన్యంలోని సంస్థలు సుమారు 40 శాతం వాటాను కలిగి ఉండి ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. మహిళా పారిశ్రామికుల కోసం చేపట్టిన అత్యంత ప్రభావవంతమైన సంస్కరణల్లో ఒకటి ‘ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్’ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను సరళీకరించడం. ఇది పూర్తిగా ఆన్‌లైన్, కాగిత రహిత, స్వయం-ధ్రువీకరణ ఆధారితమైనది కావడంతో గతంలో మహిళలకు ఆటంకంగా ఉన్న నియమనిబంధనల అడ్డంకులను తొలగించింది. జనవరి 2023లో ప్రారంభించిన ‘ఉద్యమ్ అసిస్ట్ ప్లాట్‌ఫారమ్’ మరో అడుగు ముందుకు వేసి, పాన్ లేదా జీఎస్టీఎన్ లేని అసంఘటిత రంగంలోని మహిళలకు ప్రాధాన్య రంగ రుణాలను, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను చేరువ చేసింది. వృద్ధికి చోదకశక్తులుగా మహిళలను ఆర్థిక ఎజెండాలో కేంద్రస్థానంలో ఉంచాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రత్యక్ష ఫలితం ఇది.
ఆర్థిక శక్తిగా నారీశక్తి
మహిళలను సాధికారీకరించడం కేవలం ఒక సామాజిక బాధ్యత మాత్రమే కాదు, అది ఒక జాతీయ వ్యూహం అని ప్రధానమంత్రి మోదీ నిరంతరం నొక్కి చెబుతుంటారు. ఆయన మాటల్లో చెప్పాలంటే— మహిళలు సాధికారత సాధించినప్పుడు కుటుంబాలు సాధికారమవుతాయి. కుటుంబాలు బలోపేతమైనప్పుడు దేశం మరింత శక్తిమంతంగా ఎదుగుతుంది. రాజకీయ రంగంలో ‘నారీ శక్తి వందన్ అధినియం’ ఈ తత్వానికి అత్యంత స్పష్టమైన రూపమైతే, ఆర్థిక రంగంలో, ముఖ్యంగా MSME విభాగంలో, మహిళల అభివృద్ధి పట్ల ప్రభుత్వ నిబద్ధత వివిధ విధానాల చట్రంగా రూపాంతరం చెందింది. ఇది రుణాలు, నైపుణ్యం, మార్కెట్ సదుపాయాలు, గుర్తింపు, గౌరవం వంటి అంశాలపై దృష్టి సారిస్తోంది.
మహిళల కోసం విధాన వ్యవస్థ
MSME మంత్రిత్వ శాఖ తన ప్రతి ప్రధాన కార్యక్రమం, పథకంలో మహిళా సాధికారతను ఒక అంతర్భాగంగా మార్చింది. సాంకేతికత, పరపతి, నిధులు, డిజిటలైజేషన్, మౌలిక సదుపాయాల మద్దతు, అధికారిక వ్యవస్థలో భాగం చేయడం, మార్కెట్ సదుపాయం, పరిశ్రమ స్థాయి నైపుణ్యాభివృద్ధి వంటి కీలక రంగాల్లో పారిశ్రామికవేత్తలకు ఇవి అండగా నిలుస్తున్నాయి.
- PMEGP: గత ఐదేళ్లలో ‘ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం’ (PMEGP) కింద 3.2 లక్షల కంటే ఎక్కువ మహిళా యాజమాన్య సంస్థలకు మద్దతు లభించింది. ఇటీవల గణాంకాల ప్రకారం, PMEGP లబ్ధిదారులలో 39 శాతం మంది మహిళలే ఉండటం గమనార్హం.
- CGTMSE: సూక్ష్మ, చిన్న సంస్థల పరపతి హామీ నిధి ట్రస్ట్ (CGTMSE) మహిళా రుణగ్రహీతలకు 90 శాతం వరకు మెరుగైన గ్యారెంటీ కవర్‌ను అందిస్తోంది. దీనివల్ల బ్యాంకులు ఎటువంటి హామీ లేకుండా రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి.
- బహిరంగ సేకరణ లేదా పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్: ప్రభుత్వ కొనుగోలు విధానం ప్రకారం, కేంద్ర మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు తమ వార్షిక కొనుగోళ్లలో కనీసం 3 శాతాన్ని మహిళల యాజమాన్యంలోని సంస్థల నుంచే సేకరించాలి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ వాటా 3.5 శాతానికి పెరగడం విశేషం.
- ZED ధ్రువీకరణ: ‘జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్’ (పర్యావరణంపై ఎటువంటి దుష్ప్రభావం చూపకుండా నాణ్యమైన ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం తెచ్చిన పథకం) కింద మహిళా MSMEలకు సర్టిఫికేషన్ ఖర్చుపై 100 శాతం సబ్సిడీ లభిస్తుంది.
- ప్రత్యేక పథకాలు: కొబ్బరి పీచు రంగంలోని మహిళా కళాకారుల కోసం ‘మహిళా కాయిర్ యోజన’ నైపుణ్యాభివృద్ధిని అందిస్తోంది. అలాగే ‘MSME-TEAM’ ద్వారా 5 లక్షల మంది లబ్ధిదారులలో సగం మంది మహిళలను లక్ష్యంగా చేసుకున్నారు.
- యశస్విని ప్రచార కార్యక్రమం: దేశవ్యాప్తంగా అవగాహన కల్పించే ఈ కార్యక్రమం, మహిళల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ‘MSME ఐడియా హాకథాన్ 3.0’కి 18,888 పైగా ప్రతిపాదనలు రావడం మహిళల్లో పెరిగిన సృజనాత్మకతకు నిదర్శనం.
- మహిళా పారిశ్రామికవేత్తల విభాగం (WEC): మంత్రిత్వ శాఖలోని ఈ ప్రత్యేక విభాగం పథకాల సమన్వయం, ఫలితాల పర్యవేక్షణ కోసం సమన్వయ కేంద్రంగా (నోడల్ పాయింట్)గా పనిచేస్తుంది.
నైపుణ్యం, ఆత్మవిశ్వాసం, సంఘటిత శక్తి
రుణాలు, మార్కెట్లతో పాటు, పారిశ్రామికులుగా ఎదగడానికి నైపుణ్యం, ఆత్మవిశ్వాసం కూడా ముఖ్యమని ప్రభుత్వం గుర్తించింది. ఈశాన్య రాష్ట్రాల్లోని మహిళల కోసం చేపట్టిన ప్రత్యేక పారిశ్రామిక అభివృద్ధి కార్యక్రమాల్లో మహిళలే ఎక్కువమంది శిక్షణ పొందుతున్నారు. స్వయం సహాయక సంఘాలను MSME మద్దతు వ్యవస్థలతో అనుసంధానించడం ద్వారా, మహిళలు ఒకరికొకరు అండగా నిలిచే సమూహాలుగా తయారవుతున్నాయి. ప్రతి బడ్జెట్, ప్రతి పథకం, పోర్టల్ సరళీకరణ వెనుక భారతీయ మహిళలు అపారమైన సామర్థ్యం గల శక్తి అన్న ప్రధాని మోదీ విప్లవాత్మక ఆలోచన ఉంది. మనం చేరుకోవాల్సిన గమ్యం ఇంకా దూరంలోనే ఉంది. కానీ ఈ ప్రభుత్వ పర్యవేక్షణలో, ప్రధానమంత్రి నిబద్ధతతో మనం సరైన మార్గంలోనే ముందుకు సాగుతున్నాం.
శోభా కరంద్లాజే,
కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి

