హెచ్‌సీయూ భూములు అమ్మనివ్వం
400 ఎకరాల హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం స్థలాన్ని అమ్మకానికి పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మార్చ్ 18 బీజేవైఎం అసెంబ్లీ ముట్టడి చేపట్టింది. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సెవెళ్ళ మహేందర్ పిలుపునందుకొని భారీ ఎత్తున బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టడాన్ని వెంటనే నిలిపివేయాలని ఈ సందర్భంగా బీజేవైఎం డిమాండ్ చేసింది. బిజెపి శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి హాకాభవన్ వైపు కారు దిగి గన్‌పార్కు దారిలో బీజేవైఎం నాయకులకు మద్దతు తెలపడానికి వస్తుంటే పోలీసులు ఆయన్ని అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ‘నన్నెందుకు అడ్డుకుంటున్నారు. మా బిడ్డలు ఆందోళన చేస్తుంటే మద్దతు తెలపడం తప్పా? సీఎం రేవంత్‌రెడ్డి హెచ్‌సీయూ భూములను అమ్మకానికి పెట్టారు. సర్కారు భూములు అమ్ముతుంటే చూస్తూ ఊరుకోం. పాలించడం చేతగాకపోతే దిగిపోవాలి’ అని అన్నారు. మహేశ్వర్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని బోయిన్‌పల్లి ఠాణాకు తరలించారు. అనంతరం పోలీసులు ఆయనను చాలా సేపు రోడ్లపై తిప్పి, చివరకు అసెంబ్లీ ఆవరణలో వదిలిపెట్టారు. అయితే పోలీసుల వైఖరిని ఖండిస్తూ మహేశ్వర్ రెడ్డితో పాటు బిజెపి ఎమ్మెల్యేలు రామారావు పటేల్, ధన్‌పాల్ సూర్యనారాయణగుప్తా, పాయల్ శంకర్, పాల్వాయి హరీశ్ అసెంబ్లీ ఆవరణలో నల్ల బ్యాడ్జీలు ధరించి బైఠాయించారు.
అసెంబ్లీ ముట్టడిలో పాల్గొన్న సెవెళ్ళ మహేందర్ మాట్లాడుతూ తెలంగాణలో మార్పు రావాలి అంటే కాంగ్రెస్ రావాలని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూములు అమ్ముకుంటూ కమిషన్లు తింటుందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, సంక్షేమ భవనాలకు సొంతంగా కట్టించే దమ్ము లేదు కానీ ప్రభుత్వ భూములు అమ్ముకుంటూ దిల్లీకి సూట్ కేసులు మోయడానికి మాత్రం రేవంత్ రెడ్డి ముందున్నారని మండిపడ్డారు. ముల్కీ నిబంధనల్లో భాగంగా తెలంగాణకు ఆనాడు కేంద్ర ప్రభుత్వం కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని కేటాయించిందని, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 2300 ఎకరాల స్థలాన్ని యూనివర్సిటీకి కేటాయిస్తే, రాళ్లు గుట్టలు, చెట్లు, జంతువులతో ఉన్న స్థలం అభివృద్ధి చెందుతూ ప్రపంచంలోనే ప్రఖ్యాతి కలిగిన యూనివర్సిటీగా హైదరాబాద్ విశ్వవిద్యాలయం మారిందన్నారు. దేశంలో టాప్ ఫోర్త్ ర్యాంక్ సాధించిన హెచ్‌సీయూ తెలంగాణకే తలమానికమని, అలాంటి యూనివర్సిటీ స్థలాన్ని వేలం వేసి, రియల్ ఎస్టేట్ మాఫియాకు కట్టబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. యూనివర్సిటీకి వచ్చి ఫుట్ బాల్ ఆడిన రేవంత్ రెడ్డి చుట్టుపక్కల ఉన్న స్థలాన్ని కబ్జా చేసేందుకు పన్నాగం పన్నుతున్నాడని, దీనిని బిజెపి వ్యతిరేకిస్తుందన్నారు. రాష్ట్రంలో యూనివర్సిటీలను గాలికొదిలేయడమే కాకుండా కేంద్ర ప్రభుత్వంచే నడుస్తున్న సెంట్రల్ యూనివర్సిటీ భూములను కొల్లగట్టే యత్నాన్ని ముమ్మాటికి ఎండగడుతామన్నారు. హెచ్‌సీయూలో 220 రకాల పక్షులు, 400కు పైన జింకలు, 300 కు పైన నెమళ్లు, కుందేళ్లు, ఇతర వనమూలికలు ఉన్నాయని, ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన మష్రూమ్ రాక్, పీకాక్ లేక్, బఫెలో లేక్ వంటి సరస్సులను కలుషితం చేసి లంగ్స్ ఆఫ్ హైదరాబాద్‌గా పేరు పొందిన ప్రకృతి సంపదను దెబ్బతీసేందుకు రేవంత్ సర్కార్ కుట్ర చేస్తుందన్నారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేసి యూనివర్సిటీ భూములను కాపాడుకుంటామని మహేందర్ పేర్కొన్నారు. ‘‘రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సింది పోయి, భావితరాలకు ఉపయోగపడాల్సిన యూనివర్సిటీ భూములను తెగనమ్మి పబ్బం గడుపుకోవాలని చూస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు నమ్మకద్రోహం చేస్తోంది. ఇప్పుడు ఆ భూములను రూ. 10 వేల కోట్ల కోసం అమ్మకానికి పెట్టడం భావితరాల విద్యా హక్కును దారుణంగా కాలరాయడమే. ఇది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయడమే.’’ అని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. కాసం వెంకటేశ్వర్లు అన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు మహేష్, చిత్తరంజన్, కుమార్ యాదవ్, తరుణ్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గణేష్, సామల పవన్, రాష్ట్ర కార్యదర్శులు ప్రవీణ్, అశోక్, రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి అరవింద్, అనిత రెడ్డి, అధికార ప్రతినిధులు శివచంద్రగిరి, కుశాల్ గౌడ్, కోమలి నాయక్, ఇందిరా ప్రియాంక, గోవర్ధన్, రాఘవేందర్, భరత్, అవినాష్, ఆయుష్, శ్రవణ్ రాఘవేందర్ సునీల్ కుమార్, గణేష్, బిట్టు, తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ ముట్టడిలో పాల్గొన్న బిజెపి యువమోర్చా నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు భౌతిక దాడికి పాల్పడడమే కాకుండా, అనేక పోలీస్ స్టేషన్లో తిప్పుతూ ఇబ్బందులు సృష్టించారు.

