మామునూరు విమానాశ్రయానికి లైన్ క్లియర్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు మరో వరం ప్రకటించారు. ఓరుగల్లు ప్రజల విమానాశ్రయం కల త్వరలో సాకారం చేయనున్నారు. మామునూరు విమానాశ్రయం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫిబ్రవరి 28న ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ఉత్తర్వులు ఇచ్చారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో మరో విమానాశ్రయం ఉండకూడదని గతంలో జీఎంఆర్ సంస్థతో ఒప్పందం ఇన్నాళ్లూ మామునూరు విమానాశ్రయానికి శాపంగా మారింది. రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి, రాష్ట్ర బిజెపి నాయకుల చొరవతో కేంద్ర వైమానిక శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు జీఎంఆర్‌తో ప్రత్యేకంగా చర్చలు జరపడం, ఆ సంస్థ అంగీకారం తెలపడంతో మామునూరు విమానాశ్రయానికి మార్గం సుగమమైంది.
నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక విమానయాన రంగంలో ఓ విప్లవం మొదలైంది. గత పదేళ్లలో దేశంలో విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 150కి పెరిగింది. చిన్న నగరాల్లోనూ విమానాశ్రయాలు ఏర్పాటయ్యాయి. అయితే శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం సమయంలో కేంద్రం, హెచ్‌ఐఏఎల్ మధ్య కుదిరిన ఒప్పందంలోని క్లాజ్ 5.2 ప్రకారం.. శంషాబాద్ విమానాశ్రయానికి 150 కిలోమీటర్ల పరిధిలో 25 ఏళ్లపాటు కొత్తగా దేశీయ లేదా అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుమతించరాదనే షరతు ఉంది. దీంతో ఈ పరిధిలో తెలంగాణలో మరో విమానాశ్రయం నిర్మాణం జరగలేదు. ఈ ఒప్పందంపై హెచ్‌ఐఏఎల్ నిరభ్యంతర పత్రాన్ని ఇచ్చింది. ఈ నిరభ్యంతర పత్రం కేవలం మామునూరు విమానాశ్రయానికి మాత్రమే వర్తిస్తుంది.
మామునూరులో ఏ-320 (ఎయిర్‌బస్-320) లాంటి పెద్ద విమానాలు తిరిగేలా విమానాశ్రయం నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించిన డిజైన్లు, వివిధ సాంకేతిక అంశాల విషయం ఇప్పటికే ఒక కొలిక్కి వచ్చాయి. ఏ-320 స్థాయి విమానాలు అంటే.. ఒక్కో దానిలో ఒకేసారి 180 మంది ప్రయాణికులు ప్రయాణించే అవకాశం ఉంటుంది. అదే సమయంలో వివిధ కంపెనీలకు సంబంధించి దేశ విదేశాల నుంచి వచ్చే సామగ్రి, ముడి పదార్థాలను తీసుకొచ్చే పెద్ద పెద్ద కార్గో విమానాలు కూడా ఇక్కడ దిగేందుకు వీలుగా రన్‌వేలను ఏర్పాటు చేయనున్నారు. పెద్ద విమానాలు తిరిగేందుకు వీలుగా 2,800 మీటర్ల పొడవు, 75 మీటర్ల వెడల్పుతో రన్‌వేను నిర్మించనున్నారు. ఇక మామునూరు ఎయిర్‌పోర్టును భవిష్యత్తులో అంతర్జాతీయ విమానాశ్రయంగానూ మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మామునూరులో విమానాశ్రయం 1930లో నిజాం హయాంలోనే ఏర్పాటు కాగా.. వివిధ కారణాలతో 1980లో మూతపడింది. ఎయిర్‌పోర్టు కోసం నిజాం కాలంలోనే 1,875 ఎకరాల భూమిని కేటాయించారు. ఆ భూమిలో నుంచే నవోదయ విద్యాలయానికి 23.20 ఎకరాలు, పోలీసు శిక్షణ కేంద్రానికి 59 ఎకరాలు, ఏసీపీ కార్యాలయానికి 10 ఎకరాలు, వరంగల్ సెంట్రల్ జైలుకు 101 ఎకరాలు, ఫోర్త్ బెటాలియన్‌కు 241.24 ఎకరాలతోపాటు మరో 675 ఎకరాల భూమిని వెటర్నరీ వర్సిటీకి కేటాయించారు. ప్రస్తుతం ఏఏఐ పరిధిలో 696.14 ఎకరాల భూమి ఉంది. అయితే ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు అదనంగా 253 ఎకరాల భూమి కావాలని ఏఏఐ ప్రభుత్వాన్ని కోరడంతో.. ప్రభుత్వం ఆ భూముల సేకరణకు నిధులు కూడా మంజూరు చేసింది. ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే.. ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ పెరగడంతోపాటు పరిశ్రమల స్థాపనకు పెద్ద కంపెనీలు ముందుకువచ్చే అవకాశాలుంటాయి.
ఉడాన్ స్కీమ్‌తో వరంగల్ అనుసంధానం: కిషన్ రెడ్డి
వరంగల్ విమానాశ్రయాన్ని ఉడాన్ స్కీమ్‌తో అనుసంధానం చేస్తూ.. కమర్షియల్ ఆపరేషన్స్ కు సంబంధించి అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని జి. కిషన్ రెడ్డి అన్నారు. చరిత్రాత్మకమైన ఓరుగల్లు పట్టణానికి విమాన సేవలను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో పని చేస్తోందని, ఇందులో భాగంగానే.. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న వరంగల్ శివారులోని మామునూరు బ్రౌన్ ఫీల్డ్ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపిందని అన్నారు. విమానాశ్రయం ఏర్పాటు వల్ల వరంగల్ లో ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని అన్నారు. ‘‘స్వాతంత్ర్యానికి ముందు దేశంలోనే అతిపెద్ద విమానాశ్రయంగా వరంగల్ (మామునూరు) ఎయిర్ పోర్టుకు గుర్తింపు ఉంది. అంతటి పురాతనమైన ఈ విమానాశ్రయానికి పునర్ వైభవం కల్పించడం ద్వారా ఈ ప్రాంతంలో అభివృద్ధికి బాటలు వేయాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. వరంగల్లుకు కాకతీయుల నాటి వైభవాన్ని కల్పించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. ఇందుకు గాను ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు హృదయపూర్వకంగా ధన్యవాదములు తెలియజేస్తున్నాను. తెలంగాణలోని వరంగల్, భద్రాచలం, నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి ద్వితీయశ్రేణి నగరాల్లో విమాన సదుపాయాలను కల్పించేందుకు మోదీ ప్రభుత్వం కృషిచేస్తోంది. పర్యాటకం, వాణిజ్యం కోసం వరంగల్‌తో అనుసంధానత కోసం వివిధ ఎయిర్‌లైన్స్ తోనూ చర్చలు ప్రారంభిస్తాం. ఈ మామునూరు విమానాశ్రయం పునర్వినియోగంలోకి తీసుకురావడం ద్వారా.. వరంగల్ చుట్టుపక్కల ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడనున్నాయి.’’ అని కిషన్ రెడ్డి అన్నారు.
వేగంగా వరంగల్ అభివృద్ధి: రామ్మోహన్ నాయుడు
వరంగల్ (మామునూరు) ఎయిర్‌పోర్టు క్లియరెన్స్ శుభవార్తను తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పంచుకోవడం సంతోషంగా ఉందని, భూసేకరణ పూర్తయిన రెండున్నరేళ్లలో నిర్మాణం పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు అన్నారు. వరంగల్ ఎయిర్‌పోర్టుకు క్లియరెన్స్ రావాలన్నది ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ అని, తన హయాంలో ఇది జరగడం సంతోషంగా ఉందని అన్నారు. వరంగల్ ఎయిర్‌పోర్టు గతంలో ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్టుగా ఉండేదని, 1981 వరకూ అక్కడ ఏదో ఒక కార్యకలాపం జరుగుతూ ఉండేదని అన్నారు. వరంగల్ వంటి పెద్ద నగరంలో విమానాశ్రయం విషయంలో గతంలో అడుగులు ముందుకు పడలేదని, ఇప్పుడది నెరవేరిందని అన్నారు. ‘‘విమానాశ్రయం ఏర్పాటుకు 2800 మీటర్ల రన్ వే అవసరం. 280 ఎకరాలు అదనంగా భూసేకరణ అవసరమని కేంద్రం నుంచి ప్రతిపాదనలు పంపాం. రాష్ట్ర ప్రభుత్వం త్వరగా భూసేకరణ చేస్తే విమానాశ్రయం పనులు వేగవంతం అవుతాయి. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఎన్వోసీ తీసుకొని క్లియరెన్స్ ఇచ్చాం. భద్రాద్రి విమానాశ్రయం విషయంలో గతంలో ఒక స్థలాన్ని ప్రతిపాదించారు. గతంలో సూచించిన స్థలం అనువుగా లేదని, మరో స్థలం ప్రతిపాదించారు. భద్రాద్రి విషయంలో కొత్త స్థలంపై ఫీజిబులిటీని పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. విమానాశ్రయం ఏర్పాటు వల్ల ఆ ప్రాంత రూపురేఖలు మారిపోతాయి. వరంగల్ లో టెక్స్‌టైల్స్, విద్యా రంగానికి అపారమైన అవకాశాలు ఉన్నాయి. విమానాశ్రయ ఏర్పాటుతో ఆ ప్రాంత అభివృద్ధి వేగవంతం అవ్వనుంది.” అని రామ్మోహన్ నాయుడు తెలిపారు.

