Woman

ఇది మహిళా వ్యతిరేక ఆలోచనా విధానం

2022 జూలైలో ద్రౌపది ముర్ము భారత గణతంత్ర రాజ్యానికి 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. భారత ప్రజాస్వామ్య 75 ఏళ్ల చరిత్రలో, పేదరికాన్ని స్వయంగా అనుభవించిన ఒక గిరిజన మహిళ ఆ అత్యున్నత పదవిని అధిష్టించడం ఇదే తొలిసారి. నరేంద్ర మోదీ హయాంలోనే ఈ చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కావడం కేవలం యాదృచ్ఛికం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి అందించిన ఒక పరమ సత్యం ఏమిటంటే: రాజ్యాంగ నైతికత అనేది దానంతట అది అమలు కాదు. దానికి బలమైన రాజకీయ సంకల్పం, సంస్థాగత సాహసం, దశాబ్దాలుగా వెనుకబడిన వర్గాల కోసం శక్తిమంతులైన వారి ఆధిపత్యాన్ని ఎదిరించే నాయకత్వం అవసరం.

1956లో మొదటి వెనుకబడిన తరగతుల కమిషన్ 2,399 వెనుకబడిన కులాలను గుర్తించి, సమగ్రమైన రిజర్వేషన్ల కోసం సిఫార్సు చేస్తూ నివేదిక సమర్పించింది. కానీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దానిని తిరస్కరించింది. పరిపాలనాపరమైన చిక్కులనే కుంటిసాకులతో, రాజకీయ ప్రయోజనాల కోసం ఆ నివేదికను అటకెక్కించింది. అంబేద్కర్ ఏ వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడారో ఆ ఇతర వెనుకబడిన వర్గాలు (ఓబీసీ) దీర్ఘకాలం ఎదురుచూడక తప్పలేదు. ఐదేళ్ల తర్వాత అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ రిజర్వేషన్లపై రాసిన సుప్రసిద్ధ లేఖలో తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ, దీనివల్ల “అసమర్థత” పెరుగుతుందని పేర్కొన్నారు. మేధోపరమైన అభ్యంతరంగా దీనికి ముసుగు వేసినా ఇది అగ్రవర్ణాల అభద్రతా భావానికి నిదర్శనం.

జనతా ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన మండల్ కమిషన్, 1980లో తన నివేదికను సమర్పించింది. అయితే 1980వ దశకమంతా— ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల నాయకత్వంలో— ఆ నివేదిక అలాగే ఉండిపోయింది. ఇది ఉద్దేశపూర్వకంగా సాగించిన అణచివేత. ఓబీసీల ఆకాంక్షలను నెరవేర్చడం కంటే వారిని రాజకీయంగా నియంత్రించడమే కాంగ్రెస్ వ్యూహంగా ఉండేది. 1990లో ప్రధాని వి.పి. సింగ్ మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేసేందుకు సిద్ధపడినప్పుడు, రాజీవ్ గాంధీ లోక్‌సభ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన ప్రసంగాలలో ఒకటి చేస్తూ ఓబీసీ రిజర్వేషన్లను తీవ్రంగా వ్యతిరేకించారు. స్త్రీ పురుష సమానత్వం లేకుండా సామాజిక న్యాయం సాధ్యం కాదని అంబేద్కర్ బలంగా నమ్మారు. మహిళల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం రాజ్యాంగ నిర్మాణంలో కీలకమైనది. వారసత్వం, విడాకుల హక్కులలో మహిళలకు సమానత్వం కల్పించే ‘హిందూ స్మృతి బిల్లు’ను నీరుగార్చి, జాప్యం చేస్తున్నందుకు నిరసనగా ఆయన నెహ్రూ మంత్రివర్గం నుంచి రాజీనామా చేశారు. కాంగ్రెస్ లోపల ఉన్న పితృస్వామ్య అహంకారాన్ని ఆయన ఆనాడే గుర్తించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కూడా కాంగ్రెస్ అడ్డంకులు సృష్టించిన చరిత్రే కనిపిస్తుంది. 1996 నుండి 2014 వరకు ఈ బిల్లు పార్లమెంటులో పదేపదే ప్రవేశపెట్టడం, వీగిపోవడం రివాజుగా మారింది. 1998లో ఒక అత్యంత దారుణమైన సంఘటన జరిగింది; కాంగ్రెస్ మిత్రపక్షమైన ఆర్జేడీ ఎంపీ సురేంద్ర ప్రకాష్ యాదవ్ సభలోనే బిల్లును లాక్కొని చింపేశారు. కాంగ్రెస్ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి అరాచకాలను వెనకుండి నడిపించింది.

గడిచిన దశాబ్ద కాలంలో మార్పు కేవలం ప్రతీకాత్మకమైనది మాత్రమే కాదు. కుల వివక్ష ఉన్న సమాజంలో అటువంటి ప్రతీకలు కూడా ఎంతో ముఖ్యమైనవి. భారత రైల్వే చరిత్రలో తొలిసారిగా ఒక దళిత అధికారి రైల్వే బోర్డు ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఒక గిరిజన అధికారి కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) గా నియమితులయ్యారు. ఇవి కేవలం పదవులు కావు, వనరులపై అధికారం చెలాయించే కీలక స్థానాలు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో ఇద్దరు ఆదివాసీలు ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో దళిత నాయకులు ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. 

‘నారీ శక్తి వందన్ అధినియం’కు సంబంధించిన సవరణ విఫలమవడం, కాంగ్రెస్, ‘ఇండీ’ కూటమిలోని కొన్ని వర్గాల తిరోగమన, మహిళా వ్యతిరేక ఆలోచనా విధానానికి అద్దం పడుతోంది. ఈ సమయం చాలా కీలకమైనది. ఏప్రిల్ నెల సామాజిక సంస్కర్తలు— అంబేడ్కర్, బాబూ జగ్జీవన్ రామ్, జ్యోతిరావు ఫూలేల జయంతుల నెల. ఇటువంటి తరుణంలో పరిపాలనలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచే సంస్కరణలను అడ్డుకోవడం ప్రతిపక్షాల మాటలకు, చేతలకు పొంతన లేదని నిరూపిస్తోంది. భారత ప్రజలు, ముఖ్యంగా మహిళలు, ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. తమ సాధికారత కోసం నిలబడేది ఎవరో, రాజకీయ లబ్ధి కోసం ప్రగతిని అడ్డుకునేది ఎవరో వారికి స్పష్టంగా తెలుసు.

గురు ప్రకాష్,
బిజెపి జాతీయ అధికార ప్రతినిధి