సామాజిక సాధికారత దిశలో మరో అడుగు

రాబోయే జాతీయ జనాభా గణనలో కులాల సమాచారాన్ని సేకరించాలని ఏప్రిల్ 30న ఎన్డీఏ ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ చర్య రాజకీయ వర్గాలతో పాటు విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దైనందిన జీవితంలోనూ, రాజకీయ లెక్కల్లోనూ కులం ఒక బలమైన అంశంగా ఉన్న దేశంలో, ఈ చర్య కేవలం విధాన మార్పును మాత్రమే కాదు, ఆధునిక భారత పాలనలో ఒక నిర్ణయాత్మక ఘట్టాన్ని సూచిస్తుంది. నరేంద్ర మోదీ ప్రభుత్వ నిర్ణయం సమయానుకూలంగా, సాహసోపేతంగా, ముందుచూపుతో తీసుకున్నది. భారతదేశం ఇంకా సామాజిక ప్రజాస్వామ్యాన్ని సాధించలేదని బాబాసాహెబ్ అంబేడ్కర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్య అంబేడ్కర్ దార్శనికతకు, లక్ష్యానికి నివాళి. ఇది సామాజిక న్యాయం, ఐక్యతకు దోహదపడే, భరోసానిచ్చే చర్య.

జనాభా లెక్కలలో కులాల సమాచారాన్ని చేర్చడం కేవలం పాలనాపరమైన చర్య మాత్రమే కాదు. ఈ పరివర్తనాత్మక ప్రతిపాదన చాలాకాలంగా పరిశీలనలో ఉంది. భారతదేశం చివరిసారిగా 1931లో సమగ్ర కుల గణనను నిర్వహించింది. అప్పుడు బ్రిటిష్ పాలనలో ఉండేది. అప్పటి నుంచి కాలం చెల్లిన అంచనాలు, రాజకీయ అంచనాలు, తప్పుడు సర్వేలపై ఆధారపడుతున్నాం. యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన 2011 సామాజిక-ఆర్థిక, కుల గణన (ఎస్ఈసీసీ) ఈ లోపాలను సరిదిద్దగలిగి ఉండేది కానీ గణాంకాలలో స్థిరత్వం లేకపోవడం, ఉపయోగించిన సమాచారం లోపాల కారణంగా అది లోపభూయిష్టంగా మారింది. చివరికి అధికారికంగా దానిని విడుదల చేయలేదు. అది నిజంగా మనం కోల్పోయిన ఒక మంచి అవకాశం. బహుశా తనకు ఇబ్బందికరమైన వాస్తవాలను ఎదుర్కోవడానికి ఇష్టపడని నాటి ప్రభుత్వం దీన్ని బుట్టదాఖలు చేసి ఉండవచ్చు. ఇందిరా గాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ, మన్మోహన్ సింగ్ కానీ అలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. 2014లో ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక తన ప్రసంగాల్లో సమాజంలోని అణగారిన వర్గాలే ఈ ప్రభుత్వానికి కేంద్ర బిందువు అని ఉద్ఘాటించారు. కుల గణన ప్రకటన ఆ వైఖరిని పునరుద్ఘాటిస్తోంది. ప్రధాని మోదీ గుజరాత్‌లోని ఓబీసీ సామాజికవర్గం నుంచి వచ్చి, అలుపెరగని కృషితో సీఎం స్థాయికి ఎదిగి, ఆ తర్వాత దేశానికి ప్రధానిగా ఎన్నికయ్యారని గుర్తుంచుకోవాలి.

దాదాపు ఒక శతాబ్దంగా జనాభా గణనలో కులగణన లేదు. సామాజిక న్యాయం పట్ల కాంగ్రెస్ అలసత్వం ప్రదర్శిస్తోంది. ఇటువంటి ముఖ్యమైన విధాన నిర్ణయాలను కాంగ్రెస్ చారిత్రాత్మకంగా వ్యతిరేకిస్తుంది, ఎందుకంటే అది సామాజిక విభేదాలను సరిదిద్దడానికి కట్టుబడి లేదు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు తమ వ్యక్తిగత, కుటుంబ ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి మాత్రమే ఆసక్తి చూపుతున్నాయి. సామాజిక న్యాయం కోసం వారు చేసే ప్రసంగాలు అబద్ధాలు, కపటత్వంతో నిండి ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఎస్ఈసీసీలో స్పష్టమైన లోపాలున్నాయని గుర్తుంచుకోవాలి. సమాజంలోని చిట్టచివరి పౌరుడికి సాధికారత కల్పించాలన్న పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ దార్శనికతకు అనుగుణంగా మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ కులగణన నిర్వహణలో ఒక క్రమబద్ధతకు దోహదం చేస్తుంది. ఈ విషయంలో రాష్ట్రాల స్థాయి విభజనలకు అతీతంగా, మానవ- కేంద్రిత అభివృద్ధికి దోహదపడే, సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు దోహదపడే జనాభా గణనను పారదర్శకంగా నిర్వహించేలా కేంద్రం చూస్తుంది. ఇది మనమంతా ఒక్కటేనని పునరుద్ఘాటిస్తుంది. దళిత సాధికారిత, దళితులకు ప్రాముఖ్యం పేరిట కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్న నేపథ్యంలో అంబేద్కర్ బాబు జగ్జీవన్ రాం వంటి గొప్ప దళిత నాయకులకు ఆ పార్టీ ఎలా అన్యాయం చేసిందో గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. 

వచ్చే జనాభా లెక్కలకు కులాల వివరాలను జోడించడం కేవలం ఒక పాలనాపరమైన చర్య మాత్రమే కాదు. ఇదొక రాజకీయ, నైతిక మైలురాయి. కుల ఆధారిత అసమానతలతో బిజెపి ముందుకెళ్తోందన్న ప్రతిపక్షాల వాదనను ఇది తిప్పికొడుతుంది. అణగారిన వర్గాల సాధికారత కోసం మోదీ ప్రభుత్వం సంకల్పించిన తీరు ఆయన పదవీకాలం అంతటా స్పష్టంగా కనిపించింది. కేంద్ర మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన వారికి చోటు కల్పించడం లేదా భారతదేశానికి తొలి గిరిజన మహిళా రాష్ట్రపతి పదవి వచ్చేలా చూడటం లేదా ముఖ్యమంత్రులు లేదా ఉప ముఖ్యమంత్రులుగా నియమించడం ద్వారా ప్రభుత్వాల్లో అణగారిన వర్గాలకు ఆయన ప్రాతినిధ్యం కల్పించారు. అణగారిన వర్గాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడమే కాకుండా వారు అత్యున్నత అధికార పీఠాలను అధిరోహించేలా చేయడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఈ చర్యలు స్పష్టం చేస్తున్నాయి. 

స్వాతంత్య్రం వచ్చి 78 సంవత్సరాల తరువాత, అంతర్జాతీయ అనిశ్చితుల మధ్య భారతదేశం సముచిత స్థానాన్ని పొందడానికి సిద్ధంగా ఉంది. దేశంలో పాతుకుపోయిన సామాజిక విభేదాలను పరిష్కరించే ప్రత్యేకమైన స్థానంలో భారత్ ఉందని ప్రపంచానికి తెలియజేయడానికి ఉద్దేశించిన విధానపరమైన చర్య కులగణన. ఇది రాత్రికి రాత్రే జరగనప్పటికీ, మనం వేగంగా ముందుకు సాగుతున్నాం. కుల గణనతో, భారతదేశ విధానకర్తలు పౌరుల జీవన పరిస్థితులను మెరుగుపరిచే ప్రజా విధానాలను రూపొందించగలుగుతారు.

గురు ప్రకాష్,
బిజెపి జాతీయ అధికార ప్రతినిధి