రాజ్యాంగ లక్ష్యాలను సాకారం చేసే వికసిత భారత్
భారత రాజ్యాంగ మౌలిక స్ఫూర్తి మూలాలు సమ్మిళిత అభివృద్ధి, సామాజిక న్యాయంలో ఉన్నాయి. న్యాయం, అందరికీ సమాన అవకాశాలు మన రాజ్యాంగ మౌలిక సూత్రాలు. విస్తృతమైన విభిన్నతలు కలిగిన విస్తారమైన జనాభాను సమైక్యంగా కలిపి ఉంచే ఒక అసాధారణ దేశం భారత్. భాష, సామాజిక, భౌగోళిక, ఆర్థిక వైరుధ్యాలు ఉన్నప్పటికీ మనమంతా వికసిత భారతం అనే ఒక బృహత్తర లక్ష్యంపై దృష్టి సారించాం. మన స్వాతంత్య్రం 75వ వార్షికోత్సవం నుంచి 2047లో శతాబ్ది ఉత్సవాలు జరిగే సమయం వరకు ఈ మధ్యలో కాలాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమృతకాలంగా అభివర్ణించారు. 2047లో మన స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాల నాటికి మన జాతీయ నాయకుల స్వప్నాలు సాకారం కావాల్సి ఉంది.
మన రాజ్యాంగం ప్రాథమిక హక్కులకు హామీ ఇస్తూనే మన బాధ్యతల చట్రాన్ని కూడా నిర్దేశిస్తుంది. ఈ నియమాలు మన మార్గాన్ని నిర్దేశిస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అలాగే స్థానిక మున్సిపాలిటీలు, పంచాయతీరాజ్ సంస్థలు ఇలా అన్ని పాలక వ్యవస్థలు సామరస్యంతో కలసి పనిచేయాలని మన రాజ్యాంగ నిర్మాతలు ఆశించారు. రాజ్యాంగ సభలోని 299 మంది సభ్యుల్లో 19 మంది మధ్యప్రదేశ్ కు చెందినవారు. వీరు రాజ్యాంగ రచనలో కీలకమైన పాత్రలు పోషించారు. మహావులో జన్మించిన బీఆర్ అంబేద్కర్ మన ప్రధాన రాజ్యాంగ నిర్మాత. మధ్యప్రదేశ్ కు చెందిన ఇతర రాజ్యాంగ ప్రముఖుల్లో హరి సింగ్ గౌర్, రవిశంకర్ శుక్లా, సేథ్ గోవింద దాస్ మొదలైన వారు ఉన్నారు. గౌర్ తన పాండిత్యంతో రాజ్యాంగ రూపురేఖలను నిర్ణయించి హిందూ చట్టాలకు భాష్యాలు అందించారు. మహాత్మా గాంధీ రాజ్యాంగ మౌలిక స్ఫూర్తిని స్వరాజ్యంతో ముడిపెట్టారు. భాష, స్వయంపాలన, అస్తిత్వం ఆత్మగౌరవం ఇందులో అంతర్భాగాలు. సబ్ కా సాత్, సబ్కా వికాస్ (సమిష్టి కృషి, సమ్మిళిత వృద్ధి) అనే ప్రధానమంత్రి దార్శనికత మన రాజ్యాంగం పీఠికలో ప్రవచించిన విలువలకు కొనసాగింపు. ఇది దేశవ్యాప్తంగా కొత్త ఉత్తేజాన్ని నింపింది. ఈనాడు నీతి అయోగ్ సమావేశాల్లో భారతదేశమంతా ఒకే జట్టు అనే భావన ముఖ్యమంత్రుల్లో బాధ్యతను ప్రేరేపించి ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచింది. అయితే జవహర్లాల్ నెహ్రూ కేరళలో ఎన్నికైన ప్రభుత్వాన్ని రద్దు చేసినప్పుడు కేంద్రం, రాష్ట్రాల మధ్య ఉన్న రాజ్యాంగ బంధానికి మొదటి దెబ్బ తగిలింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను రద్దు చేయడానికి అధికరణం 356ను దుర్వినియోగం చేయడం ఆ తర్వాత పరిపాటిగా మారింది. ఇది లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరిగే సంప్రదాయానికి కూడా విఘాతం కలిగించింది. దీనివల్ల దేశవ్యాప్తంగా ఒక గడువులో కాకుండా తరచుగా ఎన్నికలు జరుగుతూ వచ్చాయి.
మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలను రాజ్యాంగ నిర్మాతల లక్ష్యాలకు అనుగుణంగా పునర్నిర్వచించి ఒక ఆరోగ్యకరమైన సంప్రదాయాన్ని నెలకొల్పారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మండలి, నీతి ఆయోగ్‌ల ఏర్పాటు ద్వారా రాష్ట్రాలకు తగినంత ప్రాతినిధ్యాన్ని, భాగస్వామ్యాన్ని కల్పించారు. రాజ్యాంగ అధికరణం 356 దుర్వినియోగం ఇప్పుడు ఒక చరిత్రగా మారిపోయింది. రాజ్యాంగ వ్యవస్థలకు స్వయం ప్రతిపత్తి కల్పించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకున్నారు. రాజ్యాంగ పరిపాలనను, ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేసే దిశలో ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ ఒక చరిత్రాత్మకమైన ముందడుగు. కేంద్రంలో, రాష్ట్రాల్లో వేరువేరు సిద్ధాంతాలు కలిగిన పార్టీలు అధికారంలో ఉండవచ్చు. దీనివల్ల ఒక్కొక్కప్పుడు సంఘర్షణాత్మక వాతావరణం నెలకొంటుంది. అయితే అటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగ నియమాల ఉల్లంఘన జరగకుండా చూడటం చాలా ముఖ్యం. మన రాజ్యాంగం సమాఖ్య వ్యవస్థను నిర్దేశిస్తుంది. ఇది కేంద్రానికి, రాష్ట్రాలకు కూడా తగినంత స్వయం ప్రతిపత్తిని ఇస్తుంది.
ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం విభిన్న సైద్ధాంతిక దృక్పథాలు కలిగిన రాష్ట్ర ప్రభుత్వాలతో న్యాయమైన, సహకారాత్మక సంబంధాలను కొనసాగించడానికి, వాటిని బలోపేతం చేయడానికి అర్థంఅంతమైన చర్యలు తీసుకుంది. రాజ్యాంగం ప్రతులను సభలోను, బయట ప్రదర్శించిన వారే రాజకీయ ప్రయోజనాల కోసం దాన్ని ఉల్లంఘించి, అవమానించారు. తద్వారా ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచారు. జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించి అధికరణం 370 ని రద్దు చేయడం రాజ్యాంగ గౌరవాన్ని, పవిత్రతను కాపాడే విషయంలో మోదీ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం. రాజ్యాంగం పట్ల ప్రధాని మోదీ, బిజెపిలకు గల గౌరవ మర్యాదలకు, నమ్మకానికి నిదర్శనం ఈ నిర్ణయం.
సమ్మిళితత్వం, సామాజిక న్యాయం, సాంస్కృతిక, రాజ్యాంగ విలువలు పునాదిగా కలిగిన పాలనా వ్యవస్థ ప్రజాస్వామ్య చైతన్యానికి పట్టుగొమ్మ. ఈ లక్ష్యాల పట్ల నిబద్ధతతో మధ్య ప్రదేశ్ లోని బిజెపి ప్రభుత్వం పని చేస్తోంది. ఒక మంచి ప్రభుత్వం రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండటమే కాకుండా శాంతి, భద్రత, సామరస్యం, సమాన అవకాశాలను పెంపొందిస్తూ సమాజంలో అందుకు తగిన వాతావరణం సృష్టించడానికి నిరంతరం కృషి చేస్తుంది. వికసిత మధ్యప్రదేశ్ లక్ష్యం వికసిత భారత్ దార్శనికత కు అనుగుణంగా ఉంటుంది. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. మధ్యప్రదేశ్ ఈ జాతీయ లక్ష్యానికి సంపూర్ణంగా కట్టుబడి ఉంది. భారత్ @ 2047 కింద మధ్యప్రదేశ్ ఇంధనం, అంతర్రాష్ట్ర సమన్వయం, సాంస్కృతిక, సామాజిక పునరుజ్జీవనంతో సహా అనేక రంగాల్లో క్రియాశీలంగా పనిచేస్తోంది. కెన్-బెత్వ, పార్వతీ-కాళీ, సింధు-చంబల్ నది అనుసంధాన ప్రాజెక్టులు చారిత్రాత్మకమైనవి. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాల సహకారానికి, దూరదృష్టికి ఇవి తార్కాణాలు. ఈ నదుల అనుసంధాన ప్రాజెక్టు అంతర్రాష్ట్ర సహకారానికి, సహకారాత్మక సమాఖ్య స్ఫూర్తికి ఒక అపూర్వమైన ఉదాహరణ.
“వారసత్వం, అభివృద్ధి’’ అనే లక్ష్యంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం గ్యాన్ (గరీబ్, యూత్, అన్నదాత, నారి-పేదలు, యువత, రైతులు, మహిళలు) కార్యక్రమాలు, పథకాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తోంది. పేదలు, యువత, రైతులు, మహిళల సమ్మిళిత, సంపూర్ణ అభివృద్ధి, సాధికారీకరత దిశగా శరవేగంగా చర్యలు తీసుకుంటోంది. కేంద్రంతో సమన్వయంతో పనిచేయడం ద్వారా మధ్యప్రదేశ్ అటు రాజ్యాంగ స్ఫూర్తికి, ఇటు ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా తన దార్శనికతను, సామర్థ్యాలను అభివృద్ధి చేసుకుంటున్నది.
మోహన్ యాదవ్,
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి

